సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తనపై వివక్ష చూపుతోందంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై నేరుగా ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు గవర్నర్ల పాత్ర, ప్రభుత్వాలతో సంబంధాలకు సంబంధించిన అంశాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. నిజానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తమిళిసై స్థాయిలో బహిరంగంగా విమర్శలు చేసిన, ఆవేదన వ్యక్తం చేసిన గవర్నర్ మరొకరు లేరు.
నాడు రామ్‌లాల్ నుంచి..
ఉమ్మడి ఏపీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటివరకు పనిచేసిన గవర్నర్లలో అత్యంత వివాదాస్పదుడిగా రామ్‌లాల్ పేరును చెబుతుంటారు. ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసిన గవర్నర్‌గా ఆయన చరిత్రకెక్కారు. తర్వాత కుముద్‌బెన్ జోషి గవర్నర్‌గా ఉన్నప్పుడూ నాటి ఎన్టీఆర్ ప్రభుత్వంతో పలు విషయాల్లో విభేదించి వార్తల్లో నిలిచారు. రాజ్‌భవన్‌లో జోగినులకు వివాహం జరిపించి సంచలనం సృష్టించారు. కొంతకాలం నాటి సీఎం ఎన్టీఆర్‌తో కుముద్‌బెన్ కోల్డ్‌వార్ సాగింది.
నరసింహన్ హయాంలో..
ఉమ్మడి ఏపీ గవర్నర్‌గా నరసింహన్ పనిచేసిన కాలంలో పలుమార్లు రాజ్‌భవన్‌కు, ప్రభుత్వానికి మధ్య విభేదాలు వచ్చాయి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ఆ సమయంలో నరసింహన్ కొంత కఠినంగా వ్యవహరించారు. ఇక్కడి పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపించారు. ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన జరగడంతో.. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల బాధ్యతలను కొంతకాలం చూసుకున్నారు. ఈ సమయంలో హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై వివాదం తలెత్తినప్పుడు.. సెక్షన్–8 ప్రయోగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
ఇక తెలంగాణ ప్రభుత్వం ఆమోదం కోసం పంపించిన మున్సిపల్ చట్టంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పి పంపారు. మార్పులు చేసి తీసుకెళితే ఆమోదించారు. ప్రస్తుత గవర్నర్ తమిళిసై కూడా.. ప్రభుత్వం పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తే, ఆయనకు తగిన అర్హతలు లేవంటూ తిప్పిపంపారు. మరోవైపు పశ్చిమబెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర (ఉద్ధవ్‌ఠాక్రే సీఎంగా ఉండగా), కేరళ రాష్ట్రాల గవర్నర్లు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా పలు అంశాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో విభేదించి వివాదాస్పదులుగా నిలిచారు.
ఇదీ చదవండి: గవర్నర్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రుల ఆగ్రహం..
Comments
Please login to add a commentAdd a comment