
ఉద్యోగంలో చేరిన వెంటనే సొంతకారు ఉండాలని కోరుకుంటున్న యువత
అప్పు చేసి మరీ కారుకొంటున్న 25–30 ఏళ్లవారు
యూజ్డ్ కార్ల కొనుగోళ్లలో మహిళల పెరుగుదల
యూజ్డ్ కార్ ప్లాట్‌ఫాం ‘స్పిన్నీ’ క్యూ1 నివేదికలో వెల్లడి
సాక్షి, అమరావతి: ఉద్యోగంలో చేరిన వెంటనే సొంతకారు ఉండాలన్న కోరిక యువతరంలో బలంగా పెరుగుతోంది. ఇందుకోసం చాలామంది అప్పు చేసి మరీ సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసి జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా 25 నుంచి 30 ఏళ్లలోపు యువత రుణం(ఫైనాన్స్) తీసుకుని మరీ సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. మొత్తం కార్లు కొనేవారిలో 57 శాతం మంది ఫైనాన్స్ ద్వారానే నిధులు సమకూర్చుకుంటున్నారని, ఈ సంఖ్య ఏటా వేగంగా పెరుగుతోందని యూజ్డ్ కార్ ప్లాట్‌ఫాం స్పిన్నీ 2025 క్యూ1 నివేదికలో వెల్లడించింది.
దేశంలో అత్యధికంగా సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో జరుగుతున్నాయని తెలిపింది. మొత్తం అమ్మకాల్లో 77 శాతం డిజిటల్ లావాదేవీల ద్వారానే జరుగుతున్నట్లు పేర్కొంది. దేశంలో సొంతకారు కొనుగోలు చేస్తున్నవారి సగటు వయసు 2023లో 34 ఏళ్లు ఉండగా, అది ఇప్పుడు 32 ఏళ్లకు తగ్గినట్లు వివరించింది.
పెరుగుతున్న మహిళా కారు ఓనర్లు
» సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోళ్లలో మహిళల సంఖ్య ఏటా పెరుగుతోంది. కార్ల కొనుగోలుకు సంబంధించి 2024లో మహిళల వాటా 26% ఉండగా, అది 2025లో 28 శాతానికి పెరిగిందని స్పిన్నీ 2025 క్యూ1 నివేదిక వెల్లడించింది. మార్చి నెల కొనుగోళ్లలో అయితే 30 శాతం దాటినట్లు తెలిపింది.
» మహిళలు కార్లు ఎక్కువగా కొంటున్న నగరాల్లో కొచ్చి మొదటి స్థానంలో ఉంది.
» రుణాలు తీసుకుని కార్లు కొంటున్న మహిళలు అత్యధికంగా ఉన్న నగరాల్లో కోయంబత్తూరు అగ్రస్థానంలో నిలిచింది. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో పుణే మొదటి స్థానంలో ఉంది.
» లగ్జరీ కార్ల అమ్మకాల్లో 30 శాతం ఢిల్లీలోనే ఉంటున్నాయి. జీప్ కాంపాస్, బీఎండబ్ల్యూ ఎక్స్1, మెర్సిడెజ్ జీఎల్‌ఏ లగ్జరీ మోడల్స్‌కు అత్యధిక డిమాండ్ ఉంది.
» మొత్తం సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాల్లో 74 శాతం మంది తొలిసారి కారు కొనుగోలు చేస్తున్నవారే ఉంటున్నారు.
» 84% మంది పెట్రోలు కారు కొనుగోలుకే ఇష్టపడుతున్నారు.
» రానున్న కాలంలో పట్టణాల్లో ఎలక్ట్రిక్, హైబ్రీడ్ కార్ల అమ్మకాలకు డిమాండ్ మరింత పెరుగుతుందని ‘స్పిన్నీ’
అంచనా వేసింది.
కార్లు కొనుగోలు చేస్తున్న యువత సగటు వయసు 32 ఏళ్లు
57% ఫైనాన్స్‌లో కార్లు కొనుగోలు చేస్తున్న యువత
74% తొలిసారి కారు కొనేవారిలో సెకండ్ హ్యాండ్ వాహనాలను తీసుకునేవారు
30% ఈ ఏడాది మార్చిలో సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసినవారిలో మహిళలు