
అంతర్రాష్ట్ర పర్మిట్ల విధానం కొలిక్కి!
♦ తెలంగాణ, ఆంధ్ర నడుమ ఎంట్రీ ట్యాక్స్ త్వరలో ఎత్తివేత
♦ ఈ చర్యతో ఏపీకే అధిక ఆదాయం
సాక్షి, హైదరాబాద్: గతేడాది ఏప్రిల్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నడుమ తలెత్తిన ఎంట్రీ ట్యాక్స్ విధానం త్వరలో సమసిపోనుంది. ఈ రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర పర్మిట్ల విధానం ఓ కొలిక్కి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం నుంచే ఎంట్రీ ట్యాక్స్ విధానం ఎత్తేయాలని ప్రతిపాదనలు రావడంతో ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు ఏపీ రవాణా శాఖ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఏప్రిల్ 1 నుంచి ఇరు రాష్ట్రాల్లో ఈ విధానం రద్దు కానున్నట్లు సమాచారం. ఇరు వైపుల నుంచి వచ్చే రవాణా వాహనాలు, సరుకుల వాహనాలు విధిగా ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాలని గతేడాది ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత గవర్నర్ సమక్షంలో రెండు రాష్ట్రాల్లో 2015 మార్చి 31 వరకు రవాణా, సరుకుల వాహనాలపై పన్ను విధించకుండా గతంలో నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం ఎంట్రీ ట్యాక్స్ ఖచ్చితంగా విధించాల్సిందేనని పట్టుబట్టింది. ఏపీ సర్కారు మాత్రం ఉమ్మడి రాజధానిగా ఉన్నంతవరకు ఆంధ్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్ చెల్లించేది లేదని అప్పట్లో తేల్చి చెప్పింది. దీనిపై గవర్నర్, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసింది. కేంద్రం జోక్యం చేసుకోమని తేల్చి చెప్పడంతో విధి లేక గతేడాది ఏప్రిల్ 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఎంట్రీ పన్ను విధించాయి.
ఎంట్రీ ట్యాక్స్‌తో ఏపీకే ఆదాయం
ఈ ఎంట్రీ పన్నుతో ఆంధ్ర కంటే తెలంగాణకు ఎక్కువ ఆదాయం వస్తుందని తెలంగాణ సర్కారు భావించింది. రవాణా రంగంలో ఏపీది 60 శాతం వాటాగా ఉండటమే ఇందుకు కారణమని ఆలోచించింది. తెలంగాణ ఆలోచనలకు విరుద్ధంగా ఏపీకే ఆదాయం ఎక్కువగా ఉందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణకు నెలకు ఎంట్రీ ట్యాక్స్‌తో రూ.కోటి ఆదాయం వస్తుంటే, ఏపీకి రూ.5 కోట్లుగా ఉందని రవాణా వర్గాలు చెబుతున్నాయి. ఆర్టీసీ బస్సులకు మాత్రం ఈ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంది. విభజన జరగనందున ట్యాక్స్ వసూలు చేసే వెసులు బాటు లేదు.
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ నుంచి గ్రానైట్, నల్గొండ నుంచి సిమెంటు, ఇతర సరుకుల వాహనాలు ఏపీకి అధికంగా రావడంతో ఏపీ ఆదాయం పెరిగిందంటున్నారు. కరీంనగర్ నుంచి గ్రానైట్ లారీలు నిత్యం కాకినాడ పోర్టుకు వెళతాయి. పైగా ఏపీలోని తిరుపతి, విజయవాడ, ఇతర పుణ్యక్షేత్రాలకు టూరిస్టు వాహనాల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఎంట్రీ ట్యాక్స్ ఆదాయం ఎక్కువగా ఉందంటున్నారు. దీంతో తెలంగాణ ఈ ట్యాక్స్ ఎత్తివేతకు చొరవ చూపినట్లు అధికారులు వెల్లడించారు.