![Women suffering RTC Bus Kamareddy Bus Stop](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/1223.jpg.webp?itok=EM7nZZbW)
కరీంనగర్–కామారెడ్డి మార్గంలో ప్రజల అవస్థలు
పెద్దమ్మ స్టేజీ వద్ద రెండున్నర గంటల పడిగాపులు
98 కిలోమీటర్ల మార్గంలో అరకొరగా ఆర్టీసీ బస్సులు
సిరిసిల్ల: అది రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లోని దట్టమైన అటవీ ప్రాంతం.. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట శివారులోని పెద్దమ్మ స్టేజీ.. అక్కడి నుంచి ఎటు చూసినా రెండు కిలోమీటర్ల మేర అడవి తప్ప ఒక్క ఊరు ఉండదు. కనీసం తాగేందుకు మంచినీరు కూడా దొరకదు. అలాంటి ప్రాంతంలో రెండు రోజుల క్రితం పాతిక మంది ప్రయాణికులు... అందులోనూ మహిళలు బస్సు(bus) కోసం గంటలకొద్దీ వేచి ఉన్నారు. వీరంతా దమ్మన్నపేట, నాగంపేట, ముచ్చర్ల, సమీపంలోని గిరిజన తండాలకు చెందిన వారు.
పెద్దమ్మ స్టేజీ నుంచి కామారెడ్డికి వెళ్లేందుకు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చారు. మూడున్నర గంటల వరకూ ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ఎండలో గొంతులెండి అలమటించారు. ఒక్క బస్సు కూడా రాకపోవటంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. కొందరైతే ప్రయాణం మానుకుని వెనుదిరిగారు. ఉచిత ప్రయాణం అనుకుంటే ఉన్న బస్సులు కూడా రావటంలేదని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు.
ఇది ఆర్డీనరీ బస్సుల బాట: కరీంనగర్–కామారెడ్డి ప్రధాన రహదారి నిడివి 98 కిలోమీటర్లు. ఆర్డినరీ బస్సులు తప్ప ఒక్క ఎక్స్‌ప్రెస్ కూడా ఈ మార్గంలో లేవు. ఈ మార్గంలో సిరిసిల్ల జిల్లా కేంద్రం, వేములవాడ పుణ్యక్షేత్రంతోపాటు ఎల్లారెడ్డిపేట, మాచారెడ్డి, గంభీరావుపేట మండలాలు, అనేక గ్రామాలున్నాయి. అయినా ఆర్టీసీ అధికారులు అరకొరగా ఆర్డినరీ బస్సులతో నెట్టుకొస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.
ఆ రూట్ మా పరిధిలో లేదు
ఆ రూట్ మా పరిధిలో లేదు. కామారెడ్డి–కరీంనగర్ రూట్‌ను కరీంనగర్–1, కామారెడ్డి డిపోలు పర్యవేక్షిస్తాయి. బస్సులు రాకపోవడం, లేకపోవడంపై నాకు సమాచారం లేదు. ఆ రెండు డిపోల అధికారులను సంప్రదిస్తే కారణాలు తెలుస్తాయి.
– ప్రకాశ్‌రావు, సిరిసిల్ల డిపో మేనేజర్.
Comments
Please login to add a commentAdd a comment