బిరబిరా కృష్ణమ్మ..
గ్రేటర్ లో తాగునీటి కష్టాలకు చెక్
మూడు పథకాలకు సీఎం పచ్చజెండా
పాలమూరు, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచితరలింపు
జంట జలాశయాలకు కొత్త కళ
సిటీబ్యూరో: గ్రేటర్ నగరాన్నితాగునీటి కష్టాల నుంచి ఒడ్డున పడేసేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. భవిష్యత్‌లో తాగునీటి సమస్య లేకుండా చూసేందుకు మరో మూడు కీలక మంచినీటి పథకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, శ్రీశైలం బ్యాక్‌వాటర్ ప్రాజెక్టుల నుంచి 20 టీఎంసీల వంతున దశల వారీగా రప్పించి... నగర దాహార్తిని సమూలంగా తీర్చేందుకు చర్యలు చేపట్టాలని జలమండలి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్ హెచ్‌ఆర్డీలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ ఆదేశాలిచ్చారు. నగరానికి అదనంగా తరలించనున్న నీటితో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు ఏడాది పొడవునా కళకళలాడేలా చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులను ఆదేశించారు. ఇక సుంకిశాల (నల్లగొండ జిల్లా) వద్ద కృష్ణా హెడ్‌వర్క్స్ పనుల్లో భాగంగా మూడు భారీ జాక్‌వెల్స్‌ను నిర్మించి... 16.5 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని ఆదేశించినట్టు విశ్వసనీయ సమాచారం. తద్వారా నాగార్జున సాగర్ జలాశయంలో వేసవిలో డెడ్‌స్టోరేజికి నీటిమట్టం చేరుకున్నప్పటికీ నగర తాగునీటి అవసరాలకు ఢోకా లేకుండా చూడాలని ఆదేశించినట్లు తెలిసింది. ఈ మూడు పథకాలకు అంచనాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలు, సాధ్యాసాధ్యాలపై వేర్వేరుగా నివేదికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.
శివారు కష్టాలకు స్వస్తి
ఈ మూడు పథకాలు పూర్తయిన పక్షంలో గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపల్ సర్కిళ్లలోని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీల దాహార్తి సమూలంగా తీరే అవకాశాలుంటాయని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో జలమండలి నిత్యం 385 ఎంజీడీల జలాలను సరఫరా చేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరుకుపూర్తి కానున్న గోదావరి మంచినీటి పథకం మొదటి దశ ద్వారా 172 ఎంజీడీలు, కృష్ణా మూడో దశ- ఫేజ్-2 ద్వారా మరో 45 ఎంజీడీలు సిటీకి తరలిరానున్న విషయం విదితమే. నగరానికి తరలించనున్న అదనపు నీటిని సిటీ నలుమూలలకు, శివారు ప్రాంతాలకు సరఫరా చేసేందుకు అవసరమైన పైప్‌లైన్లు, స్టోరేజి రిజర్వాయర్లను రూ.4000 కోట్ల అంచనాతో యుద్ధ ప్రాతిపదికన నిర్మించాల్సి ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.