న్యాయ పోరాటం చేస్తాం: సీఎం కేసీఆర్‌ | CM KCR Opposes Andhra Pradesh New Lift Irrigation Project On Krishna River | Sakshi
Sakshi News home page

న్యాయ పోరాటం చేస్తాం: సీఎం కేసీఆర్‌

Published Tue, May 12 2020 2:16 AM | Last Updated on Tue, May 12 2020 5:36 AM

CM KCR Opposes Andhra Pradesh New Lift Irrigation Project On Krishna River - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా నీటిని లిఫ్టు చేస్తూ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించడం అభ్యంతరకరమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర భంగకరమైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై వెంటనే కృష్ణా వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని, జీఓ కూడా విడుదల చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్‌లో కానీ కొత్త నీటి పారుదల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే అపెక్స్‌ కమిటీ అనుమతి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టంగా చెబుతోందని, కానీ ఏపీ ప్రభుత్వం అపెక్స్‌ కమిటీ ఆమోదం తీసుకోలేదని పేర్కొన్నారు.
(చదవండి: ప్రగతి భవన్కు రండి)

‘‘శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. ఇందులోని నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి. కానీ తెలంగాణను సంప్రదించకుండా శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని లిఫ్టు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించి, జీవో జారీ చేసింది. ఇది తీవ్ర అభ్యంతకరం. కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్‌ తరలించుకుపోతే ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీటి సమస్య ఏర్పడుతుంది. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగకుండా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణా బోర్డులో ఫిర్యాదు చేస్తాం’’అని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడం
గతంలో ఉన్న వివాదాలు, విభేదాలు పక్కనపెట్టి రెండు రెండు రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు కాపాడడమే లక్ష్యంగా నదీ జలాలను వినియోగించుకుందామని ఏపీకి స్నేహహస్తం అందించిన విషయాన్ని కేసీఆర్‌ గుర్తుచేశారు. బేసిన్లు, బేషజాలు లేకుండా నీటిని వాడుకుందామని తానే చొరవ చూపించానని, కానీ ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా శ్రీశైలంలో నీటిని లిఫ్టు చేయడానికి కొత్త పథకం ప్రకటించడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగితే రాజీ పడే ప్రసక్తేలేదని, ఏపీ తలపెట్టిన కొత్త ప్రాజెక్టును అడ్డుకుని తీరడమే లక్ష్యంగా న్యాయపోరాటం చేస్తామని స్పష్టంచేశారు. కృష్ణా నదిలో రాష్ట్రాల వాటాను తేల్చే విషయంలో బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌లో జాప్యం జరుగుతున్నందున, సత్వర న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. అలాగే గోదావరి మిగులు జలాల్లో తెలంగాణకు 600 టీఎంసీలు కేటాయించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సూచించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, జగదీష్‌రెడ్డి, పువ్వాడ అజయ్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, నీటిపారుదల సలహాదారు ఎస్‌.కె.జోషి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్, ఈఎన్‌సీ మురళీధర్, ఏజీ బీఎస్‌ ప్రసాద్, అడిషనల్‌ ఏజీ రామచందర్‌రావు, లీగల్‌ కన్సల్టెంట్‌ రవీందర్‌రావు, రిటైర్డ్‌ ఇంజనీర్లు శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్రమౌళి, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌ పాండే తదితరులు పాల్గొన్నారు. 
(చదవండి: హైదరాబాద్కు చేరుకున్నవందేభారత్ఫ్లైట్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement