rds project
-
ఆర్డీఎస్ ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తుంది: బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కీలకమైన ఆర్టీఎస్ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టబోతోందని.. కొద్దినెలల్లో ప్రాజెక్టును పూర్తిచేసి 87,500 ఎకరాల సాగు నీరందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నివేదిక ఇచ్చిందని, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ విషయం చెప్పారని తెలిపారు. ఆర్డీఎస్ విషయంలో ఎనిమిదేళ్లుగా ప్రజలను మోసం చేస్తూ.. నడిగడ్డను ఎడారిగా మార్చిన సీఎం కేసీఆర్‌ను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా గురువారం 8వ రోజు పాదయాత్ర చేసిన బండి సంజయ్.. గద్వాల పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. కేసీఆర్ చేతగానితనంతో ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించలేకపోయారని మండిపడ్డారు. ఇప్పుడు కేంద్రం ఆర్డీఎస్ ఆధునీకరణకు ముందుకొచ్చిందని.. అలంపూర్, గద్వాల పరిధిలో 87,500 ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు వాటా మేర నీళ్లు అందించేలా ఆర్డీఎస్ ఆనకట్ట, హెడ్ రెగ్యులేటర్ డిజైన్‌లో మార్పులు చేయనున్నామని.. కాలువ సీపేజీ, ఓవర్ ఫ్లో సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాన కాలువకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారు. కేంద్రంపై ఏడుపెందుకు? : కేంద్రంపై ఏడవటం తప్ప సీఎం కేసీఆర్ సాధించిందేంటని సంజయ్ నిలదీశారు. ‘‘మోదీ ప్రభు త్వం ఇప్పటివరకు తెలంగాణకు 3 లక్షల కోట్లకుపైగా నిధులు ఇచ్చింది. అందులో పన్నుల రూపంలో రూ.1.68 లక్షల కోట్లు, మిగతావి ప్రాయోజిత పథకాలు, రహదారుల రూపంలో ఖర్చుచేసింది. ఈ విషయంలో బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా? గ్రామ పంచాయతీలకు, టాయిలెట్లకు, శ్మశానవాటికలు, ఇతర మౌలిక సదుపాయాలకు కేంద్రమే నిధులిస్తుంటే.. కేసీఆర్ తానే ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. పైగా మోదీనే అవమానించేలా మాట్లాడుతున్నారు.’’అని మండిపడ్డారు. అన్నీ అరాచకాలే.. : రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు, ఆత్మహత్యలు, టీఆర్ఎస్ నేతల అరాచకాలే కనిపిస్తున్నాయని సంజయ్ ధ్వజమెత్తారు. ఖమ్మంలో స్థానిక మంత్రి అక్రమాలను సోషల్ మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తున్న సాయిగణేశ్‌పై 16 కేసులు బనాయించి, బెదిరించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని మండిపడ్డారు. మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే అనుచరులు ఓ కౌన్సిలర్‌ను చంపారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల కళ్లలో సీఎం మట్టి: ఈటల చెరువులు, బావులు, బోర్లలో నీళ్లున్నా.. వరి, మక్కలు వేయొద్దం టూ రైతుల కళ్లల్లో సీఎం కేసీఆర్ మట్టి కొట్టారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. రైతుబంధు ఇచ్చేది పంటలు వేసుకోవడానికా, బంద్ చేయడానికా అని నిలదీశారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక అన్నీ పక్కనపెట్టి నియంత పాలన కొనసాగిçస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిగా మారిందన్నారు. కాగా.. ప్రధాని మోదీ నవభారత నిర్మాణం చేస్తుంటే.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల కలల తెలంగాణను ధ్వంసం చేస్తున్నారని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి ఆరోపించారు. గవర్నర్‌ను అడుగడుగునా అవమానిస్తూ బాధపెడుతున్నారని.. కేసీఆర్ కుసంస్కారానికి ఇది నిదర్శమని ధ్వజమెత్తారు. ‘తెలంగాణ పథకాలు కర్ణాటకలో అమలు చేయాలి’ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా, రైతుబంధు, ఉచిత కరెంటు, ‘దళితబంధు’ పథకాలను కర్ణాటకలో కూడా అమలయ్యేలా చూడాలని కొందరు కర్ణాటక వాసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కోరారు. కార్యక్రమంలో జీఎం జయన్న, అంజినయ్య తదితరులు పాల్గొన్నారు. -
కేటాయించిన నీటిని వాడుకుంటే తప్పేంటి?
సాక్షి, అమరావతి: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ), విభజన చట్టం ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకోవడానికి రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడి కాలువ పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. దీనిని తెలంగాణ సర్కార్ తప్పు పట్టడంపై నీటి పారుదలరంగ, న్యాయ నిపుణులు నివ్వెరపోతున్నారు. విభజన చట్టాన్ని తుంగలో తొక్కి.. కేటాయింపులు లేకున్నాకొత్త ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు పాత ప్రాజెక్టుల సామర్థ్యం పెంచి 178.93 టీఎంసీలను తరలించేలా తెలంగాణ సర్కార్ చేపట్టిన 8 ప్రాజెక్టులూ అక్రమమేనని స్పష్టం చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుండటాన్ని ఎత్తిచూపుతున్నారు. కేటాయింపులున్నా నీళ్లందని దుస్థితి శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగు గంగ, ఎస్సార్బీసీ (శ్రీశైలం కుడి గట్టు కాలువ), గాలేరు–నగరి ప్రాజెక్టుల ఆయకట్టుకు నీళ్లందించాలి. చెన్నైకి తాగునీటిని సరఫరా చేయాలి. కేసీ కెనాల్‌కు సప్లిమెంటేషన్ కింద 10 టీఎంసీలు సరఫరా చేయాలి. కేడబ్ల్యూడీటీ, విభజన చట్టం ద్వారా ఈ ప్రాజెక్టులకు 114 టీఎంసీల కేటాయింపు ఉంది. శ్రీశైలం జలాశయంలో 881 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీటి మట్టం ఉంటేనే.. ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కాలువలకు చేరుతాయి. కృష్ణా బేసిన్లో వర్షాభావ పరిస్థితుల వల్ల ఆ స్థాయిలో నీటిమట్టం ఏడాదికి సగటున 15 నుంచి 20 రోజులు కూడా ఉండటం లేదు. శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచే రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ) ప్రాజెక్టుల ద్వారా 2.95 టీఎంసీలను తరలించేలా తెలంగాణ సర్కార్ అనుమతి లేకుండా పనులు చేపట్టింది. 796 అడుగుల నీటి మట్టం నుంచే శ్రీశైలం ఎడమ కేంద్రం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం ఉంది. అంటే.. 800 అడుగుల కంటే దిగువ స్థాయి నుంచే తెలంగాణ సర్కార్ రోజుకు 6.95 టీఎంసీలను తరలించే సామర్థ్యం కలిగి ఉంది. కృష్ణా బోర్డు ఆదేశాలను తుంగలో తొక్కుతూ యథేచ్ఛగా తెలంగాణ సర్కార్ నీటిని తరలించడం వల్ల శ్రీశైలం నీటిమట్టం తగ్గిపోతుంది. శ్రీశైలం నీటి మట్టం 848 అడుగుల కంటే దిగువకు చేరితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కాలువల్లోకి చుక్క నీరు చేరదు. నీటి కేటాయింపులు ఉన్నా సరే.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆయకట్టులో పంటలను రక్షించలేని దుస్థితి. రాయలసీమ, నెల్లూరు, చెన్నై ప్రజలకు తాగునీటిని అందించలేని పరిస్థితి. ఈ పరిస్థితులను అధిగమించడానికి కేటాయింపులను సమర్థవంతంగా వినియోగించుకుని ఆయకట్టులో పంటలను రక్షించడం, తాగునీటిని అందించడం కోసం.. శ్రీశైలం నుంచి రోజుకు మూడు టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కాలువలోకి ఎత్తిపోసేలా రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టిందని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది తప్పెలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. అక్రమ ప్రాజెక్టు ఎలా అవుతుంది ఆర్డీఎస్ కుడి కాలువ ద్వారా 4 టీఎంసీలను వినియోగించుకోవడానికి కేడబ్ల్యూడీటీ–2 ఏపీ ప్రభుత్వానికి అవకాశం కల్పించింది. హక్కుగా దక్కిన ఆ జలాలను వాడుకోవడానికి ఆర్డీఎస్ కుడి కాలువను ప్రభుత్వం చేపట్టింది. ఇదెలా తప్పవుతుందని నీటిపారుదల రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కేసీ (కర్నూలు–కడప) కెనాల్‌కు ట్రిబ్యునల్ 39.9 టీఎంసీలను కేటాయించింది. సుంకేశుల బ్యారేజీ ద్వారా ఈ నీటిని కేసీ కెనాల్‌కు మళ్లించి.. 2.65 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి అనుమతి ఇచ్చింది. దశాబ్దాల క్రితం నాటి ఈ ఆయకట్టును దెబ్బతీసేలా 2015లో తెలంగాణ సర్కార్ సుంకేశుల బ్యారేజీ జల విస్తరణ ప్రాంతం నుంచి 5.54 టీఎంసీలను తరలించేలా తుమ్మిళ్ల ఎత్తిపోతలను చేపట్టింది. ఎలాంటి అనుమతి లేకుండా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల అక్రమమైనదని నీటి పారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకు ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆర్డీఎస్ కుడి కాలువ ఎలా అక్రమ ప్రాజెక్టవుతుందని ప్రశ్నిస్తున్నారు. -
అడుగు ముందుకుపడని ఆర్డీఎస్
సాక్షి, హైదరాబాద్: రాజోలిబండ ఎత్తిపోతల పథకం (ఆర్డీఎస్) కింది ఆయకట్టు రైతాంగానికి ఈ ఏడాదీ నిరాశే మిగిలే అవకాశాలున్నాయి. మూడేళ్లుగా ఊరిస్తున్న ఆధునీకరణ పనులు ఈ ఏడాది సైతం మూలన పడటంతో వారి ఆశలన్నీ అడియాసలే కానున్నాయి. పనుల పూర్తికి కర్ణాటక ప్రభుత్వం ముందుకొచ్చినా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అవాంతరాలతో పనులు ముందుకు సాగకపోవడంతో కాల్వల ఎత్తు పెంపు సాధ్యం కావడం లేదు. ప్రస్తుతం పనులు చేసేందుకు మరో రెండు మూడు నెలల వ్యవధిఉన్నా, ఏపీ నుంచి స్పందన లేకపోగా, ఆయకట్టు స్థిరీకరణకై చేపట్టిన తుమ్మిళ్లకు అడ్డుపుల్లలు వేస్తోంది. ఆర్డీఎస్ కింద తెలంగాణకు 15.9 టీఎంసీల నీటి వాటా ఉండగా, పాత పాలమూరు జిల్లాలోని 87,500 ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి ఆర్డీఎస్కు నీటిని తరలించే కాల్వలన్నీ పూడికతో నిండిపోవడంతో ఆశించిన మేర నీరు రావడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్ కాల్వల మరమ్మతులు చేసి, ఎత్తును పెంచాలని నిర్ణయించగా, ఇందుకు కర్ణాటక సైతం అంగీకరించింది. ఈ కాల్వల ఆధునీకరణ కోసం కర్ణాటకకు రాష్ట్రం రూ.72కోట్ల మేర డిపాజిట్ సైతం చేసింది. అయితే ఆనకట్టకు మరోవైపున ఉన్న కర్నూలు జిల్లా నేతలు, రైతులు ఆధునీకరణ పనులకు మూడున్నరేళ్లుగా అడ్డుపడుతూ ఉన్నారు. దీంతో ఆర్డీఎస్ కింద సాగు ముందుకు సాగడం లేదు. గత ఏడాది డిసెంబర్లో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు దీనిపై కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్‌తో చర్చలు జరపగా వారు పనులకు ఓకే చెప్పారు. దీంతో ప్యాకేజీ–1లోని హెడ్‌వర్క్స్ అంచనాను రూ.3కోట్ల నుంచి రూ.13కోట్లకు పెంచగా, దానికి ప్రభుత్వం ఆమోదం సైతం తెలిపింది. ఈ నిధులను కర్ణాటక ప్రభుత్వ ఖాతాలో జమచేసి, అక్కడి ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూనే, పనులుచేస్తున్న కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చారు. ప్యాకేజీ–1లో భాగంగా పూడికమట్టి తొలగింపు, షట్టర్ల నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉన్నా అవి జరగడం లేదు. ఈ పనుల కొనసాగింపుపై ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశంలో చర్చిదా మని భావించినా ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌రావు సమావేశానికి రాలేదు. అనంతరం ఆర్డీఎస్‌పై సమావేశం అవుదామని లేఖ రాసినా స్పందించ లేదు. దీంతో ఆధునీకరణ పనులు అడుగు ముందుకు కదల్లేదు. తుమ్మిళ్లకు అడ్డుపుల్ల... ఇక వినియోగించని తుంగభద్ర జలాల్లో వాటా మేరకు వాడుకునేలా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి కూడా ఆంధ్రప్రదేశ్ అడ్డుపడుతోంది. 15.90 టీఎంసీల కేటాయింపులో 5 టీఎంసీలకు మించి వినియోగం లేనందున తుమ్మిళ్ల చేపట్టి 5.44 టీఎంసీల నీటిని సుంకేశుల రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ నుంచి తీసుకుని ఆర్డీఎస్ కాల్వల్లో పోయాలని ప్రణాళిక వేసింది. అయితే దీనిపై ఏపీ అభ్యంతరాలు లేవనెత్తుతోంది. తుమ్మిళ్లను కొత్త ప్రాజెక్టుగానే పరిగణించాలని, నిర్మాణ పనులు కొనసాగకుండా చూడాలని బోర్డుకు, కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దీనిపై తెలంగాణ గట్టిగా బదులిచ్చేందుకు సిద్ధమవుతోంది. -
'ఆర్డీఎస్ పై కాంగ్రెస్ దీక్ష అంతా డ్రామా'
హైదరాబాద్: ఆర్డీఎస్ ప్రాజెక్టు సమస్యపై కాంగ్రెస్ చేస్తున్న దీక్ష అంతా డ్రామా' అని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాజకీయాల కోసమే కాంగ్రెస్ దీక్ష చేస్తోందంటూ ధ్వజమెత్తారు. మంగళవారం హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ది రాష్ట్రానికో సిద్ధాంతమంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు పాలేరులో ఓటమి తప్పదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కాగా, ఆర్డీఎస్ సమస్యపై ఈ రోజు మధ్యాహ్నం కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలవడానికి టీపీసీసీ బృందం బెంగళూరు వెళ్లనున్న సంగతి తెలిసిందే. -
కాంగ్రెస్‌ను పాతరేయడం వాళ్ల తరం కాదు: షబ్బీర్
హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పాతరేయడం కేసీఆర్, కేటీఆర్ తరం కాదని, ఆ పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ కేటీఆర్ అహంకారంతో ఉలికిపడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో చేపట్టినవేనని షబ్బీర్ అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కాంగ్రెస్ సహకరిస్తూనే ఉందని, అయితే చిత్తశుద్ధి లేదని కేసీఆర్‌కేనని ఆయన ధ్వజమెత్తారు. రీ డిజైన్ పేరుతో కేసీఆర్ చేస్తున్న అవినీతినే తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆర్డీఎస్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 9న ఆర్డీఎస్ ప్రాజెక్ట్ వద్ద కాంగ్రెస్ మహాదీక్ష చేపడుతున్నట్లు షబ్బీర్ అలీ వెల్లడించారు. అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి ఆర్డీఎస్ పనులు పూర్తి చేయాలని, తెలంగాణకు 3 టీఎంసీల సాగునీరు ఇవ్వాలని కోరతామన్నారు. -
పోరు.. నీరు
అన్నదాతల పోరు ఫలించింది. ఇక్కడ పంటలు ఎండుతుంటే హక్కులు లేని ప్రాంతానికి నీటి తరలింపా...అని ముక్తకంఠంతో ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు నినదించడంతో అధికారులు దిగివచ్చారు. ప్రభుత్వంలో కదలిక వచ్చింది. చివరికి శుక్రవారం రాత్రి ప్రాజెక్టుకు తొలివిడతగా రెండువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పంటలు పూర్తిగా చేతికి వచ్చేవరకూ జలాలను అందిస్తామని వెల్లడించారు. దీనింతో సుమారు 40 వేల ఎకరాల భూముల్లోని పంటలకు జీవం వచ్చినట్లైంది. గద్వాల, న్యూస్‌లైన్ : ఆర్డీఎస్ రైతుల ఆందోళనతో దిగొచ్చిన ప్రభుత్వం కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి శుక్రవారం రాత్రి మూడు వేల క్యూసెక్కుల నీటిని ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకోసం విడుదల చేయించింది. దీంతో ఈ పరిధిలో వారం రోజులుగా నీళ్లులేక వాడిపోతున్న పంటలకు నీళ్లందే అవకాశం ఏర్పడింది. ఈనెల 21వ తేదీ నుంచి ఆర్డీఎస్ కాల్వ ద్వారా పంటలకు నీటి విడుదల ఆగిపోయిన సంగతి విదితమే. ఆయకట్టులో పంటలు పూర్తి కాకుండానే తుంగభద్ర ప్రాజెక్టు నుంచి రావాల్సిన నీటి విడుదల నిలిచిపోవడంతో, ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటి మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి ఆధ్వర్యంలో ఆయకట్టు రైతు ప్రతినిధులు ప్రభుత్వానికి సమస్యలను తెలిపారు. హైదరాబాద్‌లోని నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, జిల్లా మంత్రి అరుణను, ఉన్నతాధికారులకు సమస్యను వివరించారు. ఇదే సమయంలో ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ ఓవర్‌ఫ్లో నీళ్లు చేరాల్సిన కర్నూలు, కడప సుంకేసుల బ్యారేజీ పరిధిలోని కర్నూలు జిల్లా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కర్నూలులో నిర్వహించారు. ఇలా రెండు జిల్లాల నుంచి తుంగభద్ర రిజర్వాయర్ నీటి విడుదల కోసం ఆందోళనలు జరగడంతో, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఆర్డీఎస్, కేసీ కాల్వలకు రావాల్సిన జాయింట్ ఇండెంట్ నీటిని అనంతపురం జిల్లాలోని హెచ్ఎల్సీకి మళ్లించడంపై నిరసన వ్యక్తమైంది. దీంతో స్పందించిన ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు అనుమతించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నాలుగు రోజుల వరకు మూడువేల క్యూసెక్కుల నీటి విడుదలను కొనసాగించి అనంతరం రెండు వేల క్యూసెక్కులకు కుదిస్తారు. జనవరి 10వరకు మొదటి విడత నీటి విడుదలను కొనసాగించి పది రోజుల పాటు నీటి విడుదలను నిలిపేస్తారు. జనవరి 20 నుంచి రెండో దశలో నీటి విడుదల తుంగభద్ర ప్రాజెక్టు నుంచి ప్రారంభమవుతుంది. ఇలా ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలో ఉన్న 30వేల ఎకరాల్లోని పంట పూర్తయ్యే వరకు నీటి విడుదల కొనసాగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. పంటలు పూర్తయ్యే వరకు ఇస్తాం - జూరాల ఎస్ఈ ఖగేందర్. ఆర్డీఎస్ పరిధిలోని 30వేల ఎకరాల్లో ఉన్న పంటలు పూర్తయ్యే వరకు విడతల వారీగా తడువు పెట్టేలా నీటి విడుదల కొనసాగిస్తామని జూరాల ఎస్ఈ ఖగేందర్ ‘న్యూస్‌లైన్’ కు తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచే మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. ఆయకట్టు పరిధిలో ప్రస్తుతం ఉన్న పంటలు పూర్తయ్యే వరకు తడులు పెట్టుకునేలా నీటి విడుదల కొనసాగింపు ఉంటుందని ఆయన చెప్పారు. ఆర్డీఎస్ పరిధిలోని రైతులు కాల్వకు వస్తున్న నీటిని పొదుపుగా వాడుకోవడంతోపాటు, దిగువ రైతులకు నీళ్లందేలా సహకరించాలని ఎస్ఈ కోరారు. -
పొరపాట్లను సవరించాలి
గద్వాల, న్యూస్‌లైన్: ఆర్డీఎస్ (రాజోలిబండ నీటి మ ళ్లింపు పథకం) చివరి ఆయకట్టుకు నీ ళ్లను అందించేలా ప్రతిపాదించిన తు మ్మిళ్ల ఎత్తిపోతల పథకం ప్రాథమిక స ర్వేను జూరాల ఎస్ఈ ఖగేందర్ గురువారం సమీక్షించి తిరస్కరించారు. నది లో నీటిమట్టం, పంప్‌హౌస్ లెవల్స్, ఆ ర్డీఎస్ ప్రధాన కాల్వలో నీటి నిల్వమ ట్టం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని మళ్లీ సర్వే నిర్వహించాలని ఆ ర్డీఎస్ ఇంజనీర్లను ఎస్ఈ ఆదేశిం చారు. పది రోజుల్లోగా సర్వేపనులను పూర్తిచేయాలని సూచించారు. వివరాల్లోకెళ్తే..కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా మాన్వి నియోజకవర్గంలో తుంగభద్ర నదిపై నిజాం కాలంలో నిర్మించిన ఆర్డీఎస్ ద్వారా, ప్రస్తుత అలంపూర్ నియోజకవర్గంలోని 87,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. 30 ఏళ్లుగా ఆయకట్టు తగ్గుతూ ప్రస్తుతం 25వేల ఎకరాలకు కుదిరించారు. ఆర్డీఎస్ ఎగువ ప్రాంతంలోని 25వేల ఎకరాలకు ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ నుంచి నీళ్లు అందుతుండగా, చివర ఉన్న 25వేల ఎకరాలకు జూరాల కుడికాల్వ లింకు ద్వారా సాగునీరు అందిస్తున్నారు. మధ్యలో ఉన్న 37 వేల ఎకరాలకు దశాబ్దాలుగా నీరు అందడం లేదు. ఇలా మధ్యలో మిగిలిపోయిన వడ్డేపల్లి, మానవపాడు మండలాల్లోని ఆయకట్టుకు నీళ్లందించేందుకు తుంగభద్ర నది నుంచి తుమ్మిళ్ల వద్ద ఎత్తిపోతల చేపట్టాలని ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రాథమిక సర్వే నిర్వహించాల్సిందిగా ఆర్డీఎస్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీచేశారు. గత ఏప్రిల్ నుంచి ప్రాథమిక సర్వే పనులు చేపట్టిన అధికారులు ఆలస్యంగా ఎట్టకేలకు పూర్తిచేసి గురువారం గద్వాల ఎస్ఈ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ ప్రాథమిక సర్వేను పరిశీలించిన జూరాల ఎస్ఈ ఖగేందర్ నీటిమట్టాలకు సంబంధించిన పొరపాట్లను సవరించి మరోసారి సర్వేను తయారు చేయాల్సిందిగా తిరస్కరించారు. పదిరోజుల్లో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఎత్తిపోతలకు సంబంధించిన ప్రాథమిక సర్వేను పూర్తి చేయాల్సిందిగా ఆర్డీఎస్ ఇంజనీర్లను కోరారు. సర్వేపనులు త్వరగా పూర్తిచేసి ఆర్డీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ తనగల సీతారామిరెడ్డి అధికారులను కోరారు. ప్రస్తుతం కర్ణాటకలో నీటి విడుదల పెరిగినందున వచ్చే డిసెంబర్ నాటికి ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్‌తోపాటు, ప్యాకేజీ -1,2లలో పనులు చేపట్టే విధంగా కర్ణాటకతో సంప్రదింపులు చేయాల్సిందిగా విజ్ఞప్తిచేశారు. -
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!
గద్వాల, న్యూస్‌లైన్: ఆర్డీఎస్ ప్రాజెక్టు సమస్యను పరిష్కరించేందుకు మన ప్రజాప్రతినిధులు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారింది. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ సర్వే నిలిచిపోగా, ముగ్గురు చీఫ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక రాకుండానే మూలనపడింది. ఇలా అడుగడుగునా నిర్లక్ష్యం ఆవహించడంతో 87వేల ఎకరాలకు నీళ్లివ్వాల్సిన ఆర్డీఎస్ లక్ష్యం చివరికి 25వేల ఎకరాలకు తగ్గిపోయింది. దశాబ్దాలుగా ఆర్డీఎస్ సమస్య అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లాల మధ్య నలుగుతూ కనీసం 30వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోతుంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తుంగభద్ర నది నీటిని ఎత్తిపోతల ద్వారా ఆర్డీఎస్ ప్రధానకాల్వకు అందించి 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీరు అందించేవిధంగా రూపకల్పన చేసిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం సర్వేను నాలుగు నెలల క్రితం చేపట్టారు. ఇది పూర్తయ్యే సమయంలో ఆర్డీఎస్ అధికారులు సెలవులపై వెళ్లడం, ఇతర పని ఒత్తిళ్ల కారణంగా పూర్తిగా నిలిచిపోయింది. కమిటీ నివేదిక ఏమైనట్లు? 2010 ఆగస్టు 13న ఆర్డీఎస్ ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌లోని తూముల షట్టర్ప్లేట్లను అవతలి వైపు రాయలసీమ రైతులు తొలగించారు. ఈ సమస్యపై తెలంగాణలో పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తం కావడంతో అప్పటి రోశయ్య ప్రభుత్వం ముగ్గురు చీఫ్ ఇంజనీర్లతో కూడిన కమిటీని శాశ్వత పరిష్కారం కోసం నియమించింది. ఈ కమిటీలో మహబూబ్‌నగర్, కర్నూలు చీఫ్ ఇంజనీర్లతోపాటు, డిజైన్స్ చీఫ్ ఇంజనీర్‌ను చేర్చారు. కమిటీ 2011 జూలైలో ఆర్డీఎస్ను సందర్శించింది. అయితే ఈ కమిటీ నివేదికలో ఏముంది.. ఏ చర్యల ద్వారా ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న సూచనలు ఉన్నాయో లేవోననే విషయం తెలియకుండానే కమిటీ నివేదికను మూసేశారు. ఈ తరుణంలో ఆర్డీఎస్ ప్రధానకాల్వ మధ్య ప్రాంతంలో నీళ్లందకుండా మిగిలిపోయిన దాదాపు 30 నుంచి 50వేల ఎకరాలకు తుమ్మిళ్ల వద్ద లిఫ్టు చేపట్టి తుంగభద్ర నది నీటిని ఆయకట్టుకు అందించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ సర్వే ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పటికి మంజూరు వస్తుందో అయోమయంగా మారింది. అయితే రెండు రాష్ట్రాలు, రెండు జిల్లాల మధ్య ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ నుంచి పూర్తి స్థాయిలో వాటా నీటిని తెచ్చుకోవడం సాధ్యం కాదన్న ఆలోచనకు మన ప్రభుత్వం వచ్చింది. ఆర్డీఎస్ ఆయకట్టుదారుల సంఘం రైతులు, ప్రాజెక్టు కమిటి చైర్మన్ సీతారామిరెడ్డిలు ఆర్డీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోతల చేసి చివరి ఆయకట్టుకు నీళ్లందేలా చూస్తే బాగుంటుందని సలహాలు ఇచ్చారు. ఆ మేరకే నీటిపారుదల శాఖ అధికారులు గత నాలుగు నెలల క్రితం నుంచి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం సర్వేను చేపట్టారు. నాయకులు కృషిచేయాలి ఆర్డీఎస్ సమస్య పరిష్కారానికి చీఫ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఏమైంది, ఏ సూచనలు ఉన్నాయి. ఆ నివేదిక మేరకు చర్యలు చేపట్టేలా మన ప్రతినిధులు ప్రయత్నిస్తేనే పరిష్కారం ఉంటుందని ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సీతారామిరెడ్డి ‘న్యూస్‌లైన్’తో అన్నారు. చీఫ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక అమలుతో పాటు, తుమ్మిళ్ల లిఫ్టుకు త్వరలో మంజూరు వచ్చేలా చేస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.