ఏపీ వాహనాలకు తెలంగాణ పన్ను
- రేపటి నుంచే అమలు; ఉత్తర్వు జారీ
- ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలన్న ఆంధ్రప్రదేశ్ అభ్యర్థన తిరస్కృతి
- త్రైమాసిక పన్ను చెల్లించాల్సిందేనని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించే అన్ని రకాల వాణిజ్య వాహనాల నుంచి ప్రవేశ పన్ను (ఎంట్రీ ట్యాక్స్) వసూలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ రాష్ట్రంలో త్రైమాసిక పన్ను చెల్లించినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధిలో తిరిగేందుకు ఉన్న వెసులుబాటు మార్చి 31తో ముగుస్తోంది. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నందున ప్రస్తుత విధానాన్ని కనీసం మరో ఐదేళ్లైనా కొనసాగించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లారీ యజమానుల సంఘం చేసిన విన్నపాన్ని తెలంగాణ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు.
ప్రస్తుత విధానాన్ని కనీసం రెండేళ్లపాటు కొనసాగించాలంటూ తెలంగాణ లారీ యజమానుల సంఘం కూడా కోరినా పట్టించుకోని ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి వచ్చే వాణిజ్య వాహనాల నుంచి త్రైమాసిక పన్ను వసూలు చేయనున్నట్లు పేర్కొంటూ సోమవారం ఉత్తర్వు జారీ చేసింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే దీన్ని అమలు చేసేందుకు నిర్ణయించి ఉత్తర్వు జారీ చేసింది.
కానీ ఏక పన్ను విధానం 2015 మార్చి 31 వరకు కొనసాగుతుందంటూ రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ ఆదేశించటంతో దాన్ని అమలు చేయాలంటూ లారీ యజమానుల సంఘంతోపాటు మరికొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా వారి వాదనను సమర్థిస్తూ మధ్యంతర ఉత్తర్వు జారీ చేయటంతో ఆ ఉత్తర్వును ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. మార్చి 31 గడువు తీరుతున్న నేపథ్యంలో పన్ను వసూలుకు నిర్ణయించి తాజా ఉత్తర్వు జారీ చేసింది.
వేటికి వర్తిస్తుంది..?
ప్రయాణికులను చేరవేసే కాంట్రాక్టు క్యారేజి వాహనాలు, సరుకు రవాణా వాహనాలు, మోటార్ క్యాబ్స్, మాక్సి క్యాబ్స్, వాణిజ్యపరమైన ట్రాక్టర్ ట్రైలర్లు, ఆటోరిక్షాలు... ఇలా అన్ని రకాల వాణిజ్య వాహనాలు ఇక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ బస్సులు కూడా దీని పరిధిలోకి వస్తాయి. అయితే వాటి సీట్ల సంఖ్య, వస్తున్న ఆదాయం తదితరాల ఆధారంగా వాటి పన్ను మొత్తాన్ని నిర్ధారిస్తారు. ఇందుకు ప్రత్యేక సూత్రీకరణ అమలులో ఉంది. దీని ప్రకారం సంవత్సరానికి ఒకేసారి ఆర్టీసీ ఈ మొత్తాన్ని చెల్లిస్తుంది. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీలో ఇది అమలులో ఉన్నందున యథాతథంగా దీన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులకు అమలు చేస్తారా లేదా అనేది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తదిపరి చేసుకునే ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీ రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగానే ఉన్నందున దీని విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
రెండేళ్లపాటు కొనసాగించకుంటే సమ్మెకు సై...
ప్రస్తుతం అమలులో ఉన్న ఏక పన్ను విధానాన్ని కనీసం మరో రెండేళ్లపాటైనా అమలు చేయాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కొత్త విధానంలో ప్రతి వాహనం రాష్ట్రం దాటి వెళ్తే వారానికి రూ. 1,800 మేర చెల్లించి తాత్కాలిక పర్మిట్ తీసుకోవాల్సి ఉంటుందని, అదే జరిగితే నిత్యావసరాల రవాణా భారమై అంతిమంగా ప్రజలపై ధరల ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలకు వినతిపత్రం అందజేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకోని పక్షంలో సమ్మె చేయటానికి కూడా వెనకాడబోమని హెచ్చరించినట్లు సంఘం ప్రతినిధి భాస్కర్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు.
ఆదాయం దాదాపు రూ. 50 కోట్లు-75 కోట్లు...
అఖిల భారత పర్మిట్ ఉన్న బస్సుల్లో ఒక్కో సీటుకు ప్రతి మూడు నెలలకు రూ. 3,625 చొప్పున, రాష్ట్ర పర్మిట్ ఉన్న బస్సుల్లో ఒక్కో సీటుకు రూ. 2,500, రెండు జిల్లాల పర్మిట్‌కు రూ. 1,200, ఒక్క జిల్లా పర్మిట్‌కు రూ. 950 చొప్పున పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ నుంచి నిత్యం దాదాపు 600 వరకు ప్రైవేటు బస్సులు తెలంగాణలోకి ప్రవేశిస్తున్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 200కు మించి బస్సులు వెళ్లటం లేదు. అలాగే 25 టన్నుల సామర్థ్యమున్న సరుకు రవాణా లారీలు దాదాపు ఐదు వేల వరకున్నాయి. మినీ లారీలు, ఇతర సరుకు రవాణా వాహనాలు మరో 4 వేల వరకు ఉన్నాయి. ఇవి అంధ్రప్రదేశ్-హైదరాబాద్ మధ్య తిరుగుతుంటాయి. ఒక్క బస్సుల ద్వారానే రూ. 25 కోట్ల వరకు ఆదాయం వస్తుందని, అన్నీ కలుపుకుంటే రూ. 50 కోట్ల నుంచి రూ.75 కోట్ల వరకు ఆదాయం ఉంటుందని తెలంగాణ రవాణాశాఖ అంచనా వేస్తోంది. కొత్త విధానంతో అదనంగా ఇంతమేర ఆదాయం సమకూరనుండటంతో ప్రస్తుత విధానాన్ని కొనసాగించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంత సుముఖంగా లేదు.