ఎంసెట్‌పై రగడ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ నిర్వహణపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మళ్లీ వివాదం ప్రారంభమైంది. ఎంసెట్‌ను తమ రాష్ట్రానికి వేరుగా నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి సోమవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఎంసెట్ సహా వివిధ సెట్లను ఉమ్మడిగా నిర్వహించేందుకు ఏపీ ఉన్నత విద్యా మండలి ఇంతకుముందే షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మే 10న ఎంసెట్ నిర్వహణకు వీలుగా ఏర్పాట్లు కూడా చేపట్టింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా ఎంసెట్‌ను విడిగా నిర్వహించుకునేందుకు వీలుగా షెడ్యూల్‌ను విడుదల చేయించింది.
మే 14న తెలంగాణ ఎంసెట్ జరుగుతుందని, హైదరాబాద్ సహా తెలంగాణ కాలేజీల్లో చేరదల్చుకున్న ఏపీ విద్యార్థులు తమ ఎంసెట్‌ను కూడా రాయాలని స్పష్టం చేసింది. తెలంగాణ షెడ్యూల్ ప్రకటనను తప్పుబడుతూ ఏపీ ప్రభుత్వం గవర్నర్ నరసింహ న్‌కు ఫిర్యాదు చేసింది. తెలంగాణ షెడ్యూల్ విడుదలైన వెంటనే ఏపీ మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి, ఉన్నత విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. అనంతరం మంత్రి గంటా, వేణుగోపాలరెడ్డిలు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం గౌరవించడం లేదని, ఒంటెత్తు పోకడలతో వెళ్తోందని ఫిర్యాదు చేశారు. విభజన చట్టం మేరకు ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాల బాధ్యత ఏపీ ఉన్నత విద్యా మండలిదేనని తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలికి చట్టబద్ధత లేదని చెప్పారు.
ఇందుకు సంబంధించి ఆంధ్రాబ్యాంకు తెలంగాణ ఉన్నత విద్యామండలికి పంపిన లేఖను మంత్రి గంటా గవర్నర్‌కు చూపించారు. ఏపీ ఉన్నత విద్యామండలి బ్యాంకు ఖాతాలను నిలిపేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి రాసిన లేఖకు స్పందనగా ఆంధ్రాబ్యాంకు న్యాయసలహాలు తీసుకొని ఈ లేఖను పంపించిందన్నారు. దీని ప్రకారం చూసినా ఉమ్మడి పరీక్షలపై ఏపీ ఉన్నత విద్యామండలికే సర్వాధికారాలు ఉన్నాయని తెలిపారు. ఇదివరకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉమ్మడి ఎంసెట్‌ను తామే నిర్వహిస్తామని అన్నారు.
వేర్వేరుగా సెట్లు నిర్వహిస్తే రెండు రాష్ట్రాల విద్యార్థులూ రెండేసి ప్రవేశ పరీక్షలు రాయవలసి ఉంటుందని తెలిపారు. ఈ వివాదంపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇరువురు సమన్వయంతో ఏకాభిప్రాయానికి వచ్చి పరీక్షల నిర్వహణను ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుందని అన్నారు. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేస్తానని చెప్పినట్లు సమాచారం.
గవర్నర్ సూచనల్ని అంగీకరించాలి: గంటా
ఉమ్మడి ఎంసెట్‌పై గవర్నర్ నరసింహన్ గతంలో మూడు ప్రతిపాదనలు చేశారని, వాటిలో తెలంగాణ ప్రభుత్వం దేనికి అంగీకరించినా ఆ ప్రకారం నడుచుకోవడానికి తాము సిద్ధమేనని ఏపీ మంత్రి గంటా తెలిపారు. గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రతినిధి చైర్మన్‌గా, ఏపీ ప్రతినిధి వైస్ చైర్మన్‌గా ఉమ్మడి ఎంసెట్‌కైనా తమకు అభ్యంతరం లేదన్నారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా తెలంగాణ తీరుపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబుతో చర్చించాక తదుపరి చర్యలు చేపడతామన్నారు. తమ ఖాతాలను స్తంభింపచేయాలని తెలంగాణ మండలి బ్యాంకులకు లేఖలు రాయడం దారుణమన్నారు.టి.ఉన్నత విద్యామండలి వివిధ సెట్లకు విడిగా షెడ్యూల్‌ను ప్రకటించడంతో దానిపై న్యాయపోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.