టమాటలో ముసుగులో ఇసుక రవాణా
టమాటలో ముసుగులో ఇసుక రవాణా
Published Mon, Oct 10 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
– వాహన తనిఖీల్లో మాఫియా గుట్టు రట్టు
– లారీ, రెండు మోటర్ సైకిళ్లు సీజ్
కర్నూలు: కర్నూలు నుంచి హైదరాబాద్‌కు ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్న మాఫియా గుట్టు రట్టు అయింది. నగర శివారుల్లోని అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద నిఘా తీవ్రతరం చేయడంతో అడ్డదారుల్లో ఇసుకను రవాణా చేస్తూ ఇసుక మాఫియా పోలీసుల వలకు చిక్కారు. టమాటల రవాణా పేరుతో కొంతకాలంగా ఇసుకను తరలిస్తున్నారు. కర్నూలు శివారుల్లోని హంద్రీనది నుంచి హైదరాబాద్‌కు ఐచర్ వాహనంలో ఇసుకను తరలిస్తూ ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. ఆదివారం రాత్రి నాల్గో పట్టణ సీఐ నాగరాజు రావు, తన సిబ్బందితో వెంకటరమణ కాలనీ మలుపు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఏపీ 01 ఎక్స్ 9755 ఐచర్ వాహనంలో సుమారు 10 టన్నుల ఇసుకను నింపి లారీకి వెనుక, ముందు మోటర్‌సైకిళ్లతో ఇద్దరు పైలట్ల తరహాలో తరలిస్తుండగా పోలీసులకు అనుమానం వచ్చి తనిఖీ చేశారు. లారీలో ఇసుక కనపడకుండా టమాట బాక్సులను వెనుక భాగంలో అడ్డం పెట్టి, తడికలు కప్పి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. పోలీసులను చూడగానే డ్రైవర్ ఫయాజ్ వాహనాన్ని పక్కన పార్కు చేసి పారిపోయాడు. అలాగే ద్విచక్ర వాహనాలపై పైలెట్లుగా వ్యవహరించిన రాజు, మరో వ్యక్తి కూడా తమ వాహనాలను వదిలివేసి పారిపోవడంతో పోలీసులు టమాట బక్సులను తొలగించి తనిఖీ చేయగా, ఇసుక బయటపడింది. దీంతో రెండు మోటర్ సైకిళ్లు, లారీని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
ముఠా వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ః
కర్నూలు మండలం, పంచలింగాల గ్రామానికి చెందిన రాజు, గంగన్న, హుసేని, షాలు తదితరులు హైదరాబాద్‌కు చెందిన మొహిద్దీన్, ఫయాజ్‌తో చేతులు కలిపి కొంతకాలంగా కర్నూలు నుంచి హైదరాబాద్‌కు ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలతో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతోంది. గంగన్న, హుసేని హమాలీలుగా పని చేస్తూ ముఠాకు చేదోడుగా ఉంటున్నారు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నాయకులకు మామూళ్లు ముట్టజెప్పి ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు విచారణలో బయటపడింది. సుంకేసుల పరిసర ప్రాంతాల్లోని తుంగభద్ర నది నుంచి కూడా భారీ ఎత్తున మాఫియా సభ్యులు ఇసుకను హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెలుగు చూసింది. హైదరాబాద్ నాంపల్లికి చెందిన మొహిద్దీన్, పంచలింగాలకు చెందిన గంగన్న, హుసేని తదితరులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఎంత కాలం నుంచి ఇసుక రవాణా అక్రమంగా జరుగుతుంది, ముఠా వెనుక ఎవరెవరి హస్తం ఉంది, తదితర విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Advertisement
Advertisement