
ఎంట్రీ ట్యాక్స్ రగడ
ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చే సరుకు రవాణా వాహనాలు, ప్రయాణికులను చేరవేసే క్యాబ్‌లు, ప్రైవేటు బస్సుల నుంచి ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేయాలని విభజన తర్వాత తెలంగాణ సర్కారు భావించింది. అయితే అప్పట్లో గవర్నర్ జోక్యంతో ఈ నిర్ణయం మార్చి వరకు వాయిదా పడింది. ఈ ఏడాది మార్చి నెల చివర్లో.. ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు, తెలంగాణ రవాణా మంత్రి మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. తమ ప్రతిపాదనను విరమించుకునేందుకు తెలంగాణ సర్కారు అంగీకరించలేదు. మార్చి 31న జీవో జారీ చేసింది. ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైంది. పదేళ్లు ఉమ్మడి రాష్ట్రంగా ఉంటే ఎంట్రీ ట్యాక్స్ ఎలా విధిస్తారంటూ ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
ఈ విషయంలో తామేమీ చేయలేమని, రెండు ప్రభుత్వాలే తేల్చుకోవాలంటూ కేంద్ర మంత్రులు గడ్కారీ, నిర్మలా సీతారామన్ సూచించారు. ఈలోగా ఏపీ లారీ అసోసియేషన్, ప్రైవేటు యజమానుల సంఘం హైకోర్టుకు వెళ్లాయి. కోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడం, సుప్రీంకోర్టులో కూడా అనుకూల తీర్పు రాకపోవడంతో ఏప్రిల్ 1 నుంచి ఏపీ నుంచి వచ్చే రవాణా వాహనాలపై తెలంగాణ సర్కారు ఎంట్రీ ట్యాక్స్ వసూలు చే స్తోంది. ఏపీలోని 32 లక్షల లారీలు, 800 ప్రైవేటు బస్సులు ఎంట్రీ ట్యాక్స్ చెల్లించక తప్పని పరిస్థితి నెలకొంది. చివరకు ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ నుంచి ఏపీకి వచ్చే వాహనాలపై ఏప్రిల్ రెండో వారం తర్వాత ట్యాక్స్ వసూలు చేస్తోంది. మూడు నెలలకు వసూలు చేసే ఈ ఎంట్రీ ట్యాక్స్‌తో తెలంగాణకు రూ.30 కోట్లు, ఏపీకి రూ.20 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది.