రాజ్యసభ ఎన్నికలకు మేం దూరం : మైసూరారెడ్డి
అభ్యర్థిని గెలిపించుకునేంత బలం లేదు
టీడీపీ, కాంగ్రెస్ మాదిరి కుమ్మక్కు
రాజకీయాలు చేయలేం: మైసూరారెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థిని బరిలో దింపి గెలిపించుకునేంత సంఖ్యా బలం లేనందున పోటీ చేయడం లేదని ఆ పార్టీ సీజీసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘ఈ ఎన్నికల్లో మరెవరి బలం మీదనో ఆధారపడి అభ్యర్థిని నిలబెట్టడం అంటే - అది కుమ్మక్కు రాజకీయాల్లో భాగం మాత్రమే అని వైఎస్సార్‌సీపీ అభిప్రాయపడుతోంది. అలాంటి రాజకీయాలను విభజనకు అనుకూలంగా ఉన్న మూడు పార్టీలు చేస్తున్నాయి.
శాసనసభ ఎన్నికల తర్వాత రాజ్యసభ ఎన్నికలు జరిగితే తమకు ఆ మూడు సీట్లు కూడా రావని కాంగ్రెస్, తమకు ఆ రెండు సీట్లు కూడా రావని తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఒక అభిప్రాయానికి వచ్చి ఈ ఎన్నికల ప్రక్రియను ముందుకు జరిపేలా ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తెచ్చాయి. నిజానికి టీడీపీకి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థుల్ని గెలిపించుకునే సంఖ్యా బలం లేకపోయినా.. కాంగ్రెస్ సభ్యుల మద్దతు మీద ఆధారపడి అభ్యర్థిని నిలబెడుతోంది. ఇది కుమ్మక్కు రాజకీయానికి నిదర్శనం కాదా? విభజనపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే అధికార కాంగ్రెస్ ఈ ఎన్నికలను ఒక పథకం ప్రకారం వాడుకుంటోంది’’ అని అన్నారు.