గ్రేటర్‌కు శ్రీశైల గంగ!
ఎల్లూరు ఎత్తంగుట్ట నుంచి 5.5 టీఎంసీల తరలింపు
ఔటర్ రింగురోడ్డు చుట్టూ గ్రేటర్ వాటర్ గ్రిడ్
జలమండలికి రూ.100 కోట్లు విడుదల
ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి
సిటీబ్యూరో:రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకు శ్రీశైల గంగను రప్పించనున్నారు. శ్రీశైలం జలాశయానికి 16 కి.మీ. దూరంలో ఉన్న ఎల్లూరు ఎత్తంగుట్ట (648 మీటర్ల ఎత్తున్న కొండ) ప్రాంతానికి కృష్ణా జలాలను తరలించి(లిఫ్టు).... అక్కడి నుంచి నగరానికి రప్పించి.... హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలను నింపేందుకు కసర త్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై జలమండలి అధికారులు సమగ్ర అధ్యయనం చేసి అం చనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇది పూర్తి చేస్తే విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గుతుందని, భూమ్యాకర్షణ శక్తి(గ్రావిటీ) ద్వారానే నగరానికి నీటిని తరలించవచ్చని పేర్కొన్నారు. సోమవారం సచి వాలయంలో జలమండలి ప్రాజెక్టులపై సీఎంసుదీర్ఘంగా సమీక్షించారు. నగర దాహార్తిని తీర్చేందుకు ప్రస్తుతం కృష్ణా జలాశయం నుంచి 11 టీఎంసీలు, సింగూరు నుంచి ఏడు టీఎంసీలు, గండిపేట్, హిమాయత్ సాగర్‌ల నుంచి మరో రెండు టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. ఇంకా 15 టీఎంసీల నీటికి కొరతగా ఉం దని సీఎం తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ జనాభా కోటికి చేరుకోవడంతో పాటు ఏటా పది లక్షల జనాభా పెరుగుతుండడం, ఐటీఐఆర్ ప్రాజెక్టు పూర్తికానున్న తరుణంలో మహానగర జనాభా అనూహ్యంగా పెరుగుతోందని సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నగరానికి కృష్ణా మూడో దశ, గోదావరి మంచినీటి పథకాలతో పాటు కృష్ణా నాలుగో దశ, శ్రీశైలం బ్యాక్‌వాటర్ పథకాలను పూర్తి చేసి నీటి కొరతను తీర్చాల్సి ఉందని స్పష్టంచేశారు. కృష్ణా మూడోదశను ఈ ఏడాది మార్చి నాటికి, గోదావరి మొదటి దశను జూన్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.
కో కేంద్ర సాయం రదాం
గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల నుంచి నగర తాగునీటి అవసరాలకు నీటిని సేకరించే విధంగా గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టాలని సీఎం సూచించారు. ఇందుకు అవసరమయ్యే నిధులను కేంద్రం నుంచి రాబట్టేందుకు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని బోర్డు అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని మొత్తం నగరం చుట్టూ మంచినీటి పైప్‌లైన్లు వేయాలని సూచించారు. ఎక్కడి నుంచైనా నీళ్లు తెచ్చుకోవడానికి, శివారు, మారుమూల ప్రాంతాలకు సైతం నీటి సరఫరాకు వీలవుతుందన్నారు.
హైదరాబాద్ వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని సీఎం తెలిపారు. నిధుల విషయంలో వెనుకాడబోదని స్పష్టం చేశారు. భారీ వర్షాల సమయంలో వర్షపు నీరు నగర రహదారులపై నిలవకుండా జలమండలి, జీహెచ్‌ఎంసీ అధికారులు సంయుక్త సమావేశం ఏర్పాటు చేసుకొని సీవరేజి, వరదనీటి కాల్వల ప్రక్షాళనకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
జలమండలికి రూ.100 కోట్లు విడుదల
జలమండలి ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులకు తక్షణం రూ.100 కోట్లు విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. శివారు ప్రాంతాల్లో నీటి పథకాలకు జీహెచ్‌ఎంసీ రూ.50 కోట్లు జలమండలికి కేటాయించాలని సూచించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి జలమండలికి రావాల్సిన బకాయిల వసూలపై అధికారులు శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, జలమండలి ఎమ్‌డీ జగదీశ్వర్, ఈఎన్‌సీ సత్యనారాయణ, డెరైక్టర్లు ప్రభాకర శర్మ, కొండారెడ్డి, రామేశ్వర్‌రావు పాల్గొన్నారు.
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకానికి రూ.1600 కోట్లు
జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం రెండో దశ కింద నగర శివార్లలో మంచినీటి సరఫరా నెట్‌వర్క్ విస్తరణకు రూ.1600 కోట్లు విడుదలకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఇటీవల అంగీకరించినట్టు సీఎం కేసీఆర్ జలమండలి అధికారులకు తెలి పారు. సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విష యం చెప్పారు. ఈ నిధులతో పటాన్‌చెరువు, రామచంద్రాపురం, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ మున్సిపాల్టీల పరిధిలో మంచినీటి పైప్‌లైన్లు, స్టోరేజి రిజర్వాయర్లు ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర నిధులు సకాలంలో అందితే ఆ ప్రాంతాలకు రాబోయే రెండేళ్లలో దాహార్తి తీరనుంది.