బాబు ప్రాజెక్టులు కట్టకే ఈ దుస్థితి: గడికోట | Chandra babu Naidu's inefficiancy leads to worst situation in the state, criticises G Srikanth Reddy | Sakshi
Sakshi News home page

బాబు ప్రాజెక్టులు కట్టకే ఈ దుస్థితి: గడికోట

Published Sat, Nov 30 2013 1:06 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

బాబు ప్రాజెక్టులు కట్టకే ఈ దుస్థితి: గడికోట - Sakshi

బాబు ప్రాజెక్టులు కట్టకే ఈ దుస్థితి: గడికోట

సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సాగునీటి ప్రాజెక్టులను నిర్మించకుండా నిర్లక్ష్యం చేసినందువల్లే ఈ రోజు కృష్ణా నదీ జలాల కేటాయింపుల విషయంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇలాంటి తీర్పు నిచ్చిందని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని, ప్రధానినీ, రాష్ట్రపతినీ తానే ఎంపిక చేశానని చెప్పుకునే చంద్రబాబు ఆయన హయాంలో కర్ణాటకలో చేపట్టిన అక్రమ ప్రాజెక్టులను ఎందుకు ఆపలేక పోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రాజెక్టులు నిర్మిస్తుంటే బాబు ముఖ్యమంత్రిగా ఉండి వారికి సహకరించారన్నారు. 
 
 బాబు పాలనలో అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆయనకు అనుకూలంగా ఉండే ఓ పత్రికతో పాటు మరిన్ని పత్రికలు వార్తలు రాశాయని, అవి పూర్తయితే తుపాను వస్తేనే ఇక మన ప్రాజెక్టులకు నీళ్లు అన్నట్లుగా కథనాలు కూడా వచ్చాయన్నారు. బాబు గాలేరు-నగరి, హంద్రీనీవా, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను నిర్మించి ఉంటే మనం కృష్ణా ట్రిబ్యునల్ నుంచి కేటాయింపులు పొందడానికి ఆస్కారం ఉండేదన్నారు. బాబు హయాంలో నిర్మించిన అల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519 నుంచి 524 అడుగుల నీటిని పెంచుకోవడానికి ఇపుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వటంతో రాష్ట్ర రైతుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ సీఎం కాగానే బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో ప్రారంభించిన తెలుగుగంగ పథకాన్ని చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తే వైఎస్ దానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి పూర్తి చేశారని అందువల్లే ఆ ప్రాజెక్టుకు ట్రిబ్యునల్ ఇపుడు 33 టీఎంసీల నీటిని కేటాయించిందన్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement