కీలక తీర్మానాలు ఇవీ..
♦కేటాయింపులు, పర్యావరణ అనుమతులు లేకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా ఏపీ అక్రమంగా పోతిరెడ్డిపాడు, సీమ లిఫ్టు పథకాలను చేపడుతోంది. మేం వాటిని గుర్తించం.
♦ పోతిరెడ్డిపాడు, సీమ లిఫ్టు ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ బోర్డు సమావేశంలో వాదనలను వినిపించాలి.
♦ జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని వదిలి.. చెరువులను, కుంటలను నింపాలి.
♦కృష్ణాజలాల్లో బచావత్ ట్రిబ్యునల్ ఎన్‌బ్లాక్ (గుండుగుత్త) కేటాయింపులు చేసిన, నికర జలాల కేటాయింపులున్న ప్రాజెక్టులకు మాత్రమే ఏపీ నీటిని వాడుకోవాలి.
♦9న కృష్ణా బోర్డు త్రిసభ్య భేటీని రద్దు చేయాలి. 20 తర్వాత పూర్తిస్తాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అందులో తెలంగాణ రాష్ట్ర అంశాలను కూడా ఎజెండాలో చేర్చాలి.
♦ సమ్మక్క బ్యారేజీ, సీతమ్మసాగర్ ప్రాజెక్టులను ఇరిగేషన్ అండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులుగా పిలవాలి.
♦శ్రీశైలం సహా కృష్టా ప్రాజెక్టుల వద్ద పూర్తిస్థాయి రక్షణ చర్యలు తీసుకోవాలి. శ్రీశైలం డ్యామ్ వద్ద తెలంగాణ భూభాగంలోకి విద్యుత్ ఉద్యోగులను తప్ప వేరెవరినీ అనుమతించొద్దు.
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంలో ఇప్పటివరకు అమలు చేస్తున్న విధానాన్ని పక్కనపెట్టాలని.. ఇకపై తెలంగాణ, ఏపీ చెరో సగం నీటిని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన అత్యున్నత సమావేశం నిర్ణయించింది. ఏపీ, తెలంగాణ మధ్య తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో కొనసాగుతున్న కృష్ణా జలాల పంపిణీని సరికాదని.. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో పంపకాలు జరగాలని తీర్మానించింది. ట్రిబ్యునల్ తుది కేటాయింపులు జరిపేదాకా కూడా.. మొత్తం 811 టీఎంసీల నికర జలాల్లోంచి 405.5 టీఎంసీల (50%) నీటిని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగించాలని తీర్మానించింది. శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. సాగునీటి ప్రాజెక్టులు, జల విద్యుత్, ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ పథకం తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.
చట్టబద్ధంగానే జల విద్యుదుత్పత్తి
ప్రాజెక్టుల్లో జల విద్యుదుత్పత్తిని ఆపాలని చెప్పే హక్కు కృష్ణాబోర్డుకు లేదని.. జల విద్యుత్‌కు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పందాలు లేవని ఉన్నతస్థాయి సమావేశం అభిప్రాయపడింది. ఈ అంశంలో బోర్డు జోక్యం చేసుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది. తెలంగాణ సర్కారు పులిచింతలలో విద్యుదుత్పత్తితో కృష్ణా జలాలను వృథా చేస్తోందంటూ ఏపీ ప్రభుత్వ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించింది. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా జిల్లా అవసరాలను వాడుకోవాలని.. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోసే ఖర్చును మిగుల్చుకోవచ్చని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణలో సాగునీటిని ఎత్తిపోసేందుకు, హైదరాబాద్ తాగునీటి అవసరాలు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఎంతగానో ఉందని సమావేశం పేర్కొంది. అందువల్ల ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొని చట్టబద్ధంగా జల విద్యుదుత్పత్తి చేసుకుంటామని స్పష్టం చేసింది. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులతో కాలుష్యం పెరిగిపోతోందని, ‘క్లీన్ ఎనర్జీ’ఉత్పత్తి చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు ఇచ్చిందని.. తెలంగాణ జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా వాటిని అమలు చేస్తోందని పేర్కొంది. విద్యుదుత్పత్తి కోసమే నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వాటా నీటిని వాడుకుంటుంటే.. ఆపాలని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించింది. రాయలసీమ లిఫ్టుపై ఇచ్చిన స్టేని ఉల్లంఘించినందుకు ఏపీ ప్రభుత్వ సీఎస్‌ను జైల్లో వేస్తామని ఎన్జీటీ ప్రకటించిందని, అయినా సర్వే ముసుగులో నిర్మాణాలు చేపట్టడం దారుణమని అభిప్రాయ పడింది.
ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, నీటిపారుదలశాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎం సెక్రెటరీ స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్‌రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, జెన్‌కో డైరెక్టర్ (హైడల్) వెంకటరాజం, అడ్వొకేట్ జనరల్ ప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సాగునీటిశాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు.
‘‘తెలంగాణలో ఆంధ్రా మాదిరిగా కాలు అడ్డం పెట్టుకొని నీళ్లు పారించుకునే పరిస్థితి లేదు. నీటిని ఎత్తి పోసుకోవాలె. తెలంగాణలో 30 లక్షలకుపైగా బోర్లున్నాయి. మొత్తం విద్యుత్‌లో 40 శాతం దాకా సాగునీటి అవసరాలకే వినియోగమవుతోంది. తెలంగాణకున్న పరిస్థితుల దృష్ట్యా సాగునీరే కాదు, విద్యుదుత్పత్తి కోసం కూడా నీరు అవసరం.’’ సీఎం కేసీఆర్
రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందాకైనా..
‘‘కృష్ణా జలాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా, ఎంతదూరమైనా కొట్లాడుతం. వలస పాలకులు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు. ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలంగాణలో వ్యవసాయాన్ని దండుగలా మార్చి రైతులకు అన్యాయం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రథమ ప్రాధాన్యతగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి.. సాగునీటి గోస తీర్చుకున్నం. జల విద్యుత్ ప్రాజెక్టుల్లో కేటాయింపులున్న నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకుంటం. ట్రిబ్యునల్స్ ద్వారా రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు కేటాయించిన నదీ జలాలను వాడుకుంటం. పొరుగు రాష్ట్రాలు వారి వాటాను వినియోగించుకోవడానికి సంపూర్ణంగా సహకరిస్తం. కానీ కేటాయింపులు లేని నికర జలాలను దౌర్జన్యంగా వాడుకుంటామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోబోరు..’’
అవసరమైతే కేంద్రంతో పోరు
బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఏర్పాటై 17 ఏండ్లు కావస్తున్నా తెలంగాణకు కృష్ణా జలాల్లో నీటి వాటాను నిర్ధారించకపోవడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని స్పష్టం చేశారు. కృష్ణా బేసిన్ అవసరాలు పూర్తిగా తీరాకనే.. అదీ మిగులు జలాలు ఉంటేనే ఇతర నదీ బేసిన్లకు నీటిని తీసుకెళ్లాలని.. ఈ నిబంధనను ఏపీ ప్రభుత్వం విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ చేపట్టిన లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం విద్యుత్ అవసరం పెరిగిందని.. ఈ మేరకు జల విద్యుదుత్పత్తి చేసి, లిఫ్టులను నడిపి సాగునీటిని ఎత్తిపోసుకుంటుందని వివరించారు. తెలంగాణకు కేటాయించిన నీటి ద్వారానే జల విద్యుదుత్పత్తి చేస్తుందని, ఎవరూ అభ్యంతరం తెలపడానికి లేదన్నారు. ఇదే విషయాన్ని ట్రిబ్యునళ్లు, బోర్డులు, కోర్టుల్లో వివరిస్తామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుకు వరద జలాలను మాత్రమే వాడుకుంటామని అసెంబ్లీలో, బయటా అనేకసార్లు ప్రకటించారని, బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు కూడా అదే విషయం చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పోతిరెడ్డిపాడు పేరుతో తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తామంటే తెలంగాణ ప్రజలు సహించబోరని కేసీఆర్ హెచ్చరించారు. ఎగువన ఉన్న మహారాష్ట్రతో చర్చలు జరిపి, వారికి ఇబ్బంది లేనివిధంగా, సహకరిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని.. ఏపీ విషయంలోనూ ఇదే తీరులో స్నేహహస్తం సాచామని, అయినా ఏపీ పెడచెవిన పెట్టిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment