
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంతో పాటు ప్రపంచంలోని నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భారీ జనసమూహంతో కిటకిటలాడుతున్న ఈ ప్రాంతంలో పలు ఆసక్తికర ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా పరారీలోవున్న ఒక నేరస్తుడు పుణ్యస్నానం ఆచరిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.
వివరాల్లోకి వెళితే ఆదివారం మహా కుంభమేళాలో పర్యాటకులు, భక్తులు స్నానమాచరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఒక మద్యం స్మగ్లర్ కూడా పుణ్యస్నానం చేసేందుకు సంగమతీరానికి చేరుకున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వారు సంగమస్థలిలో మద్యం స్మగ్లర్ ప్రవేశ్ యాదవ్‌ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని భదోహి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిమన్యు మాంగ్లిక్ మీడియాకు తెలియజేశారు.
మద్యం స్మగ్లర్ ప్రవేశ్ యాదవ్ రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా నివాసి అని అభిమన్యు మాంగ్లిక్ తెలిపారు. ప్రవేశ్ యాదవ్ ఒకటిన్నర సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. 2023, జూలై 29న జాతీయ రహదారి-19పై వాహనాల తనిఖీలు చేస్తుండగా మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రవేశ్ యాదవ్, రాజ్ దోమోలియాలను పోలీసులు అరెస్టు చేసినట్లు అభిమన్యు పేర్కొన్నారు. నాడు ఆ నిందితులు బీహార్‌కు అక్రమంగా తరలిస్తున్న కల్తీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతలో ప్రవేశ్ యాదవ్ పోలీసుల కన్నుగప్పి, అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కుంభమేళాలో పుణ్యస్నానం చేసేందుకు ప్రవేశ్ యాదవ్ వచ్చాడన్న సమాచారం అందుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని అభిమన్యు మాంగ్లిక్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Mahakumbh-2025: 10 ప్రత్యేక ఆకర్షణలు.. సోషల్ మీడియాలో చక్కర్లు
Comments
Please login to add a commentAdd a comment