నేనేం చేస్తున్నది ప్రజలకు తెలుసు
- తనను కలసిన ఏపీ కాంగ్రెస్ నేతలతో నరసింహన్
- ఎంట్రీ ట్యాక్స్ ఉపసంహరణకు చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు కాంగ్రెస్ నేతల వినతి
సాక్షి, హైదరాబాద్: ‘‘నా గురించి బయట ఏవేవో మాట్లాడుతున్నారు.. నేనేం చేస్తున్నది ప్రజలకు బాగా తెలుసు. రెండు రాష్ట్రాల మధ్య సమస్య ఏదైనా కావచ్చు. నా దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి నాకున్న అధికార పరిధిలో చేయాల్సింది చేస్తున్నాను.. ఏమి చేసిందీ నేను ఇక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత తెలుస్తుంది’’ అంటూ తనను కలసిన కాంగ్రెస్ నేతలతో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఒకింత అసహనంతో వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలపై రుసుం వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకొని దానిని ఉపసంహరించుకునేలా చూడాలంటూ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం గవర్నర్ ను కలసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఒక వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సమయంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గవర్నర్‌తో మాట్లాడుతూ.. రుసుం వసూలుపై కోర్టు జోక్యం కంటే కూడా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించి ఉంటే బాగుండేదని అన్నారు. దీనిపై గవర్నర్ తీవ్రంగా స్పందిస్తూ పైవిధంగా సమాధానం ఇచ్చినట్లు సమాచారం.
తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. హైకోర్టుతో పాటు ఆర్బీఐ, నాబార్డు సహా పలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోనే ఉన్నందున వాహనాలపై ప్రవేశ రుసుం విధించడం సరైన చర్య కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చట్టం ప్రకారం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని గవర్నర్‌ను కోరారు. అదేవిధంగా ఏపీలో తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా లక్షలాది మంది పేద కూలీలు వలసలు పోతున్నారని.. దానిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
దాదాపు 5 వేల గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉందని కాంగ్రెస్ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామాలకు సరఫరా చేసే నీటి ట్యాంకర్లలో కూడా జన్మభూమి కమిటీల జోక్యం కారణంగా టీడీపీకి మద్దతివ్వని గ్రామాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వినతిపత్రంలో పేర్కొన్నారు. గవర్నర్‌ను కలసిన వారిలో కె.చిరంజీవి, పల్లంరాజు, మల్లాది విష్ణు, గిడుగు రుద్రరాజు, టీజేఆర్ సుధాకర్‌బాబు తదితరులు ఉన్నారు.