సాక్షి, అమరావతి: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ), విభజన చట్టం ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడి కాలువ పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. దీనిని తెలంగాణ సర్కార్ తప్పు పట్టడంపై నీటి పారుదలరంగ, న్యాయ నిపుణులు నివ్వెరపోతున్నారు. విభజన చట్టాన్ని తుంగలో తొక్కి.. కేటాయింపులు లేకున్నాకొత్త ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు పాత ప్రాజెక్టుల సామర్థ్యం పెంచి 178.93 టీఎంసీలను తరలించేలా తెలంగాణ సర్కార్ చేపట్టిన 8 ప్రాజెక్టులూ అక్రమమేనని స్పష్టం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుండటాన్ని ఎత్తిచూపుతున్నారు.
కేటాయింపులున్నా నీళ్లందని దుస్థితి
శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగు గంగ, ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), గాలేరు–నగరి ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించాలి. చెన్నైకి తాగునీటిని సరఫరా చేయాలి. కేసీ కెనాల్‌కు సప్లిమెంటేషన్ కింద 10 టీఎంసీలు సరఫరా చేయాలి. కేడబ్ల్యూడీటీ, విభజన చట్టం ద్వారా ఈ ప్రాజెక్టులకు 114 టీఎంసీల కేటాయింపు ఉంది. శ్రీశైలం జలాశయంలో 881 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీటి మట్టం ఉంటేనే.. ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కాలువలకు చేరుతాయి.
కృష్ణా బేసిన్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల ఆ స్థాయిలో నీటిమట్టం ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచే రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ) ప్రాజెక్టుల ద్వారా 2.95 టీఎంసీలను తరలించేలా తెలంగాణ సర్కార్ అనుమతి లేకుండా పనులు చేపట్టింది. 796 అడుగుల నీటి మట్టం నుంచే శ్రీశైలం ఎడమ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం ఉంది. అంటే.. 800 అడుగుల కంటే దిగువ స్థాయి నుంచే తెలంగాణ సర్కార్ రోజుకు 6.95 టీఎంసీలను తరలించే సామర్థ్యం కలిగి ఉంది.
కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ యథేచ్ఛగా తెలంగాణ సర్కార్ నీటిని తరలించడం వల్ల శ్రీశైలం నీటిమట్టం తగ్గిపోతుంది. శ్రీశైలం నీటి మట్టం 848 అడుగుల కంటే దిగువకు చేరితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కాలువల్లోకి చుక్క నీరు చేరదు. నీటి కేటాయింపులు ఉన్నా సరే.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆయకట్టులో పంటలను రక్షించలేని దుస్థితి. రాయలసీమ, నెల్లూరు, చెన్నై ప్రజలకు తాగునీటిని అందించలేని పరిస్థితి. ఈ పరిస్థితులను అధిగమించడానికి కేటాయింపులను సమర్థవంతంగా వినియోగించుకుని ఆయకట్టులో పంటలను రక్షించడం, తాగునీటిని అందించడం కోసం.. శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కాలువలోకి ఎత్తిపోసేలా రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టిందని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు.
అక్రమ ప్రాజెక్టు ఎలా అవుతుంది
ఆర్డీఎస్ కుడి కాలువ ద్వారా 4 టీఎంసీలను వినియోగించుకోవడానికి కేడబ్ల్యూడీటీ–2 ఏపీ ప్రభుత్వానికి అవకాశం కల్పించింది. హక్కుగా దక్కిన ఆ జలాలను వాడుకోవడానికి ఆర్డీఎస్ కుడి కాలువను ప్రభుత్వం చేపట్టింది. ఇదెలా తప్పవుతుందని నీటిపారుదల రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కేసీ (కర్నూలు–కడప) కెనాల్‌కు ట్రిబ్యునల్ 39.9 టీఎంసీలను కేటాయించింది. సుంకేశుల బ్యారేజీ ద్వారా ఈ నీటిని కేసీ కెనాల్‌కు మళ్లించి.. 2.65 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి అనుమతి ఇచ్చింది. దశాబ్దాల క్రితం నాటి ఈ ఆయకట్టును దెబ్బతీసేలా 2015లో తెలంగాణ సర్కార్ సుంకేశుల బ్యారేజీ జల విస్తరణ ప్రాంతం నుంచి 5.54 టీఎంసీలను తరలించేలా తుమ్మిళ్ల ఎత్తిపోతలను చేపట్టింది. ఎలాంటి అనుమతి లేకుండా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల అక్రమమైనదని నీటి పారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆర్డీఎస్ కుడి కాలువ ఎలా అక్రమ ప్రాజెక్టవుతుందని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment