నల్లగొండ అర్బన్ : వాడపల్లి, నల్లబటండగూడెం, నాగార్జునసాగర్.. మూడు చెక్‌పోస్టులు..మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం వరకు ఒకేరోజు రూ.54లక్షలు వసూలు.. ఇదీ..జిల్లాలో రాష్ట్ర సరిహద్దుల్లోకి ప్రవేశించే వాహనాల నుంచి వసూలు చేసిన ఎంట్రీ ట్యాక్స్. జీఓనంబర్ 15 ప్రకారం.. వాహన పన్ను వసూలును అధికారులు మొదలుపెట్టారు.ఉమ్మడి రాష్ట్రంలో చెల్లించిన పన్నులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో తిరిగేందుకు మంగళవారం రాత్రి వరకే వెసులుబాటు ఉన్నది.
గత జూన్ 1వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబరు 43 ప్రకారం ఇరు ప్రాంతాల్లో ఎక్కడా పన్ను చెల్లించినా 2015 మార్చి 31 వరకు ఉభయ రాష్ట్రాల్లో పర్యటించేందుకు అవకాశం కల్పించారు. ఆ గడువు పూర్తి కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జీఓను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం పొరుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రతి ట్రాన్స్‌పోర్టు వాహనం విధిగా పన్ను చెల్లించేలా ఆదేశాలు అమల్లోకి వచ్చాయి.
కాగా నూతన పన్ను విధానం అమలు కావడంతో పెద్ద సంఖ్యలో వాహనాలను జిల్లా సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్ పరిధిలోనే యజమానులు నిలిపివేశారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి దాదాపు 250 వాహనాలను తనిఖీ చేసి రూ. 54లక్షల పన్నులను రాబట్టారు. వీటిల్లో 33 ప్రైవేట్ ట్రావెల్స్, 30 మ్యాక్సీ క్యాబ్‌లు, 187 లారీలు, ఇతర వాహనాలున్నాయి. కాగా కోర్టుకు వెళ్లిన వారు మాత్రం సంబంధిత చెక్‌పోస్టులో విధిగా హామీపత్రం (బాండ్ )సమర్పించి తెలంగాణలో తిరిగేందుకు వెసులుబాటు కల్పించారు. వచ్చే మంగళవారానికి తదుపరి విచారణ వాయిదా పడింది. అయితే కోర్టుకు వెళ్లని వారు మాత్రం యథావిధిగా పన్ను చెల్లించాల్సిందే.
పన్ను విధానం కొత్తకాదు
- మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్
ఒక రాష్ట్రం వాహనం మరో రాష్ట్రంలోకి ప్రవేశించినప్పుడు పన్ను చెల్లించడం కొత్తేమీకాదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా తదితర ప్రాంతాల వారు పొరుగు రాష్ట్రంలోకి వెళ్లినప్పుడు పన్ను చెల్లించిన పరిస్థితులు తెలిసిందే. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఏ రాష్ట్రం వారు ఆయా ప్రభుత్వాల నిర్ణయాల ప్రకారం పన్ను వసూళ్లు జరుపుతారు. దీని వల్ల ఓ ప్రాంతం వారికి లాభం, మరో ప్రాంతం వారికి నష్టం అంటూ ఉండదు. ఎక్కడైనా పన్ను చెల్లించాల్సిందే.
మూడు చెక్‌పోస్టులు..రూ.54లక్షలు
Published Thu, Apr 2 2015 4:27 AM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM
Advertisement
Advertisement