అడ్డొస్తే అంతే.. | , dangerous sand mafia | Sakshi
Sakshi News home page

అడ్డొస్తే అంతే..

Published Thu, Jul 28 2016 11:53 PM | Last Updated on Tue, Nov 6 2018 5:21 PM

అడ్డొస్తే అంతే.. - Sakshi

అడ్డొస్తే అంతే..

  • మంత్రి ఇలాకాలోనే అధికారులపై దాడులు
  • జిల్లావైపు కన్నెతి చూడని అమాత్యుడు 
  • ఓ డీఎస్పీ ‘మామూలు’ రూ.8 లక్షలపైనే !
  • ప్రత్యేక సమయంలోనే రవాణా
  • కరీంనగర్‌ క్రైం : జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నాయకులు, అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇసుక స్మగ్లర్లు దేనికైనా బరితెగిస్తున్నారు. ఏకంగా అధికారులపై దాడులకు దిగుతున్నారు. ఓపక్క ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని మైనింగ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ఆయన సొంత నియోజకవర్గం సిరిసిల్లలోనే ఇసుక స్మగ్లర్లు రవాణా శాఖ అధికారులపై దాడికి యత్నించడం గమనార్హం. మరోవైపు పోలీసుల కనుసన్నల్లోనే ఈ దందా సాగుతుందనే ఆరోపణలున్నాయి. 
     
    జిల్లావైపు చూడని మంత్రి...
    జిల్లాకు చెందిన మంత్రి కేటీఆర్‌ మూడునెలల క్రితం మైనింగ్‌శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వెంటనే ఇంటిలెజెన్స్‌ ద్వారా సమాచారం సేకరించిన ఆయన అక్రమాలకు ఊతం ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సంకేతాలు పంపారు. ఇసుక అక్రమ వ్యవహారంలో మహబూబ్‌నగర్‌ మైనింగ్‌ ఏడీగా పనిచేస్తున్న కృష్ణప్రతాప్‌పై సస్పెన్షన్‌ వేటువేశారు. అయితే సొంత జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. హైదరాబాద్‌కు రవాణా అవుతున్న ఇసుకలో 80శాతం కరీంనగర్‌ నుంచే వెళ్తోంది. వీటిలో 45శాతం అక్రమంగా రవాణా అవుతోంది. నిబంధనల ప్రకారం ఒక్క ఇసుక క్వారీ నిర్వహించడం లేదు. పైగా క్వారీ దక్కించుకున్న వారిలో చాలామంది అధికార పార్టీకి చెందిన నాయకులే ఉండడం గమనార్హం. దీంతోనే మంత్రి జిల్లాపై దృష్టి సారించడంలేదనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కోట్ల విలువైన సహజ సంపద తరలిపోతోంది. ఏకంగా మంత్రి నియోజకవర్గంలోనే ఇసుక మాఫియా రవాణాశాఖ అధికారులపై దాడులకు దిగడం స్మగ్లర్ల బరితెగింపునకు నిదర్శనం. 
     
    నిబంధనలు గాలికి...
    ఇసుక రీచ్‌లు వేలంవేసే సమయంలో నిబంధనలు అమలుచేసే బాధ్యతను టీఎంఎన్‌డీసీకి అప్పగించారు. ఇసుక రవాణాలో పాదర్శకంగా అమ్మకాలు చేయడానికి పలు అంశాలను అందులో పొందుపర్చారు. అయితే వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మకై  నిబంధనలను గాలికొదిలేశారు. ఇసుక క్వారీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు, ప్రతీ లారీకి జీపీఎస్‌ ట్రాకర్లు అమర్చడం, చెక్‌పోస్టుల్లో ప్రత్యేక రికార్డ్‌లు ఏర్పాటుచేయాలి. అయితే ఇంతవరకూ ఏ ఒక్క క్వారీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. కొన్ని చోట్ల ఏర్పాటుచేసినా పనిచేయకుండా చేశారనే విమర్శలున్నాయి. రోజు జిల్లా నుంచి సుమారు 300 లారీల ఇసుక హైదరాబాద్‌కు రవాణా అవుతోంది. ఇందులో 60 శాతం వరకూ అక్రమంగా తరలిపోతోంది. ఇవన్నీ కూడా టీఎంఎన్‌డీసీ, పోలీసులు, మైనింగ్‌ అధికారులకు తెలిసినా వారు మాముళ్ల మత్తులో జోగుతున్నారన్నది జగమెరిగిన సత్యం. 
     
    ఓ డీఎస్పీ వాటా రూ.8 లక్షలు..!
    జిల్లాలో ఇసుక క్వారీలు అధికంగా ఉన్న ప్రాంతంలో పనిచేస్తున్న ఓ డీఎస్పీకి ఇసుక అక్రమ రవాణాదారులు ప్రతీనెల రూ.8 లక్షలపైనే ముట్టజెబుతున్నారు. సదరు డీఎస్పీ నియంత్రణలో ఉన్న సుమారు 60 టిప్పర్లు రోజూ తెల్లవారుజామున ఓ ప్రత్యేక సమయంలో వెళ్లిపోతాయని సమాచారం. వాటి నంబర్లతో సహా చెక్‌పోస్టులో ఉండడంతో ఇబ్బందులు లేకుండా ఇసుక రవాణా సాగిపోతోందని సమాచారం. గతంలో పలువురు పోలీస్‌ సిబ్బంది కూడా వీటిని పర్యవేక్షించారని తెలిసింది. ఉన్నతాధికారులు మాత్రం ఇసుక రవాణాను ప్రోత్సహిస్తున్నారని పేర్కొంటూ వారిపై బదిలీ వేటు వేసి దూరప్రాంతాలకు పంపించారు. అయితే సదరు డీఎస్పీ, సీఐలపై చర్య తీసుకోలేదు. ప్రస్తుతం ఇసుక క్వారీల ఉన్న ప్రాంతంలో ఉన్న పోలీస్‌స్టేషన్లు, సీఐలకు ఓవర్‌లోడు, అనుమతి లేకుండా రవాణా అవుతున్న ఒక్కో లారీకి నెలకు రూ.5వేల చొప్పున చెల్లిస్తున్నారని తెలిసింది. పోలీసు అధికారులు కనుసన్నల్లోని చెక్‌పోస్టుల నుంచి ఇబ్బందులు లేకుండా ఇసుక రవాణాచేస్తున్నారని తెలిసింది. దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి విచారణ చేపడితే మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశముంది.
     
    దాడులకు వెనుకాడని మాఫియా...
    ఇసుక అక్రమ రవాణాకు అడ్డువస్తున్న వారికి మొదట డబ్బులు ఎరవేయడం... లేదంటే దాడులు చేయడానికి కూడా వెనుకాడడంలేదు. నిబంధనల ప్రకారమే ఇసుక రవాణా చేస్తున్నామని చెప్పుకుంటున్న క్వారీల కాంట్రాక్టర్లు మరి అధికారులపై దాడులు ఎందుకు చేస్తున్నారనేది ప్రశ్న.  ఇసుక రవాణా విషయంలో పోలీస్‌శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, అధికారులు స్పందించి కఠినంగా వ్యవహరిస్తేనే ఈ దందాకు చెక్‌ పెట్టవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
     
    దూకుడుగా మైనింగ్‌ విజిలెన్స్‌
    ఓ వైపు సిబ్బంది కొరత ఉన్నా మైనింగ్‌ విజిలెన్స్‌ దూకుడుగా వ్యవహరిస్తోంది. రోజు ఎక్కడో ఒకచోట అక్రమంగా ఇసుకరవాణా చేస్తున్న లారీలను అధికారులు పట్టుకుంటున్నారు. మొదటిసారి పట్టుబడితే వాటికి రూ.50వేలు, రెండోసారి రూ.లక్ష జరిమానా విధిస్తున్నారు. 2015–16లో కేవలం ఇసుక అక్రమంగా తరలిస్తున్న లారీలను పట్టుకుని రూ.61.87లక్షలను జరిమానా రూపంలో వసూలు చేశారు. వీరికి మరింత సిబ్బందిని మరిన్ని అధికారాలు ఇస్తే ఆదాయం పెరగడంతోపాటు అక్రమ రవాణా తగ్గుతుంది.
     
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement