తిరుత్తణి/తమిళనాడు: అన్నాడీఎంకే నుంచి ఆ పార్టీ సీనియర్ నేత నరసింహన్‌ను తొలగించారు. అన్నాడీఎంకేను ఎంజీఆర్ స్థాపించిన సమయం నుంచి ఆ పార్టీలో నరసింహన్ కొనసాగుతున్నారు. 1980లో విద్యార్థి దశలోనే తొలిసారిగా పళ్లిపట్టు అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి పళ్లిపట్టు, తిరుత్తణి ప్రాంతాల్లో అన్నాడీఎంకేకు పెద్ద దిక్కుగా ఉన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న పళ్లిపట్టులో అన్నాడీఎంకేకు జీవం పోసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఎంజీఆర్, జయలలిత అడుగుజాడల్లో పయనించారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2016లో తిరుత్తణి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో నరసింహనన్‌ను పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వం నుంచి పార్టీ అధిష్టానం తొలగించింది. బలమైన ప్రజా ఆదరణ ఉన్న నాయకుడిని పార్టీ వదులుకోవడంతో తిరుత్తణి నియోజకవర్గంలో అన్నాడీఎంకే డీలా పడే పరిస్థితులు నెలకొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment