మనమూ ప్రవేశపన్ను వేద్దామా?
- మల్లగుల్లాలు పడుతున్న ఆంధ్రప్రదేశ్ సర్కారు
సాక్షి, హైదరాబాద్: ప్రవేశ పన్ను(ఎంట్రీ ట్యాక్స్) విషయంలో తెలంగాణ ప్రభుత్వ బాటలో నడిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది. అయితే తెలంగాణకు వచ్చే ఆదాయంతో పోలిస్తే ఏపీకి ఎంత ఆదా యం సమకూరుతుందనే అంశంపై రవాణాశాఖ ఆరా తీస్తోంది.
తెలంగాణకు 3 నెలలకుగాను రూ.90 కోట్ల మేర ప్రవేశ పన్ను రూపం లో ఆదాయం సమకూరుతుందని అం చనా వేస్తుండగా, ఏపీకి ఎంతమేరకు ఆదా యం వస్తుందనే లెక్కల్లో రవాణా అధికారులు తల మునకలయ్యారు. తెలుగు రాష్ట్రాలు కలసి అభివృద్ధి సాధించాలని ప్రభుత్వ పెద్దలు ఓ వైపు చెబుతూ తెలంగాణ విధానాన్ని అనుసరించ డం కరెక్టు కాదని పలువురు చెబుతున్నారు.
తెలంగాణపై గవర్నర్‌కు శిద్ధా ఫిర్యాదు
ఇదిలా ఉండగా ఏపీ రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు గురువారం ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలసి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రవేశపన్ను విధానంపై ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గకుంటే తాము కూడా అమలు చేయాల్సి ఉంటుందని గవర్నర్‌కు సూత్రప్రాయంగా తెలిపారు. అనంతరం తనను కలసిన విలేకరులతో మంత్రి శిద్ధా మాట్లాడుతూ.. జరుగుతున్న అన్యాయాన్ని గవర్నర్‌కు వివరించానని, గవర్నర్ సమస్యను పరిష్కరించకుంటే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.