సాక్షి, హైదరాబాద్: ‘‘నా వద్ద ఏడీసీగా పనిచేసిన తుషార్ భాసన్ పేరును, రాజ్‌భవన్‌ను ‘టీఆర్‌ఎస్ న్యూస్’ అనే అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలోకి లాగారు. అందులో రాజ్‌భవన్ పాలుపంచుకుందని ఆరోపణలు చేశారు. నా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు. తుషార్ కొద్దిరోజుల కింద హైదరాబాద్‌కు వచ్చి నన్ను కలవాలని రెండు మూడు రోజులు కాల్ చేశారు. ఇలా నాకు ఎవరెవరు కాల్ చేస్తున్నారో వాళ్లు (రాష్ట్ర ప్రభుత్వం) కనుక్కున్నారు. నా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పరిస్థితులు నెలకొని ఉన్నాయి’’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన ఆరోపణలు చేశారు.
రాజ్‌భవన్ పారదర్శకమైన కార్యాలయమని, తాను అలాంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదని స్పష్టం చేశారు. కావాలంటే తన ఫోన్ ఇచ్చేస్తానని, చూసుకోవచ్చని.. అంతా పారదర్శకంగా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. బుధవారం గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు గవర్నర్ మాటల్లోనే..
‘‘బిల్లులను ఆమోదించడానికి ఎలాంటి టైం లిమిట్ లేదు. ఆమోదించే వ్యక్తులకు వాటిని మదింపు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. నాకు అవసరమైనంత సమయాన్ని తీసుకుంటాను. నేను బిల్లులపై కూర్చున్నానని, సూపర్ పవర్ అని తప్పుడు ప్రచారాలు చేశారు. ఆరు బిల్లులు పంపించారు. ఒకదాని తర్వాత ఒక బిల్లును పరిశీలిస్తున్నా. నేను నియామకాల ప్రక్రియకు అడ్డంకిగా మారినట్టు తప్పుడు ప్రచారం చేశారు. కేవలం ఒకే నెల అయింది. బిల్లులను మదించడానికి నాకు సమయం వద్దా? బిల్లు పంపించి సింపుల్‌గా ఆమోదించేయాలంటే కుదరదు. వివరాలు కావాలి. వర్సిటీలకు చాన్స్‌లర్‌గా నాకు అన్ని హక్కులు ఉన్నాయి. రిక్రూట్‌మెంట్ బోర్డుకు సరైన వ్యక్తి ఉండాలి కదా.
నా ఒత్తిడితోనే ప్రభుత్వంలో కదలిక
గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచే వర్సిటీల్లో బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలని కోరుతూనే ఉన్నాను. వీసీలందరితో మాట్లాడి వర్సిటీల పరిస్థితులపై ప్రభుత్వానికి పెద్ద రిపోర్టు కూడా పంపాను. ఆ రిపోర్టు ప్రధాన ఎజెండా పోస్టుల భర్తీయే. నేను పదేపదే ఒత్తిడి చేయడంతోనే ఎనిమిదేళ్లు ఖాళీగా ఉన్న 13 వర్సిటీల వీసీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది
స్పష్టత మాత్రమే కోరాను
వర్సిటీల్లో నియామకాలకు ఇప్పటికే ఒక విధానం ఉండగా కొత్త బోర్డు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? ఎలా ఏర్పాటు చేస్తారు, ఏ పద్ధతిని అనుసరిస్తారు?దీనికి చట్టబద్ధత ఉంటుందా? యూజీసీ ఒప్పుకుంటుందా? చైర్మన్‌గా ఎవరిని నియమిస్తారు? ఏం ప్రొటోకాల్‌ను పాటిస్తారు? ఏటా నియామకాలు చేస్తారా? యూనివర్సిటీ కేంద్రంగా నియామకాలుంటాయా? అన్ని వర్సిటీలను కలిపి కేంద్రీకృతంగా నియామకాలు చేపడతారా? వీటిపై స్పష్టత రావాలి. ఒకవేళ న్యాయపరమైన చిక్కులొస్తే బోధన, బోధనేతర సిబ్బంది లేక విద్యార్థులు ఇబ్బందిపడతారు. సత్వర నియామకాల కోసమే బోర్డు అని మీరు అంటున్నారు. బోర్డు ఏర్పాటుకు చాలా సమయం పడుతుంది. పారదర్శకంగా నియామకాలు జరగాలి. పక్షపాతం వల్ల అర్హులైన విద్యావేత్తలు నష్టపోరాదు. అందుకే బిల్లు విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టత కోరాను. ఆరేడు నెలలుగా బిల్లులు ఆపినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కేవలం ఒక నెల, ఆపై కొన్ని రోజులు మాత్రమే అయింది. రోజూ అనుమానాల నివృత్తి కోసం కొంత సమయం గడుపుతున్నాను. ప్రత్యేక బోర్డులు కలిగిన రాష్ట్రాలను సంప్రదిస్తే.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కిందే అవి పనిచేస్తున్నట్టు తెలిసింది. ప్రజాప్రయోజనాల రీత్యానే స్పష్టత కోరుతూ మంత్రికి లేఖ రాశాను.
ఇలాగైతే ప్రగతిభవన్‌కు ప్రజల గొంతు చేరుతుందా?
నేను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నానని, లేఖ అందలేదని మంత్రి (సబితా ఇంద్రారెడ్డి) అనడం ఆశ్చర్యం కలిగించింది. సీఎం నుంచి లేఖ మంత్రికి చేరడానికి, రాజ్‌భవన్ నుంచి గవర్నర్ గొంతు మంత్రికి చేరడానికే ఇంత జాప్యం జరిగితే.. ప్రజల గొంతు ప్రగతిభవన్‌కు ఎలా చేరుతుంది? గవర్నర్ లేఖ రాశారా, లేదా? అని మంత్రి తెలుసుకుని ఉండాల్సింది. వాస్తవం తెలుసుకోకుండా రాజ్‌భవన్‌ను అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారు. బిల్లుపై స్పష్టత కోసమే మంత్రిని రమ్మన్నాను. అగ్నివీర్ పథకంపై సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఆందోళన చేస్తున్న వారిని రాజ్‌భవన్ ఎదుట ఆందోళన చేయాలంటూ (టీఆర్‌ఎస్) అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి పిలుపునివ్వడాన్ని గుర్తుంచుకోవాలి.
ముందు ప్రభుత్వ వర్సిటీలను పట్టించుకోండి
ప్రభుత్వ వర్సిటీల్లో మెస్‌లు, హాస్టళ్లు దుర్భరంగా ఉన్నాయి. బెడ్లు, టేబుళ్లు. ట్యూ బ్‌లైట్లు లేవు. పారిశుధ్యం లేదు. కలుషిత ఆహారం నిత్యకృత్యమైంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు వర్సిటీలను అభివృద్ధి చేసేందుకు బిల్లు తెస్తారా? వాటి సంఖ్యను పెంచాలనుకుంటారా? ఎందుకు? విద్య వ్యాపారం కాదని సుప్రీంకోర్టు అన్నది. ముందు ప్రభు త్వ వర్సిటీల దుస్థితిని పట్టించుకోండి. ఆ తర్వాత ప్రైవేటు బిల్లు గురించి ఆలోచిద్దాం.
గవర్నర్లే వీసీలుగా ఉండాలి
వర్సిటీల చాన్స్‌లర్లుగా గవర్నర్లే ఉండాలి. వారిని తొలగించి సీఎంలను నియమించడంపై విస్తృత చర్చ జరగాలి. సెక్యులరిజంపై వ్యాఖ్యలు చేసినంత మాత్రాన తమిళనాడు గవర్నర్‌ను భర్తరఫ్ చేయాలని అక్కడి ప్రభు త్వం కేంద్రానికి లేఖ రాయాల్సిన అవసరం లేదు’ అని తమిళిసై స్పష్టం చేశారు.
తెలుగు ప్రజల గురించి అలా అనలేదు
తమిళనాడులో తెలుగు ప్రజలు ఆధిపత్యం చెలాయిస్తున్నారని తాను చెప్పలేదని, తన మాటలను వక్రీకరించారని ఓ ప్రశ్నకు గవర్నర్ తమిళిసై బదులిచ్చారు. తాను కేవలం మాతృభాష గురించి మాట్లాడానని వివరించారు. ఇక ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా నిరసనలు తెలపాలంటూ పలువురు పిలుపునివ్వడంపై గవర్నర్ స్పందించారు. ప్రధాని పర్యటనతో రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు వస్తాయని, దీనిని సానుకూల దృక్పథంతో చూడాలని సూచించారు.
అందుకే ఖైదీల క్షమాభిక్షను తిరస్కరించా..
కేంద్ర హోంశాఖ నిబంధనలను పాటించకపోవడంతోనే ఖైదీల క్షమాభిక్ష ప్రతిపాదనలను తిరస్కరించినట్టు గవ ర్నర్ స్పష్టం చేశారు. జీవిత ఖైదీలను వెంటనే విడుదల చేయడం కుదరదని.. క్షణికావేశంలో నేరాలు చేసిన వారికే క్షమాభిక్ష వర్తిస్తుందని పేర్కొన్నారు.
చదవండి: మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే
Comments
Please login to add a commentAdd a comment