
ల్యాండ్ పూలింగ్ అయితేనే రైతులకు మేలు
రిటర్నబుల్ ప్లాట్లు, రోడ్లు, డ్రెయిన్లు, మౌలిక వసతులకు పోగా మిగిలేది 5 వేల ఎకరాలే
అందుకే ఇంకా ఎక్కువ భూమిని సమీకరించాల్సి ఉంటుంది
అయినా భూ సమీకరణా లేక భూసేకరణా అనేది నిర్ణయం తీసుకోలేదు
మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ
తాడికొండ: అమరావతిలో మరోసారి భూ సమీకరణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూనే అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 30 వేల ఎకరాలు సమీకరిస్తామని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మంగళవారం ఆయన అనంతవరంలోని గ్రావెల్ క్వారీలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు, అమరావతిని కలిపి త్వరలో మెగాసిటీగా ఏర్పాటు చేయాలనే ఆలోచనతో సీఎం చంద్రబాబు ఉన్నారని చెప్పారు.
ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారని, ఇందుకోసం 30 వేల ఎకరాల భూమి సమీకరించాల్సి ఉంటుందన్నారు. ఇందులో రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వగా మిగిలిన భూముల్లో రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక వసతుల కోసం మరికొన్ని వేల ఎకరాలు అవసరం ఉంటుందని తెలిపారు. ఇవన్నీ పోగా ఐదు వేల ఎకరాలు మాత్రమే మిగులుతుందని, అందుకే ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇంకా ఎక్కువ భూమి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
సేకరణ ద్వారా భూములు తీసుకుంటే రిజిస్ట్రేషన్ ధరలో రెండున్నర రెట్లు మాత్రమే ఎక్కువ వస్తుందని, అలా కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుంటే రైతులకు ప్రయోజనం ఉంటుందని.. రైతులు కూడా ల్యాండ్ పూలింగ్‌ను కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అయినా.. భూ సమీకరణా లేదా భూసేకరణా అనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.