M. V. Mysura Reddy
-
రైతులను తక్షణమే ఆదుకోండి
* మే 4, 5వ తేదీల్లో మండలాధికారులకు వైఎస్సార్ సీపీ వినతిపత్రాలు * మొక్కుబడిగా కేంద్ర బృందం పర్యటన: మైసూరారెడ్డి సాక్షి, హైదరాబాద్: కరువు, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలనే డిమాండ్‌తో మే 4, 5వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఎమ్మార్వోలు, ఎండీవోలకు స్థానిక నేతలు వినతి పత్రాలు సమర్పించనున్నట్లు వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పంటలు సర్వనాశనమై దుర్భర పరిస్థితుల్లో ఉన్న రైతుల పట్ల టీడీపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న 10 జిల్లాల్లో 35 నుంచి 50 సెంటీమీటర్ల వరకూ తక్కువ వర్షం కురిసిందన్నారు. అనంతపురం, ఉత్తరాంధ్రలో జీవనోపాధి లేక బెంగళూరు, ఒడిశాకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇవేమీ పట్టనట్లుగా పరిశ్రమలు, పెట్టుబడులంటూ జపం చేస్తోందని విమర్శించారు. కరువు వల్ల పంట నష్టంపై సరైన అంచనాలే వేయలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన కరువు బృందం రాత్రి పూట టార్చ్‌లైట్ వెలుగులో రాయచోటి తదితర ప్రాంతాల్లో మొక్కుబడిగా పర్యటించిందన్నారు. ధాన్యం సేకరణ విధానాన్ని మార్చటంతో రైతులు కనీస మద్దతు ధర కన్నా రూ. 100 నుంచి రూ. 150 తక్కువ ధరకు మార్కెట్లో విక్రయిస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. రైతులకు 5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని టీడీపీ తుంగలోకి తొక్కిందని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా బాధ్యత బీజేపీ, టీడీపీలదే విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాల్సిన బాధ్యత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీదేనని మైసూరా పేర్కొన్నారు. ఒత్తిడి చేసి సాధించాల్సిన బాధ్యత టీడీపీపై ఉందన్నారు. రాజ్యసభలో విభజన బిల్లుపై చర్చ జరిగినపుడు తాము అధికారంలోకి రాగానే ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ నేతలు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. భూకంపంతో తీవ్రంగా నష్టపోయిన నేపాల్‌ను ఆదుకోవాలని పార్టీ తరపున కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మైసూరా చెప్పారు. అక్కడ చిక్కుకుపోయిన తెలుగు వారిని సురక్షితంగా తేవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు. -
తెలంగాణ సాకుతో ఏపీలో పన్ను వేసే పథకం
బాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి మండిపాటు ఎంట్రీ ట్యాక్స్‌పై కోర్టుకెందుకు వెళ్లలేదని నిలదీత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేసిందని సాకు చూపి.. ఆంధ్రప్రదేశ్‌లోనూ రవాణా వాహనాలపై ఎంట్రీ ట్యాక్స్ వేయాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ అంశంపై కనీసం కోర్టును ఆశ్రయించలేదని వైఎస్సార్సీపీ తప్పుపట్టింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 15ను సవాలు చేస్తూ కొందరు వాహనాల యజమానులు, ప్రైవేట్ ఆపరేటర్లు కోర్టుకు వెళ్లారేగానీ.. ఇప్పటివరకు ఆ జీవోను ఏపీ ప్రభుత్వం కోర్టులో ఛాలెంజ్ చేయలేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎద్దులు పోట్లాడితే దూడ కాళ్లు విరిగాయన్న చందంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తెలుగు ప్రజలు అల్లాడుతున్నారు. ఇద్దరూ వారు చెప్పిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించడానికి లేనిపోని వివాదాలు ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉన్నారు. కానీ ప్రజలపై బాదుడు కార్యక్రమాన్ని మాత్రం ఇద్దరూ మాట్లాడుకునే చేస్తారు. రెండు ప్రభుత్వాలూ ఒకేరోజు పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ పెంచాయి. ఒకట్రెండు రోజుల తేడాతో విద్యుత్ చార్జీలను పెంచాయి. దీంట్లో మాత్రం తగాదాలు లేవు. చూస్తే ఇద్దరూ మాట్లాడుకునే పన్నులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏ చిన్నసాకు దొరికినా ప్రజలపై పన్ను బాదుడు మానడం లేదు. రవాణా వాహనాలపై వేస్తున్న ఎంట్రీ ట్యాక్స్ ఇలాంటిదే’’ అని దుయ్యబట్టారు. అడ్డుకునేందుకు ఏ ప్రయత్నం చేయలేదు.. ఎంట్రీ ట్యాక్స్‌ను అడ్డుకునేందుకు అనేక అవకాశాలున్నప్పుటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరి నిమిషం వరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని మైసూరారెడ్డి విమర్శించారు. ‘‘విభజన చట్టంలో సెక్షన్ 72 ప్రకారం.. రెండు రాష్ట్రాల మధ్య ఎంట్రీ ట్యాక్స్‌కు అవకాశం లేదు.. కానీ రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ జారీ చేసిన జీవో ప్రకారం ఈ ఏడాది మార్చి 31 తరువాత రెండు ప్రభుత్వాలు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, గడువు ముగిసేవరకు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణతో ఎలాంటి చర్చలకు చొరవ చూపలేదు’’ అని ఆయన ధ్వజమెత్తారు. ఏపీ మంత్రులు గవర్నర్ వద్దకు వెళ్లి ఆర్జీ పెట్టెలో వినతులు వేస్తున్నారని.. కానీ ఆయన రెండు రాష్ట్రాల్లోని దేవాలయాలకు ముత్యాలు తీసుకుపోవడం తప్ప అంతకుమించి చేస్తున్నది ఏమీ కనిపించట్లేదని మైసూరా విమర్శించారు. అందరి ఇటుకలతో ఏం కడతారట! ప్రజలనుంచి విరాళాలుగా ఇటుకలు సేకరించి చంద్రబాబు సింగపూర్ తరహా రాజధాని ఏం కట్టగలరని మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. విలేకరులడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘అందరి ఇటుకలు తెచ్చి కడితే.. సింగపూర్ రాజధాని ఏం కడతారట ఆయన. నేను పరిపాలన దక్షుడిని. నేనే ఈ రాష్ట్రాన్ని గటెక్కిస్తానన్న వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కేంద్రం సాయం చేయట్లేదంటున్నారు. కేంద్రం సాయం చేస్తే నీ పాలనా దక్షత ఏంటీ? ఉన్న సంసారం పొదుపుగా చేసి గట్టెక్కిస్తే మంచిగా సంసారం చేసినట్టు. అంతేగానీ ఎవరో డబ్బిస్తే నేను సంసారాన్ని బాగా చేస్తానంటూ.. రోజూ లగ్జరీ హోటళ్లలో తిరగడం చందంగా చంద్రబాబు తీరు ఉంది’’ అని చమత్కరించారు. -
పోలవరంపై ఆర్డినెన్స్ ఇవ్వడంలో తప్పులేదు: మైసూరారెడ్డి
పోలవరంపై ఆర్డినెన్స్ ఇవ్వడంలో తప్పులేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి. మైసూరారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లో మైసూరారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... గతంలో జూరాల ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ఇలాంటి సమస్యే ఉత్పన్నమైందని... అయితే ఇప్పటికీ జూరాలా ప్రాజెక్టు ముంపు బాధితులకు నష్టపరిహారం అందలేదని ఆయన పేర్కొన్నారు. ఆర్డినెన్స్ ద్వారా కలుపుతున్న పోలవరం ముంపు గ్రామాలు గతంలో ఆంధ్రాలోనివని మైసూరారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పోలవరం ముంపు ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలపకుంటే బాధితులకు నష్టపరిహారం మంజూరు చేసే సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. పోలవరం ముంపు గ్రామాలు ఆంధ్రప్రదేశ్‌లో విలీనంపై టీఆర్ఎస్ గురువారం బంద్ పిలుపు నిచ్చిన నేపథ్యంలో మైసూరారెడ్డి స్పందించారు.బంద్ అంశం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారమన్నారు. తెలంగాణ ప్రజలను సంతృప్తిపరచడానికి బంద్ చేస్తున్నట్లున్నారని మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు. -
విజయమే లక్ష్యం
సాక్షి, రాజమండ్రి :మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా అవిశ్రాంతంగా కృషి చేయాలని మాజీ ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా పరిశీలకుడు ఎంవీ మైసూరారెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కలిసి నిట్టనిలువుగా చీల్చి, ప్రజల మనోభావాల్సి దెబ్బ తీశాయన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీల నైజాన్ని ఎండగట్టాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యకర్తలను, నేతలను కార్యోన్ముఖులను చేసేందుకు ఆయన గురువారం రాజమండ్రి ఉమారామలింగేశ్వరస్వామి కల్యాణ మంటపంలో జిల్లా నేతలతో సమావేశమయ్యారు. ప్రధానంగా ఎన్నికలు జరగనున్న రాజమండ్రి, అమలాపురం, తుని, మండపేట, సామర్లకోట, పెద్దాపురం, రామచంద్రపురం, పిఠాపురం మున్సిపాలిటీలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం, ముమ్మిడివరం నగర పంచాయతీల పరిధిలోని ముఖ్యనేతలు, కో ఆర్డినేటర్లతో విడివిడిగా భేటీ అయి, ఆయా ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను సేకరించారు. పార్టీని విజయపథాన నడిపించేందుకు అవలంబించాల్సిన వ్యూహాలపై మైసూరారెడ్డి స్థానిక నేతలతో చర్చించారు. సాయంత్రం నాలుగు గంటలకు రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలోని నేతలతో సమావేశమయ్యారు. నగర అధ్యక్షుడు బొమ్మన రాజ్‌కుమార్ నగరంలో పార్టీ పరిస్థితిని మైసూరాకు వివరించారు. మేయర్ స్థానంతో పాటు మెజారిటీ డివిజన్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని మైసూరా ఆకాంక్షించారు. ప్రజల్లో పార్టీకి మంచి ఆదరణ ఉందని, దాన్ని సంపూర్తిగా అనుకూలంగా మలచుకోవడంలో నేతలు సఫలం కావాలని సూచించారు. మైసూరాతో సమావేశమైనవారిలో ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, బొడ్డు భాస్కరరామారావు, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు కుడుపూడి చిట్టబ్బాయి, సీఈసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి పి.కె.రావు, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ మంత్రి సంగిత వెంకటరెడ్డి, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి, జిల్లా విభాగాల కన్వీనర్లు కర్రి పాపారాయుడు, శెట్టిబత్తుల రాజబాబు, గుత్తుల రమణ, నయీం భాయి, గారపాటి ఆనంద్, గెడ్డం రమణ, రావూరి వెంకటేశ్వర్లు, కాకినాడ నగర అధ్యక్షులు ఫ్రూటీకుమార్, కో ఆర్డినేటర్లు గిరజాల వెంకటస్వామి నాయుడు, వరుపుల సుబ్బారావు, పెండెం దొరబాబు, చెల్లుబోయిన వేణు, కొండేటి చిట్టిబాబు, మిండగుదిటి మోహన్, దాడిశెట్టి రాజా, ఆకుల వీర్రాజు, తోట సుబ్బారావు నాయుడు, ఇతర నాయకులు జక్కంపూడి రాజా, విప్పర్తి వేణుగోపాల్, ఆదిరెడ్డి వాసు తదితరులు ఉన్నారు. -
రాజ్యసభ ఎన్నికలకు మేం దూరం : మైసూరారెడ్డి
అభ్యర్థిని గెలిపించుకునేంత బలం లేదు టీడీపీ, కాంగ్రెస్ మాదిరి కుమ్మక్కు రాజకీయాలు చేయలేం: మైసూరారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో దింపి గెలిపించుకునేంత సంఖ్యా బలం లేనందున పోటీ చేయడం లేదని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ఈ ఎన్నికల్లో మరెవరి బలం మీదనో ఆధారపడి అభ్యర్థిని నిలబెట్టడం అంటే - అది కుమ్మక్కు రాజకీయాల్లో భాగం మాత్రమే అని వైఎస్సార్సీపీ అభిప్రాయపడుతోంది. అలాంటి రాజకీయాలను విభజనకు అనుకూలంగా ఉన్న మూడు పార్టీలు చేస్తున్నాయి. శాసనసభ ఎన్నికల తర్వాత రాజ్యసభ ఎన్నికలు జరిగితే తమకు ఆ మూడు సీట్లు కూడా రావని కాంగ్రెస్, తమకు ఆ రెండు సీట్లు కూడా రావని తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఒక అభిప్రాయానికి వచ్చి ఈ ఎన్నికల ప్రక్రియను ముందుకు జరిపేలా ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చాయి. నిజానికి టీడీపీకి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థుల్ని గెలిపించుకునే సంఖ్యా బలం లేకపోయినా.. కాంగ్రెస్ సభ్యుల మద్దతు మీద ఆధారపడి అభ్యర్థిని నిలబెడుతోంది. ఇది కుమ్మక్కు రాజకీయానికి నిదర్శనం కాదా? విభజనపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికలను ఒక పథకం ప్రకారం వాడుకుంటోంది’’ అని అన్నారు. -
రాష్ట్రానికి గొడ్డలిపెట్టు: మైసూరారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కృష్ణాజలాల పంపిణీపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టులాంటిదని, తీర్పునిచ్చిన రోజు రాష్ట్రానికి ఒక దుర్దినమని వైఎస్సార్ సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారంనాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, ట్రిబ్యునల్ తీర్పును తీవ్రంగా తప్పు పట్టారు. తక్షణమే దీనిపై సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకురావాలని లేకుంటే రాష్ట్ర ప్రజలకు తీరని నష్టం కలుగుతుందన్నారు. ఇదే ట్రిబ్యునల్ గతంలో ఇచ్చిన తాత్కాలిక తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆంధ్రప్రదేశ్ లేవనెత్తిన అంశాలను పరిశీలించాలని ఆదేశించినా ట్రిబ్యునల్ తుది తీర్పులో అన్యాయాన్ని ఏ మాత్రం సరిదిద్దలేదని మైసూరారెడ్డి ఆరోపించారు. ఒక నదిలో నీటి లభ్యతను 75 శాతం తీసుకుంటారని, బ్రిజేశ్ ట్రిబ్యునల్ మాత్రం 65 శాతమే తీసుకుందన్నారు.ట్రిబ్యునల్ తాజా తీర్పు వల్ల ఎగువ రాష్ట్రాలు నీటినంతా వాడుకున్నాక దిగువ రాష్ట్రానికి వచ్చేది ఏమీ ఉండవన్నారు. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు అరకొరగా మాత్రమే నీరు వస్తున్నాయన్నారు. కృష్ణలో కర్ణాటకకు 171, మహారాష్ట్రకు 81 టీఎంసీల నీటిని ట్రిబ్యునల్ అదనంగా కేటాయించాక ఇక మన రాష్ట్రానికి అదనంగా నీరు ఎక్కడినుంచి లభిస్తుందని ఆయన ప్రశ్నించారు.నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులే ఎండిపోయే ప్రమాదం ఉంది కనుక ఇక మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన వాటికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రానికి అదనంగా నాలుగైదు టీఎంసీల నీరే దక్కిందని చెప్పారు. మిగులు జలాలు తమకు అక్కర లేదని దివంగత వైఎస్ లేఖ రాసినందువల్లనే ఇలాంటి తీర్పు వచ్చిందని టీడీపీ చేసిన విమర్శలను ఆయన కొట్టి పారేశారు. రాష్ట్ర ప్రయోజనాలకు హాని జరుగుతున్నపుడు అందరూ కలిసి పోరాడాల్సిన సమయంలో బురద జల్లడం సరికాదన్నారు. వైఎస్ లేఖ రాసిన సందర్భం వేరని ఈ అంశంపై ఆయన బతికి ఉండగానే అసెంబ్లీలో చర్చకు వస్తే సవివరమైన సమాధానం ఇచ్చారని మైసూరా గుర్తు చేశారు. జల యజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులను తక్షణం నిలిపి వేయాలని కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేసినప్పుడు వైఎస్ మిగులుజలాల వాడకానికి సంబంధించి గతంలో బచావత్ 6సి కింద పొందుపర్చిన సారాం శాన్నే తెలియజేస్తూ లేఖను రాశారన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నీటిని కేటాయించాలని కూడా కోరారన్నారు. టీడీపీ వారు పూర్వాపరాలు తెలియకుండా ‘ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయండి’ అన్న చందంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బ్రిజేశ్ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంటే ప్రధాన ప్రతిపక్షంగా దానిని విమర్శించకుండా ఇలా మాట్లాడటం తగదన్నారు. చంద్రబాబు హయాంలో ఎగువ రాష్ట్రాలు నిర్మించిన అల్మట్టి లాంటి అక్రమ ప్రాజెక్టులను ఇపుడు బ్రిజేశ్ ట్రిబ్యునల్ క్రమబద్ధం చేసిందన్నారు. బాబు పాలనలో ఎగువ రాష్ట్రాలు అక్రమ కట్టడాలు కడుతుంటే నిర్లక్ష్యం వహించారని, కృష్ణా ఆయకట్టు రైతులను ఇక మెట్టపంటల వైపు మళ్లించాలని బాబు చెప్పారని మైసూరా గుర్తు చేశారు. వీటికి సంబంధించి బాబు అనుకూల పత్రికలో వచ్చిన అప్పటి వార్తల క్లిప్పింగ్‌లను ఆయన ప్రదర్శించారు. టీడీపీ హయాంలో వేసిన రాజారావు కమిటీ కృష్ణాలో 268 టీఎంసీల మిగులు జలాలున్నాయని నివేదిక ఇచ్చిందని ఇదే ఎగువ రాష్ట్రాల వాదనలకు ప్రాతిపదిక అయిందని మైసూరా విమర్శించారు. ఆ నివేదిక రూపొందించిన చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగించారని ధ్వజమెత్తారు.