Krishna Water Disputes Tribunal
-
నీటి పంపిణీ బాధ్యత కృష్ణా బోర్డుదే
సాక్షి, అమరావతి: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 అవార్డు అమల్లోకి వచ్చేవరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా నదీ జలాలు పంపిణీ చేసే బాధ్యత కృష్ణా బోర్డుదేనని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసింది. నీటి పంపకాల్లో అపెక్స్ కౌన్సిల్ జోక్యం చేసుకోబోదని బోర్డుకు తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలకు నీటి పంపిణీపై జనవరి 21న నిర్వహించే 19వ సర్వసభ్య సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా 811 టీఎంసీలను ఉమ్మడి ఏపీకి కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. విభజన నేపథ్యంలో కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకుండా చూసేందుకు 2014 మే 28న కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన నీటి కేటాయింపుల ఆధారంగా 2015–16 నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 512.06, తెలంగాణకు 298.94 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015 జూలై 18–19న కేంద్ర జల్ శక్తి తాత్కాలిక సర్దుబాటు ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో 2016 సెప్టెంబర్ 21న అపెక్స్ కౌన్సిల్ తొలి సమావేశంలో 2016–17 సంవత్సరంలోనూ తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే నీటిని పంపిణీ చేసుకోవడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని..రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపకాల అంశాన్ని అపెక్స్ కౌన్సిల్లో చర్చించి.. తుది నిర్ణయం తీసుకునేలా అజెండాలో చేర్చాలని కేంద్ర జల్ శక్తి శాఖకు కృష్ణా బోర్డు విజ్ఞప్తి చేసింది. కృష్ణా బోర్డు పనితీరుపై 2024 జనవరి 9న కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో కృష్ణా జలాల పంపకం అంశాన్ని కృష్ణా బోర్డు అధికారులు లేవనెత్తారు. కృష్ణా జలాల పంపకం జోలికి అపెక్స్ కౌన్సిల్ వెళ్లబోదని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి తేల్చిచెప్పారు. కేడబ్ల్యూడీటీ–2 అవార్డు అమల్లోకి వచ్చే వరకూ ఇప్పటిలానే రెండు రాష్ట్రాలతో ఏటా సంప్రదింపులు జరిపి.. నీటిని పంపిణీ చేసే బాధ్యత కృష్ణా బోర్డుదేనని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 66:34 నిష్ఫత్తిలో పంపిణీఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో లభ్యత గల జలాల్లో ఏపీ 66 శాతం, తెలంగాణ 34 శాతం వాడుకునేలా 2017–18 నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. 2018–19, 2019–20, 2020–21, 2021–22, 2022–23 సంవత్సరాల్లో బోర్డు సర్వసభ్య సమావేశాల్లో రెండు రాష్ట్రాలతో చర్చించి అదే పద్ధతి ప్రకారం కృష్ణా బోర్డు నీటిని పంపిణీ చేసింది. కానీ.. 2023–24 నీటి సంవత్సరానికి సంబంధించి నీటి పంపకాలపై 2023 మే 10న నిర్వహించిన కృష్ణా బోర్డు సమావేశంలో తమకు 50 శాతం వాటా కావాలని తెలంగాణ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. దీన్ని ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి తోసిపుచ్చారు. దాంతో కృష్ణా జలాల లభ్యత, అవసరాలపై ఎప్పటికప్పుడు చర్చించి, కేటాయింపులు చేసే బాధ్యతను త్రిసభ్య కమిటీకి కృష్ణా బోర్డు అప్పగించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. పాత పద్ధతి ప్రకారమే ఉమ్మడి ప్రాజెక్టుల్లో 66 శాతం ఏపీ, తెలంగాణకు 34 శాతం పంపిణీ చేస్తూ కృష్ణా బోర్డు తుది నిర్ణయం తీసుకుంది. -
నీళ్లున్నా కన్నీరే
తలాపున కృష్ణమ్మ బిరబిరా పరుగులిడుతున్నప్పటికీ ఇక గ్రేటర్ రాయలసీమకు కన్నీళ్లు తప్పవా? కళ్లెదుటే శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండిపోయి ప్రకాశం బ్యారేజీ మీదుగా కృష్ణా వరద జలాలు కడలిలో కలుస్తున్నా సరే గ్రేటర్ రాయలసీమకు చుక్క నీటిని విడుదల చేయరా? విభజన చట్టంలోని 11వ షెడ్యూలులో పదో పేరా ద్వారా కేంద్రం అనుమతి ఇచ్చిన హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోతాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు. నీటి పారుదల రంగ నిపుణులు. సాక్షి, అమరావతి : దేశంలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగు నీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగు నీటికీ ఇబ్బందులు తప్పవని నీటి పారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ)–2లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణ(ఆపరేషన్ రూల్స్)పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున సాక్షి ఏకే గోయల్ అక్టోబర్ 18న దాఖలు చేసిన అఫిడవిట్ ద్వారా గ్రేటర్ రాయలసీమకు వెన్నుపోటు పొడిచారని నిపుణులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు కేడబ్ల్యూడీటీ–2 కృష్ణా జలాలను పంపిణీ చేస్తూ కేంద్రానికి 2010 డిసెంబర్ 30న ప్రాథమిక నివేదిక.. 2013 నవంబర్ 29న తుది నివేదిక ఇచ్చాయి. వాటిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో కేడబ్ల్యూడీటీ–2 తుది నివేదికను కేంద్రం అమలు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నీటి కేటాయింపు చేసే బాధ్యతను విభజన చట్టం ద్వారా కేంద్రం కేడబ్ల్యూడీటీ–2కే అప్పగించింది. విభజన చట్టంలోని మార్గదర్శకాలు, కేంద్రం గతేడాది అక్టోబర్ 6న జారీ చేసిన అదనపు నియమ, నిబంధనల మేరకు రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.దేశంలో అత్యంత దుర్భిక్ష ప్రాంతమైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సుభిక్షం చేయడానికి తెలుగు గంగ (29 టీఎంసీలు కృష్ణా జలాలు + 30 టీఎంసీలు పెన్నా జలాలు), గాలేరు–నగరి (38 టీఎంసీలు), హంద్రీ–నీవా (40 టీఎంసీలు), వెలిగొండ ప్రాజెక్టు (43.5 టీఎంసీలు)ను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మిగులు జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టులను చేపట్టింది. శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ(శ్రీశైలం కుడి గట్టు కాలువ)కు మూడు దశాబ్దాలుగా, 11 ఏళ్లుగా గాలేరు–నగరి, .. 12 ఏళ్లుగా హంద్రీ–నీవాకు నీరు విడుదల చేస్తున్నారు.వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. నిర్వాసితులకు పునరావాసం కలి్పంచడమే తరువాయి. శ్రీశైలం నుంచి వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌కు కృష్ణా జలాలను తరలించవచ్చు. కానీ.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్ల నిర్వహణపై కేడబ్ల్యూడీటీ–2లో రాష్ట్ర ప్రభుత్వం తన తరఫు సాక్షి అయిన ఏకే గోయల్ ద్వారా దాఖలు చేయించిన అఫిడవిట్‌ను పరిశీలిస్తే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరిలతోపాటు వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడం ప్రశ్నార్థకంగా మారిందని నీటి పారుదల రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. సముద్రంలో కలిసినా సరే.. ⇒ గత ఆరేళ్ల తరహాలోనే కృష్ణాకు ముందుగా అంటే జూలై, ఆగస్టులో వరదలు ప్రారంభమై శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండి.. ప్రకాశం బ్యారేజ్ ద్వారా వరద జలాలు సముద్రంలో కలుస్తున్నా సరే తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే అవకాశం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన ప్రాజెక్టుల కింద 811 టీఎంసీల నికర జలాలు (75 శాతం లభ్యత) వాడుకుని, శ్రీశైలం, సాగర్‌లలో 150 టీఎంసీలను క్యారీ ఓవర్ కింద నిల్వ చేశాకే ఆ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ⇒ పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అదనంగా దక్కే 45 టీఎంసీలను కూడా కృష్ణా బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 2130 టీఎంసీలను వినియోగించుకున్న తర్వాతే తెలుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో.. తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీళ్లు దక్కే అవకాశాలు కనిష్టంగా ఉంటాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఆ ప్రాజెక్టులు ఉత్సవ విగ్రహాలే ⇒ కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన కేడబ్ల్యూడీటీ–1.. పునరుత్పత్తి జలాలు 70 టీఎంసీలు కలుపుకుంటే 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసి.. మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. అంతకంటే అదనంగా ఉన్న జలాలు అంటే.. మిగులు నీటిని వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఇచి్చంది. ⇒ కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 2,130 టీఎంసీల నికర జలాలను యథాతథంగా కొనసాగిస్తూనే.. 65 శాతం లభ్యత, సగటు ప్రవాహాలు ఆధారంగా 448 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 మూడు రాష్ట్రాలకు అదనంగా పంపిణీ చేసింది. దాంతో మహారాష్ట్రకు 666, కర్ణాటకకు 907, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,005 టీఎంసీలు దక్కాయి. తద్వారా కేడబ్ల్యూడీటీ–2 మొత్తం 2,578 టీఎంసీలను కేటాయించింది. అంతకంటే ఎక్కువ లభ్యత ఉన్న నీటిని అంటే మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి కేటాయించింది. ఈ నీటి కేటాయింపులు రాష్ట్రాలకు దక్కేలా చేయడం కోసం బేసిన్ పరిధిలోని అన్ని రాష్ట్రాలను కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాలని సూచించింది. ⇒ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేడబ్ల్యూడీటీ–2 అదనంగా కేటాయించిన 194 టీఎంసీల్లో.. 76–65 శాతం మధ్య లభ్యతగా ఉన్న 49 టీఎంసీలు (జూరాలకు 9, ఆర్డీఎస్ కుడి కాలువకు 4, క్యారీ ఓవర్ కింద 30, పర్యావరణ ప్రవాహాలు 6 టీఎంసీలు), 65 శాతం సగటు ప్రవాహాల మధ్య లభ్యతగా ఉన్న 145 టీఎంసీలు (తెలుగు గంగకు 25, క్యారీ ఓవర్ కింద 120 టీఎంసీలు) కేటాయించింది. ⇒ కేడబ్ల్యూడీటీ–2 తీర్పును అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే.. కృష్ణా బేసిన్ పరిధిలోని రాష్ట్రాలన్నీ 2,578 టీఎంసీలను వాడుకున్న తర్వాతే హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తామని ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కేడబ్ల్యూడీటీ–1 కూడా బేసిన్ పరిధిలోని రాష్ట్రాలతో కలిపి కృష్ణా బోర్డును ఏర్పాటు చేసి.. అన్ని రాష్ట్రాలకు వాటా జలాలు అందేలా చూడాలని చేసిన సూచనను కేంద్రం అమలు చేయలేదు. ఇప్పుడు కూడా కృష్ణా బోర్డును అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయకపోతే.. 2,578 టీఎంసీలను వినియోగించుకున్నట్లు తేల్చేదెవరని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ⇒ పోలవరం కుడి కాలువ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అదనంగా దక్కే 45 టీఎంసీలను కూడా కృష్ణా బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన 2,578 టీఎంసీలను వినియోగించుకున్న తర్వాతే తెలుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ⇒ ఇక కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన నీటిని గంపగుత్తగా వినియోగించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు ప్రతిపాదించలేదు. దాంతో కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను మళ్లించినా సరే.. శ్రీశైలం నుంచి హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే అవకాశం ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే ఆ ప్రాజెక్టులు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతాయని తేల్చి చెబుతున్నారు.తుంగభద్రలో పూడికతో ‘సీమ’కు నష్టం తుంగభద్ర డ్యాంను 133.5 టీఎంసీల సామర్థ్యంతో నిరి్మంచారు. ఆ డ్యాం ఒకటిన్నరసార్లు నిండుతుందని.. దాని వల్ల ప్రాజెక్టులో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన కేడబ్ల్యూడీటీ–1.. రాయలసీమకు 66.5 టీఎంసీలు (హెచ్చెల్సీ 32.5, ఎల్లెల్సీ 24, కేసీ కెనాల్ 10), తెలంగాణ(ఆర్డీఎస్)కు 6.51 టీఎంసీలు కేటాయించింది. కానీ.. తుంగభద్ర డ్యాంలో పూడిక పేరుకు పోవడంతో నీటి నిల్వ 105 టీఎంసీలకు తగ్గింది. అంటే.. 25 టీఎంసీల నిల్వ తగ్గినట్లు స్పష్టమవుతోంది. డ్యాం ఒకటిన్నర సార్లు నిండుతుందని బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన నేపథ్యంలో పూడిక వల్లే.. 37 టీఎంసీలు, నీటి ఆవిరి రూపంలో 5.. వెరసి 42 టీఎంసీలను రాయలసీమ కోల్పోవాల్సి వచి్చంది.ఆ నీళ్లన్నీ తుంగభద్ర నది ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులోకి చేరుతున్నాయి. తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో.. నీటి లభ్యత తక్కువగా ఉందని చూపుతూ దామాషా పద్ధతిలో తుంగభద్ర నీటి కేటాయింపులు చేస్తోంది. దాంతో తుంగభద్ర డ్యాం నుంచి రాయలసీమకు గరిష్టంగా 40 టీఎంసీలు కూడా దక్కడం లేదు. దాంతో రాయలసీమ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తుంగభద్ర డ్యాంలో పూడిక వల్ల రాయలసీమ కోల్పోతున్న వాటా జలాలను వినియోగించుకునే ప్రాజెక్టులు నిరి్మంచడంపైనా రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కృష్ణా జలాల వివాదం: డిసెంబర్ 6న కీలక భేటీ
సాక్షి, విజయవాడ: కృష్ణా జలాల వివాదంపై పరిష్కారం, నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ తదితర అంశాలపై ఈనెల 6న ఎపీ , తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జల వనరుల శాఖ అధికారులతో కేంద్ర జలశక్తి శాఖ వీడియో సమావేశం నిర్వహించనుంది. ఈ అంశాలపై ఢిల్లీ నుండి కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వీడియో శనివారం సమావేశం నిర్వహించారు. కానీ తెలంగాణా సీఎస్ ఈరోజు సమావేశానికి హాజరు కాలేనని 5వ తేదీకి సమావేశాన్ని మార్చాలని కోరారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారులతో ఈనెల 6వ తేదీన వీడియో సమావేశం నిర్వహించనున్నట్లు దేబశ్రీ ప్రకటించారు. అన్ని అంశాలను కూలంకుషంగా చర్చించి ఈసమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అప్పటి వరకూ ఇరు రాష్ట్రాలు పూర్తి సంయవనం పాటించాలని సూచించారు. నీటి విడుదలకు సంబంధించి ఎపీ ఇచ్చిన ఇండెంటుపై కృష్ణా నది యాజమాన్య బోర్డు ఈనెల 4వ తేదీన సమావేశం నిర్వహించాలని జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ.. కేఆర్ఎంబి చైర్మన్ శివనందన్ కు సూచించారు. నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని అప్పటి వరకూ నాగార్జున సాగర్ కుడి కాలువ నుండి నీటి విడుదలను ఆపాలని కోరారు. కృష్ణా జలాల పంపకంపై విభజన చట్టం ప్రకారం ఎపీ, తెలంగాణా రాష్ట్రాలకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుండి వీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర తాగునీటి అవసరాలకు నీటి విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని కారణంగానే ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. 6వతేదీన జరిగే సమావేశంలో ఇందుకు సంబంధించి అన్ని అంశాలను సమావేశం దృష్టికి తీసుకు వస్తామని సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: నాగార్జున సాగర్ దగ్గర టెన్షన్.. టెన్షన్.. మోహరించిన సీఆర్పీఎఫ్ బలగాలు -
ట్రిబ్యునల్ తీర్పు అమలయ్యే వరకూ పాత వాటాలే
సాక్షి, అమరావతి : కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) తీర్పు అమల్లోకి వచ్చే వరకూ పాత వాటాల ప్రకారమే రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. దీంతో ప్రస్తుత నీటి సంవత్సరంలోనూ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిలో గతంలో మాదిరిగానే 66 శాతం ఏపీకి, 34 శాతం తెలంగాణకు కృష్ణా బోర్డు పంపిణీ చేయనుంది. కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా.. ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేస్తూ 2015, జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. ఈ ఒప్పందంపై రెండు రాష్ట్రాలు సంతకం చేశాయి. దీని ప్రకారం 2015–16, 2016–17లో కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు జలాలను పంపిణీ చేసింది. ఆ తర్వాత కృష్ణాబోర్డు సమావేశాల్లో.. చిన్న నీటిపారుదలలో వినియోగం, కృష్ణా బేసిన్‌కు మళ్లించే గోదావరి జలాలను మినహాయించి, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిలో 66 శాతం ఏపీ, 34 శాతం తెలంగాణ వాడుకునేలా రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. దీంతో 2017–18 నుంచి అదే విధానం ప్రకారం రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు నీటిని పంపిణీ చేస్తూ వస్తోంది. అడ్డం తిరిగిన తెలంగాణ.. ప్రస్తుత నీటి సంవత్సరం ఆరంభంలో జరిగిన కృష్ణా బోర్డు సర్వసభ్య సమావేశంలోనూ అదే విధానం ప్రకారం నీటిని పంపిణీ చేసుకోవడానికి తొలుత అంగీకరించిన తెలంగాణ.. ఆ తర్వాత అడ్డం తిరిగింది. కృష్ణా జలాల్లో సగం వాటా కావాలని పట్టుబట్టడంతో ఈ అంశాన్ని కృష్ణాబోర్డు కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లింది. ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను.. 2రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై ఆ ట్రిబ్యునల్ విచారిస్తుండటాన్ని గుర్తుచేసిన కేంద్ర జల్‌శక్తి శాఖ.. ఆ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చే వరకూ పాత వాటాల ప్రకారమే నీటిని పంపిణీ చేయాలని తేల్చిచెప్పింది. -
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే గెజిట్ ప్రకటన రాలేదు
సాక్షి, న్యూఢిల్లీ: జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కృష్ణాజల వివాదాల ట్రిబ్యునల్ చేసిన సిఫార్సులను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధికారిక గెజిట్‌లో నోటిఫై చేయలేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు చెప్పారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం కింద కేంద్ర ప్రభుత్వం 2004లో జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసిందని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబుగా తెలిపారు. 2010లో ఈ ట్రిబ్యునల్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా 2011లో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిం దని, దీనిపై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయని వివరించారు. వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించేవరకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ సిఫార్సులను అధికారిక గెజిట్‌లో ప్రకటించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ట్రిబ్యునల్ సిఫార్సులను ప్రభుత్వం అధికారికంగా గెజిట్‌లో ప్రకటించలేదన్నారు. 1.15 కోట్ల గృహాలు మంజూరు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన్–అర్బన్ (పీఎంఏవై–యూ)లో 1.15 కోట్ల గృహాలు మంజూరయ్యాయని, వాటిలో 56.2 లక్షలు పూర్తయ్యాయని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. మిగిలినవి వివిధ దశలో ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆర్థిక మద్దతుపై ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి ఏపీకి ఆర్థిక మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి వైఎ స్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం మరో ఐదేళ్లపాటు పొడిగించాలన్నారు. రాజ్యసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై మాట్లాడారు. ‘దేశంలో ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థికవ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ పరిహారాన్ని ఐదేళ్ల పాటు పొడిగించాలి. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను కేంద్రం వేగవంతం చేయాలి. రాష్ట్రానికి ఆర్థిక మద్దతు అందించడానికి ఓ వ్యవస్థ రూపొందించాలి..’ అని ఆయన పేర్కొన్నారు. -
అప్పర్ భద్రకు అనుమతులు సరికాదు
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరివాహక ప్రాంతం (బేసిన్)లో దిగువ రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభిప్రాయాలను తీసుకోకుండా కర్ణాటక చేపట్టిన అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) హైడ్రలాజికల్ క్లియరెన్స్ ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణమే ఈ అనుమతులను పునఃసమీక్షించి.. ప్రాజెక్టు పనులు చేపట్టకుండా కర్ణాటకను ఆదేశించాలని సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్కే సిన్హాను రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలు డిమాండ్ చేశారు. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు అప్పర్ భద్రపై ఏపీ, కర్ణాటక జలవనరుల శాఖ అధికారులతో ఆర్కే సిన్హా మంగళవారం వర్చువల్ విధానంలో సమావేశమయ్యారు. కేటాయించిన నీటిని వాడుకోవడానికే అప్పర్ భద్ర చేపట్టామని కర్ణాటక జలవనరుల శాఖ కార్యదర్శి ఎన్.లక్ష్మణ్‌రావు పీష్వా పేర్కొనడంపై ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1.. అప్పర్ భద్రకు ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని.. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు ఇప్పటిదాకా అమల్లోకి రాలేదన్నారు. ప్రాజెక్టుల ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఎక్కడా తగ్గలేదని కేడబ్ల్యూడీటీ–2 తేల్చిచెప్పినా.. దానికి భిన్నంగా మిగులు ఉందంటూ.. వాటిని వాడుకోవడానికే అప్పర్ భద్ర చేపట్టామని కర్ణాటక పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో కృష్ణా బేసిన్ ఆయకట్టుకు తీవ్ర నీటి ఎద్దడి అప్పర్ తుంగ ప్రాజెక్టు నుంచి 17.40 టీఎంసీలను భద్ర ప్రాజెక్టులోకి ఎత్తిపోసి.. భద్ర ప్రాజెక్టు నుంచి 29.90 టీఎంసీలను తరలించేలా కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు చేపట్టిందని ఏపీ అధికారులు వివరించారు. నీటిని తరలించే క్రమంలో కర్ణాటకలోని వాణివిలాసాగర్, ఏపీలోని భైరవానితిప్ప ప్రాజెక్టు (బీటీపీ) మధ్య వేదవతిపై రిజర్వాయర్‌ను నిర్మిస్తోందన్నారు. ఈ రిజర్వాయర్‌ను నిర్మించకూడదని కేడబ్ల్యూడీటీ–1 స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్ కింద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల ఆయకట్టుతోపాటూ కేసీ కెనాల్ కింద ఏపీ, ఆర్డీఎస్ కింద ఏపీ, తెలంగాణల్లోని ఆయకట్టుకు తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడుతుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద ప్రవాహం రావడంలో జాప్యం చోటు చేసుకుంటుందన్నారు. ఇది ఆ ప్రాజెక్టుల ఆయకట్టు రైతులకు ఇబ్బందులను సృష్టిస్తుందన్నారు. దీనిపై ఆర్కే సిన్హా స్పందిస్తూ.. ప్రాజెక్టుపై అభ్యంతరాలను కర్ణాటక సర్కార్‌కు పంపాలని సూచించారు. వాటిపై కర్ణాటక సర్కార్ వివరణ ఇచ్చిన తర్వాత మరోసారి 2 రాష్ట్రాల అధికారులతో సమావేశమై.. అప్పర్ భద్రపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయకున్నా.. అప్పర్ భద్రకు 36 టీఎంసీలు కేటాయించాలని కర్ణాటక చేసిన ప్రతిపాదనను.. నీటి లభ్యత లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ కేడబ్ల్యూడీటీ–1 తోసిపుచ్చిందని గుర్తు చేశారు. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయకున్నా సరే.. అప్పర్ భద్ర ద్వారా 29.90 టీఎంసీలను వినియోగించుకుని 2.25 లక్షల హెక్టార్లకు నీళ్లందించేలా కర్ణాటక చేపట్టిన ఈ ప్రాజెక్టుకు గతేడాది డిసెంబర్ 24న సీడబ్ల్యూసీ టీఏసీ అనుమతి ఇచ్చిందని ఎత్తిచూపారు. దీనికి ఈ ఏడాది మార్చి 25న కేంద్ర జల్ శక్తి శాఖ పెట్టుబడి అనుమతి ఇచ్చిందన్నారు. కేడబ్ల్యూడీటీ–1, కేడబ్ల్యూడీటీ–2లు అప్పర్ భద్రకు 10 టీఎంసీలు కేటాయించనే లేదన్నారు. తుంగ ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 6.25, భద్ర ఆనకట్ట ఆధునికీకరణ వల్ల 0.5, విజయనగర ఛానల్స్ ఆధునికీకరణ వల్ల 6.25, కృష్ణా డెల్టాకు పోలవరం ద్వారా మళ్లించిన జలాల్లో వాటాగా దక్కిన నీటిలో 2, కృష్ణా బేసిన్లో అదనపు మిగులు జలాల రూపంలో 6 టీఎంసీల లభ్యత ఉందని.. ప్రవాహ, ఆవిరి నష్టాలుపోనూ మిగిలిన నీటిని అప్పర్ భద్ర ద్వారా వాడుకుంటామని కర్ణాటక పేర్కొందన్నారు. కానీ.. వాటి ఆధునికీకరణ వల్ల నీటి వినియోగం ఏమాత్రం తగ్గలేదని.. అదనపు మిగులు జలాలు లేవని కేడబ్ల్యూడీటీ–2 ఎత్తిచూపిన అంశాన్ని గుర్తు చేశారు. -
జల వివాదం: ‘సుప్రీం’ను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని పిటిషన్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిని నోటిఫై చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. అదే విధంగా... తెలంగాణ సర్కార్ జూన్ 28న ఇచ్చిన జీవోను రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు.. ‘‘తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తాగు, సాగు నీటి జలాలు దక్కకుండా ప్రజల హక్కును హరిస్తోంది. కృష్ణా జలాల పంపిణీ అవార్డును తెలంగాణ ఉల్లంఘిస్తోంది. విభజన చట్టాన్ని కూడా తెలంగాణ ఉల్లంఘిస్తోంది’’ అని ఏపీ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. -
కృష్ణా నదీ జలాల్లో అర్ధభాగం అసంబద్ధం
ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెరిసగం వాటా దక్కాలని తెలంగాణ సర్కార్ కొత్త పల్లవి అందుకోవడంపై న్యాయ, నీటిపారుదలరంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ఆధారంగా.. ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలు పంపిణీ చేస్తూ జూన్ 19, 2015న కేంద్ర జలవనరుల శాఖ ఏర్పాటుచేసిన తాత్కాలిక సర్దుబాటును ఆమోదిస్తూ.. ఒప్పందంపై సంతకం చేసిన తెలంగాణ సర్కార్, ఇప్పుడు ఆ ఒప్పందం నుంచి బయటకొస్తున్నట్లు ప్రకటించడాన్ని తప్పుపడుతున్నారు. ఇది విభజన చట్టాన్ని, ట్రిబ్యునళ్లను అపహాస్యం చేయడమేనని చెబుతున్నారు. చెరిసగం కానేకాదు.. బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–1) చేసిన కేటాయింపులను కొనసాగిస్తూనే.. 75 శాతం, 65 శాతం లభ్యతకు మధ్యన అందుబాటులో ఉన్న 448 టీఎంసీలను ప్లాన్–బి కింద మూడు రాష్ట్రాలకు అదనంగా పంపిణీ చేసిందని గుర్తుచేస్తున్నారు. ఇందులో ఉమ్మడి ఏపీకి 194 టీఎంసీల వాటా దక్కిందని గుర్తుచేస్తున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూల్లో ఏపీలోని తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులను కేంద్రం అధికారికంగా గుర్తించింది. అలాగే, తెలంగాణలోని నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలనూ గుర్తించింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ప్లాన్–బి కింద అదనంగా కేటాయించిన జలాల్లోనూ కేంద్రం అధికారికంగా గుర్తించిన ప్రాజెక్టులకు 150.5 టీఎంసీలు ఏపీకి, 44 టీఎంసీలు తెలంగాణకు దక్కే అవకాశముందని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 512.04 టీఎంసీల నుంచి 662.54 టీఎంసీలకు పెరుగుతుందని.. తెలంగాణ వాటా 342.96 టీఎంసీలకు చేరుతుందే తప్ప.. చెరిసగం కానేకాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది తెలిసి కూడా తెలంగాణ సర్కార్ తద్భిన్నంగా వ్యవహరించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రీయంగానే పంపిణీ కృష్ణా జలాలను పరీవాహక ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేయడానికి ఏప్రిల్ 10, 1969న జస్టిస్ బచావత్ నేతృత్వంలో కేంద్రం కేడబ్ల్యూడీటీ–1ను ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ మే 27, 1976న తుది తీర్పు ఇచ్చింది. అందులో ప్రధానాంశాలివీ.. ►కృష్ణా జలాల పంపిణీకి బచావత్ ట్రిబ్యునల్ ఫస్ట్ ఇన్ యూజ్.. ఫస్ట్ ఇన్ రైట్(మొదటి నీటిని వాడుకున్న ప్రాజెక్టులకే ప్రథమ హక్కు)ను మూలసూత్రంగా పాటించింది. ►కృష్ణా డెల్టాకు 1854 నుంచి ప్రకాశం బ్యారేజీ ద్వారా నీళ్లందిస్తున్నారు. కేసీ(కర్నూల్–కడప) కెనాల్ ఆయకట్టుకు 1933 నుంచి నీళ్లందిస్తున్నారు. తుంగభద్ర డ్యామ్‌ను 1945లో చేపట్టి 1953 నాటికి పూర్తిచేసి.. హెచ్చెల్సీ, ఎల్లెల్సీ ద్వారా రాయలసీమకు నీళ్లందిస్తున్నారు. తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ మినహా ఏపీలోని ప్రాజెక్టులన్నీ 1976కు ముందు చేపట్టినవే. ►1976కు ముందు పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీటి వినియోగాన్ని పరిగణనలోకి తీసుకున్న బచావత్ ట్రిబ్యునల్.. నీటి కేటాయింపులో వాటికే తొలి ప్రాధాన్యం ఇచ్చింది. ►కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,060.. పునరుత్పత్తి 70తో కలిపి 2,130 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఏపీకి 811 టీఎంసీలను కేటాయించింది. మిగులు జలాలను హక్కుగా కాకుండా వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఏపీకి ఇచ్చింది. ►ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో.. 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16 టీఎంసీల వాటా ఇచ్చింది. నిర్మాణం, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలంలో ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ప్రామాణికం కృష్ణా నదీ జలాలను పునఃపంపిణీ చేయడానికి ఏప్రిల్, 2004లో కేంద్రం ఏర్పాటు చేసిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్.. బచావత్ ట్రిబ్యునల్ తుది తీర్పునే ప్రామాణికంగా తీసుకుని నీటి కేటాయింపులు చేస్తూ అక్టోబర్ 19, 2016న కేంద్రానికి తుది నివేదిక ఇచ్చింది. ఈ నివేదికలో ప్రధానాంశాలివీ.. ►కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కొనసాగించింది. ►75 శాతం, 65 శాతం లభ్యత మధ్య అందుబాటులో ఉన్న 448 టీఎంసీల్లో ఆర్డీఎస్ కుడి కాలువకు 4 టీఎంసీలు, తెలుగుగంగకు 25 టీఎంసీలతో సహా 194 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి అదనంగా కేటాయించింది. దాంతో ఏపీకి 1,005 టీఎంసీల వాటా దక్కింది. కర్ణాటకకు అదనంగా 173, మహారాష్ట్రకు 81 టీఎంసీలు అదనంగా దక్కాయి. ►బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును పరిగణనలోకి తీసుకుంటే.. ఏపీకి 512.04 టీఎంసీలతో పాటూ అదనంగా 150.5 టీఎంసీలు వెరసి 662.54 టీఎంసీల వాటా దక్కుతుంది. తెలంగాణకు 342.96 టీఎంసీలు దక్కుతాయి. ►బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం తరహాలోనే తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను ఇటీవల వెనక్కి తీసుకుంది. ►ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేస్తున్న నేపథ్యంలో.. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం నోటిఫై చేయలేదు. విభజన చట్టాన్ని అపహాస్యం చేస్తారా? ఉమ్మడి రాష్ట్రానికి చేసిన నీటి కేటాయింపులను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే విభజన చట్టం అప్పగించింది. ఈ నేపథ్యంలో.. రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయడంపై ఐదేళ్లుగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల జోలికి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వెళ్లే అవకాశం లేదని.. అదనంగా కేటాయించిన 194 టీఎంసీలను విభజన చట్టంలో 11వ షెడ్యూలులో కేంద్రం అధికారికంగా గుర్తించిన ప్రాజెక్టులకు పంపిణీ చేయడంపైనే కసరత్తు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేసే దాకా.. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగా ఇరు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ జూన్ 19, 2015న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ఆధారంగా ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ చేసిన ఒడంబడికపై ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే దాకా ఇదే ఒప్పందం ప్రకారం నీటిని పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. వాస్తవాలిలా ఉంటే.. కృష్ణా జలాల్లో చెరి సగం వాటా దక్కాలని తెలంగాణ సర్కార్ తీర్మానం చేయడం, 2015లో ఆమోదించిన ఒప్పందం నుంచి బయటకొస్తామని ప్రకటించడాన్ని న్యాయ నిపుణులు తప్పుపడుతున్నారు. ఇది విభజన చట్టాన్ని, ట్రిబ్యునళ్లను అపహాస్యం చేయడమేనని స్పష్టంచేస్తున్నారు. -
తేలని లెక్కలు..వీడని వివాదాలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీ జలాల వినియోగానికి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారంలో కృష్ణా బోర్డు పూర్తిగా విఫలమవుతోంది. దీంతో ఏళ్ల తరబడి సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోతున్నాయి. జూన్ నుంచి ఆరంభమైన కొత్త నీటి సంవత్సరంలో అయినా, కొన్నింటికైనా పరిష్కారం లభిస్తుందని ఆశించినా అడియాశే అవుతోంది. ఒకరు రాసిన లేఖలను మరొకరికి పంపడం, రెండు రాష్ట్రాలు స్పందించకుంటే కేంద్రానికి లేఖలు రాయడం తప్ప, పరిష్కారాలు చూపకపోవడంతో జల జగడాలు తీవ్రమవుతూనే ఉన్నాయి. వివాదాలు ముదురుతున్న నేపథ్యంలో ఈ నెల 9న హైదరాబాద్‌లో త్రిసభ్య కమిటీ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యమైన సమస్యలివీ.. ♦హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వాడుకుంటున్న నీటిలో 20 శాతాన్నే వినియోగ కోటా కింద పరిగణించాలని రాష్ట్ర సర్కార్ 2016లో కృష్ణా బోర్డును కోరింది. కృష్ణా బేసి¯Œ నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న నీటిలో 80% వివిధ రూపాల్లో మూసీ ద్వారా కృష్ణాలో కలుస్తోందని పేర్కొంది. అయితే దీన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని కృష్ణా బోర్డు కోరింది. అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం రాలేదు. ♦ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో క్యారీ ఓవర్ జలాలను ఎప్పుడైనా వినియోగించుకునే స్వేచ్ఛ తమకు ఉందని తెలంగాణ అంటోంది. 2019–20 నీటి సంవత్సరంలో కేటాయించిన నీటిలో 50.851 టీఎంసీలను వాడుకోలేకపోయామని, వాటిని 2020–21లో వినియోగించుకుంటామని గతేడాది తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. దీన్ని ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించింది. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–1 తీర్పులో క్లాజ్–8 ప్రకారం.. ఏ నీటి సంవత్సరం లెక్కలు ఆ ఏడాదితోనే పూర్తవుతాయని, వాడుకోకుండా మిగిలిపోయిన జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దీనిపై కేంద్రం ఇదే వైఖరిని స్పష్టం చేసినా తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కూడా బోర్డు ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ♦నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద ప్రవాహ నష్టాలు 40 శాతం మేర ఉన్నాయని తెలంగాణ తొలినుంచీ చెబుతోంది. ప్రవాహ నష్టాలను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేయాలని కోరుతోంది. అయితే ఈ ప్రవాహ నష్టాలు 27 శాతానికి మించవని ఏపీ అంటోంది. ప్రవాహ నష్టాలను తేల్చేందుకు జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తామని, ఆర్నెల్లలోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని బోర్డు చెప్పి రెండేళ్లవుతున్నా దీనిపై ఏమీ తేల్చలేదు. ♦కృష్ణా బేసిన్ లో చిన్న నీటి వనరుల కింద తెలంగాణకు 90 టీఎంసీల మేర కేటాయింపులున్నా, కేవలం 30 నుంచి 40 టీఎంసీల మేర మాత్రమే వినియోగం ఉంటోందని రాష్ట్రం చెబుతోంది. అయితే ఏపీ మాత్రం మిషన్ కాకతీయ కార్యక్రమం అనంతరం తెలంగాణ పూర్తి స్థాయిలో నీటి వినియోగం చేస్తోందని, ఆ నీటి పరిమాణాన్ని సైతం తెలంగాణ నీటి వినియోగం కోటాలో కలపాలని అంటోంది. దీనిపై బోర్డు గతంలోనే జాయింట్ కమిటీని నియమించినా నాలుగేళ్లుగా ఈ లెక్కలు తేలలేదు. ♦బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ నిండి నీరు సముద్రంలో కలుస్తున్నప్పుడు వరద జలాలను ఎవరు వాడుకున్నా వాటిని కోటా కింద పరిగణించకూడదని ఏపీ కోరుతోంది. 2019–20లో కృష్ణా నదికి భారీ వరద వచ్చి నీరంతా సముద్రంలో కలుస్తున్న సమయంలో ఏపీ 44 టీఎంసీలను మళ్లించింది. ఈ నీటిని రాష్ట్రాల కోటా కింద లెక్కించకూడదని బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. దీన్ని తెలంగాణ వ్యతిరేకించింది. దీనిపై ఇంతవరకు ఎటూ తేలలేదు. ♦కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి అందులో ఏయే ప్రాజెక్టులను చేర్చాలన్న దానిపై తర్జనభర్జన కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను గుర్తించినా, న్యాయపరంగా కొన్ని చిక్కులు తప్పవన్న ఉద్దేశంతో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ♦నాగార్జునసాగర్ కుడి కాలువ కింద అనవసరంగా విడుదల చేసిన 13.47 టీఎంసీలను తమ వాటా వినియోగంలో చూపరాదని ఆంధ్రప్రదేశ్ అంటోంది. ఈ విషయం ఏపీ గతంలో కూడా ప్రస్తావించినా, ఈ వివాదంపై ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ♦ఇక ఇరు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలపై పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నా.. బోర్డు వాటికి ఎలాంటి పరిష్కారం తీసుకురాలేకపోతోంది. ఈ విషయాలపై కేంద్రానికి నివేదించడం తప్ప పరిష్కారాలు కనుగొనడం లేదు. -
Krishna Water Dispute: కృష్ణా జలాలు.. చెరిసగం
కీలక తీర్మానాలు ఇవీ.. ♦కేటాయింపులు, పర్యావరణ అనుమతులు లేకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా ఏపీ అక్రమంగా పోతిరెడ్డిపాడు, సీమ లిఫ్టు పథకాలను చేపడుతోంది. మేం వాటిని గుర్తించం. ♦ పోతిరెడ్డిపాడు, సీమ లిఫ్టు ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ బోర్డు సమావేశంలో వాదనలను వినిపించాలి. ♦ జూరాల కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని వదిలి.. చెరువులను, కుంటలను నింపాలి. ♦కృష్ణాజలాల్లో బచావత్ ట్రిబ్యునల్ ఎన్‌బ్లాక్ (గుండుగుత్త) కేటాయింపులు చేసిన, నికర జలాల కేటాయింపులున్న ప్రాజెక్టులకు మాత్రమే ఏపీ నీటిని వాడుకోవాలి. ♦9న కృష్ణా బోర్డు త్రిసభ్య భేటీని రద్దు చేయాలి. 20 తర్వాత పూర్తిస్తాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అందులో తెలంగాణ రాష్ట్ర అంశాలను కూడా ఎజెండాలో చేర్చాలి. ♦ సమ్మక్క బ్యారేజీ, సీతమ్మసాగర్ ప్రాజెక్టులను ఇరిగేషన్ అండ్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులుగా పిలవాలి. ♦శ్రీశైలం సహా కృష్టా ప్రాజెక్టుల వద్ద పూర్తిస్థాయి రక్షణ చర్యలు తీసుకోవాలి. శ్రీశైలం డ్యామ్ వద్ద తెలంగాణ భూభాగంలోకి విద్యుత్ ఉద్యోగులను తప్ప వేరెవరినీ అనుమతించొద్దు. సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంలో ఇప్పటివరకు అమలు చేస్తున్న విధానాన్ని పక్కనపెట్టాలని.. ఇకపై తెలంగాణ, ఏపీ చెరో సగం నీటిని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన అత్యున్నత సమావేశం నిర్ణయించింది. ఏపీ, తెలంగాణ మధ్య తాత్కాలికంగా 66:34 నిష్పత్తిలో కొనసాగుతున్న కృష్ణా జలాల పంపిణీని సరికాదని.. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో పంపకాలు జరగాలని తీర్మానించింది. ట్రిబ్యునల్ తుది కేటాయింపులు జరిపేదాకా కూడా.. మొత్తం 811 టీఎంసీల నికర జలాల్లోంచి 405.5 టీఎంసీల (50%) నీటిని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇటీవల రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఉన్నంతకాలం పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగించాలని తీర్మానించింది. శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన.. సాగునీటి ప్రాజెక్టులు, జల విద్యుత్, ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్ పథకం తదితర అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. చట్టబద్ధంగానే జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల్లో జల విద్యుదుత్పత్తిని ఆపాలని చెప్పే హక్కు కృష్ణాబోర్డుకు లేదని.. జల విద్యుత్‌కు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఎటువంటి ఒప్పందాలు లేవని ఉన్నతస్థాయి సమావేశం అభిప్రాయపడింది. ఈ అంశంలో బోర్డు జోక్యం చేసుకునే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది. తెలంగాణ సర్కారు పులిచింతలలో విద్యుదుత్పత్తితో కృష్ణా జలాలను వృథా చేస్తోందంటూ ఏపీ ప్రభుత్వ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించింది. పులిచింతల నుంచి విడుదలైన నీటిని ప్రకాశం బ్యారేజీ ద్వారా కృష్ణా జిల్లా అవసరాలను వాడుకోవాలని.. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోసే ఖర్చును మిగుల్చుకోవచ్చని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణలో సాగునీటిని ఎత్తిపోసేందుకు, హైదరాబాద్ తాగునీటి అవసరాలు, మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఎంతగానో ఉందని సమావేశం పేర్కొంది. అందువల్ల ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొని చట్టబద్ధంగా జల విద్యుదుత్పత్తి చేసుకుంటామని స్పష్టం చేసింది. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులతో కాలుష్యం పెరిగిపోతోందని, ‘క్లీన్ ఎనర్జీ’ఉత్పత్తి చేస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు ఇచ్చిందని.. తెలంగాణ జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా వాటిని అమలు చేస్తోందని పేర్కొంది. విద్యుదుత్పత్తి కోసమే నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ వాటా నీటిని వాడుకుంటుంటే.. ఆపాలని ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించింది. రాయలసీమ లిఫ్టుపై ఇచ్చిన స్టేని ఉల్లంఘించినందుకు ఏపీ ప్రభుత్వ సీఎస్‌ను జైల్లో వేస్తామని ఎన్జీటీ ప్రకటించిందని, అయినా సర్వే ముసుగులో నిర్మాణాలు చేపట్టడం దారుణమని అభిప్రాయ పడింది. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్, నీటిపారుదలశాఖ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, సీఎం సెక్రెటరీ స్మితా సబర్వాల్, ఈఎన్సీ మురళీధర్‌రావు, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, జెన్కో డైరెక్టర్ (హైడల్) వెంకటరాజం, అడ్వొకేట్ జనరల్ ప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు, సాగునీటిశాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ‘‘తెలంగాణలో ఆంధ్రా మాదిరిగా కాలు అడ్డం పెట్టుకొని నీళ్లు పారించుకునే పరిస్థితి లేదు. నీటిని ఎత్తి పోసుకోవాలె. తెలంగాణలో 30 లక్షలకుపైగా బోర్లున్నాయి. మొత్తం విద్యుత్‌లో 40 శాతం దాకా సాగునీటి అవసరాలకే వినియోగమవుతోంది. తెలంగాణకున్న పరిస్థితుల దృష్ట్యా సాగునీరే కాదు, విద్యుదుత్పత్తి కోసం కూడా నీరు అవసరం.’’ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందాకైనా.. ‘‘కృష్ణా జలాల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా, ఎంతదూరమైనా కొట్లాడుతం. వలస పాలకులు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు. ఎత్తిపోతల పథకాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలంగాణలో వ్యవసాయాన్ని దండుగలా మార్చి రైతులకు అన్యాయం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రథమ ప్రాధాన్యతగా కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టి.. సాగునీటి గోస తీర్చుకున్నం. జల విద్యుత్ ప్రాజెక్టుల్లో కేటాయింపులున్న నీటిని విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకుంటం. ట్రిబ్యునల్స్ ద్వారా రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు కేటాయించిన నదీ జలాలను వాడుకుంటం. పొరుగు రాష్ట్రాలు వారి వాటాను వినియోగించుకోవడానికి సంపూర్ణంగా సహకరిస్తం. కానీ కేటాయింపులు లేని నికర జలాలను దౌర్జన్యంగా వాడుకుంటామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోబోరు..’’ అవసరమైతే కేంద్రంతో పోరు బ్రిజేశ్ ట్రిబ్యునల్ ఏర్పాటై 17 ఏండ్లు కావస్తున్నా తెలంగాణకు కృష్ణా జలాల్లో నీటి వాటాను నిర్ధారించకపోవడంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి వాటా కోసం అవసరమైతే కేంద్రంతో పోరాడుతామని స్పష్టం చేశారు. కృష్ణా బేసిన్ అవసరాలు పూర్తిగా తీరాకనే.. అదీ మిగులు జలాలు ఉంటేనే ఇతర నదీ బేసిన్లకు నీటిని తీసుకెళ్లాలని.. ఈ నిబంధనను ఏపీ ప్రభుత్వం విస్మరించడం సరికాదని పేర్కొన్నారు. తెలంగాణ చేపట్టిన లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం విద్యుత్ అవసరం పెరిగిందని.. ఈ మేరకు జల విద్యుదుత్పత్తి చేసి, లిఫ్టులను నడిపి సాగునీటిని ఎత్తిపోసుకుంటుందని వివరించారు. తెలంగాణకు కేటాయించిన నీటి ద్వారానే జల విద్యుదుత్పత్తి చేస్తుందని, ఎవరూ అభ్యంతరం తెలపడానికి లేదన్నారు. ఇదే విషయాన్ని ట్రిబ్యునళ్లు, బోర్డులు, కోర్టుల్లో వివరిస్తామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడుకు వరద జలాలను మాత్రమే వాడుకుంటామని అసెంబ్లీలో, బయటా అనేకసార్లు ప్రకటించారని, బ్రిజేష్ ట్రిబ్యునల్‌కు కూడా అదే విషయం చెప్పారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పోతిరెడ్డిపాడు పేరుతో తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తామంటే తెలంగాణ ప్రజలు సహించబోరని కేసీఆర్ హెచ్చరించారు. ఎగువన ఉన్న మహారాష్ట్రతో చర్చలు జరిపి, వారికి ఇబ్బంది లేనివిధంగా, సహకరిస్తూ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని.. ఏపీ విషయంలోనూ ఇదే తీరులో స్నేహహస్తం సాచామని, అయినా ఏపీ పెడచెవిన పెట్టిందని పేర్కొన్నారు. -
కేటాయించిన నీటిని వాడుకుంటే తప్పేంటి?
సాక్షి, అమరావతి: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ), విభజన చట్టం ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడి కాలువ పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. దీనిని తెలంగాణ సర్కార్ తప్పు పట్టడంపై నీటి పారుదలరంగ, న్యాయ నిపుణులు నివ్వెరపోతున్నారు. విభజన చట్టాన్ని తుంగలో తొక్కి.. కేటాయింపులు లేకున్నాకొత్త ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు పాత ప్రాజెక్టుల సామర్థ్యం పెంచి 178.93 టీఎంసీలను తరలించేలా తెలంగాణ సర్కార్ చేపట్టిన 8 ప్రాజెక్టులూ అక్రమమేనని స్పష్టం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుండటాన్ని ఎత్తిచూపుతున్నారు. కేటాయింపులున్నా నీళ్లందని దుస్థితి శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగు గంగ, ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), గాలేరు–నగరి ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించాలి. చెన్నైకి తాగునీటిని సరఫరా చేయాలి. కేసీ కెనాల్‌కు సప్లిమెంటేషన్ కింద 10 టీఎంసీలు సరఫరా చేయాలి. కేడబ్ల్యూడీటీ, విభజన చట్టం ద్వారా ఈ ప్రాజెక్టులకు 114 టీఎంసీల కేటాయింపు ఉంది. శ్రీశైలం జలాశయంలో 881 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీటి మట్టం ఉంటేనే.. ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కాలువలకు చేరుతాయి. కృష్ణా బేసిన్లో వర్షాభావ పరిస్థితుల వల్ల ఆ స్థాయిలో నీటిమట్టం ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచే రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ) ప్రాజెక్టుల ద్వారా 2.95 టీఎంసీలను తరలించేలా తెలంగాణ సర్కార్ అనుమతి లేకుండా పనులు చేపట్టింది. 796 అడుగుల నీటి మట్టం నుంచే శ్రీశైలం ఎడమ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం ఉంది. అంటే.. 800 అడుగుల కంటే దిగువ స్థాయి నుంచే తెలంగాణ సర్కార్ రోజుకు 6.95 టీఎంసీలను తరలించే సామర్థ్యం కలిగి ఉంది. కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ యథేచ్ఛగా తెలంగాణ సర్కార్ నీటిని తరలించడం వల్ల శ్రీశైలం నీటిమట్టం తగ్గిపోతుంది. శ్రీశైలం నీటి మట్టం 848 అడుగుల కంటే దిగువకు చేరితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కాలువల్లోకి చుక్క నీరు చేరదు. నీటి కేటాయింపులు ఉన్నా సరే.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆయకట్టులో పంటలను రక్షించలేని దుస్థితి. రాయలసీమ, నెల్లూరు, చెన్నై ప్రజలకు తాగునీటిని అందించలేని పరిస్థితి. ఈ పరిస్థితులను అధిగమించడానికి కేటాయింపులను సమర్థవంతంగా వినియోగించుకుని ఆయకట్టులో పంటలను రక్షించడం, తాగునీటిని అందించడం కోసం.. శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కాలువలోకి ఎత్తిపోసేలా రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టిందని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అక్రమ ప్రాజెక్టు ఎలా అవుతుంది ఆర్డీఎస్ కుడి కాలువ ద్వారా 4 టీఎంసీలను వినియోగించుకోవడానికి కేడబ్ల్యూడీటీ–2 ఏపీ ప్రభుత్వానికి అవకాశం కల్పించింది. హక్కుగా దక్కిన ఆ జలాలను వాడుకోవడానికి ఆర్డీఎస్ కుడి కాలువను ప్రభుత్వం చేపట్టింది. ఇదెలా తప్పవుతుందని నీటిపారుదల రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కేసీ (కర్నూలు–కడప) కెనాల్‌కు ట్రిబ్యునల్ 39.9 టీఎంసీలను కేటాయించింది. సుంకేశుల బ్యారేజీ ద్వారా ఈ నీటిని కేసీ కెనాల్‌కు మళ్లించి.. 2.65 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి అనుమతి ఇచ్చింది. దశాబ్దాల క్రితం నాటి ఈ ఆయకట్టును దెబ్బతీసేలా 2015లో తెలంగాణ సర్కార్ సుంకేశుల బ్యారేజీ జల విస్తరణ ప్రాంతం నుంచి 5.54 టీఎంసీలను తరలించేలా తుమ్మిళ్ల ఎత్తిపోతలను చేపట్టింది. ఎలాంటి అనుమతి లేకుండా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల అక్రమమైనదని నీటి పారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆర్డీఎస్ కుడి కాలువ ఎలా అక్రమ ప్రాజెక్టవుతుందని ప్రశ్నిస్తున్నారు. -
'వాదనలు వినిపించనందునే వాటా దక్కలేదు'
- డిపెండబులిటీ తగ్గడంతో రాష్ట్రానికి అన్యాయం - సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపిస్తే నీటి కోటా పెరుగుతుంది - ఫీజు బకాయిలివ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు - బీసీ కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వానికి అభినందనలు - కేంద్రం నుంచి సంక్షేమానికి మరిన్ని నిధులు వచ్చేలా ప్రయత్నిస్తా - కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హైదరాబాద్: నీటి వాటాలపై బ్రిజేష్ ట్రిబ్యూనల్ ఎదుట రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించడంలో విఫలమైందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. డిపెండబులిటీ 75 నుంచి 65కు తగ్గించడంతో కొంత నష్టపోగా... సరైన వానదలు వినిపించక పోవడంతో మరింత నష్టం జరిగిందని, ఫలితంగా రాష్ట్రానికి తక్కువ నీటి కేటాయింపులు జరిగాయన్నారు. చివరగా సుప్రీంకోర్టులో మరో అవకాశం ఉందని, ఈసారైన సరైన నిపుణులను సంప్రదించి సమర్థవంతంగా వాదనలు వినిపించాలని ప్రభుత్వానికి సూచించారు. నీటి వాటాలు పెరిగితే రాష్ట్రంలో ప్రాజెక్టులు కళకళలాడతాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన నీటిపై హక్కు ఉండేదని, గత కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆదివారం దిల్కుషా అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు బకాయిలు కోట్లలో పేరుకుపోయాయని, దీంతో విద్యార్థులపై ఒత్తిడి పెరగడంతో మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రూ.2వేల కోట్ల బకాయిలున్నాయని, గత నాలుగేళ్లుగా ఈ పథకం నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు. పేదప్రజల సంక్షేమానికి కేంద్రం నుంచి అధిక నిధులు వచ్చేలా కృషి చేస్తానని, త్వరలో సాంఘీక సంక్షేమ శాఖ మంత్రిని కలుస్తానని తెలిపారు. ఫెడరేషన్లు, కార్పొరేషన్లకు నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తుందని, దీంతో ఆయా సంస్థలు దివాలా తీస్తున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాయితీ రుణాలు పొందేందుకు ఇష్టపడడం లేదన్నారు. ప్రతి సంస్థకు కనిష్టంగా రూ.150 కోట్ల బడ్డెట్ పెంచాలని, కులవృత్తులు అంతరించిపోతున్నాయని, వీటిపై ఆధారపడ్డ కుటుంబాలకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి సాంకేతిక నైపుణ్యాన్ని జోడించాలని, దీంతో ఉత్పత్తులు పెరగడంతో పాటు ఆయా కుటుంబాల ఆదాయం కూడా పెరుగుతుందని వివరించారు. దేశప్రజలకు ప్రధాని మోదీ సైనిక వందనాలకు పిలపునిచ్చారని, ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. ఆలస్యమైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములుతో పాటు సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, ఆంజనేయగౌడ్, గౌరిశంకర్లను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతల రాంచెంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణా ట్రిబ్యునల్ కేసు ఐదు వారాల వాయిదా
-
కృష్ణా ట్రిబ్యునల్ కేసు ఐదు వారాల వాయిదా
న్యూఢిల్లీ : కృష్ణా ట్రిబ్యునల్ కేసును సుప్రీంకోర్టు అయిదు వారాల పాటు వాయిదా వేసింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును గెజిట్ లో నోటి ఫై చేయవద్దని ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక రాష్ట్రం న్యాయస్థానంలో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై మూడు వారాల్లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. కాగా కృష్ణా ట్రిబ్యునల్ పిటిషన్లు అన్ని ఒకేచోట విచారించాలని తెలంగాణ ప్రభుత్వం ఈ సందర్భంగా న్యాయస్థానాన్ని కోరింది. -
బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై నేడు సుప్రీంలో విచారణ
న్యూఢిల్లీ: కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కృష్ణా జలాలకు సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందని భావించిన ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ విన్నవించిన అభ్యంతరాలను పక్కనపెట్టిన ట్రైబ్యునల్.. తుంగభద్ర జలాల్లో 4 టీఎంసీల అదనపు జలాలను మాత్రమే కేటాయించింది. దీంతో మిగులు జలాలపై ఆధారపడ్డ రాష్ట్ర ప్రాజెక్టులకు ఇది శరాఘాతంగా మారనుంది. హంద్రీనీవా, వెలుగొండ, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు 190 టీఎంసీల నీరు అవసరం కావడంతో ఆ ప్రాజెక్టులను భారీ మొత్తంలో ఖర్చుపెట్టి పూర్తి చేశారు. ట్రిబ్యునల్ తీర్పులో ఆంధ్రప్రదేశ్‌కే అతితక్కువ కేటాయింపు జరిగింది. కర్ణాటకకు 43 టీఎంసీలు, మహారాష్ట్రకు 65 టీఎంసీలు కేటాయించగా.. ఆంధ్రప్రదేశ్‌కు 39 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. మిగులు జలాల విషయంలో మహారాష్ట్రకు 35 టీఎంసీలు, కర్ణాటకకు 105 టీఎంసీలు, ఆంధప్రదేశ్‌కు 145 టీఎంసీలు ఇచ్చారు. అన్ని కలిపితే ఆంధ్రప్రదేశ్‌కు 1005 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలు. ప్రస్తుత తీర్పుతో ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు 519 .5 నుంచి 524.25 మీటర్లకు పెరుగనుంది. -
బాబు పాపం.. రాష్ట్రానికి శాపం!
ఆనాడే ప్రాజెక్టులు నిర్మించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు ఆ ప్రాజెక్టులన్నింటికీ నేడు ట్రిబ్యునల్ నీటిని కేటాయించేది కానీ బాబు తొమ్మిదేళ్ల పాలనలో ప్రాజెక్టులను పట్టించుకోలేదు పైగా ఆయన హయాంలోనే ఎగువ రాష్ట్రాల్లో ఆలవుట్టి వంటి మెగా ప్రాజెక్టుల నిర్మాణం ఇవన్నీ విస్మరించి వైఎస్‌పై దుష్ర్పచారం సాక్షి, హైదరాబాద్: గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రాజెక్టుల నిర్మాణంపై అనుసరించిన వైఖరే ఇప్పుడు రాష్ట్రానికి పెనుశాపంగా మారింది! ఒకవైపు బచావత్ ట్రిబ్యునల్ తీర్పు గడువు సమీపిస్తున్నా అప్పటి సీఎం చంద్రబాబు మిన్నకుండిపోయారు. ప్రాజెక్టులకు డబ్బుల్లేవంటూ చేతులు ముడుచుకొని కూర్చోవద్దని, వాటిని పూర్తిచేయుకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వైఎస్ అనేకమార్లు చెప్పారు. చరిత్రహీనుడిగా మిగిలిపోవద్దని హెచ్చరించారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఖాతరు చేయులేదు. తీరా వైఎస్ వుుఖ్యవుంత్రి అయ్యాక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయుటానికి నడుంబిగించారు. వుహారాష్ట్ర, కర్ణాటక ఇందుకు అభ్యంతరం తెలిపాయి. కొత్త ట్రిబ్యునల్ ఎదుట ఆ ప్రాజెక్టుల నిర్మాణాలు ఆపేరుుంచాలని పట్టుబట్టారుు. అప్పుడు మిగులు జలాలపై ఆధారపడిన ప్రాజెక్టులకు మేం ఎలాంటి హక్కులు కోరబోవునీ, ఎలాగూ మిగులు జలాలపై వూకు స్వేచ్ఛ ఉంది కాబట్టి వాటిపై ఆధారపడే నిర్మించుకుంటావునీ వైఎస్ ప్రభుత్వం ఒక లేఖ ఇచ్చింది. ఆ తర్వాతే ఆ ప్రాజెక్టుల ప్రగతి సాధ్యమైంది. లేకపోతే వాటిని ఆరంభించడమే సాధ్యం కాకపోయేది. నాడు బాబు ప్రభుత్వం ప్రదర్శించిన అలసత్వం కారణంగా నేడు ఈ పరిస్థితి నెలకొంది. ట్రిబ్యునల్ ఏర్పడే నాటికే ప్రస్తుత ప్రాజెక్టులు పూర్తి కావడమో లేక.. నిర్మాణాలు చివరి దశలో ఉండి ఉంటే.. ఇప్పుడు ఈ నష్టం జరిగేది కాదు. ప్రాజెక్టులు ఉన్నందున నీటి కేటాయింపులు వచ్చేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర ఇలాగే ప్రయోజనం పొందాయి. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో తప్పిదాలు ఇంకా రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ట్రిబ్యునల్ తీర్పు కూడా అందులో ఒక భాగం! బాబు హయాంలోనే బాబ్లీ.. రాష్ట్రంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు చంద్రబాబు హయాంలోనే రూపు దిద్దుకుంది. పైగా టీడీపీ ముఖ్యనేతకు చెందిన సంస్థే దాన్ని నిర్మించింది. నిర్మాణం పూర్తయ్యాక ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఈ ప్రాజెక్టును అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది. అలాగే ఎగువ కృష్ణాలో కర్ణాటక నిర్మించిన ఆలమట్టిని కూడా బాబు హయాంలోనే పూర్తయింది. దాంతో ఈ ప్రాజెక్టుకు నీటి కోటాను పెంచుతూ ప్రస్తుత ట్రిబ్యునల్ తీర్పును వెల్లడించింది. ఆనాడే నిర్మించి ఉంటే... ప్రస్తుత బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 2004 ఏప్రిల్ 2న ఏర్పాటైంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ వైఎస్ సీఎం అయిన తర్వాత చేపట్టినవే. జలయజ్ఞం కింద మొత్తం 86 ప్రాజెక్టులను చేపట్టారు. ఇందులో ఆయన హయాంలోనే 12 ప్రాజెక్టులు పూర్తయ్యాయి. మరో 21 ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరందించారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగానే కల్వకుర్తి, నెట్టెంపాడు, గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ, ఏఎమ్మార్పీ వంటి ప్రాజెక్టులను చేపట్టారు. ఇవి ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల కోసం గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది. వీటిలో కొన్ని ఎన్టీఆర్, చంద్రబాబు కూడా శంకుస్థాపన చేసినవి ఉన్నాయి. అయితే వాటిని నిర్మించడంలో విఫలమయ్యారు. వైఎస్ వచ్చిన తర్వాత వాటికి మోక్షం కలిగింది. గతంలోనే ఈ ప్రాజెక్టులను నిర్మించి ఉంటే.. నేడు ట్రిబ్యునల్ వీటికి నీటి కేటాయింపులను చేసేది. సాధారణంగా ట్రిబ్యున ల్ ఏర్పాటు కంటే ముందే పూర్తయిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులను చేయడం ఆనవాయితీ. దాంతో రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది. అయితే ట్రిబ్యునల్ మొదలైన తర్వాత వీటిని చేపట్టినందున ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరం చెప్పాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణాలను నిలుపుదల చేయించాల్సిందిగా ట్రిబ్యునల్‌పై ఒత్తిడి తీసుకువచ్చాయి. దాంతో ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయడానికి వీలుగా ప్రభుత్వం వీటికి నికర జలాలను కోరబోమనే అఫిడవిట్‌ను దాఖలు చేసింది. వీటిని మిగులు జలాల ఆధారంగానే చేపట్టినందున, వరద నీటిని ఉపయోగించుకుంటామని చెప్పింది. ఇలా కాకుండా గతంలోనే ఈ ప్రాజెక్టులు పూర్తయినట్టయితే.. నేడు ట్రిబ్యునల్ వాటికీ నీటికి కేటాయించడానికి అవకాశం ఉండేది. నికర జలాలంటే... కృష్ణా బేసిన్లో 47 సంవత్సరాల ప్రవాహాల్లో 65 శాతం నీటి లభ్యతను ఆధారంగా చేసుకొని.. బేసిన్లో ఏటా అందులోబాటులోకి వచ్చే జలాల పరిమాణాన్ని లెక్కిస్తారు. అవే నికర జలాలు. మిగులు జలాలు: నదీ పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురిసినప్పుడు.. సాధారణం కంటే అధిక పరిమాణంలో లభ్యమయ్యే నీటినే మిగులు జలాలు అంటారు. వరద జలాలు: వరదల సమయంలో నదిలో అధికంగా (నికర, మిగులు జలాలకు మించి) ప్రవహించే నీరు. డిపెండబిలిటీ అంటే..?: 75 శాతం డిపెండబిలిటీ అంటే.. వందేళ్లలో 75 సంవత్సరాల్లో వచ్చిన నీటి ప్రవాహం సరాసరి. -
మిగులు మట్టే - నీటముంచిన బ్రిజేశ్ ట్రిబ్యునల్
కృష్ణా జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలకు పాతర మిగులు జలాల్లోనూ ఎగువ రాష్ట్రాలకు వాటా ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపునకూ పచ్చజెండా కంటితుడుపుగా 4 టీఎంసీల అదనపు కేటాయింపు నీటి వాడకంపై పర్యవేక్షణకు బోర్డు ఏర్పాటు దాని నిర్ణయాలపై సమీక్షకు అథారిటీ 2050 దాకా అమల్లో ఉండేలా తుది తీర్పు ఈ దెబ్బతో కృష్ణా డెల్టా ఇక ‘కృష్ణార్పణమే’ వర్షాభావముంటే రాష్ట్రానికి కృష్ణా జలాలు సున్నా సాక్షి, న్యూఢిల్లీ: భయపడ్డంతా అయింది. కృష్ణా జలాల పంపకంలో మనకు తీరని అన్యాయం జరిగింది. ఊరట దొరకవచ్చన్న ఆశ అడియాసగా మిగిలింది. జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ సారథ్యంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ శుక్రవారం ప్రకటించిన తుది తీర్పు నామమాత్రపు సవరణలకే పరిమితమైంది. గత తీర్పులో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన కొండంత అన్యాయాన్ని ట్రిబ్యునల్ ఏమాత్రమూ సవరించలేదు. జలాల సక్రమ పంపిణీ ఆవశ్యకతపై రాష్ట్రం చేసిన ఆక్రందనలు, ట్రిబ్యునల్ లోగడ వెలువరించిన తీర్పుపై చెప్పిన తీవ్ర అభ్యంతరాలు, ఎగువ రాష్ట్రాల దాష్టీకాలను ఎత్తిచూపుతూ సాగించిన వాదనలు ఏవీ పని చేయలేదు. మిగులు జలాలు, ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు తదితర అంశాలపై రాష్ర్టం చేసిన విన్నపాలన్నీ నిష్ఫలమయ్యాయి. ఎగువ రాష్ట్రాలకు అనుకూలంగా గతంలో ఇచ్చిన తీర్పులో కేవలం కొద్ది మార్పులకే ట్రిబ్యునల్ పరిమితమైంది. కర్ణాటకకు గతంలో కేటాయించిన జలాల్లో 4 టీఎంసీలు కోత విధించి, వాటిని రాష్ర్టంలోని ఆర్డీఎస్ కుడి ప్రధాన కాల్వకు కేటాయించడం, వివిధ డిపెండబిలిటీల వద్ద రాష్ట్రాలు జలాల్ని ఏ తీరున వినియోగించుకోవాలనేది స్పష్టంగా నిర్దేశించడం, కృష్ణా బేసిన్ పరిధిలోని సబ్ బేసిన్ల మధ్య నీటి బదిలీ కుదరదని మహారాష్ట్రకు తెగేసి చెప్పడం, కృష్ణా జలాల నిర్ణయం అమలు బోర్డు (కేడబ్ల్యూడీఐబీ) ఏర్పాటు, దాని నిర్ణయూలపై అభ్యంతరాలుంటే సమీక్షకు రివ్యూ అథారిటీ ఏర్పాటు, వరదలపై హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు... ట్రిబ్యునల్ తుదితీర్పులో చేసిన ప్రధాన సవరణలు ఇవే. మిగులు జలాలు, ఆలమట్టి డ్యాం ఎత్తు, సకాలంలో నీటి విడుదల తదితర అంశాలపై రాష్ట్రం లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాల విషయంలో మనకు ఎలాంటి ఉపశమనమూ లభించలేదు. 2010 డిసెంబర్ 30న తీర్పు వెలువరించిన మీదట దాదాపు మూడేళ్లపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరాలపై వాదనలు వింటూ వచ్చిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్, సవరణలతో తాజాగా వెలువరించిన తుది తీర్పు మనకు తీరని అన్యాయమే చేసింది. దాంతో ఇప్పుడు న్యాయం కోసం సుప్రీంకోర్టులో మన రాష్ట్రం పోరాటం కొనసాగించడం అనివార్యమైంది. ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపునకు గత తీర్పులో అనుమతించిన ట్రిబ్యునల్, దాన్ని తుది తీర్పులో సవరించలేదు. కేవలం అనుమతుల విషయమై పెట్టిన నిబంధనను మాత్రం సవరించింది. కర్ణాటక తనకు లభించినట్టు చెబుతున్న అనుమతులన్నింటినీ సంబంధిత సంస్థలు, విభాగాల ముందుంచాలని, అవి సరిపోతాయా లేక మళ్లీ తాజా అనుమతులు తీసుకోవాలా అనేది ఆ విభాగాలు, సంస్థలే నిర్ణయిస్తాయని పేర్కొంది. ఈ సవరణతో ఆలమట్టి విషయంలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. ఈ తీర్పు 2050 దాకా అమల్లో ఉంటుంది. అయితే ఈ తుది తీర్పును అధికారికంగా ప్రచురించొద్దని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించడమొక్కటే మన రాష్ట్రానికి కాస్త ఊరటగా చెప్పుకోవచ్చు. పావుగంటలో ముగిసింది... జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ చైర్మన్‌గా, జస్టిస్ డి.కె.సేఠ్, జస్టిస్ బి.పి.దాస్ సభ్యులుగా ఉన్న కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తుది తీర్పును ప్రకటించింది. ట్రిబ్యునల్ తరఫున జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ తుది తీర్పును వెలువరించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు వర్తించే ప్రధానాంశాలను వరుస క్రమంలో చదివారు. ఇదంతా మొత్తం పావుగంటలోపే పూర్తరుుంది. తుదితీర్పు ప్రకటన పూర్తయిన తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర తరఫున వాదించిన సీనియర్ న్యాయవాదులు ఫాలీ నారిమన్, అంద్యార్జున మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తీర్పు సంతృప్తికరంగా ఉందంటూ హర్షం వెలిబుచ్చారు. ట్రిబ్యునల్ పని పూర్తయింది... కృష్ణా జలాల విషయమై మూడు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటైన ట్రిబ్యునల్... సుదీర్ఘ విచారణ అనంతరం అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్ 5(2) కింద 2010 డిసెంబర్ 30న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పులోని అంశాలపై అభ్యంతరాలు చెబుతూ సవరణల కోసం 2011లో మూడు రాష్ట్రాలు, కేంద్రం చేసిన దరఖాస్తులపై ట్రిబ్యునల్ దాదాపు మూడేళ్ల పాటు పరిశీలన సాగించి, అన్ని పక్షాల వాదనలను సుదీర్ఘంగా ఆలకించింది. ఆ మీదట గత తీర్పునకు సవరణలతో తాజాగా తుది తీర్పును ప్రకటించింది. చట్టంలోని సెక్షన్ 5(3) కింద ఇచ్చిన ఈ తుది తీర్పుతో ట్రిబ్యునల్‌కు అప్పగించిన పని సంపూర్ణంగా పూర్తయింది. చేసిన సవరణలివీ... 65 శాతం డిపెండబిలిటీ వద్ద కర్ణాటకకు కేటాయించిన జలాల్లోంచి 4 టీఎంసీలను తొలగించి వాటిని ఆర్డీఎస్ కుడి ప్రధాన కాలువకు కేటాయించారు. కర్ణాటకలోని ఎగువ భద్ర, ఎగువ తుంగ నుంచి ఒక్కో టీఎంసీ, సింగత్లూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీల చొప్పున మొత్తం 4 టీఎంసీలకు కోతపెట్టారు. వాటిని ఆర్డీఎస్ కుడి ప్రధాన కాలువకు తొలిసారిగా కేటాయించారు. దాంతో మన రాష్ట్రానికి జరిపిన కేటాయింపులు 1005 టీఎంసీలకు పెరిగాయి. వివిధ డిపెండబిలిటీల వద్ద జలాలను మూడు రాష్ట్రాలు ఏ తీరున వినియోగించుకోవాలో స్పష్టపరిచారు. 75 శాతం డిపెండబిలిటీ కేటాయింపులను మూడు రాష్ట్రాలు పూర్తిగా వాడుకున్నాకే 65 శాతం డిపెండబిలిటీ కేటాయింపులకు సిద్ధపడాలి. అలాగే, 65 శాతం డిపెండబిలిటీ కేటాయింపులను మూడు రాష్ట్రాలూ వినియోగించుకున్న తర్వాతే సగటు జలాల కేటాయింపుల వాడకానికి దిగాలి. నికర జలాల వినియోగం పూర్తయ్యూక వాడుకోవాల్సిన మిగులు జలాల వినియోగం విషయుంలో... దిగువ, అతి దిగువ రాష్ట్రాల జల వినియోగం జరిగాకే ఎగువ రాష్ట్రాలు తమ కేటాయింపులను వినియోగించుకోవాలి. అన్ని రకాల కేటారుుంపుల మేరకు జలాల వినియోగం తర్వాత ఏమైనా జలాలు మిగిలితే వాటిని ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు. అయితే, చట్టం కింద ఏర్పాటయ్యే ఏదైనా సంబంధిత ప్రాధికార సంస్థ చేపట్టే తదుపరి సమీక్ష, పరిశీలన వరకే ఆంధ్రప్రదేశ్ ఇలా వాడుకోగలుగుతుంది. అంతే తప్ప మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి హక్కూ సంక్రమించదు. ఆలమట్టిపైనా ఊరట లేదు! ప్రస్తుతం ఆలమట్టి డ్యాం ఎత్తుకు 519.6 మీటర్ల వరకు అనుమతి ఉంది. సుమారు 129 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 173 టీఎంసీల నీటి వాడకానికి అనుమతి ఉంది. అయితే తాజా తీర్పు తర్వాత దాని ఎత్తు 524.25 మీటర్ల వరకు పెరగనుంది. ఆ మేరకు నీటి నిల్వ సామర్థ్యమూ పెరగుతుంది. దాంతో దిగువనున్న మన రాష్ట్రానికి నీటి విడుదల మరింత ఆలస్యం కానుంది. అలాగే ఆలమట్టి ద్వారా కర్ణాటక నీటి వాడ కం 173 టీఎంసీల నుంచి 303 టీఎంసీలకు పెరగనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అనుమతులపైనా మన రాష్ట్రం అభ్యంతరాలు తెలిపింది. తుదితీర్పు ప్రకారం క్లియరెన్స్‌లకు సంబంధించిన పత్రాల్ని కర్ణాటక రాష్ట్రం సంబంధిత అధికార విభాగా ల ముందుంచాలి. సదరు క్లియరెన్స్‌లు, ఇప్పటికే ఇచ్చినవి అయితే, ఇప్పటికీ వర్తిస్తాయా లేదా అనేది సంబంధిత విభాగాలు తేల్చాలని ట్రిబ్యునల్ పేర్కొంది. తమకు కేటాయించిన నీటి కేటాయింపుల్లో ఒక సబ్ బేసిన్ నుంచి మరో సబ్ బేసిన్‌కు, అంటే కోయ్నా సబ్ బేసిన్ నుంచి బీమా సబ్ బేసిన్‌కు జలాలను బదిలీ చేసుకోవడానికి మహారాష్ట్ర అనుమతి కోరగా ట్రిబ్యునల్ నిరాకరించింది. అలాగే కొన్ని పరిమితులకు లోబడి కేటాయింపులన్నింటినీ వాడుకునేందుకు అనుమతించింది. -
బాబు ప్రాజెక్టులు కట్టకే ఈ దుస్థితి: గడికోట
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సాగునీటి ప్రాజెక్టులను నిర్మించకుండా నిర్లక్ష్యం చేసినందువల్లే ఈ రోజు కృష్ణా నదీ జలాల కేటాయింపుల విషయంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇలాంటి తీర్పు నిచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని, ప్రధానినీ, రాష్ట్రపతినీ తానే ఎంపిక చేశానని చెప్పుకునే చంద్రబాబు ఆయన హయాంలో కర్ణాటకలో చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను ఎందుకు ఆపలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రాజెక్టులు నిర్మిస్తుంటే బాబు ముఖ్యమంత్రిగా ఉండి వారికి సహకరించారన్నారు. బాబు పాలనలో అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆయనకు అనుకూలంగా ఉండే ఓ పత్రికతో పాటు మరిన్ని పత్రికలు వార్తలు రాశాయని, అవి పూర్తయితే తుపాను వస్తేనే ఇక మన ప్రాజెక్టులకు నీళ్లు అన్నట్లుగా కథనాలు కూడా వచ్చాయన్నారు. బాబు గాలేరు-నగరి, హంద్రీనీవా, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను నిర్మించి ఉంటే మనం కృష్ణా ట్రిబ్యునల్ నుంచి కేటాయింపులు పొందడానికి ఆస్కారం ఉండేదన్నారు. బాబు హయాంలో నిర్మించిన అల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519 నుంచి 524 అడుగుల నీటిని పెంచుకోవడానికి ఇపుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వటంతో రాష్ట్ర రైతుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ సీఎం కాగానే బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో ప్రారంభించిన తెలుగుగంగ పథకాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తే వైఎస్ దానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి పూర్తి చేశారని అందువల్లే ఆ ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ ఇపుడు 33 టీఎంసీల నీటిని కేటాయించిందన్నారు. -
రాష్ట్రానికి గొడ్డలిపెట్టు: మైసూరారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కృష్ణాజలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టులాంటిదని, తీర్పునిచ్చిన రోజు రాష్ట్రానికి ఒక దుర్దినమని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారంనాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రిబ్యునల్ తీర్పును తీవ్రంగా తప్పు పట్టారు. తక్షణమే దీనిపై సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకురావాలని లేకుంటే రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం కలుగుతుందన్నారు. ఇదే ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తాత్కాలిక తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన అంశాలను పరిశీలించాలని ఆదేశించినా ట్రిబ్యునల్ తుది తీర్పులో అన్యాయాన్ని ఏ మాత్రం సరిదిద్దలేదని మైసూరారెడ్డి ఆరోపించారు. ఒక నదిలో నీటి లభ్యతను 75 శాతం తీసుకుంటారని, బ్రిజేశ్ ట్రిబ్యునల్ మాత్రం 65 శాతమే తీసుకుందన్నారు.ట్రిబ్యునల్ తాజా తీర్పు వల్ల ఎగువ రాష్ట్రాలు నీటినంతా వాడుకున్నాక దిగువ రాష్ట్రానికి వచ్చేది ఏమీ ఉండవన్నారు. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు అరకొరగా మాత్రమే నీరు వస్తున్నాయన్నారు. కృష్ణలో కర్ణాటకకు 171, మహారాష్ట్రకు 81 టీఎంసీల నీటిని ట్రిబ్యునల్ అదనంగా కేటాయించాక ఇక మన రాష్ట్రానికి అదనంగా నీరు ఎక్కడినుంచి లభిస్తుందని ఆయన ప్రశ్నించారు.నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులే ఎండిపోయే ప్రమాదం ఉంది కనుక ఇక మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన వాటికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి అదనంగా నాలుగైదు టీఎంసీల నీరే దక్కిందని చెప్పారు. మిగులు జలాలు తమకు అక్కర లేదని దివంగత వైఎస్ లేఖ రాసినందువల్లనే ఇలాంటి తీర్పు వచ్చిందని టీడీపీ చేసిన విమర్శలను ఆయన కొట్టి పారేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు హాని జరుగుతున్నపుడు అందరూ కలిసి పోరాడాల్సిన సమయంలో బురద జల్లడం సరికాదన్నారు. వైఎస్ లేఖ రాసిన సందర్భం వేరని ఈ అంశంపై ఆయన బతికి ఉండగానే అసెంబ్లీలో చర్చకు వస్తే సవివరమైన సమాధానం ఇచ్చారని మైసూరా గుర్తు చేశారు. జల యజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులను తక్షణం నిలిపి వేయాలని కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు వైఎస్ మిగులుజలాల వాడకానికి సంబంధించి గతంలో బచావత్ 6సి కింద పొందుపర్చిన సారాం శాన్నే తెలియజేస్తూ లేఖను రాశారన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని కూడా కోరారన్నారు. టీడీపీ వారు పూర్వాపరాలు తెలియకుండా ‘ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయండి’ అన్న చందంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బ్రిజేశ్ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంటే ప్రధాన ప్రతిపక్షంగా దానిని విమర్శించకుండా ఇలా మాట్లాడటం తగదన్నారు. చంద్రబాబు హయాంలో ఎగువ రాష్ట్రాలు నిర్మించిన అల్మట్టి లాంటి అక్రమ ప్రాజెక్టులను ఇపుడు బ్రిజేశ్ ట్రిబ్యునల్ క్రమబద్ధం చేసిందన్నారు. బాబు పాలనలో ఎగువ రాష్ట్రాలు అక్రమ కట్టడాలు కడుతుంటే నిర్లక్ష్యం వహించారని, కృష్ణా ఆయకట్టు రైతులను ఇక మెట్టపంటల వైపు మళ్లించాలని బాబు చెప్పారని మైసూరా గుర్తు చేశారు. వీటికి సంబంధించి బాబు అనుకూల పత్రికలో వచ్చిన అప్పటి వార్తల క్లిప్పింగ్‌లను ఆయన ప్రదర్శించారు. టీడీపీ హయాంలో వేసిన రాజారావు కమిటీ కృష్ణాలో 268 టీఎంసీల మిగులు జలాలున్నాయని నివేదిక ఇచ్చిందని ఇదే ఎగువ రాష్ట్రాల వాదనలకు ప్రాతిపదిక అయిందని మైసూరా విమర్శించారు. ఆ నివేదిక రూపొందించిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగించారని ధ్వజమెత్తారు. -
కృష్ణా డెల్టా ఉప్పు కయ్యే!
బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు ఫలితం కృష్ణా నీటిలో లవణాల శాతం పెరుగుదల తాగేందుకు, సాగుకూ నిరుపయోగం వరి పండించడం మరచిపోదాం.. పాడి పరిశ్రమకూ మంగళం పాడదాం.. భవిష్యత్తులో కృష్ణా డెల్టా రైతులు ఇక నమ్ముకోవాల్సింది.. అమ్ముకోవాల్సిందీ ఉప్పు మాత్రమే! కృష్ణా నదీ జలాల వివాదాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీసుకొస్తున్న పెను ఉపద్రవమిది!! కృష్ణా జలాల వివాదంలో ఇప్పటివరకూ ఎవరూ దృష్టిసారించని ఓ పెను ప్రమాదంపై సాక్షి ప్రత్యేక కథనం.. మనకు వచ్చేది లవణాల నీరే! వర్షపు నీరు నేలను తాకినప్పుడు మట్టిలోని కొన్ని లవణాలను కరిగించి తన వెంట మోసుకెళ్తుంది. ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే మహారాష్ట్ర, కర్ణాటకల్లో కృష్ణా నది ప్రవహించే ప్రాంతాల్లో అగ్నిపర్వత అవశేషాలతో కూడిన రాతి నేలలు (బసాల్ట్) ఎక్కువగా ఉన్నాయి. ఫలితంగా ఈ ప్రాంతాల్లో కురిసే వర్షపు నీటిలోకి చేరే లవణాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వర్షాలు కురిసినప్పుడు తాజాగా వచ్చిన నీటిని వాడుకొని అప్పటికే నిల్వ ఉంచిన నీటిని మహారాష్ట, కర్ణాటక కిందకు వదులుతాయి. అంటే నాణ్యమైన నీటిని ఆ రాష్ట్రాలు వినియోగించుకోగా, లవణాలతో కూడిన నీరంతా కిందకు వచ్చి చేరుతుందన్నమాట! పైనుంచి స్వచ్ఛమైన జలాలు తగ్గిపోతే నీటిలో లవణాల శాతం పెరిగిపోయి సాగుకు కాదు కదా.. కనీసం పశువులు తాగేందుకు కూడా పనికిరాకుండా పోయే ప్రమాదముంది. నది పరీవాహక ప్రాంతంలో నీటిలోని లవణాల మోతాదు లీటర్‌కు 500 మిల్లీ గ్రాములకు మించితే ఆ నీరు వాడుకునేందుకు పనికిరాని స్థాయికి చేరుతుంది. క్యాల్షియం, మెగ్నీషియం వంటి లవణాలతో పోలిస్తే సోడియం మోతాదు పెరిగిపోవడం లేదా సోడియం కార్బొనేట్ వంటి లవణాలు ఉండటం వల్ల సాగునీరు, వ్యవసాయ భూములపై దుష్ర్పభావం చూపుతుంది. కాలక్రమంలో నేల చౌడుబారి సాగుకు పనికిరాని ఉప్పుకయ్యగా మిగులుతుంది. కృష్ణా బేసిన్లో లవణాలన్నింటినీ వదిలించుకోవాలంటే దాదాపు 850 టీఎంసీల వరకూ నీటిని సముద్రంలోకి వదిలేయాలి. బేసిన్ బయట వాడుకుంటున్న మరో 360 టీఎంసీల నీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలంటే వదిలేయాల్సిన నీటి పరిమాణం మొత్తం మరో 490 టీఎంసీలకు పెరుగుతుంది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో లభ్యమయ్యే మొత్తం 2,578 టీఎంసీల నీటిలో ఎవరికీ కేటాయించని జలాలు.. దాదాపు 16 టీఎంసీలు. పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకుగాను ఈ నీటిని ప్రకాశం బ్యారేజీ ద్వారా నేరుగా సముద్రంలోకి కలిపేయాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఎగువ రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్న లవణాల మాటేమిటన్నది ప్రశ్నార్థకంగా మిగిలింది. నీటి పరిమాణంతో పాటు అత్యంత ముఖ్యమైన ఈ నీటి నాణ్యత అంశాన్ని ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోకపోవడం చిత్రమే. అంతర్జాతీయంగా చేదు అనుభవాలు.. ఆస్ట్రేలియాలోని ముర్రే డార్లింగ్ జలాలను విచ్చలవిడిగా వాడటం వల్ల క్షారత పెరిగిపోయింది. ఈ నష్టాన్ని నివారించేందుకు రివర్ అథారిటీ 1997లో చర్యలు చేపట్టింది. నీటి నాణ్యతను 1993 నాటి స్థాయికి చేర్చేందుకు అప్పటిదాకా విచ్చలవిడిగా వాడుతున్న జలాల వినియోగంలో కోత పెట్టారు. ఫలితంగా బేసిన్ ప్రాంతంలో నీటి లభ్యత గణనీయంగా పెరిగింది. కొలరాడో కథ కూడా ఇలాంటిదే. అమెరికాలో వ్యవసాయం విపరీతంగా పెరిగిపోవడంతో మెక్సికోకు చేరే నీటి నాణ్యత దెబ్బతినడం మొదలైంది. దీనిపై మెక్సికో నిరసన వ్యక్తం చేయడంతో అమెరికా వాడుతున్న నాణ్యతతో కూడిన నీరు లభించేలా చూసేందుకు 1974లో ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. -
మిగులు కృష్ణార్పణం
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి తీరని నష్టం మనకు దక్కాల్సిన మిగులు జలాలు ఎగువ రాష్ట్రాలకు పంపిణీ కొంపముంచిన 65 శాతం డిపెండబిలిటీ విధానం కృష్ణా పరిధిలో ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వస్తే.. రాష్ట్ర రైతుల పరిస్థితి ఏమిటి? సాధారణ వర్షపాతం నమోదయ్యే సమయాల్లో రాష్ట్రానికి కృష్ణా నీరు వస్తుందా? ఈ ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పడం కష్టమే! కొత్త తీర్పు అమల్లో లేని సమయాల్లోనే కృష్ణా బేసిన్లో తీవ్ర నీటి కొరత నెలకొంటోంది. మిగులు జలాలు కాదు కదా.. నికర జలాలు రావడమే కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో కొత్త తీర్పు ప్రకారం మిగులు జిలాలు, 65 శాతం డిపెండబులిటీ పద్ధతిన పంచిన నీటిని కూడా ఎగువ రాష్ట్రాలు వాడుకోవడం మొదలు పెడితే.. దిగువన ఉన్న మనకు తీరని నష్టం వాటిల్లనుంది. భారీ వరదలు వస్తే తప్ప సాధారణ పరిస్థితుల్లో ఆయకట్టుకు నీరందివ్వడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. 65 శాతం డిపెండబిలిటీతో నష్టం ఇలా.. ఇప్పుడు అమలవుతున్న పద్ధతి ప్రకారం కృష్ణా నది నుంచి కర్ణాటక, మహారాష్ట్రలు 1,319 టీఎంసీల నీటిని వాడుకుంటున్నాయి. కొత్త తీర్పు అమల్లోకి వస్తే... అదనంగా మరో 254 టీఎంసీలు అంటే... మొత్తం 1,573 టీఎంసీలను వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మేర దిగువన ఉన్న మన రాష్ట్రానికి నీటి ప్రవాహం తగ్గనుంది. ఈ 254 టీఎంసీలు అంటే... మన శ్రీశైలం ప్రాజెక్టులో నీటి పరిమాణంతో సమానం. వర్షాలు సరిగ్గా లేని సమయాల్లో మన రాష్ట్రంలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండడానికి సెప్టెంబర్, అక్టోబర్ మాసాల వరకు వేచి చూడాల్సి వస్తోంది. అప్పటివరకు నీరు రాకపోతే పంటల సాగు సీజన్ కూడా ముగిసిపోతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఈసారి మాత్రమే సరైన వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండాయి. అంతకుముందు వరుసగా సాగర్, డెల్టా ఆయకట్టు రైతులు క్రాప్‌హాలిడే ప్రకటించాల్సి వచ్చింది. ఎగువ రాష్ట్రాలకు నీటి కేటాయింపుల్ని పెంచడానికి వీలుగా ట్రిబ్యునల్ కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. నదుల్లో నీటి లభ్యతలను అంచనా వేయడానికి వీలుగా జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రస్తుతం అమలవుతున్న పద్ధతి 75 శాతం డిపెండబిలిటీ మాత్రమే. అంటే వందేళ్లలో 75 సంవత్సరాల్లో వచ్చిన ప్రవాహాన్ని సరాసరిగా తీసుకుని నీటిని అంచనా వేస్తారు. అయితే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం డిపెండబిలిటీని పరిగణనలోకి తీసుకుంది. అంటే వందేళ్లలో 65 ఏళ్లల్లో వచ్చిన నీటిని సరాసరిగా పరిగణిస్తారు. దాంతో నదుల్లో నీటి లభ్యత ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ పద్ధతిన కర్ణాటకకు 61 టీఎంసీలు, మహారాష్ట్రకు 43 టీఎంసీలను ట్రిబ్యునల్ కేటాయించింది. అలాగే 112 ఏళ్లల్లో వచ్చిన సరాసరి నీటిని పరిగణనలోకి తీసుకోవాలని మనం కోరితే.. ట్రిబ్యునల్ మాత్రం 47 సంవత్సరాల్లో వచ్చిన వరదను సరాసరి నీటిగా పరిగణనలోకి తీసుకుంది. దీనివల్ల కూడా మనకు తీరని అన్యాయం జరిగింది. ‘మిగులు’ను పంచేసిన ట్రిబ్యునల్.. గత బచావత్ ట్రిబ్యునల్... మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన మనకు ఇచ్చింది. కరువొచ్చినా... వరదలు వచ్చినా నష్టపోయేది దిగువ రాష్ర్టమేనన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అవకాశం కల్పించింది. అయితే ప్రస్తుత ట్రిబ్యునల్ మాత్రం మిగులు జలాలను కూడా పంపిణీ చేసేసింది. మొత్తం 285టీఎంసీల మిగులు జలాలు ఉన్నట్టు గుర్తించి, వాటిల్లో కర్ణాటకకు 105 టీఎంసీలు, మహారాష్ట్రకు 35 టీఎంసీలను కేటాయించింది. ఈ నీటిని ఆధారం చేసుకునే మన రాష్ర్టంలో పలు ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ నీటిని పంపిణీ చేయడంతో దిగువకు వచ్చే నీరు గణనీయంగా తగ్గిపోనుంది. అలాగే ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు వల్ల కూడా దిగువకు సకాలంలో నీరు రాదు. ఇప్పటివరకు 173 టీఎంసీల వాడకమే ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా నీటి వాడకం భవిష్యత్తులో 303 టీఎంసీలకు పెరగనుంది. అంటే దిగువకు రావాల్సిన 130 టీఎంసీల నీరు కర్ణాటక వాడుకోవడానికి అవకాశం ఏర్పడనుంది. దాంతో మన ప్రాజెక్టుల పరిధిలోని ఖరీఫ్ సీజన్‌పై తీవ్ర ప్రభావం పడనుంది. -
ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టం
-
కృష్ణా జలాలపై తుది తీర్పు, రాష్ట్రానికి తీరని నష్టం
కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు వెల్లడించింది. ఇందులోనూ ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టమే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలను పక్కనపెట్టిన ట్రైబ్యునల్.. తుంగభద్ర జలాల్లో 4 టీఎంసీల అదనపు జలాలను మాత్రమే కేటాయించింది. అన్ని అభ్యంతరాలను పక్కనపెట్టిన ట్రైబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది. మిగులు జలాలపై ఆధారపడ్డ రాష్ట్ర ప్రాజెక్టులకు ఇది శరాఘాతంగా మారనుంది. హంద్రీనీవా, వెలుగొండ, గాలేరు-నగరి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు 190 టీఎంసీల నీరు అవసరం. ఈ ప్రాజెక్టులను 14వేల కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేశాం. ప్రస్తుతం వీటి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. నికరజలాల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌కే అతితక్కువ కేటాయింపు జరిగింది. కర్ణాటకకు 43 టీఎంసీలు, మహారాష్ట్రకు 65 టీఎంసీలు కేటాయించగా.. ఆంధ్రప్రదేశ్‌కు 39 టీఎంసీలు మాత్రమే కేటాయించారు. మిగులు జలాల విషయంలో మహారాష్ట్రకు 35 టీఎంసీలు, కర్ణాటకకు 105 టీఎంసీలు, ఆంధప్రదేశ్‌కు 145 టీఎంసీలు ఇచ్చారు. అన్ని కలిపితే ఆంధ్రప్రదేశ్‌కు 1005 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలు. ప్రస్తుత తీర్పుతో ఆల్మట్టి ప్రాజెక్ట్ ఎత్తు 519 .5 నుంచి 524.25 మీటర్లకు పెరుగుతుంది. దీనివల్ల దాదాపు 100 టీఎంసీల నీటిని ఎక్కువుగా వాడుకోనున్నారు. మొత్తంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్ర రైతులకు శరాఘాతమేనని భావించాలి. -
కృష్ణా జలాల వివాదంపై నేడు మళ్లీ సమావేశం
న్యూఢిల్లీ : కృష్ణా జలాల వినియోగం వివాదంపై నేడు మూడు రాష్ట్రాల అధికారులు మరోసారి సమావేశం కానున్నారు. కృష్ణా జలాలపై వివాదంలో మళ్లీ పాత కథే కొనసాగటంతో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ) అవార్డు తమకు అందివచ్చిన నేపథ్యంలో పట్టు వీడటానికి అటు మహారాష్ట్ర, ఇటు కర్ణాటక ఏమాత్రం సిద్ధంగా లేకపోవడంతో చర్చలు ఫలించలేదు. ఈ చర్చలను ఇంజనీర్ల స్థాయిలో నేడు కూడా కొనసాగించాలని మూడు రాష్ట్రాలు ఓ అంగీకారానికి రావడం గమనార్హం. దీని ప్రకారం ట్రిబ్యునల్ విచారణ అయ్యాక మూడు రాష్ట్రాల ఇంజనీర్లు ట్రిబ్యునల్ కార్యాలయంలోనే సమావేశమై చర్చలు జరపనున్నారు. ఏకాభిప్రాయ సాధన కోసం ట్రిబ్యునల్ చేసిన సూచన ప్రకారం ఆదివారం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర న్యాయవాదులు, ఉన్నతాధికారులు ఢిల్లీలోని కర్ణాటక భవన్ ‘కావేరి’ సమావేశ మందిరంలో భేటీ అయ్యారు. రాత్రి 7 గంటల నుంచి 8.15 వరకు ఈ సమావేశం జరిగింది. రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాది డి.సుదర్శన్‌రెడ్డి, న్యాయవాది ఎం.ఆర్.శ్రీనివాస్, ఇంజనీర్-ఇన్-చీఫ్ మురళీధర్, చీఫ్ ఇంజనీర్ ఎం.ఎ.రవూఫ్, నీటిపారుదల శాఖ జాయింట్ సెక్రటరీ ఎం.విశ్వేశ్వరరావు, ఇంజనీరింగ్ విభాగం ముఖ్యాధికారులు పి.ఆర్.కె.మూర్తి, వి.ఎస్.ఎన్.రాజు, వై.వి.ఎస్.రెడ్డి, సుబ్రహ్మణ్యం, గిరిధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.