నల్లమలలో అతివేగం.. వన్యప్రాణులకు శాపం | Rare animals die in road accidents due to high speed of vehicles | Sakshi
Sakshi News home page

నల్లమలలో అతివేగం.. వన్యప్రాణులకు శాపం

Published Fri, Aug 30 2024 3:36 AM | Last Updated on Fri, Aug 30 2024 3:36 AM

Rare animals die in road accidents due to high speed of vehicles

హైదరాబాద్‌ – శ్రీశైలం రహదారిపై నిత్యం వేలసంఖ్యలో వాహనాల రద్దీ 

వాహనాల అతివేగంతో రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న అరుదైన జంతువులు 

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో ఐదేళ్లలో 800కు పైగా వన్యప్రాణులు బలి  

సాక్షి, నాగర్‌కర్నూల్‌: నల్లమల అటవీప్రాంతంలో వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలు..వన్యప్రాణుల పాలిట మృత్యుపాశాలుగా మారుతున్నాయి. అ మ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధి నుంచి హైదరాబాద్‌–శ్రీశైలం రహదారి వెళుతోంది. దట్టమైన అడవిలో స్వేచ్ఛగా విహరిస్తూ ఉండే వన్యప్రాణులు రహదారి దాటుతుండగానే వేగంగా వస్తున్న వాహనాలు ఢీకొని అక్కడికక్కడే మృత్యువాత పడుతున్నాయి.  

నిషేధం ఉన్నా.. తగ్గని వేగం  
హైదరాబాద్‌–శ్రీశైలం హదారిపై మన్ననూర్‌ నుంచి శ్రీశైలం వరకు సుమారు 70 కి.మీ. నల్లమల అటవీ ప్రాంతం గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలోకి రాగానే నిబంధనల మేరకు వాహనాలు గంటకు కేవలం 30 కి.మీ. వేగంతోనే ప్రయాణించాలి. ఇక్కడి వన్యప్రాణుల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అడవిలోని రహదారి గుండా ప్రయాణించేందుకు అనుమతి ఉంటుంది. అయితే అడవిలో గరిష్ట వేగం 30 కి.మీ. 

కాగా, వాహనదారులు మితిమీరిన వేగంతో వెళుతున్నారు. అడవిలో ఏదైనా వన్యప్రాణి అడ్డుగా వచ్చినప్పుడు అదుపు చేయలేకపోవడంతో వాహనాల కింద పడి అవి మరణిస్తున్నాయి. 2019 నుంచి ఇప్పటివరకు ఐదేళ్లలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో సుమారు 800కు పైగా వన్యప్రాణులు వాహనాల కిందపడి మరణించాయని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. రిపోర్టు కాని వన్యప్రాణుల మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.  

సూచిక బోర్డులకే పరిమితం  
హైదరాబాద్‌ నుంచి శ్రీశైలానికి నిత్యం వేలసంఖ్యలో వాహనాలు వెళుతున్నాయి. శని, ఆదివారాలతో పాటు ఇతర సెలవురోజుల్లో వాహనాల రద్దీ రెట్టింపు స్థాయిలో ఉంటుంది. నల్లమలలో ప్రయాణించే వాహనాల వేగాన్ని తగ్గించేందుకు అటవీమార్గంలో సూచిక బోర్డులతో పాటు 35 చోట్ల స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటు చేశామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే అక్కడక్కడా సూచిక బోర్డులు ఉన్నా వాహనాల వేగానికి బ్రేక్‌ పడటం లేదు. 

నిర్ణీత వేగానికి మించి వాహనాలు దూసుకెళ్తుండటం నల్లమలలోని పులులు, చిరుతలు, జింకలు, అరుదైన మూషికజింకలు, మనుబోతులు, సరీసృపాలు తదితర అమూల్యమైన జంతుసంపదకు ముప్పుగా పరిణమిస్తోంది. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో వాహనాల వేగాన్ని తగ్గించేందుకు వాహనదారులకు వి్రస్తృతంగా అవగాహన కలి్పంచడంతో పాటు, వేగానికి కళ్లెం వేసేందుకు స్పీడ్‌గన్‌లను ఏర్పాటుచేయాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

వాహనాల వేగం తగ్గించేందుకు చర్యలు  
అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ పరిధిలో ప్రయాణించే వాహనాల వేగాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. వన్యప్రాణులు తరచుగా రహదారులు దాటే ప్రాంతాల్లో 35 చోట్ల సూచికబోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు ఏర్పాటుచేశాం. వాహనాలు అటవీమార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు నెమ్మదిగా ప్రయాణించేలా వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం.  – రోహిత్‌ గోపిడి, డీఎఫ్‌ఓ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement