తెలంగాణ సాకుతో ఏపీలో పన్ను వేసే పథకం | Under the pretext of Telangana in Andhra taxing scheme | Sakshi
Sakshi News home page

తెలంగాణ సాకుతో ఏపీలో పన్ను వేసే పథకం

Published Sat, Apr 4 2015 12:59 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

తెలంగాణ సాకుతో ఏపీలో పన్ను వేసే పథకం - Sakshi

తెలంగాణ సాకుతో ఏపీలో పన్ను వేసే పథకం

  • బాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నేత మైసూరారెడ్డి మండిపాటు
  • ఎంట్రీ ట్యాక్స్‌పై కోర్టుకెందుకు వెళ్లలేదని నిలదీత
  • సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేసిందని సాకు చూపి.. ఆంధ్రప్రదేశ్‌లోనూ రవాణా వాహనాలపై ఎంట్రీ ట్యాక్స్ వేయాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ అంశంపై కనీసం కోర్టును ఆశ్రయించలేదని వైఎస్సార్‌సీపీ తప్పుపట్టింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 15ను సవాలు చేస్తూ కొందరు వాహనాల యజమానులు, ప్రైవేట్ ఆపరేటర్లు కోర్టుకు వెళ్లారేగానీ.. ఇప్పటివరకు ఆ జీవోను ఏపీ ప్రభుత్వం కోర్టులో ఛాలెంజ్ చేయలేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి విమర్శించారు.

    శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎద్దులు పోట్లాడితే దూడ కాళ్లు విరిగాయన్న చందంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తెలుగు ప్రజలు అల్లాడుతున్నారు. ఇద్దరూ వారు చెప్పిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించడానికి లేనిపోని వివాదాలు ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉన్నారు. కానీ ప్రజలపై బాదుడు కార్యక్రమాన్ని మాత్రం ఇద్దరూ మాట్లాడుకునే చేస్తారు. రెండు ప్రభుత్వాలూ ఒకేరోజు పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ పెంచాయి. ఒకట్రెండు రోజుల తేడాతో విద్యుత్ చార్జీలను పెంచాయి. దీంట్లో మాత్రం తగాదాలు లేవు. చూస్తే ఇద్దరూ మాట్లాడుకునే పన్నులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏ చిన్నసాకు దొరికినా ప్రజలపై పన్ను బాదుడు మానడం లేదు. రవాణా వాహనాలపై వేస్తున్న ఎంట్రీ ట్యాక్స్ ఇలాంటిదే’’ అని  దుయ్యబట్టారు.
     
    అడ్డుకునేందుకు ఏ ప్రయత్నం చేయలేదు..

    ఎంట్రీ ట్యాక్స్‌ను అడ్డుకునేందుకు అనేక అవకాశాలున్నప్పుటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరి నిమిషం వరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని మైసూరారెడ్డి విమర్శించారు. ‘‘విభజన చట్టంలో సెక్షన్ 72 ప్రకారం.. రెండు రాష్ట్రాల మధ్య ఎంట్రీ ట్యాక్స్‌కు అవకాశం లేదు.. కానీ రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ జారీ చేసిన జీవో ప్రకారం ఈ ఏడాది మార్చి 31 తరువాత రెండు ప్రభుత్వాలు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, గడువు ముగిసేవరకు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణతో ఎలాంటి చర్చలకు చొరవ చూపలేదు’’ అని ఆయన ధ్వజమెత్తారు. ఏపీ మంత్రులు గవర్నర్ వద్దకు వెళ్లి ఆర్జీ పెట్టెలో వినతులు వేస్తున్నారని.. కానీ ఆయన రెండు రాష్ట్రాల్లోని దేవాలయాలకు ముత్యాలు తీసుకుపోవడం తప్ప అంతకుమించి చేస్తున్నది ఏమీ కనిపించట్లేదని మైసూరా విమర్శించారు.
     
    అందరి ఇటుకలతో ఏం కడతారట!

    ప్రజలనుంచి విరాళాలుగా ఇటుకలు సేకరించి చంద్రబాబు సింగపూర్ తరహా రాజధాని ఏం కట్టగలరని మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. విలేకరులడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘అందరి ఇటుకలు తెచ్చి కడితే.. సింగపూర్ రాజధాని ఏం కడతారట ఆయన. నేను పరిపాలన దక్షుడిని. నేనే ఈ రాష్ట్రాన్ని గటెక్కిస్తానన్న వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కేంద్రం సాయం చేయట్లేదంటున్నారు. కేంద్రం సాయం చేస్తే నీ పాలనా దక్షత ఏంటీ? ఉన్న సంసారం పొదుపుగా చేసి గట్టెక్కిస్తే మంచిగా సంసారం చేసినట్టు. అంతేగానీ ఎవరో డబ్బిస్తే నేను సంసారాన్ని బాగా చేస్తానంటూ.. రోజూ లగ్జరీ హోటళ్లలో తిరగడం చందంగా చంద్రబాబు తీరు ఉంది’’ అని చమత్కరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement