-
కృష్ణా జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలకు పాతర
-
మిగులు జలాల్లోనూ ఎగువ రాష్ట్రాలకు వాటా
-
ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపునకూ పచ్చజెండా
-
కంటితుడుపుగా 4 టీఎంసీల అదనపు కేటాయింపు
-
నీటి వాడకంపై పర్యవేక్షణకు బోర్డు ఏర్పాటు
-
దాని నిర్ణయాలపై సమీక్షకు అథారిటీ
-
2050 దాకా అమల్లో ఉండేలా తుది తీర్పు
-
ఈ దెబ్బతో కృష్ణా డెల్టా ఇక ‘కృష్ణార్పణమే’
-
వర్షాభావముంటే రాష్ట్రానికి కృష్ణా జలాలు సున్నా
సాక్షి, న్యూఢిల్లీ: భయపడ్డంతా అయింది. కృష్ణా జలాల పంపకంలో మనకు తీరని అన్యాయం జరిగింది. ఊరట దొరకవచ్చన్న ఆశ అడియాసగా మిగిలింది. జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ సారథ్యంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ శుక్రవారం ప్రకటించిన తుది తీర్పు నామమాత్రపు సవరణలకే పరిమితమైంది. గత తీర్పులో ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన కొండంత అన్యాయాన్ని ట్రిబ్యునల్ ఏమాత్రమూ సవరించలేదు. జలాల సక్రమ పంపిణీ ఆవశ్యకతపై రాష్ట్రం చేసిన ఆక్రందనలు, ట్రిబ్యునల్ లోగడ వెలువరించిన తీర్పుపై చెప్పిన తీవ్ర అభ్యంతరాలు, ఎగువ రాష్ట్రాల దాష్టీకాలను ఎత్తిచూపుతూ సాగించిన వాదనలు ఏవీ పని చేయలేదు. మిగులు జలాలు, ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు తదితర అంశాలపై రాష్ర్టం చేసిన విన్నపాలన్నీ నిష్ఫలమయ్యాయి. ఎగువ రాష్ట్రాలకు అనుకూలంగా గతంలో ఇచ్చిన తీర్పులో కేవలం కొద్ది మార్పులకే ట్రిబ్యునల్ పరిమితమైంది.
కర్ణాటకకు గతంలో కేటాయించిన జలాల్లో 4 టీఎంసీలు కోత విధించి, వాటిని రాష్ర్టంలోని ఆర్‌డీఎస్ కుడి ప్రధాన కాల్వకు కేటాయించడం, వివిధ డిపెండబిలిటీల వద్ద రాష్ట్రాలు జలాల్ని ఏ తీరున వినియోగించుకోవాలనేది స్పష్టంగా నిర్దేశించడం, కృష్ణా బేసిన్ పరిధిలోని సబ్ బేసిన్ల మధ్య నీటి బదిలీ కుదరదని మహారాష్ట్రకు తెగేసి చెప్పడం, కృష్ణా జలాల నిర్ణయం అమలు బోర్డు (కేడబ్ల్యూడీఐబీ) ఏర్పాటు, దాని నిర్ణయూలపై అభ్యంతరాలుంటే సమీక్షకు రివ్యూ అథారిటీ ఏర్పాటు, వరదలపై హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటు... ట్రిబ్యునల్ తుదితీర్పులో చేసిన ప్రధాన సవరణలు ఇవే. మిగులు జలాలు, ఆలమట్టి డ్యాం ఎత్తు, సకాలంలో నీటి విడుదల తదితర అంశాలపై రాష్ట్రం లేవనెత్తిన ప్రధాన అభ్యంతరాల విషయంలో మనకు ఎలాంటి ఉపశమనమూ లభించలేదు.
2010 డిసెంబర్ 30న తీర్పు వెలువరించిన మీదట దాదాపు మూడేళ్లపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అభ్యంతరాలపై వాదనలు వింటూ వచ్చిన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్, సవరణలతో తాజాగా వెలువరించిన తుది తీర్పు మనకు తీరని అన్యాయమే చేసింది. దాంతో ఇప్పుడు న్యాయం కోసం సుప్రీంకోర్టులో మన రాష్ట్రం పోరాటం కొనసాగించడం అనివార్యమైంది. ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపునకు గత తీర్పులో అనుమతించిన ట్రిబ్యునల్, దాన్ని తుది తీర్పులో సవరించలేదు. కేవలం అనుమతుల విషయమై పెట్టిన నిబంధనను మాత్రం సవరించింది. కర్ణాటక తనకు లభించినట్టు చెబుతున్న అనుమతులన్నింటినీ సంబంధిత సంస్థలు, విభాగాల ముందుంచాలని, అవి సరిపోతాయా లేక మళ్లీ తాజా అనుమతులు తీసుకోవాలా అనేది ఆ విభాగాలు, సంస్థలే నిర్ణయిస్తాయని పేర్కొంది. ఈ సవరణతో ఆలమట్టి విషయంలో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. ఈ తీర్పు 2050 దాకా అమల్లో ఉంటుంది. అయితే ఈ తుది తీర్పును అధికారికంగా ప్రచురించొద్దని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించడమొక్కటే మన రాష్ట్రానికి కాస్త ఊరటగా చెప్పుకోవచ్చు.
పావుగంటలో ముగిసింది...
జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ చైర్మన్‌గా, జస్టిస్ డి.కె.సేఠ్, జస్టిస్ బి.పి.దాస్ సభ్యులుగా ఉన్న కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తుది తీర్పును ప్రకటించింది. ట్రిబ్యునల్ తరఫున జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ తుది తీర్పును వెలువరించారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు వర్తించే ప్రధానాంశాలను వరుస క్రమంలో చదివారు. ఇదంతా మొత్తం పావుగంటలోపే పూర్తరుుంది. తుదితీర్పు ప్రకటన పూర్తయిన తర్వాత కర్ణాటక, మహారాష్ట్ర తరఫున వాదించిన సీనియర్ న్యాయవాదులు ఫాలీ నారిమన్, అంద్యార్జున మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తీర్పు సంతృప్తికరంగా ఉందంటూ హర్షం వెలిబుచ్చారు.
ట్రిబ్యునల్ పని పూర్తయింది...
కృష్ణా జలాల విషయమై మూడు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటైన ట్రిబ్యునల్... సుదీర్ఘ విచారణ అనంతరం అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్ 5(2) కింద 2010 డిసెంబర్ 30న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పులోని అంశాలపై అభ్యంతరాలు చెబుతూ సవరణల కోసం 2011లో మూడు రాష్ట్రాలు, కేంద్రం చేసిన దరఖాస్తులపై ట్రిబ్యునల్ దాదాపు మూడేళ్ల పాటు పరిశీలన సాగించి, అన్ని పక్షాల వాదనలను సుదీర్ఘంగా ఆలకించింది. ఆ మీదట గత తీర్పునకు సవరణలతో తాజాగా తుది తీర్పును ప్రకటించింది. చట్టంలోని సెక్షన్ 5(3) కింద ఇచ్చిన ఈ తుది తీర్పుతో ట్రిబ్యునల్‌కు అప్పగించిన పని సంపూర్ణంగా పూర్తయింది.
చేసిన సవరణలివీ...
65 శాతం డిపెండబిలిటీ వద్ద కర్ణాటకకు కేటాయించిన జలాల్లోంచి 4 టీఎంసీలను తొలగించి వాటిని ఆర్డీఎస్ కుడి ప్రధాన కాలువకు కేటాయించారు. కర్ణాటకలోని ఎగువ భద్ర, ఎగువ తుంగ నుంచి ఒక్కో టీఎంసీ, సింగత్లూర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీల చొప్పున మొత్తం 4 టీఎంసీలకు కోతపెట్టారు. వాటిని ఆర్డీఎస్ కుడి ప్రధాన కాలువకు తొలిసారిగా కేటాయించారు. దాంతో మన రాష్ట్రానికి జరిపిన కేటాయింపులు 1005 టీఎంసీలకు పెరిగాయి.
వివిధ డిపెండబిలిటీల వద్ద జలాలను మూడు రాష్ట్రాలు ఏ తీరున వినియోగించుకోవాలో స్పష్టపరిచారు. 75 శాతం డిపెండబిలిటీ కేటాయింపులను మూడు రాష్ట్రాలు పూర్తిగా వాడుకున్నాకే 65 శాతం డిపెండబిలిటీ కేటాయింపులకు సిద్ధపడాలి. అలాగే, 65 శాతం డిపెండబిలిటీ కేటాయింపులను మూడు రాష్ట్రాలూ వినియోగించుకున్న తర్వాతే సగటు జలాల కేటాయింపుల వాడకానికి దిగాలి. నికర జలాల వినియోగం పూర్తయ్యూక వాడుకోవాల్సిన మిగులు జలాల వినియోగం విషయుంలో... దిగువ, అతి దిగువ రాష్ట్రాల జల వినియోగం జరిగాకే ఎగువ రాష్ట్రాలు తమ కేటాయింపులను వినియోగించుకోవాలి.
అన్ని రకాల కేటారుుంపుల మేరకు జలాల వినియోగం తర్వాత ఏమైనా జలాలు మిగిలితే వాటిని ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు. అయితే, చట్టం కింద ఏర్పాటయ్యే ఏదైనా సంబంధిత ప్రాధికార సంస్థ చేపట్టే తదుపరి సమీక్ష, పరిశీలన వరకే ఆంధ్రప్రదేశ్ ఇలా వాడుకోగలుగుతుంది. అంతే తప్ప మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి హక్కూ సంక్రమించదు.
ఆలమట్టిపైనా ఊరట లేదు!
-
ప్రస్తుతం ఆలమట్టి డ్యాం ఎత్తుకు 519.6 మీటర్ల వరకు అనుమతి ఉంది. సుమారు 129 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 173 టీఎంసీల నీటి వాడకానికి అనుమతి ఉంది. అయితే తాజా తీర్పు తర్వాత దాని ఎత్తు 524.25 మీటర్ల వరకు పెరగనుంది. ఆ మేరకు నీటి నిల్వ సామర్థ్యమూ పెరగుతుంది. దాంతో దిగువనున్న మన రాష్ట్రానికి నీటి విడుదల మరింత ఆలస్యం కానుంది. అలాగే ఆలమట్టి ద్వారా కర్ణాటక నీటి వాడ కం 173 టీఎంసీల నుంచి 303 టీఎంసీలకు పెరగనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అనుమతులపైనా మన రాష్ట్రం అభ్యంతరాలు తెలిపింది. తుదితీర్పు ప్రకారం క్లియరెన్స్‌లకు సంబంధించిన పత్రాల్ని కర్ణాటక రాష్ట్రం సంబంధిత అధికార విభాగా ల ముందుంచాలి. సదరు క్లియరెన్స్‌లు, ఇప్పటికే ఇచ్చినవి అయితే, ఇప్పటికీ వర్తిస్తాయా లేదా అనేది సంబంధిత విభాగాలు తేల్చాలని ట్రిబ్యునల్ పేర్కొంది.
-
-
తమకు కేటాయించిన నీటి కేటాయింపుల్లో ఒక సబ్ బేసిన్ నుంచి మరో సబ్ బేసిన్‌కు, అంటే కోయ్‌నా సబ్ బేసిన్ నుంచి బీమా సబ్ బేసిన్‌కు జలాలను బదిలీ చేసుకోవడానికి మహారాష్ట్ర అనుమతి కోరగా ట్రిబ్యునల్ నిరాకరించింది. అలాగే కొన్ని పరిమితులకు లోబడి కేటాయింపులన్నింటినీ వాడుకునేందుకు అనుమతించింది.