సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కీలకమైన ఆర్టీఎస్ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టబోతోందని.. కొద్దినెలల్లో ప్రాజెక్టును పూర్తిచేసి 87,500 ఎకరాల సాగు నీరందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రకటించారు. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నివేదిక ఇచ్చిందని, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ విషయం చెప్పారని తెలిపారు. ఆర్డీఎస్ విషయంలో ఎనిమిదేళ్లుగా ప్రజలను మోసం చేస్తూ.. నడిగడ్డను ఎడారిగా మార్చిన సీఎం కేసీఆర్‌ను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా గురువారం 8వ రోజు పాదయాత్ర చేసిన బండి సంజయ్.. గద్వాల పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. కేసీఆర్ చేతగానితనంతో ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించలేకపోయారని మండిపడ్డారు. ఇప్పుడు కేంద్రం ఆర్డీఎస్ ఆధునీకరణకు ముందుకొచ్చిందని.. అలంపూర్, గద్వాల పరిధిలో 87,500 ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు వాటా మేర నీళ్లు అందించేలా ఆర్డీఎస్ ఆనకట్ట, హెడ్ రెగ్యులేటర్ డిజైన్‌లో మార్పులు చేయనున్నామని.. కాలువ సీపేజీ, ఓవర్ ఫ్లో సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాన కాలువకు మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారు.
కేంద్రంపై ఏడుపెందుకు? : కేంద్రంపై ఏడవటం తప్ప సీఎం కేసీఆర్ సాధించిందేంటని సంజయ్ నిలదీశారు. ‘‘మోదీ ప్రభు త్వం ఇప్పటివరకు తెలంగాణకు 3 లక్షల కోట్లకుపైగా నిధులు ఇచ్చింది. అందులో పన్నుల రూపంలో రూ.1.68 లక్షల కోట్లు, మిగతావి ప్రాయోజిత పథకాలు, రహదారుల రూపంలో ఖర్చుచేసింది. ఈ విషయంలో బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా? గ్రామ పంచాయతీలకు, టాయిలెట్లకు, శ్మశానవాటికలు, ఇతర మౌలిక సదుపాయాలకు కేంద్రమే నిధులిస్తుంటే.. కేసీఆర్ తానే ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. పైగా మోదీనే అవమానించేలా మాట్లాడుతున్నారు.’’అని మండిపడ్డారు.
అన్నీ అరాచకాలే.. : రాష్ట్రంలో ఎక్కడ చూసినా హత్యలు, ఆత్మహత్యలు, టీఆర్‌ఎస్ నేతల అరాచకాలే కనిపిస్తున్నాయని సంజయ్ ధ్వజమెత్తారు. ఖమ్మంలో స్థానిక మంత్రి అక్రమాలను సోషల్ మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తున్న సాయిగణేశ్‌పై 16 కేసులు బనాయించి, బెదిరించి ఆత్మహత్య చేసుకునేలా చేశారని మండిపడ్డారు. మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే అనుచరులు ఓ కౌన్సిలర్‌ను చంపారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
రైతుల కళ్లలో సీఎం మట్టి: ఈటల
చెరువులు, బావులు, బోర్లలో నీళ్లున్నా.. వరి, మక్కలు వేయొద్దం టూ రైతుల కళ్లల్లో సీఎం కేసీఆర్ మట్టి కొట్టారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. రైతుబంధు ఇచ్చేది పంటలు వేసుకోవడానికా, బంద్ చేయడానికా అని నిలదీశారు. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక అన్నీ పక్కనపెట్టి నియంత పాలన కొనసాగిçస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిగా మారిందన్నారు. కాగా.. ప్రధాని మోదీ నవభారత నిర్మాణం చేస్తుంటే.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల కలల తెలంగాణను ధ్వంసం చేస్తున్నారని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి ఆరోపించారు. గవర్నర్‌ను అడుగడుగునా అవమానిస్తూ బాధపెడుతున్నారని.. కేసీఆర్ కుసంస్కారానికి ఇది నిదర్శమని ధ్వజమెత్తారు.
‘తెలంగాణ పథకాలు కర్ణాటకలో అమలు చేయాలి’
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతు బీమా, రైతుబంధు, ఉచిత కరెంటు, ‘దళితబంధు’ పథకాలను కర్ణాటకలో కూడా అమలయ్యేలా చూడాలని కొందరు కర్ణాటక వాసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కోరారు. కార్యక్రమంలో జీఎం జయన్న, అంజినయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment