రాష్ట్రానికి గొడ్డలిపెట్టు: మైసూరారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కృష్ణాజలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టులాంటిదని, తీర్పునిచ్చిన రోజు రాష్ట్రానికి ఒక దుర్దినమని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారంనాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రిబ్యునల్ తీర్పును తీవ్రంగా తప్పు పట్టారు. తక్షణమే దీనిపై సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకురావాలని లేకుంటే రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం కలుగుతుందన్నారు. ఇదే ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తాత్కాలిక తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన అంశాలను పరిశీలించాలని ఆదేశించినా ట్రిబ్యునల్ తుది తీర్పులో అన్యాయాన్ని ఏ మాత్రం సరిదిద్దలేదని మైసూరారెడ్డి ఆరోపించారు.
ఒక నదిలో నీటి లభ్యతను 75 శాతం తీసుకుంటారని, బ్రిజేశ్ ట్రిబ్యునల్ మాత్రం 65 శాతమే తీసుకుందన్నారు.ట్రిబ్యునల్ తాజా తీర్పు వల్ల ఎగువ రాష్ట్రాలు నీటినంతా వాడుకున్నాక దిగువ రాష్ట్రానికి వచ్చేది ఏమీ ఉండవన్నారు. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు అరకొరగా మాత్రమే నీరు వస్తున్నాయన్నారు. కృష్ణలో కర్ణాటకకు 171, మహారాష్ట్రకు 81 టీఎంసీల నీటిని ట్రిబ్యునల్ అదనంగా కేటాయించాక ఇక మన రాష్ట్రానికి అదనంగా నీరు ఎక్కడినుంచి లభిస్తుందని ఆయన ప్రశ్నించారు.నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులే ఎండిపోయే ప్రమాదం ఉంది కనుక ఇక మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన వాటికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి అదనంగా నాలుగైదు టీఎంసీల నీరే దక్కిందని చెప్పారు. మిగులు జలాలు తమకు అక్కర లేదని దివంగత వైఎస్ లేఖ రాసినందువల్లనే ఇలాంటి తీర్పు వచ్చిందని టీడీపీ చేసిన విమర్శలను ఆయన కొట్టి పారేశారు.
రాష్ట్ర ప్రయోజనాలకు హాని జరుగుతున్నపుడు అందరూ కలిసి పోరాడాల్సిన సమయంలో బురద జల్లడం సరికాదన్నారు. వైఎస్ లేఖ రాసిన సందర్భం వేరని ఈ అంశంపై ఆయన బతికి ఉండగానే అసెంబ్లీలో చర్చకు వస్తే సవివరమైన సమాధానం ఇచ్చారని మైసూరా గుర్తు చేశారు. జల యజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులను తక్షణం నిలిపి వేయాలని కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు వైఎస్ మిగులుజలాల వాడకానికి సంబంధించి గతంలో బచావత్ 6సి కింద పొందుపర్చిన సారాం శాన్నే తెలియజేస్తూ లేఖను రాశారన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని కూడా కోరారన్నారు. టీడీపీ వారు పూర్వాపరాలు తెలియకుండా ‘ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయండి’ అన్న చందంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బ్రిజేశ్ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంటే ప్రధాన ప్రతిపక్షంగా దానిని విమర్శించకుండా ఇలా మాట్లాడటం తగదన్నారు. చంద్రబాబు హయాంలో ఎగువ రాష్ట్రాలు నిర్మించిన అల్మట్టి లాంటి అక్రమ ప్రాజెక్టులను ఇపుడు బ్రిజేశ్ ట్రిబ్యునల్ క్రమబద్ధం చేసిందన్నారు.
బాబు పాలనలో ఎగువ రాష్ట్రాలు అక్రమ కట్టడాలు కడుతుంటే నిర్లక్ష్యం వహించారని, కృష్ణా ఆయకట్టు రైతులను ఇక మెట్టపంటల వైపు మళ్లించాలని బాబు చెప్పారని మైసూరా గుర్తు చేశారు. వీటికి సంబంధించి బాబు అనుకూల పత్రికలో వచ్చిన అప్పటి వార్తల క్లిప్పింగ్‌లను ఆయన ప్రదర్శించారు. టీడీపీ హయాంలో వేసిన రాజారావు కమిటీ కృష్ణాలో 268 టీఎంసీల మిగులు జలాలున్నాయని నివేదిక ఇచ్చిందని ఇదే ఎగువ రాష్ట్రాల వాదనలకు ప్రాతిపదిక అయిందని మైసూరా విమర్శించారు. ఆ నివేదిక రూపొందించిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగించారని ధ్వజమెత్తారు.