గద్వాల, న్యూస్‌లైన్: ఆర్డీఎస్ ప్రాజెక్టు సమస్యను పరిష్కరించేందుకు మన ప్రజాప్రతినిధులు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అనే చందంగా మారింది. దీనికి సంబంధించి ప్రత్యామ్నాయ సర్వే నిలిచిపోగా, ముగ్గురు చీఫ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక రాకుండానే మూలనపడింది. ఇలా అడుగడుగునా నిర్లక్ష్యం ఆవహించడంతో 87వేల ఎకరాలకు నీళ్లివ్వాల్సిన ఆర్డీఎస్ లక్ష్యం చివరికి 25వేల ఎకరాలకు తగ్గిపోయింది. దశాబ్దాలుగా ఆర్డీఎస్ సమస్య అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లాల మధ్య నలుగుతూ కనీసం 30వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోతుంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు తుంగభద్ర నది నీటిని ఎత్తిపోతల ద్వారా ఆర్డీఎస్ ప్రధానకాల్వకు అందించి 50 నుంచి 60వేల ఎకరాలకు సాగునీరు అందించేవిధంగా రూపకల్పన చేసిన తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం సర్వేను నాలుగు నెలల క్రితం చేపట్టారు. ఇది పూర్తయ్యే సమయంలో ఆర్డీఎస్ అధికారులు సెలవులపై వెళ్లడం, ఇతర పని ఒత్తిళ్ల కారణంగా పూర్తిగా నిలిచిపోయింది.
కమిటీ నివేదిక ఏమైనట్లు?
2010 ఆగస్టు 13న ఆర్డీఎస్ ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌లోని తూముల షట్టర్‌ప్లేట్లను అవతలి వైపు రాయలసీమ రైతులు తొలగించారు. ఈ సమస్యపై తెలంగాణలో పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తం కావడంతో అప్పటి రోశయ్య ప్రభుత్వం ముగ్గురు చీఫ్ ఇంజనీర్లతో కూడిన కమిటీని శాశ్వత పరిష్కారం కోసం నియమించింది. ఈ కమిటీలో మహబూబ్‌నగర్, కర్నూలు చీఫ్ ఇంజనీర్లతోపాటు, డిజైన్స్ చీఫ్ ఇంజనీర్‌ను చేర్చారు. కమిటీ 2011 జూలైలో ఆర్డీఎస్‌ను సందర్శించింది. అయితే ఈ కమిటీ నివేదికలో ఏముంది.. ఏ చర్యల ద్వారా ఆర్డీఎస్‌కు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న సూచనలు ఉన్నాయో లేవోననే విషయం తెలియకుండానే కమిటీ నివేదికను మూసేశారు.
ఈ తరుణంలో ఆర్డీఎస్ ప్రధానకాల్వ మధ్య ప్రాంతంలో నీళ్లందకుండా మిగిలిపోయిన దాదాపు 30 నుంచి 50వేల ఎకరాలకు తుమ్మిళ్ల వద్ద లిఫ్టు చేపట్టి తుంగభద్ర నది నీటిని ఆయకట్టుకు అందించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ సర్వే ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పటికి మంజూరు వస్తుందో అయోమయంగా మారింది. అయితే రెండు రాష్ట్రాలు, రెండు జిల్లాల మధ్య ఆర్డీఎస్ హెడ్‌వర్క్స్ నుంచి పూర్తి స్థాయిలో వాటా నీటిని తెచ్చుకోవడం సాధ్యం కాదన్న ఆలోచనకు మన ప్రభుత్వం వచ్చింది. ఆర్డీఎస్ ఆయకట్టుదారుల సంఘం రైతులు, ప్రాజెక్టు కమిటి చైర్మన్ సీతారామిరెడ్డిలు ఆర్డీఎస్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. వడ్డేపల్లి మండలం తుమ్మిళ్ల వద్ద తుంగభద్ర నది నుంచి నీటిని ఎత్తిపోతల చేసి చివరి ఆయకట్టుకు నీళ్లందేలా చూస్తే బాగుంటుందని సలహాలు ఇచ్చారు. ఆ మేరకే నీటిపారుదల శాఖ అధికారులు గత నాలుగు నెలల క్రితం నుంచి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం సర్వేను చేపట్టారు.
నాయకులు కృషిచేయాలి
ఆర్డీఎస్ సమస్య పరిష్కారానికి చీఫ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక ఏమైంది, ఏ సూచనలు ఉన్నాయి. ఆ నివేదిక మేరకు చర్యలు చేపట్టేలా మన ప్రతినిధులు ప్రయత్నిస్తేనే పరిష్కారం ఉంటుందని ఆర్డీఎస్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సీతారామిరెడ్డి ‘న్యూస్‌లైన్’తో అన్నారు. చీఫ్ ఇంజనీర్ల కమిటీ నివేదిక అమలుతో పాటు, తుమ్మిళ్ల లిఫ్టుకు త్వరలో మంజూరు వచ్చేలా చేస్తేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే!
Published Tue, Aug 13 2013 4:39 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM
Advertisement
Advertisement