entry tax
-
నటుడు విజయ్‌కి హైకోర్టులో ఊరట
Vijay Moves HC Against Entry Tax on BMW Car: నటుడు విజయ్‌కి మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. విజయ్ విదేశాల నుంచి ఖరీదైన కారును కొనుగోలుచేశారు. దీనికి ఎంట్రీ ట్యాక్స్ చెల్లించకపోవడంతో వాణిజ్య పన్నుల శాఖ హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్‌ను విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎంట్రీట్యాక్స్ చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేస్తూ నటులు ఇలా పన్ను ఎగవేతకు పాల్పడడం సమంజసం కాదంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో విజయ్ ఎంట్రీట్యాక్స్ చెల్లించారు. అయితే ప్రత్యేకన్యాయమూర్తి తనపై వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను రద్దు చేయాలంటూ విజయ్ కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ శుక్రవారం జరిగింది. ప్రత్యేక న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా న్యాయస్తానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. చదవండి: (మరో బాంబు పేల్చిన చైనా.. ఆ వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి) -
అంతర్రాష్ట్ర పర్మిట్ల విధానం కొలిక్కి!
♦ తెలంగాణ, ఆంధ్ర నడుమ ఎంట్రీ ట్యాక్స్ త్వరలో ఎత్తివేత ♦ ఈ చర్యతో ఏపీకే అధిక ఆదాయం సాక్షి, హైదరాబాద్: గతేడాది ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నడుమ తలెత్తిన ఎంట్రీ ట్యాక్స్ విధానం త్వరలో సమసిపోనుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర పర్మిట్ల విధానం ఓ కొలిక్కి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నుంచే ఎంట్రీ ట్యాక్స్ విధానం ఎత్తేయాలని ప్రతిపాదనలు రావడంతో ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఏపీ రవాణా శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఏప్రిల్ 1 నుంచి ఇరు రాష్ట్రాల్లో ఈ విధానం రద్దు కానున్నట్లు సమాచారం. ఇరు వైపుల నుంచి వచ్చే రవాణా వాహనాలు, సరుకుల వాహనాలు విధిగా ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాలని గతేడాది ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత గవర్నర్ సమక్షంలో రెండు రాష్ట్రాల్లో 2015 మార్చి 31 వరకు రవాణా, సరుకుల వాహనాలపై పన్ను విధించకుండా గతంలో నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ ట్యాక్స్ ఖచ్చితంగా విధించాల్సిందేనని పట్టుబట్టింది. ఏపీ సర్కారు మాత్రం ఉమ్మడి రాజధానిగా ఉన్నంతవరకు ఆంధ్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్ చెల్లించేది లేదని అప్పట్లో తేల్చి చెప్పింది. దీనిపై గవర్నర్, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసింది. కేంద్రం జోక్యం చేసుకోమని తేల్చి చెప్పడంతో విధి లేక గతేడాది ఏప్రిల్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఎంట్రీ పన్ను విధించాయి. ఎంట్రీ ట్యాక్స్‌తో ఏపీకే ఆదాయం ఈ ఎంట్రీ పన్నుతో ఆంధ్ర కంటే తెలంగాణకు ఎక్కువ ఆదాయం వస్తుందని తెలంగాణ సర్కారు భావించింది. రవాణా రంగంలో ఏపీది 60 శాతం వాటాగా ఉండటమే ఇందుకు కారణమని ఆలోచించింది. తెలంగాణ ఆలోచనలకు విరుద్ధంగా ఏపీకే ఆదాయం ఎక్కువగా ఉందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణకు నెలకు ఎంట్రీ ట్యాక్స్‌తో రూ.కోటి ఆదాయం వస్తుంటే, ఏపీకి రూ.5 కోట్లుగా ఉందని రవాణా వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీ బస్సులకు మాత్రం ఈ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంది. విభజన జరగనందున ట్యాక్స్ వసూలు చేసే వెసులు బాటు లేదు. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ నుంచి గ్రానైట్, నల్గొండ నుంచి సిమెంటు, ఇతర సరుకుల వాహనాలు ఏపీకి అధికంగా రావడంతో ఏపీ ఆదాయం పెరిగిందంటున్నారు. కరీంనగర్ నుంచి గ్రానైట్ లారీలు నిత్యం కాకినాడ పోర్టుకు వెళతాయి. పైగా ఏపీలోని తిరుపతి, విజయవాడ, ఇతర పుణ్యక్షేత్రాలకు టూరిస్టు వాహనాల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఎంట్రీ ట్యాక్స్ ఆదాయం ఎక్కువగా ఉందంటున్నారు. దీంతో తెలంగాణ ఈ ట్యాక్స్ ఎత్తివేతకు చొరవ చూపినట్లు అధికారులు వెల్లడించారు. -
అక్రమార్కుల భరతం పడతాం
ఎంట్రీ ట్యాక్స్ ఎగ్గొట్టి తిరుగుతున్న తెలంగాణ వాహనాలపై చర్యలు : ఎస్పీ చింతలపూడి : ప్రవేశ పన్ను కట్టకుండా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తున్న అక్రమ వాహనాలపై కొరడా ఝుళిపించడానికి జిల్లా ఎస్పీ భరత్ భూషణ్ సిద్ధమయ్యారు. ‘ఎంట్రీ ట్యాక్స్ ఎగ్గొట్టి ఏపీలోకి’ శీర్షికన శనివారం ‘సాక్షి’ దినపత్రిలో వచ్చిన కథనానికి ఎస్పీ తీవ్రంగా స్పందించారు. ఏపీలోకి వచ్చే గ్రానైట్ వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామనిహెచ్చరించారు. ట్యాక్స్ కట్టకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఉపేక్షించేది లేదన్నారు. ఏపీ చెక్ పోస్ట్‌లో ట్యాక్స్ కట్టకుండా దొడ్డి దారిన రాష్ట్రంలోకి వస్తున్న వాహనాలపై ఇక నుంచి నిఘా పెడతామన్నారు. ఏఏ రూట్లలో ఈ వాహనాలు దారి మళ్లిస్తున్నారో విచారణ జరుపుతామన్నారు. అవసరం అయినచోట కొత్త చెక్ పోస్టులు ఏర్పాటు చేసేలా సంబంధిత రవాణా శాఖ, మైనింగ్ శాఖ అధికారులతో సంప్రదిస్తానని చెప్పారు. తెలంగాణ నుంచి వస్తున్న భారీ గ్రానైట్ వాహనాల నుంచి ఎంట్రీ ట్యాక్స్ కట్టించాల్సిన బాధ్యత రవాణా శాఖదేనన్నారు. పోలీస్ అధికారులతో పాటు మిగిలిన డిపార్ట్మెంట్లతో సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ నుంచి వచ్చే వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయడంలో తీసుకోవలసిన చర్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎంట్రీ ట్యాక్స్ కట్టించడానికి అవసరమైతే రవాణా శాఖ అధికారులకు పోలీసులు కూడా సహకరించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. -
ఎంట్రీ ట్యాక్స్ రగడ
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే సరుకు రవాణా వాహనాలు, ప్రయాణికులను చేరవేసే క్యాబ్‌లు, ప్రైవేటు బస్సుల నుంచి ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయాలని విభజన తర్వాత తెలంగాణ సర్కారు భావించింది. అయితే అప్పట్లో గవర్నర్ జోక్యంతో ఈ నిర్ణయం మార్చి వరకు వాయిదా పడింది. ఈ ఏడాది మార్చి నెల చివర్లో.. ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు, తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. తమ ప్రతిపాదనను విరమించుకునేందుకు తెలంగాణ సర్కారు అంగీకరించలేదు. మార్చి 31న జీవో జారీ చేసింది. ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైంది. పదేళ్లు ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే ఎంట్రీ ట్యాక్స్ ఎలా విధిస్తారంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో తామేమీ చేయలేమని, రెండు ప్రభుత్వాలే తేల్చుకోవాలంటూ కేంద్ర మంత్రులు గడ్కారీ, నిర్మలా సీతారామన్ సూచించారు. ఈలోగా ఏపీ లారీ అసోసియేషన్, ప్రైవేటు యజమానుల సంఘం హైకోర్టుకు వెళ్లాయి. కోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడం, సుప్రీంకోర్టులో కూడా అనుకూల తీర్పు రాకపోవడంతో ఏప్రిల్ 1 నుంచి ఏపీ నుంచి వచ్చే రవాణా వాహనాలపై తెలంగాణ సర్కారు ఎంట్రీ ట్యాక్స్ వసూలు చే స్తోంది. ఏపీలోని 32 లక్షల లారీలు, 800 ప్రైవేటు బస్సులు ఎంట్రీ ట్యాక్స్ చెల్లించక తప్పని పరిస్థితి నెలకొంది. చివరకు ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వాహనాలపై ఏప్రిల్ రెండో వారం తర్వాత ట్యాక్స్ వసూలు చేస్తోంది. మూడు నెలలకు వసూలు చేసే ఈ ఎంట్రీ ట్యాక్స్‌తో తెలంగాణకు రూ.30 కోట్లు, ఏపీకి రూ.20 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. -
ఎంట్రీ ట్యాక్స్ ఎగ్గొట్టి ఏపీలోకి..
చింతలపూడి : తెలంగాణ రాష్ట్రానికి వెళ్లే ఆంధ్రా రవాణా వాహనాలపై అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఎంట్రీ ట్యాక్స్ విధిస్తూ.. ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. తెలంగాణ నుంచి మన రాష్ట్రంలోకి వచ్చే వాహనదారులు మాత్రం ఎంట్రీ ట్యాక్స్ చెల్లించకుండానే దొడ్డిదారిన దర్జాగా వెళ్లిపోతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రా నుంచి తెలంగాణ వైపు వెళ్లే వాహనాల నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 1నుంచి ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కూడా ఏప్రిల్ 24 నుంచి తెలంగాణ నుంచి వచ్చే రవాణా వాహనాలపై పన్ను విధించింది. రాజమండ్రి-హైదరాబాద్ హైవేపై ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వద్ద తెలంగాణ రవాణా శాఖ చెక్‌పోస్ట్ ఏర్పాటు చేయగా.. ఏపీ ప్రభుత్వం మన జిల్లాలోని జీలుగుమిల్లి వద్ద చెక్‌పోస్ట్ నెలకొల్పింది. ఏపీలోకి వచ్చే తెలంగాణ వాహనాల నుంచి ఎంట్రీ ట్యాక్స్ రూపంలో మన రాష్ట్రానికి నెలకు రూ.5 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే, ఆ మేరకు రావడం లేదు. కారణం ఏమిటని ఆరా తీస్తే.. తెలంగాణ రాష్ట్రం నుంచి నిత్యం వందలాదిగా భారీ ట్రాలీ లారీలు గ్రానైట్ రాళ్లతో దొడ్డిదారిన మన రాష్ట్రంలోని కృష్ణపట్నం, కాకినాడ పోర్టులకు వెళ్తున్నాయి. ఈ వాహనాలను చెక్‌పోస్ట్ ఉన్న జీలుగుమిల్లి మీదుగా కాకుండా ఖమ్మం జిల్లా గంగారం నుంచి చింతల పూడి మండలం రాఘవాపురం మీదుగా భీమడోలు మండలం పూళ్ల చేరుకుంటున్నాయి. అక్కడి నుంచి విజయవాడ-కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రయాణించి గమ్యస్థానాలకు వెళుతున్నాయి. అదేవిధంగా మేడిశెట్టివారిపాలెం అడ్డరోడ్డు నుంచి యర్రగుంటపల్లి, మక్కినవారిగూడెం, లక్ష్మీపురం మీదుగా రాజమండ్రి వైపు హైవేపై ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల మన రాష్ట్రానికి ఎంట్రీ ట్యాక్స్ రూపంలో రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. మరోవైపు తెలంగాణ నుంచి వచ్చే భారీ వాహనాలు దొడ్డిదారిన ప్రయాణించడం వల్ల గ్రామీణ రహదారులు ఛిద్రమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు ఏ దశలోనూ వీటిని తనిఖీ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రవాణా శాఖ అధికారులు తరచూ తని ఖీలు నిర్వహించి దొడ్డిదారిన వెళ్తున్న వాహనదారుల నుంచి ట్యాక్స్ వసూ లు చేస్తే ఎంట్రీ ట్యాక్స్ ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం తెలంగాణ సరిహద్దుల్లో మరిన్ని చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. -
ధరల మోత
ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు కందిపప్పు కిలోపై రూ. 20-30లు పెంపు మినప్పప్పు ధర ఏకంగా రూ.130 బావురుమంటున్న బడుగుజీవి మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయి. నిన్న మొన్నటి వరకు తక్కువగా ఉన్న ధరలు ఒక్కసారిగా చుక్కలు చూపిస్తున్నాయి. ఒకవైపు పెరిగిన డీజిల్ ధరలు, మరో వైపు రెండు రాష్ట్రాల్లోని ఎంట్రీ ట్యాక్స్, ఇంకో వైపు వ్యాట్ పన్ను వెరసి సరుకుల ధరలు వినియోగదారుని వీపు విమానం మోత మోగిస్తున్నాయి. సాధారణ జనం ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదని ఆందోళన చెందుతున్నారు. కడప అగ్రికల్చర్ : సాధారణంగా ప్రతి ఇంట్లో కందిపప్పు, మినపప్పు, శనగ, వేరుశనగ పప్పులు, పప్పులు తప్పక వినియోగిస్తారు. వారం క్రితం మినపప్పు(ఉద్దిపప్పు) కిలో రూ. 80 ఉండగా నేడు అది రూ. 130కి చేరింది. అలాగే కందిపప్పు రకాలు కిలో రూ. 80-100 ఉండగా ఇప్పుడు రూ. 100-120 ధర పలుకుతున్నాయి. వేరుశనగ పప్పు కిలో రూ. 56లు ఉండగా నేడు రూ. 80, శనగ బేడలు కిలో రూ.45 ఉండగా ఇప్పుడు వాటి ధర కిలో రూ. 60 పలుకుతున్నాయి. పప్పులు కిలో రూ. 45 ఉండగా ఇప్పుడు కిలో రూ. 60ల ధర ఉంటోంది. ఎండు మిరపకాయలు కిలో రూ. 80 ఉండేవి, ఇప్పుడు కాస్త కిలో రూ.110కి చేరింది. తెల్లగడ్డలు కిలో రూ.40 నుంచి రూ. 60, చింతపండు కిలో రూ. 55 నుంచి రూ. 78లకు చేరుకుంది. ధరలు ఇలా పెరగడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా చంద్రబాబు పాలన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వస్తే అన్ని రకాల నిత్యావసర ధరలు అదుపులో ఉంటాయని ఎన్నికల సందర్భంలో ప్రచారంతో హోరెత్తించారు. అధికారం చేపట్టినప్పటి నుంచి అన్ని రకాల పన్నులు విధించి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు. అప్పట్లో 9 రకాల నిత్యావసర వస్తువులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ ప్రజలకు సబ్సిడీపై అందించేది. దాని వల్ల ప్రతి కుటుంబానికి కనీసం నెలకు రూ. 170ల వరకు భారం తగ్గేది. కానీ నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో తగ్గడం మాట అటుంచి మార్కెట్లో ఉన్న ధరల్లో కూడా ఒక్కో సరుకు ధర రూ. 120-130ల వరకు పెరిగాయి. ప్రస్తుతం వినియోగదారునిపై భారం అమాంతంగా పడుతోంది. -
తెలంగాణ వాహనాలపై ఏపీ పన్ను
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలకు పన్ను విధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శుక్రవారం నిర్ణయించింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఈ ఆదేశాలు అమలుకానున్నాయి. ఏపీలో ప్రవేశించే ఇతర రాష్ట్రాల వాహనాల వలే తెలంగాణ నుంచి వచ్చే రవాణ వాహనాలపై పన్ను వసూలు చేస్తారు. తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవేశించే అన్ని చెక్‌పోస్టుల వద్ద ఈ విధానం అమలుకానుంది. అందుకు సంబంధించిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ప్రతి 3 నెలలకు ఓ సారి ఏపీ ప్రభుత్వం పన్ను వసూలు చేయనుంది. ఈ పన్ను వసూలు ద్వారా ఏడాదికి సుమారు రూ. 50 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇప్పటికే ఏపీ నుంచి వచ్చే వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం పన్ను వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఎంట్రీ ట్యాక్స్ కట్టాల్సిందే: హైకోర్టు
-
ఎంట్రీ ట్యాక్స్ కట్టాల్సిందే..
హైదరాబాద్ : అంతర్ రాష్ట్ర రవాణా పన్ను విధానంపై హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వాహనదారులు ప్రవేశపన్నును కట్టాల్సిందేని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయితే రవాణా కమిషనర్ పేరుతో బ్యాంకు ఖాతా తెరిచి ఆ ట్యాక్స్‌ను వాహన యజమానులు అకౌంట్లో జమ చేయాలని సూచించింది. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వాహనదారులకు మాత్రమే ఈ తీర్పు వర్తిస్తుంది. మరోవైపు ప్రవేశ పన్ను (ఎంట్రీ ట్యాక్స్) పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాఖు వచ్చే వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్‌ను వసూలు చేయటంపై 280మంది వాహనదారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
నగరానికి ఇసుక జ్వరం!
⇒ తాజా పరిణామాలతో ముంచుకొస్తున్న కొరత ⇒ రాష్ర్ట అవసరాలకు ఏపీ ఇసుకే దిక్కు ⇒ అక్కడా ఎంట్రీ ట్యాక్స్ విధిస్తే ధర రెట్టింపయ్యే అవకాశం ⇒ ఏపీ రాజధాని నిర్మాణం మొదలైతే రవాణా నిలిచే ప్రమాదం ⇒ తీవ్ర ఇసుక కొరత ఏర్పడవచ్చని పరిశ్రమ వర్గాల ఆందోళన ⇒ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించిన రాష్ర్ట ప్రభుత్వం ⇒ నల్లగొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్ నుంచి రవాణాకు ఏర్పాట్లు.. హైదరాబాద్ శివార్లలో 3 ఇసుక డంప్‌లు రాక్శాండ్కు పరిశ్రమ హోదా ఇవ్వాలని యోచన ⇒ గనుల శాఖను సమగ్ర నివేదిక కోరిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ‘ఇసుక’ ముప్పు ముంచుకొస్తోంది! నిర్మాణ రంగానికి మూలాధారమైన ఇసుక లేకపోతే పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయే ప్రమాదముంటుంది. ఇది రాష్ర్ట ప్రగతి చక్రానికి ప్రతిబంధకం కానుంది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే సమీప భవిష్యత్తులో గడ్డు పరిస్థితి తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ర్ట ఇసుక అవసరాలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచే తీరుతున్నాయి. అయితే అక్కడ కొత్త రాజధాని నిర్మాణం మొదలైతే తెలంగాణకు ఇసుక రవాణా ఆగిపోయే అవకాశముంది. అలాగే ఏపీ సర్కారు కూడా ప్రవేశ సుంకాన్ని(ఎంట్రీ ట్యాక్స్) విధిస్తే ఇసుక ధర అమాంతం పెరుగుతుంది. భవిష్యత్తులో రాష్ర్టంలో తీవ్ర ఇసుక కొరత తలెత్తే ప్రమాదముందని నిర్మాణ రంగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పరిస్థితిని గమనించిన ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఇసుక కొరత రాకుండా చర్యలకు సిద్ధమైంది. దీనికి అనుగుణంగా గతంలో ప్రకటించిన ఇసుక విధానానికి కొన్ని సవరణలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర నివేదిక ఇవ్వాలని గనుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్లు తెలిసింది. ధరలు పెరగకుండా చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంట్రీ ట్యాక్స్ విధిస్తే రాష్ర్టంలో ఇసుక ధర రెట్టింపవుతుంది. ఇప్పటికే అన్ని ఖర్చులు కలిపి టన్నుకు రూ.1200 నుంచి రూ.1400 వసూలు చేస్తున్నారు. ప్రవేశ పన్ను కూడా మొదలైతే ఈ ధర రూ. 2000 వరకు చేరే అవకాశముంది. దీంతో సాధారణ జనానికి ఇసుక అందుబాటులో లేకుండా పోతోంది. అపార్టుమెంట్ల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఈ దృష్ట్యా ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ‘స్థానికంగా ఇసుక రిచ్‌లు ఏర్పాటు చేసుకోవడమొక్కటే ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. ఇందుకోసం కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలను ఇటీవల పరిశీలించాం. పర్యావరణానికి ఇబ్బందులు లేకుండా హైదరాబాద్‌తో పాటు అన్ని పట్టణాలకు ఇసుక సరఫరాపై ఆలోచన చేస్తున్నాం’ అని గనుల శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. భారీగా ఇసుక సేకరణకు నిర్ణయం నల్లగొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో కృష్ణా, గోదావరి, మంజీరా నదుల నుంచి భారీగా ఇసుకను సేకరించాలని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్ఎండీసీ) సమాయత్తమవుతోంది. ప్రస్తుత అవసరాల మేరకు రాష్ట్రంలో రోజుకు లక్ష టన్నుల ఇసుక అవసరమవుతుందని అంచనా. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే రోజుకు 45 నుంచి 50 వేల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటోంది. ముందుగా ఈ జిల్లాల అవసరాలకు ఇసుకను అందుబాటులో ఉంచగలిగితే కొరతను అరికట్టవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం నల్లగొండ, కరీనంగర్, మహబూబ్‌నగర్ నుంచి తెచ్చే ఇసుకతో హైదరాబాద్ శివార్లలో 3 ప్రత్యేక డంప్‌యార్డులను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. మహబూబ్‌నగర్ నుంచి వచ్చే ఇసుకను ఆరాంఘర్ దగ్గర, కరీంనగర్, మెదక్ నుంచి సేకరించే ఇసుకను కొంపల్లి పరిసరాల్లో, నల్లగొండ నుంచి తెచ్చే ఇసుకను హయత్‌నగర్‌లో నిల్వ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇసుక క్వారీ నుంచి వినియోగదారునికి చేర్చే వరకు అయ్యే మొత్తం వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని ధరను నిర్ణయించనుంది. నాణ్యతను బట్టి టన్ను ఇసుకకు రూ.600 నుంచి రూ.750 దాకా ఉండొచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇసుక రవాణాకు బహిరంగ టెండర్లను పిలవాలని ఆ సంస్థ భావిస్తోంది. మరో వారం, పది రోజుల్లో దీనికి సంబంధించిన విధాన నిర్ణయాలు వెలువడనున్నాయి. హైదరాబాద్‌లోనే అత్యధిక వినియోగం రాష్ర్ట ఇసుక అవసరాల్లో అత్యధిక శాతం హైదరాబాద్‌లోనే వినియోగమవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, కర్నూలు నుంచే తెలంగాణ ప్రాంతానికి భారీగా ఇసుక రవాణా జరుగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం మొదలైతే అక్కడి నుంచి ఇసుక రాకపోవచ్చునని భవన నిర్మాణ సంస్థలు రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. అలాగే హైదరాబాద్‌లోని డిమాండ్ దృష్ట్యా ఇప్పటికే ఇసుక మాఫియా విజృంభిస్తోంది. ఎప్పటికప్పుడు ధరలు పెంచడం, తూకాల్లో మోసాలు చేయడం వంటి అక్రమాలకు పాల్పడుతోంది. ఏపీ నుంచి ఇసుక రవాణా తగ్గిపోవచ్చునన్న భావనతో నగర శివార్లలో వ్యాపారులు తమ నిల్వలను పెంచుకుంటున్నారు. నల్లగొండ జిల్లా తుప్రాన్‌పేట, మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాపూర్ ప్రాంతాల్లో అక్రమ నిల్వలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుకను బహిరంగంగా అందుబాటులో ఉంచితే తప్ప వీరి ఆగడాలకు కళ్లెం వేయలేమని సర్కారు భావిస్తోంది. రాక్శాండ్కు ప్రోత్సాహం కేవలం ఇసుకతోనే అన్ని అవసరాలను తీర్చడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రకృతి వనరులను పూర్తిగా వినియోగిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని, ప్రత్యామ్నాయంగా రాక్‌శాండ్(రాతి ఇసుక) వినియోగాన్ని ప్రోత్సహించాలని అనుకుంటోంది. ప్రభుత్వ నిర్మాణాల్లో రాక్శాండ్ను వినియోగించాలని ఇప్పటికే ఆదేశాలున్నాయి. రాక్‌శాండ్ ఉత్పత్తిని పెంచడానికి కూడా సర్కారు చర్యలు తీసుకుంటోంది. దీనికి పరిశ్రమ హోదాను కల్పించాలని నిర్ణయించింది. ఈ ఉత్తర్వులు కూడా త్వరలోనే వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
నేనేం చేస్తున్నది ప్రజలకు తెలుసు
తనను కలసిన ఏపీ కాంగ్రెస్ నేతలతో నరసింహన్ ఎంట్రీ ట్యాక్స్ ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు కాంగ్రెస్ నేతల వినతి సాక్షి, హైదరాబాద్: ‘‘నా గురించి బయట ఏవేవో మాట్లాడుతున్నారు.. నేనేం చేస్తున్నది ప్రజలకు బాగా తెలుసు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య ఏదైనా కావచ్చు. నా దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి నాకున్న అధికార పరిధిలో చేయాల్సింది చేస్తున్నాను.. ఏమి చేసిందీ నేను ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తెలుస్తుంది’’ అంటూ తనను కలసిన కాంగ్రెస్ నేతలతో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఒకింత అసహనంతో వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై రుసుం వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకొని దానిని ఉపసంహరించుకునేలా చూడాలంటూ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం గవర్నర్ ను కలసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సమయంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గవర్నర్‌తో మాట్లాడుతూ.. రుసుం వసూలుపై కోర్టు జోక్యం కంటే కూడా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించి ఉంటే బాగుండేదని అన్నారు. దీనిపై గవర్నర్ తీవ్రంగా స్పందిస్తూ పైవిధంగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. హైకోర్టుతో పాటు ఆర్బీఐ, నాబార్డు సహా పలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనే ఉన్నందున వాహనాలపై ప్రవేశ రుసుం విధించడం సరైన చర్య కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చట్టం ప్రకారం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని గవర్నర్‌ను కోరారు. అదేవిధంగా ఏపీలో తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా లక్షలాది మంది పేద కూలీలు వలసలు పోతున్నారని.. దానిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దాదాపు 5 వేల గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందని కాంగ్రెస్ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాలకు సరఫరా చేసే నీటి ట్యాంకర్లలో కూడా జన్మభూమి కమిటీల జోక్యం కారణంగా టీడీపీకి మద్దతివ్వని గ్రామాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. గవర్నర్‌ను కలసిన వారిలో కె.చిరంజీవి, పల్లంరాజు, మల్లాది విష్ణు, గిడుగు రుద్రరాజు, టీజేఆర్ సుధాకర్‌బాబు తదితరులు ఉన్నారు. -
రాబడి చక్రాలపై రయ్ రయ్
ఏపీఎస్ఆర్టీసీకి వరంగా మారిన ఎంట్రీ ట్యాక్స్ 30 శాతాన్ని దాటిన ఆక్యుపెన్సీ ప్రైవేటు బస్సుల జోరుకు కళ్లెం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విధించిన ఎంట్రీ ట్యాక్స్ (ప్రవేశ పన్ను)... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్సార్టీసీ)కి వరంగా మారింది. మూడు రోజులుగా రాబడి పెరిగింది. ఎంట్రీ ట్యాక్సుతో స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్న ప్రైవేటు బస్సుల జోరు కూడా తగ్గింది. దీంతో అత్యధికశాతం మంది ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు. ఈ కారణంగా ఆక్యుపెన్సీ రేటు 30 శాతాన్ని మించుతోంది. ఇదిలాగే కొనసాగితే ఏపీ నుంచి హైదరాబాద్‌కు ఆర్టీసీ నడిపే సూపర్ డీలక్స్, హైటెక్, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్, వెన్నెల బస్సుల వల్ల ఆర్టీసీ ఆదాయం రూ.కోటి దాటుతుందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదనపు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రతిరోజూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ... హైదరాబాద్ నగరానికి సుమారు 800 బస్సులను నడుపుతోంది. మరోవైపు అన్ని ప్రాంతాల నుంచి దాదాపు వెయ్యి బస్సులను ప్రైవేటు ఆపరేటర్లు నడుపుతున్నారు. గతంలో ప్రైవేటు బస్సులు పెద్దసంఖ్యలో ప్రమాదాలకు గురైనపుడు...ముఖ్యంగా షిర్టీ సమీపంలో ప్రమాదం జరిగిన సందర్భంలో నిబంధనలకు విరుద్ధంగా స్టేజి క్యారియర్లుగా తిప్పుతున్న ప్రైవేటు బస్సుల్ని రవాణా శాఖ అధికారులు కట్టడి చేశారు. దీంతో అప్పట్లో ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా పెరిగింది. మళ్లీ ప్రైవేటు బస్సులపై ఎంట్రీ ట్యాక్స్ ప్రభావం కారణంగా ఆ పరిస్థితి పునరావృతమైంది. నిబంధనలు గాలికి: ప్రైవేటు ఆపరేటర్లు నిబంధనలను పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టు క్యారియర్లుగా తిరగాల్సిన ప్రైవేటు బస్సులను ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకుంటూ స్టేజి క్యారియర్లుగా నడుపుతున్నారు. ప్రైవేటు ఆపరేటర్లలో ఎక్కువమంది టీడీపీ నేతలే ఉండడంతో రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారాన్ని కాగ్ తప్పు పట్టినా ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రైవేటు బస్సుల విషయమై రవాణా శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారిపైనా ఫిర్యాదులొచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనల మేరకు ప్రైవేటు బస్సులను నడుపుకునే అనుమతి ఇవ్వాలని, అప్పుడే ఆర్టీసీకి మనుగడ ఉంటుందని యూనియన్ నేతలు కోరుతున్నారు. -
ఎంట్రీ ట్యాక్స్‌పై న్యాయ పోరాటం: పరకాల
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపన్ను(ఎంట్రీ ట్యాక్స్) విధించటంపై న్యాయపోరాటం చేస్తామని ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ ప్రకటించారు. ఈ అంశంపై మంత్రివర్గంలో చర్చించి తెలంగాణ ప్రభుత్వానికి సందేశం పంపామన్నారు. పరకాల శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. పట్టిసీమ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శాసనసభలో వివరణ ఇచ్చాక కూడా ప్రతిపక్ష పార్టీ దుష్ర్పచారం సాగించడం మంచిది కాదన్నారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు ఇతర రాష్ట్రాలను ప్రభుత్వంపైకి ఉసిగొల్పుతున్నారని ఈ సందర్భంగా ప్రతిపక్షనేత నుద్దేశించి విమర్శించారు. -
తెలంగాణ సాకుతో ఏపీలో పన్ను వేసే పథకం
బాబు ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నేత మైసూరారెడ్డి మండిపాటు ఎంట్రీ ట్యాక్స్‌పై కోర్టుకెందుకు వెళ్లలేదని నిలదీత సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేసిందని సాకు చూపి.. ఆంధ్రప్రదేశ్‌లోనూ రవాణా వాహనాలపై ఎంట్రీ ట్యాక్స్ వేయాలన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఈ అంశంపై కనీసం కోర్టును ఆశ్రయించలేదని వైఎస్సార్సీపీ తప్పుపట్టింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 15ను సవాలు చేస్తూ కొందరు వాహనాల యజమానులు, ప్రైవేట్ ఆపరేటర్లు కోర్టుకు వెళ్లారేగానీ.. ఇప్పటివరకు ఆ జీవోను ఏపీ ప్రభుత్వం కోర్టులో ఛాలెంజ్ చేయలేదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎద్దులు పోట్లాడితే దూడ కాళ్లు విరిగాయన్న చందంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తెలుగు ప్రజలు అల్లాడుతున్నారు. ఇద్దరూ వారు చెప్పిన హామీలను నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించడానికి లేనిపోని వివాదాలు ఏదో ఒకటి సృష్టిస్తూనే ఉన్నారు. కానీ ప్రజలపై బాదుడు కార్యక్రమాన్ని మాత్రం ఇద్దరూ మాట్లాడుకునే చేస్తారు. రెండు ప్రభుత్వాలూ ఒకేరోజు పెట్రోలియం ఉత్పత్తులపై వ్యాట్ పెంచాయి. ఒకట్రెండు రోజుల తేడాతో విద్యుత్ చార్జీలను పెంచాయి. దీంట్లో మాత్రం తగాదాలు లేవు. చూస్తే ఇద్దరూ మాట్లాడుకునే పన్నులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏ చిన్నసాకు దొరికినా ప్రజలపై పన్ను బాదుడు మానడం లేదు. రవాణా వాహనాలపై వేస్తున్న ఎంట్రీ ట్యాక్స్ ఇలాంటిదే’’ అని దుయ్యబట్టారు. అడ్డుకునేందుకు ఏ ప్రయత్నం చేయలేదు.. ఎంట్రీ ట్యాక్స్‌ను అడ్డుకునేందుకు అనేక అవకాశాలున్నప్పుటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరి నిమిషం వరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని మైసూరారెడ్డి విమర్శించారు. ‘‘విభజన చట్టంలో సెక్షన్ 72 ప్రకారం.. రెండు రాష్ట్రాల మధ్య ఎంట్రీ ట్యాక్స్‌కు అవకాశం లేదు.. కానీ రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ జారీ చేసిన జీవో ప్రకారం ఈ ఏడాది మార్చి 31 తరువాత రెండు ప్రభుత్వాలు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా, గడువు ముగిసేవరకు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణతో ఎలాంటి చర్చలకు చొరవ చూపలేదు’’ అని ఆయన ధ్వజమెత్తారు. ఏపీ మంత్రులు గవర్నర్ వద్దకు వెళ్లి ఆర్జీ పెట్టెలో వినతులు వేస్తున్నారని.. కానీ ఆయన రెండు రాష్ట్రాల్లోని దేవాలయాలకు ముత్యాలు తీసుకుపోవడం తప్ప అంతకుమించి చేస్తున్నది ఏమీ కనిపించట్లేదని మైసూరా విమర్శించారు. అందరి ఇటుకలతో ఏం కడతారట! ప్రజలనుంచి విరాళాలుగా ఇటుకలు సేకరించి చంద్రబాబు సింగపూర్ తరహా రాజధాని ఏం కట్టగలరని మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. విలేకరులడిగిన ఓ ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ‘‘అందరి ఇటుకలు తెచ్చి కడితే.. సింగపూర్ రాజధాని ఏం కడతారట ఆయన. నేను పరిపాలన దక్షుడిని. నేనే ఈ రాష్ట్రాన్ని గటెక్కిస్తానన్న వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కేంద్రం సాయం చేయట్లేదంటున్నారు. కేంద్రం సాయం చేస్తే నీ పాలనా దక్షత ఏంటీ? ఉన్న సంసారం పొదుపుగా చేసి గట్టెక్కిస్తే మంచిగా సంసారం చేసినట్టు. అంతేగానీ ఎవరో డబ్బిస్తే నేను సంసారాన్ని బాగా చేస్తానంటూ.. రోజూ లగ్జరీ హోటళ్లలో తిరగడం చందంగా చంద్రబాబు తీరు ఉంది’’ అని చమత్కరించారు. -
భారం మోపడంలో ఎలాంటి వివాదాల్లేవ్..
-
భారం మోపడంలో ఎలాంటి వివాదాల్లేవ్..
హైదరాబాద్: ప్రజలపై భారం మోపడంలో తెలుగు రాష్ట్రాలు రెండూ ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని వైఎస్సార్సీపీ నేత ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రవేశ పన్ను వేసి ప్రజల నుంచి ఆదాయం పెంచుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. దీన్ని బట్టి చూస్తే ఏపీ సర్కారుకు ఎంత దురుద్దేశం ఉందో స్పష్టంగా తెలుస్తోందని మైసూరా అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ పై ఇచ్చిన జీవోను ఏపీ ప్రభుత్వం ఎందుకు కోర్టులో సవాల్ చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. ఇంటికి పెద్దన్నలా ఉండే కేంద్రం కూడా దీనిపై జోక్యం చేసుకోకపోవటం దారుణమన్నారు. రాష్ట్ర గవర్నర్ కూడా ఈ ఎంట్రీ పన్ను విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదన్నారు. గవర్నర్‌కు ఆలయాలు తిరగడానికే సమయం సరి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల వల్ల ప్రజలు అల్లాడుతున్నారు. ఎన్నో విషయాల్లో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. కానీ ప్రజలపై భారం మోపడంలో ఎలాంటి వివాదాలు లేకుండా ప్రభుత్వాలు పని చేస్తున్నాయని మైసూరారెడ్డి ఎద్దేవా చేశారు. -
మనమూ ప్రవేశపన్ను వేద్దామా?
మల్లగుల్లాలు పడుతున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు సాక్షి, హైదరాబాద్: ప్రవేశ పన్ను(ఎంట్రీ ట్యాక్స్) విషయంలో తెలంగాణ ప్రభుత్వ బాటలో నడిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది. అయితే తెలంగాణకు వచ్చే ఆదాయంతో పోలిస్తే ఏపీకి ఎంత ఆదా యం సమకూరుతుందనే అంశంపై రవాణాశాఖ ఆరా తీస్తోంది. తెలంగాణకు 3 నెలలకుగాను రూ.90 కోట్ల మేర ప్రవేశ పన్ను రూపం లో ఆదాయం సమకూరుతుందని అం చనా వేస్తుండగా, ఏపీకి ఎంతమేరకు ఆదా యం వస్తుందనే లెక్కల్లో రవాణా అధికారులు తల మునకలయ్యారు. తెలుగు రాష్ట్రాలు కలసి అభివృద్ధి సాధించాలని ప్రభుత్వ పెద్దలు ఓ వైపు చెబుతూ తెలంగాణ విధానాన్ని అనుసరించ డం కరెక్టు కాదని పలువురు చెబుతున్నారు. తెలంగాణపై గవర్నర్‌కు శిద్ధా ఫిర్యాదు ఇదిలా ఉండగా ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు గురువారం ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలసి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రవేశపన్ను విధానంపై ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గకుంటే తాము కూడా అమలు చేయాల్సి ఉంటుందని గవర్నర్‌కు సూత్రప్రాయంగా తెలిపారు. అనంతరం తనను కలసిన విలేకరులతో మంత్రి శిద్ధా మాట్లాడుతూ.. జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్‌కు వివరించానని, గవర్నర్ సమస్యను పరిష్కరించకుంటే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
మూడు చెక్‌పోస్టులు..రూ.54లక్షలు
నల్లగొండ అర్బన్ : వాడపల్లి, నల్లబటండగూడెం, నాగార్జునసాగర్.. మూడు చెక్‌పోస్టులు..మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం వరకు ఒకేరోజు రూ.54లక్షలు వసూలు.. ఇదీ..జిల్లాలో రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించే వాహనాల నుంచి వసూలు చేసిన ఎంట్రీ ట్యాక్స్. జీఓనంబర్ 15 ప్రకారం.. వాహన పన్ను వసూలును అధికారులు మొదలుపెట్టారు.ఉమ్మడి రాష్ట్రంలో చెల్లించిన పన్నులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తిరిగేందుకు మంగళవారం రాత్రి వరకే వెసులుబాటు ఉన్నది. గత జూన్ 1వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబరు 43 ప్రకారం ఇరు ప్రాంతాల్లో ఎక్కడా పన్ను చెల్లించినా 2015 మార్చి 31 వరకు ఉభయ రాష్ట్రాల్లో పర్యటించేందుకు అవకాశం కల్పించారు. ఆ గడువు పూర్తి కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జీఓను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం పొరుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రతి ట్రాన్స్‌పోర్టు వాహనం విధిగా పన్ను చెల్లించేలా ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. కాగా నూతన పన్ను విధానం అమలు కావడంతో పెద్ద సంఖ్యలో వాహనాలను జిల్లా సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే యజమానులు నిలిపివేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి దాదాపు 250 వాహనాలను తనిఖీ చేసి రూ. 54లక్షల పన్నులను రాబట్టారు. వీటిల్లో 33 ప్రైవేట్ ట్రావెల్స్, 30 మ్యాక్సీ క్యాబ్‌లు, 187 లారీలు, ఇతర వాహనాలున్నాయి. కాగా కోర్టుకు వెళ్లిన వారు మాత్రం సంబంధిత చెక్‌పోస్టులో విధిగా హామీపత్రం (బాండ్ )సమర్పించి తెలంగాణలో తిరిగేందుకు వెసులుబాటు కల్పించారు. వచ్చే మంగళవారానికి తదుపరి విచారణ వాయిదా పడింది. అయితే కోర్టుకు వెళ్లని వారు మాత్రం యథావిధిగా పన్ను చెల్లించాల్సిందే. పన్ను విధానం కొత్తకాదు - మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ ఒక రాష్ట్రం వాహనం మరో రాష్ట్రంలోకి ప్రవేశించినప్పుడు పన్ను చెల్లించడం కొత్తేమీకాదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా తదితర ప్రాంతాల వారు పొరుగు రాష్ట్రంలోకి వెళ్లినప్పుడు పన్ను చెల్లించిన పరిస్థితులు తెలిసిందే. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఏ రాష్ట్రం వారు ఆయా ప్రభుత్వాల నిర్ణయాల ప్రకారం పన్ను వసూళ్లు జరుపుతారు. దీని వల్ల ఓ ప్రాంతం వారికి లాభం, మరో ప్రాంతం వారికి నష్టం అంటూ ఉండదు. ఎక్కడైనా పన్ను చెల్లించాల్సిందే. -
ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయొద్దు.. వారం మాత్రమే...
హైదరాబాద్: ఏపీ ప్రైవేటు వాహన యజమానులకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎంట్రీ ట్యాక్స్ వారం పాటు వసూలు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చెక్ పోస్టుల వద్ద హామీ పత్రాలు ఇవ్వాలని సూచించింది. ఎంపీ కేశినేని నాని తదితరులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ధర్మాసనం ఈ ఆదేశాల్చింది. కోర్టును ఆశ్రయించిన వారు తప్ప మిగతా వారంతా ఎంట్రీ ట్యాక్స్ కట్టాల్సిందేనని న్యాయస్థానం పేర్కొంది. దీనిపై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. -
ఉమ్మడి రాజధానిలో ఎంట్రీ ట్యాక్స్ ఎందుకు?
హైదరాబాద్: ఏపీ వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం విధించిన ఎంట్రీ టాక్స్ పై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. జీవో 15ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగాలని విభజన చట్టంలో ఉన్నప్పుడు ప్రత్యేక పన్నులు ఎలా వసూలు చేస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ప్రవేశపన్ను మాత్రమే విధిస్తున్నామని, పర్మిట్ పన్నులు వసూలు చేయడం లేదని తెలంగాణ ప్రభుత్వం తరపు లాయర్ పేర్కొన్నారు. హైదరాబాద్ అనేది ఉమ్మడి రాజధాని మాత్రమేనని, కేంద్రపాలిత ప్రాంతం కాదన్నారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్ 72 వాహన పన్నుల విధింపుకు వెసులుబాటు కల్పిస్తోందని తెలిపారు. -
ట్యాక్స్‌పై కేసీఆర్ సర్కార్ ఆలోచించాలి
హైదరాబాద్ : ఏపీ వాహనాలపై ట్యాక్స్ విషయంలో పునరాలోచించాలని కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం హైదరాబాద్‌లో కొండా రాఘవరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకున్న ఇలాంటి నిర్ణయాలతో ప్రజలపై భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సర్కార్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటే ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చే ఏపీ వాహనాలకు పన్ను చెల్లించాలనే అంశంపై రెండు ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని కొండా రాఘవరెడ్డి సూచించారు. -
ప్రవేశ పన్ను తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనిది
-
ఎంట్రీ ట్యాక్స్ విధింపుపై హైకోర్టులో పిటిషన్లు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రైవేటు బస్సులకు తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ ట్యాక్స్ అమలు చేయటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో బుధవారం మూడు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరగనుంది. ఈ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన వారిలో ప్రయివేట్ ట్రావెల్స్ యజమానులు ఉన్నారు. -
ప్రవేశ పన్ను తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనిది: గడ్కరీ
హైదరాబాద్: ఏపీ వాహనాలపై పన్ను వేయడం అనేది తెలంగాణ రాష్ట్ర పరిధిలోనిదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. తెలంగాణ రవాణ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి గడ్కరీతో ఈ ఉదయం సమావేశమై ఆర్టీసి విభజనపై చర్చించారు. అనంతరం మంత్రులు ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు డ్రై పోర్టు కోసం కేంద్ర కృషి చేస్తుందని గడ్కరీ చెప్పారు. భారత్‌లో జల రవాణా మెరుగుపడటానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. నిబంధనల ప్రకారమే ఏపీ వాహనాలపై రోడ్ టాక్స్ విధించినట్లు మహేందర్ రెడ్డి చెప్పారు. ఏపీ అధికారుల వల్లే ఆలస్యమైందన్నారు. రాష్ట్రం విడిపోయినందువల్లే అక్కడి వాహనాలపై పన్ను విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
తెల్లవారేసరికి రూ.50 లక్షల ప్రవేశపన్ను వసూలు!
నల్లగొండ: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే అన్ని రకాల వాణిజ్య వాహనాల నుంచి మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పన్ను (ఎంట్రీ ట్యాక్స్) వసూలు చేయడం మొదలు పెట్టింది. కోదాడ, వాడపల్లి, నాగార్జున సాగర్ చెక్‌పోస్టులలో ఏపీ నుంచి వచ్చే వాహనాల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు 150 వాహనాల నుంచి 50 లక్షల రూపాయల పన్ను వసూలు చేశారు. అర్ధరాత్రి పన్నులు వసూలు చేస్తున్నారన్న విమర్శ సరైనది కాదని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. మూడు నెలల క్రితమే సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు. మూడు నెలల ఎంట్రీ ట్యాక్స్ చెల్లిస్తేనే ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు బస్సుల్ని అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఏపీలోని13 జిల్లాల్లో సుమారు 32 లక్షల లారీలు, 800కిపైగా ప్రైవేటు బస్సులు ఉన్నాయి. వీటిలో చాలావరకూ నిత్యం తెలంగాణ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. విజయవాడ నుంచి రోజుకు 300 వరకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు హైదరాబాద్‌కు వస్తున్నాయి. ఏపీ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే ప్రతి లారీ తాత్కాలిక పర్మిట్ (నెలకు) కింద సుమారు 6 వేల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. -
‘ఎంట్రీ ట్యాక్స్’ నా దృష్టికి రాలేదు: గవర్నర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదంగా మారిన వాహనాల ప్రవేశ పన్ను విషయం తన దృష్టికి రాలేదని గవర్నర్ నరసింహన్ చెప్పారు. రాష్ట్రానికి తిరిగివెళ్లాక దానిపై సమీక్షిస్తానని మీడియాకు చెప్పారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై నివేదికలు అందజేశారు. విభజన చట్టంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివాదాస్పద అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అంతకు ముందు కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎల్.సి.గోయల్‌తో కూడా నరసింహన్ రెండు గంటల పాటు భేటీ అయ్యారు. -
కేసీఆర్.. ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి
ఏపీ నుంచి వచ్చే వాహనాలపై పన్ను విధించటం సరికాదు: వై.ఎస్.జగన్ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై పన్ను విధించాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని.. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు పెరిగేలా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కోరారు. పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ విప్ వై.వి.సుబ్బారెడ్డి, ఎంపీలు వెలగపల్లి వరప్రసాద్‌రావు, పి.వి.మిథున్‌రెడ్డి, వై.ఎస్.అవినాశ్‌రెడ్డిలతో కలసి వై.ఎస్.జగన్ మంగళవారం సాయంత్రం ఆర్థికమంత్రి జైట్లీని ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో ఆయన కార్యాలయంలో కలిశారు. విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలను అమలుచేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన నిర్మించేందుకు వీలుగా భారీగా నిధులు కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అమలుచే సి రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం నాడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అందించిన 8 పేజీల వినతిపత్రాన్ని జైట్లీకి కూడా అందించారు. అనంతరం జగన్మోహన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘నిన్న (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చెప్పిన అంశాలను అరుణ్‌జైట్లీకి కూడా నివేదించాం. రాష్ట్రానికి మంచి చేయాలని కోరాం. ఆయన సానుకూలంగా విన్నారు. మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం...’’ అని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నారు... ‘పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నిధుల దుర్వినియోగంపై ఏమైనా చెప్పారా?’ అని మీడియా ప్రతినిధి ఒకరు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘పట్టిసీమ గురించి ఆర్థికమంత్రికి కూడా చెప్పాం. 21.9 శాతం ఎక్సెస్‌కు కోట్ చేయడం, టెండర్లు వేసిన తరువాత ఎక్సెస్‌ను బోనస్‌గా మార్చడం, టెండరు పిలవకముందు బోనస్ అనే క్లాజ్ లేకపోవడం, కోట్ చేసిన తరువాత ఎక్సెస్‌లో 16.9 శాతం బోనస్‌గా ప్రకటించడం వంటి అంశాలన్నీ తెలియజేశాం. గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోని నిబంధనలు ఏవిధంగా ప్రభావితం చేయనున్నాయో వివరించాం...’’ అని పేర్కొన్నారు. ‘గోదావరి ప్రజలు పట్టిసీమ వద్దని అంటున్నారు. వారిని కూడగడతారా?’ అని మరో విలేకరి అడిగిన ప్రశ్నకు.. ‘‘మేం పట్టిసీమపై మొదటి నుంచీ స్పష్టంగా ఉన్నాం. జరుగుతున్నది అన్యాయం. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం కాగానే.. గోదావరి ట్రిబ్యునల్ అవార్డులోని 7(ఇ) క్లాజ్ ప్రకారం 35 టీఎంసీల నీళ్లు వెళ్లిపోతాయి. ఇప్పుడు పట్టిసీమ పనులు మొదలుపెట్టగానే 7(ఎఫ్) క్లాజ్ వల్ల మరో 35 టీఎంసీలు వెళ్లిపోతాయేమోనన్న భయం మాలో చాలా ఎక్కువగా ఉంది. ప్రాజెక్టులు మొదలుపెట్టగానే.. కృష్ణాకు వచ్చే 70 టీఎంసీల నీళ్లు దూరమవుతాయేమోనన్న భయం ఉంది. ఎటువంటి స్టోరేజీ కెపాసిటీ నిర్మాణం లేకుండా కేవలం డబ్బులు సంపాదించుకోవాలన్న ఒకే ఒక్క కారణంతో ఈమాదిరిగా రాష్ట్రాన్ని పణంగా పెట్టడం తప్పు అని స్పష్టంగా చెప్తున్నాం. కాబట్టి దీనిని ప్రతి వేదికపైనా కచ్చితంగా వ్యతిరేకిస్తాం...’’ అని బదులిచ్చారు. కేసీఆర్ ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి... తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వాహనాలపై పన్ను విధించడాన్ని ఎలా చూస్తారని ఇంకో విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా ‘‘పక్క రాష్ట్రాలు కర్ణాటక, తమిళనాడు చేయనప్పుడు.. ఒకే భాష మాట్లాడుకుంటున్న మనం చేయడమన్నది సరికాదని మేం మొదటి నుంచీ చెప్తున్నాం. ఒకే భాష మాట్లాడుతాం. మనుషులమంతా కలిసే ఉంటాం. మనం మనం పెరగాలనే చూడాలి తప్ప.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే కరెక్టు.. కేసీఆర్ కూడా ఈ నిర్ణయాన్ని వెనక్కితీసుకుని ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలు పెంచాలి...’’ అని జగన్ స్పందించారు. జైట్లీకి వినతిపత్రం సారాంశమిదీ... ూ విభజన తర్వాత ఏపీకి ఐదేళ్ల పాటు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వర్తింపజేస్తామన్న నాటి ప్రధాని హామీని సత్వరం నెరవేర్చాలి. ఇచ్చిన హామీ మేరకు ఏపీ వాస్తవిక రెవెన్యూ లోటును రీయింబర్స్ చేయాలి. ూ ప్రకాశం జిల్లా వంటి తక్కువ తలసరి ఆదాయమున్న ఇతర జిల్లాలకూ ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిచేయాలి. ఆచరణ సాధ్యం కాని పట్టిసీమ ప్రాజెక్టును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి. రాష్ట్ర రాజధాని నిర్మాణానికి డీగ్రేడెడ్ అటవీ భూములను డీనోటిఫై చేస్తానని విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గుంటూరు జిల్లాలో వేలాది ఎకరాల డీగ్రేడెడ్ అటవీ భూములు ఉన్నా.. బహుళ పంటలు సాగయ్యే 30 వేల ఎకరాలను భూములను భూ సమీకరణ పేరుతో సేకరించటాన్ని రైతులతో పాటు, ప్రతిపక్షంగా మేమూ వ్యతిరేకిస్తున్నాం. కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం 2015-16 బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదు. రాష్ట్ర రాజధాని కోసం భారీ మొత్తంలో నిధులు కేటాయించాలి. హిమాచల్‌ప్రదేశ్ , ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు పారిశ్రామిక వృద్ధి కోసం ఇచ్చిన పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను ఆంధ్రప్రదేశ్‌కూ ప్రకటించాలి. పన్ను ప్రోత్సాహకాలను మొత్తం రాష్ట్రానికి వర్తించేలా ప్రకటించాలి. కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖల్లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, విశాఖ, తిరుపతి, విజయవాడలోని విమానాశ్రయాలను అంతర్జాతీయస్థాయికి అభివృద్ధి చేయడం, విశాఖ, విజయవాడ మెట్రో రైలు వసతి ఏర్పాటుచేయడం, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, చిత్తూరు జిల్లాలో ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్ మన్నవరం ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయాలి. రెండు రాష్ట్రాల్లో ఏర్పాటుచేయాల్సిన విద్యాసంస్థలు, వైద్య సంస్థలకు ఇతోధికంగా నిధులు కేటాయించి సత్వర నిర్మాణం జరిగేలా చర్యలు తీసుకోవాలి. సీమాంధ్రకు కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, తదితర రైల్వే రంగ హామీలన్నీ నెరవేర్చాలి. ూ విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలన్నింటినీ త్వరగా నెరవేర్చాలి. ప్రాణహిత - చేవెళ్ల, దుమ్మగూడెం - నాగార్జునసాగర్ ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా ప్రకటించాలి. తెలంగాణ నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి. జగ్గంపేట, విశాఖకు నేడు జగన్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటకు ఆయన వెళతారు. అక్కడ ఆయన వైఎస్సార్సీ శాసనసభాపక్షం ఉప నేత జ్యోతుల నెహ్రూ సోదరుడి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. నెహ్రూ సోదరుడు ఇటీవల మృతి చెందిన విషయం విదితమే. అక్కడ పరామర్శించిన తరువాత జగన్మోహన్రెడ్డి విశాఖపట్నానికి బయల్దేరి వెళతారు. గోకులపాడులో జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబీకులను జగన్ ఓదారుస్తారు. -
ఏపీ వాహనాలపై పన్ను వద్దు: కేసీఆర్‌కు వైఎస్ జగన్ వినతి
హైదరాబాద్: ఏపీ వాహనాలపై తెలంగాణ ప్రభుత్వం ఈ అర్ధరాత్రి నుంచి పన్ను విధించనున్నట్లు తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఏపీ వాహనాలపై పన్ను విధించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని కోరనున్నట్లు తెలిపారు. ''రాష్ట్రాలు విడిపోయినా మనది ఒకే భాష.మనం అందరం కలిసే ఉంటాం. రెండు రాష్ట్రాలూ ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకోకూడదు'' అని వైఎస్ జగన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే అన్ని రకాల వాణిజ్య వాహనాల నుంచి ప్రవేశ పన్ను (ఎంట్రీ ట్యాక్స్) వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ రాష్ట్రంలో త్రైమాసిక పన్ను చెల్లించినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలో తిరిగేందుకు ఉన్న వెసులుబాటు మార్చి 31తో ముగుస్తోంది. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ప్రస్తుత విధానాన్ని కనీసం మరో ఐదేళ్లైనా కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం చేసిన విన్నపాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఏపీలోని ప్రైవేట్ బస్సుల యజమానులు ఈ అర్ధరాత్రి నుంచి తెలంగాణకు వచ్చే బస్సులను ఆపివేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశం ముగిసిన అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. రాష్ట్రాల మధ్య పన్నుపై పునరాలోచన చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని కోరుతున్నట్లు తెలిపారు. ఏపీ వాహనాలపై పన్నును ఉపసంహరించుకోవాలని కేసీఆర్‌ని కోరతామని చెప్పారు. -
ఏపీ వాహనాలకు తెలంగాణ పన్ను
రేపటి నుంచే అమలు; ఉత్తర్వు జారీ ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలన్న ఆంధ్రప్రదేశ్ అభ్యర్థన తిరస్కృతి త్రైమాసిక పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే అన్ని రకాల వాణిజ్య వాహనాల నుంచి ప్రవేశ పన్ను (ఎంట్రీ ట్యాక్స్) వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ రాష్ట్రంలో త్రైమాసిక పన్ను చెల్లించినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలో తిరిగేందుకు ఉన్న వెసులుబాటు మార్చి 31తో ముగుస్తోంది. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ప్రస్తుత విధానాన్ని కనీసం మరో ఐదేళ్లైనా కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం చేసిన విన్నపాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. ప్రస్తుత విధానాన్ని కనీసం రెండేళ్లపాటు కొనసాగించాలంటూ తెలంగాణ లారీ యజమానుల సంఘం కూడా కోరినా పట్టించుకోని ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వచ్చే వాణిజ్య వాహనాల నుంచి త్రైమాసిక పన్ను వసూలు చేయనున్నట్లు పేర్కొంటూ సోమవారం ఉత్తర్వు జారీ చేసింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే దీన్ని అమలు చేసేందుకు నిర్ణయించి ఉత్తర్వు జారీ చేసింది. కానీ ఏక పన్ను విధానం 2015 మార్చి 31 వరకు కొనసాగుతుందంటూ రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ ఆదేశించటంతో దాన్ని అమలు చేయాలంటూ లారీ యజమానుల సంఘంతోపాటు మరికొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా వారి వాదనను సమర్థిస్తూ మధ్యంతర ఉత్తర్వు జారీ చేయటంతో ఆ ఉత్తర్వును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. మార్చి 31 గడువు తీరుతున్న నేపథ్యంలో పన్ను వసూలుకు నిర్ణయించి తాజా ఉత్తర్వు జారీ చేసింది. వేటికి వర్తిస్తుంది..? ప్రయాణికులను చేరవేసే కాంట్రాక్టు క్యారేజి వాహనాలు, సరుకు రవాణా వాహనాలు, మోటార్ క్యాబ్స్, మాక్సి క్యాబ్స్, వాణిజ్యపరమైన ట్రాక్టర్ ట్రైలర్లు, ఆటోరిక్షాలు... ఇలా అన్ని రకాల వాణిజ్య వాహనాలు ఇక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులు కూడా దీని పరిధిలోకి వస్తాయి. అయితే వాటి సీట్ల సంఖ్య, వస్తున్న ఆదాయం తదితరాల ఆధారంగా వాటి పన్ను మొత్తాన్ని నిర్ధారిస్తారు. ఇందుకు ప్రత్యేక సూత్రీకరణ అమలులో ఉంది. దీని ప్రకారం సంవత్సరానికి ఒకేసారి ఆర్టీసీ ఈ మొత్తాన్ని చెల్లిస్తుంది. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీలో ఇది అమలులో ఉన్నందున యథాతథంగా దీన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులకు అమలు చేస్తారా లేదా అనేది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తదిపరి చేసుకునే ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీ రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగానే ఉన్నందున దీని విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రెండేళ్లపాటు కొనసాగించకుంటే సమ్మెకు సై... ప్రస్తుతం అమలులో ఉన్న ఏక పన్ను విధానాన్ని కనీసం మరో రెండేళ్లపాటైనా అమలు చేయాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కొత్త విధానంలో ప్రతి వాహనం రాష్ట్రం దాటి వెళ్తే వారానికి రూ. 1,800 మేర చెల్లించి తాత్కాలిక పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుందని, అదే జరిగితే నిత్యావసరాల రవాణా భారమై అంతిమంగా ప్రజలపై ధరల ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మలకు వినతిపత్రం అందజేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకోని పక్షంలో సమ్మె చేయటానికి కూడా వెనకాడబోమని హెచ్చరించినట్లు సంఘం ప్రతినిధి భాస్కర్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. ఆదాయం దాదాపు రూ. 50 కోట్లు-75 కోట్లు... అఖిల భారత పర్మిట్ ఉన్న బస్సుల్లో ఒక్కో సీటుకు ప్రతి మూడు నెలలకు రూ. 3,625 చొప్పున, రాష్ట్ర పర్మిట్ ఉన్న బస్సుల్లో ఒక్కో సీటుకు రూ. 2,500, రెండు జిల్లాల పర్మిట్‌కు రూ. 1,200, ఒక్క జిల్లా పర్మిట్‌కు రూ. 950 చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి నిత్యం దాదాపు 600 వరకు ప్రైవేటు బస్సులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 200కు మించి బస్సులు వెళ్లటం లేదు. అలాగే 25 టన్నుల సామర్థ్యమున్న సరుకు రవాణా లారీలు దాదాపు ఐదు వేల వరకున్నాయి. మినీ లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాలు మరో 4 వేల వరకు ఉన్నాయి. ఇవి అంధ్రప్రదేశ్-హైదరాబాద్ మధ్య తిరుగుతుంటాయి. ఒక్క బస్సుల ద్వారానే రూ. 25 కోట్ల వరకు ఆదాయం వస్తుందని, అన్నీ కలుపుకుంటే రూ. 50 కోట్ల నుంచి రూ.75 కోట్ల వరకు ఆదాయం ఉంటుందని తెలంగాణ రవాణాశాఖ అంచనా వేస్తోంది. కొత్త విధానంతో అదనంగా ఇంతమేర ఆదాయం సమకూరనుండటంతో ప్రస్తుత విధానాన్ని కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంత సుముఖంగా లేదు. -
ఏప్రిల్ 1 నుంచి ఇరు రాష్ట్రాలలో ఎంట్రీ ట్యాక్స్
హైదరాబాద్ : ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వాహనాలకు ఎంట్రీ పన్ను విధించనున్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చే రవాణా, సరుకుల వాహనాలపై విధిగా ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఈ మేరకు ఇదివరకే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత గవర్నర్ సమక్షంలో మార్చి 31వ తేదీ వరకు రెండు రాష్ట్రాల్లో రవాణా, సరుకుల వాహనాలపై పన్ను విధించకుండా ఉండాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. గడువు ముగియడంతో రెండు రాష్ట్రాలు కలిసి కూర్చుని మాట్లాడుకునేందుకు ప్రయత్నించగా వీలుపడలేదని సమాచారం. ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు, తెలంగాణా మంత్రి మహేందర్‌రెడ్డిలు ఓ దఫా సమావేశమై ఈ సమస్యపై చర్చించారు. ఇదే సమయంలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు కోర్టును ఆశ్రయించారు. విషయం కోర్టు పరిధిలో ఉందని తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి చర్చలు జరిపేందుకు విముఖత చూపారు. ఉమ్మడి రాజధానిగా ఉన్నంతవరకు ఎంట్రీ ట్యాక్స్ విధించడానికి వీల్లేదన్న ఏపీ వాదనలు తెలంగాణ పట్టించుకోలేదు. దీంతో ఏప్రిల్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఎంట్రీ పన్ను విధించనున్నాయి. ఈ ఎంట్రీ పన్నుతో ఆంధ్ర కంటే తెలంగాణకు మూడు నెలలకు అదనంగా రూ.30 కోట్లు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. రవాణా రంగంలో ఏపీది 60 శాతం వాటాగా ఉండటమే ఇందుకు కారణం. ఇందులో ముఖ్యంగా స్టేజి క్యారియర్లుగా ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రైవేటు బస్సులపై పన్ను భారం పడనుంది. దీంతో ప్రైవేటు బస్సు ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రైవేటు ఆపరేటర్లు ఏప్రిల్ 1తర్వాత బుక్ చేసుకునే టిక్కెట్లపై ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులకు మాత్రం ఈ ఎంట్రీ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంది. ఆర్టీసీ విభజన జరగనందున ట్యాక్స్ వసూలు చేసే వెసులుబాటు లేదు. కాగా తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ నుంచి గ్రానైట్ లారీలు అనునిత్యం కాకినాడ పోర్టుకు వెళతాయి. నల్గొండ నుంచి సిమెంటు, ఇతర ప్రాంతాల నుండి సరుకుల వాహనాలు ఏపీకి వస్తాయని, సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద ఎంట్రీ ట్యాక్స్ విధించక తప్పదని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంట్రీ ట్యాక్స్ విధించడం వల్ల మూడు నెలలకు చెల్లించే క్వార్టర్లీ పన్ను కొంత వరకు తగ్గించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ ఎంట్రీ ట్యాక్స్ వసూలుపై ఏపీ రవాణా శాఖ అధికారులు నోరు మెదపడం లేదు. ఉన్నత స్థాయిలో తీసుకునే ఈ నిర్ణయంపై తాము మాట్లాడబోమని నిరాకరించడం గమనార్హం.