పోలవరంపై ఆర్డినెన్స్ ఇవ్వడంలో తప్పులేదు: మైసూరారెడ్డి
పోలవరంపై ఆర్డినెన్స్ ఇవ్వడంలో తప్పులేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి. మైసూరారెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్లో మైసూరారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... గతంలో జూరాల ప్రాజెక్టు నిర్మాణంలో కూడా ఇలాంటి సమస్యే ఉత్పన్నమైందని... అయితే ఇప్పటికీ జూరాలా ప్రాజెక్టు ముంపు బాధితులకు నష్టపరిహారం అందలేదని ఆయన పేర్కొన్నారు. ఆర్డినెన్స్ ద్వారా కలుపుతున్న పోలవరం ముంపు గ్రామాలు గతంలో ఆంధ్రాలోనివని మైసూరారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పోలవరం ముంపు ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో కలపకుంటే బాధితులకు నష్టపరిహారం మంజూరు చేసే సమయంలో పలు ఇబ్బందులు
ఎదురవుతాయని తెలిపారు. పోలవరం ముంపు గ్రామాలు ఆంధ్రప్రదేశ్లో విలీనంపై టీఆర్ఎస్ గురువారం బంద్ పిలుపు నిచ్చిన నేపథ్యంలో మైసూరారెడ్డి స్పందించారు.బంద్ అంశం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారమన్నారు. తెలంగాణ ప్రజలను సంతృప్తిపరచడానికి బంద్ చేస్తున్నట్లున్నారని మైసూరారెడ్డి అభిప్రాయపడ్డారు.