బలవంతపు భూసేకరణపై శ్రమజీవుల గర్జన
వందలాది మంది రైతు, రైతుకూలీల అరెస్ట్
విజయవాడ (భవానీపురం) : రాష్ట్ర ప్రభుత్వ బలవంతపు భూసేకరణ, భూసమీకరణకు వ్యతిరేకంగా రైతులు, వ్యవసాయ కార్మికులు గర్జించారు. తమ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని స్పష్టంచేశారు. బలవంతపు భూసేరణను తక్షణమే ఆపాలని, ల్యాండ్ పూలింగ్ రద్దు చేయాలని, 2013 చట్టం ప్రకారమే భూసేకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ చలో విజయవాడ పిలుపునిచ్చింది. 13 జిల్లాల నుంచి వచ్చిన రైతులు, రైతు కూలీలు చంద్రబాబు మోసపూరిత విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రదర్శనగా సీఎం క్యాంప్ కార్యాలయానికి బయలుదేరారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద, పాత బస్టాండ్ వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు.
దీంతో పోలీసులకు ప్రదర్శనకారులకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. ఆందోళనకారులను నగర పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకులందరినీ ఒక వాహనంలో ఎక్కించి ఇబ్రహీంపట్నం స్టేషన్‌కు, మిగిలిన వారిని ఇతర పోలీస్ స్టేషన్లకు తరలించారు.
కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకే..
ప్రదర్శనకు ముందు కళాక్షేత్రం ప్రాంగణంలో జరిగిన సభకు అధ్యక్షత వహించిన కమిటీ కన్వీనర్లు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జల్లి విల్సన్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ దోపిడీని, చంద్రబాబు అనుసరిస్తున్న రైతాంగ, గ్రామీణ వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. పచ్చని భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అఖిల భారత కిసాన్ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా, భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ ప్రధాన కార్యదర్శి నాగేంధ్రనాథ్ ఓఝూ, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, భూ హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ టి. గోపాలరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల శేఖర్ ప్రసంగించారు. అరెస్ట్ అయి ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో ఉన్న నేతలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ పరామర్శించారు.
62మంది వామపక్ష నేతలు తరలింపు
ఇబ్రహీంపట్నం : రాష్ట్ర భూ హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు, వామపక్ష నేతలు 62మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ చర్యను పలువురు తీవ్రంగా ఖండించారు.