- మితిమీరిన వేగంతో ప్రమాదాలు
- గర్రెపల్లి నుంచి ట్రాక్టర్ల ద్వారా సరఫరా
- ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు
ప్రాణాలు బలిగొంటున్న ఇసుకాసురులు
Published Sat, Aug 20 2016 9:54 PM | Last Updated on Tue, Nov 6 2018 5:21 PM
చొప్పదండి : అక్రమ ఇసుక రవాణా అమాయకుల ప్రాణాలను బలిగొంటోంది. ఇసుక ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ పలు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. పగలు రాత్రి లేకుండా కొనసాగుతున్న అక్రమ దందా మూలంగా గ్రామాల్లోని సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అక్రమ వ్యాపారాలను అడ్డుకోవాల్సిన అధికారుల ఉదాసీన వైఖరి రోడ్డు మీద ప్రయాణించే వారిపాలిట శాపంగా మారుతోంది. ఇసుక రవాణ చేసే వాహనాలతో ప్రమాదాల బారిన పడి ప్రతి సంవత్సరం ఒకరిద్దురూ ప్రాణాలు వదులుతున్నారు.
అడ్డుకట్ట వేసేదెప్పుడో..
చొప్పదండి కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి నుంచి చొప్పదండి కేంద్రంగా అనుమతి లేకుండనే పగలు, రాత్రి తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుక రవాణా కొనసాగుతోంది. చొప్పదండి మండలంతో పాటు, పరిసరాలలో ఇసుకకొరత ఉండడంతో అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. చొప్పదండి శివార్లలో నిర్మాణ రంగం అభివృద్ధి చెందుతుండటంతో దళారులు కమీషన్ దందాలకు తెరలేపి ఇసుక అక్రమ రవాణాకు ఆజ్యాం పోస్తున్నారు. అక్రమ రవాణాపై కొరుఢా ఝులిపించాల్సిన అధికారులు మాముళ్ల మత్తులో తూగుతుండడంతో ఇసుక దళారులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఇసుక తరలించే వాహనాల వల్ల చొప్పదండితో పాటు భూపాలపట్నం, వెదురుగట్ట, కరీంనగర్ మండలం బహుదూర్‌ఖాన్‌పేట గ్రామాల్లో రోడ్ల వెంట ప్రజలు వెళ్లేందుకే జంకుతున్నారు. జనావాసాలు మధ్య నుంచే ఇసుక ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో వెలుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇసుక ట్రాక్టర్ల ఆగడాలను నిరోధించాలని స్థానికులు ఎన్నిసార్లు అధికారులకు వవిజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
నిఘా కరువు
చొప్పదండి కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్ అధికారులు సీరియస్‌గా దృష్టి సారించడం లేదు. అప్పుడప్పుడు దాడులు చేసి నామమాత్రంగా జరిమానాలు విధించి వదిలేస్తుండటంతో, అక్రమార్కులు తమ దందాను కొనసాగిస్తూనే ఉన్నారు. అధిక ధరలకు ఇసుక విక్రయిస్తూ జనాలను దోచుకుంటున్నారు. రూ. లక్షల్లో కొనసాగుతున్న దందాపై పలువురు అధికారులు చేతివాటం ప్రదర్శిస్తుండటంతో ఇసుక అక్రమ రవాణా దారుల వ్యవహారం బయటకు పొక్కడం లేదని విమర్శలు వస్తున్నాయి.
Advertisement
Advertisement