సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలో పెండింగ్ అంశాలను పరిష్కరిస్తూ వాటి అమలుకు ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ప్రధానంగా రాష్ట్ర విభజన అనంతరం ఏపీ జెన్‌కో తెలంగాణ డిస్కంలకు సరఫరా చేసిన విద్యుత్‌కు చెల్లించాల్సిన బకాయిలు తెలంగాణ సర్కారు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ కార్యదర్శి అనురాధా ప్రసాద్ అధ్యక్షతన శనివారం తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో రాష్ట్రం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ సమీర్ శర్మ, రాష్ట్ర పునర్విభజన విభాగం ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, జల వనరుల సలహాదారు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై ఏపీ చేసిన వినతికి స్టాండింగ్ కమిటీ సానుకూలంగా స్పందించింది. కేంద్రం ఆదేశాలతోనే పెండింగ్ అంశాలు పరిష్కారం అవుతాయని, లేదంటే ఎన్నేళ్లయినా అపరిష్కృతంగానే ఉంటాయని ఏపీ స్పష్టంచేసింది.
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్‌కో విద్యుత్ సరఫరా చేసిందని, దీనికి సంబంధించి ఏపీకి రూ.6,015 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఈ బకాయిలు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. విభజన చట్టం ప్రకారం విద్యుత్ బకాయిలపై ఆదేశాలు జారీ చేసే అధికారం కేంద్రానికి ఉందని ఇటీవలే కేంద్ర న్యాయ శాఖ కూడా తెలిపింది. ఈ బకాయిలపై ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో గతంలో కేసు వేసింది. హైకోర్టులో కేసు ఉన్నందున కేంద్రం ఆదేశాలు ఎలా జారీ చేస్తుందని తెలంగాణ అభ్యంతరం తెలిపింది.
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కేసును ఉపసంహరించుకుంది. సమస్య పరిష్కారమయ్యేలా ఉన్నందున కేసు ఉపసంహరించుకుంటున్నామని, పరిష్కారం కాకపోతే మళ్లీ వస్తామని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టును కోరింది. కోర్టు కేసు కూడా లేనందున కేంద్రం వెంటనే విద్యుత్ బకాయిలపై ఆదేశాలు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనిపై స్టాండింగ్ కమిటీ సానుకూలంగా స్పందించింది. విభజన చట్టానికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను నిలువరించాలని ఏపీ కోరింది.
ఈ ప్రాజెక్టుల కారణంగా దిగువనున్న ఏపీకి కలిగే నష్టాన్ని వివరించింది. అలాగే విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ఏడు జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ, విభజన జరిగిన ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటును ప్రస్తావించింది. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలు, న్యూఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది.
విభజన చట్టం అమలుకు ఆదేశాలివ్వండి
Published Sun, May 29 2022 4:06 AM | Last Updated on Sun, May 29 2022 8:15 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment