⇒ తాజా పరిణామాలతో ముంచుకొస్తున్న కొరత
⇒ రాష్ర్ట అవసరాలకు ఏపీ ఇసుకే దిక్కు
⇒ అక్కడా ఎంట్రీ ట్యాక్స్ విధిస్తే ధర రెట్టింపయ్యే అవకాశం
⇒ ఏపీ రాజధాని నిర్మాణం మొదలైతే రవాణా నిలిచే ప్రమాదం
⇒ తీవ్ర ఇసుక కొరత ఏర్పడవచ్చని పరిశ్రమ వర్గాల ఆందోళన
⇒ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించిన రాష్ర్ట ప్రభుత్వం
⇒ నల్లగొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్ నుంచి రవాణాకు ఏర్పాట్లు.. హైదరాబాద్ శివార్లలో 3 ఇసుక డంప్‌లు
రాక్‌శాండ్‌కు పరిశ్రమ హోదా ఇవ్వాలని యోచన
⇒ గనుల శాఖను సమగ్ర నివేదిక కోరిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ‘ఇసుక’ ముప్పు ముంచుకొస్తోంది! నిర్మాణ రంగానికి మూలాధారమైన ఇసుక లేకపోతే పనులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయే ప్రమాదముంటుంది. ఇది రాష్ర్ట ప్రగతి చక్రానికి ప్రతిబంధకం కానుంది. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే సమీప భవిష్యత్తులో గడ్డు పరిస్థితి తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ర్ట ఇసుక అవసరాలన్నీ ఆంధ్రప్రదేశ్ నుంచే తీరుతున్నాయి. అయితే అక్కడ కొత్త రాజధాని నిర్మాణం మొదలైతే తెలంగాణకు ఇసుక రవాణా ఆగిపోయే అవకాశముంది. అలాగే ఏపీ సర్కారు కూడా ప్రవేశ సుంకాన్ని(ఎంట్రీ ట్యాక్స్) విధిస్తే ఇసుక ధర అమాంతం పెరుగుతుంది. భవిష్యత్తులో రాష్ర్టంలో తీవ్ర ఇసుక కొరత తలెత్తే ప్రమాదముందని నిర్మాణ రంగ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పరిస్థితిని గమనించిన ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఇసుక కొరత రాకుండా చర్యలకు సిద్ధమైంది. దీనికి అనుగుణంగా గతంలో ప్రకటించిన ఇసుక విధానానికి కొన్ని సవరణలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సమగ్ర నివేదిక ఇవ్వాలని గనుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్లు తెలిసింది.
ధరలు పెరగకుండా చర్యలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంట్రీ ట్యాక్స్ విధిస్తే రాష్ర్టంలో ఇసుక ధర రెట్టింపవుతుంది. ఇప్పటికే అన్ని ఖర్చులు కలిపి టన్నుకు రూ.1200 నుంచి రూ.1400 వసూలు చేస్తున్నారు. ప్రవేశ పన్ను కూడా మొదలైతే ఈ ధర రూ. 2000 వరకు చేరే అవకాశముంది. దీంతో సాధారణ జనానికి ఇసుక అందుబాటులో లేకుండా పోతోంది. అపార్టుమెంట్ల ధరలు ఆకాశాన్నంటుతాయి. ఈ దృష్ట్యా ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ‘స్థానికంగా ఇసుక రిచ్‌లు ఏర్పాటు చేసుకోవడమొక్కటే ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం. ఇందుకోసం కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలను ఇటీవల పరిశీలించాం. పర్యావరణానికి ఇబ్బందులు లేకుండా హైదరాబాద్‌తో పాటు అన్ని పట్టణాలకు ఇసుక సరఫరాపై ఆలోచన చేస్తున్నాం’ అని గనుల శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
భారీగా ఇసుక సేకరణకు నిర్ణయం
నల్లగొండ, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో కృష్ణా, గోదావరి, మంజీరా నదుల నుంచి భారీగా ఇసుకను సేకరించాలని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(టీఎస్‌ఎండీసీ) సమాయత్తమవుతోంది. ప్రస్తుత అవసరాల మేరకు రాష్ట్రంలో రోజుకు లక్ష టన్నుల ఇసుక అవసరమవుతుందని అంచనా. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే రోజుకు 45 నుంచి 50 వేల టన్నుల ఇసుకకు డిమాండ్ ఉంటోంది.
ముందుగా ఈ జిల్లాల అవసరాలకు ఇసుకను అందుబాటులో ఉంచగలిగితే కొరతను అరికట్టవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం నల్లగొండ, కరీనంగర్, మహబూబ్‌నగర్ నుంచి తెచ్చే ఇసుకతో హైదరాబాద్ శివార్లలో 3 ప్రత్యేక డంప్‌యార్డులను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. మహబూబ్‌నగర్ నుంచి వచ్చే ఇసుకను ఆరాంఘర్ దగ్గర, కరీంనగర్, మెదక్ నుంచి సేకరించే ఇసుకను కొంపల్లి పరిసరాల్లో, నల్లగొండ నుంచి తెచ్చే ఇసుకను హయత్‌నగర్‌లో నిల్వ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఇసుక క్వారీ నుంచి వినియోగదారునికి చేర్చే వరకు అయ్యే మొత్తం వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని ధరను నిర్ణయించనుంది. నాణ్యతను బట్టి టన్ను ఇసుకకు రూ.600 నుంచి రూ.750 దాకా ఉండొచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇసుక రవాణాకు బహిరంగ టెండర్లను పిలవాలని ఆ సంస్థ భావిస్తోంది. మరో వారం, పది రోజుల్లో దీనికి సంబంధించిన విధాన నిర్ణయాలు వెలువడనున్నాయి.
హైదరాబాద్‌లోనే అత్యధిక వినియోగం
రాష్ర్ట ఇసుక అవసరాల్లో అత్యధిక శాతం హైదరాబాద్‌లోనే వినియోగమవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, కర్నూలు నుంచే తెలంగాణ ప్రాంతానికి భారీగా ఇసుక రవాణా జరుగుతోంది. అమరావతి రాజధాని నిర్మాణం మొదలైతే అక్కడి నుంచి ఇసుక రాకపోవచ్చునని భవన నిర్మాణ సంస్థలు రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తెచ్చాయి. అలాగే హైదరాబాద్‌లోని డిమాండ్ దృష్ట్యా ఇప్పటికే ఇసుక మాఫియా విజృంభిస్తోంది. ఎప్పటికప్పుడు ధరలు పెంచడం, తూకాల్లో మోసాలు చేయడం వంటి అక్రమాలకు పాల్పడుతోంది. ఏపీ నుంచి ఇసుక రవాణా తగ్గిపోవచ్చునన్న భావనతో నగర శివార్లలో వ్యాపారులు తమ నిల్వలను పెంచుకుంటున్నారు. నల్లగొండ జిల్లా తుప్రాన్‌పేట, మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాపూర్ ప్రాంతాల్లో అక్రమ నిల్వలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నిర్మాణ రంగానికి అవసరమైన ఇసుకను బహిరంగంగా అందుబాటులో ఉంచితే తప్ప వీరి ఆగడాలకు కళ్లెం వేయలేమని సర్కారు భావిస్తోంది.
రాక్‌శాండ్‌కు ప్రోత్సాహం
కేవలం ఇసుకతోనే అన్ని అవసరాలను తీర్చడం సాధ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రకృతి వనరులను పూర్తిగా వినియోగిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని, ప్రత్యామ్నాయంగా రాక్‌శాండ్(రాతి ఇసుక) వినియోగాన్ని ప్రోత్సహించాలని అనుకుంటోంది. ప్రభుత్వ నిర్మాణాల్లో రాక్‌శాండ్‌ను వినియోగించాలని ఇప్పటికే ఆదేశాలున్నాయి. రాక్‌శాండ్ ఉత్పత్తిని పెంచడానికి కూడా సర్కారు చర్యలు తీసుకుంటోంది. దీనికి పరిశ్రమ హోదాను కల్పించాలని నిర్ణయించింది. ఈ ఉత్తర్వులు కూడా త్వరలోనే వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
నగరానికి ఇసుక జ్వరం!
Published Thu, Apr 9 2015 1:51 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM
Advertisement
Advertisement