భారీగా పెరిగిన వాహనాలతో హైదరాబాద్ నగరం దిగ్బంధం
పీక్ అవర్స్‌లో అంగుళం కూడా ఖాళీ లేనట్టుగా కార్లు, బైకులు, ఇతర వాహనాలు
ప్రజా రవాణా సరిగా లేకపోవడంతో వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్న జనం
విస్తరణకు నోచుకోని మెట్రో,ఎంఎంటీఎస్, ఆర్టీసీ సర్వీసులు
పదేళ్లలో సగానికి తగ్గిన సిటీ బస్సులు.. సుమారు 5 లక్షల మందితో మెట్రో కిటకిట
కొన్ని ప్రాంతాలకే పరిమితమైనఎంఎంటీఎస్‌లు.. ప్రజా రవాణాను మెరుగుపర్చడమే పరిష్కారమంటున్న నిపుణులు
గ్రేటర్ పరిధిలో వాహనాలు..80 లక్షలు
కొత్తగా ఏటా మరో నాలుగైదు లక్షలు రోడ్డెక్కుతున్న తీరు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వాహన విస్ఫోటనం తారస్థాయికి చేరింది. రోడ్లపై అంగుళం కూడా ఖాళీలేనట్టుగా కార్లు, బైకులు, ఇతర వాహనాలు నిండిపోయి కనిపిస్తున్నాయి. నత్త నడకను తలపిస్తున్నట్టుగా ఒకదాని వెనుక ఒకటి మెల్లగా కదులుతున్నాయి. ఎప్పుడైనా కాసిన్ని చినుకులు పడితే అంతే.. గంటలకు గంటలు ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. బండి తీసుకుని రోడ్డెక్కితే నరకమే. అలాగని బస్సు ఎక్కుదామనుకుంటే.. అదే ట్రాఫిక్ చిక్కు. అంతంత సేపు కిక్కిరిసిన జనంలో నిలబడి ప్రయాణించలేని పరిస్థితి.
ఎంఎంటీఎస్ రైల్లోనో, మెట్రోలోనో వెళదామనుకుంటే.. ఇంటి నుంచి స్టేషన్లకు, స్టేషన్ల నుంచి ఆఫీసులకు వెళ్లేందుకు సరిగా రవాణా సదుపాయాలు లేని దుస్థితి. మొత్తంగా హైదరాబాద్ నగరం వాహనాల రద్దీతో ‘గ్రిడ్ లాక్’స్థాయికి చేరుకుంటోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రజారవాణాను మెరుగుపర్చడం, లాస్ట్‌మైల్ కనెక్టివిటీ కల్పించడమే ఈ సమస్యకు పరిష్కారమనే అభిప్రాయం వస్తోంది.
రవాణా సౌకర్యాలు సరిగా లేక..
హైదరాబాద్ మహానగరం అన్నివైపులా శరవేగంగా విస్తరిస్తోంది. ఇందుకు అనుగుణంగా రహదారులు, ప్రజారవాణా సదుపాయాలు మాత్రం పెరగడం లేదు. దీనితో వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా పెరిగింది. నగరం పరిధిలోనే ఏటా 3.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి.
ప్రస్తుతంఅన్ని రకాల వాహనాలు కలిపి 80 లక్షలు ఉంటే.. అందులో ద్విచక్ర వాహనాలు 60 లక్షలు, మరో 15 లక్షల వరకు కార్లు ఉండటం గమనార్హం. నగరంలోని రోడ్లపై రోజూ పీక్ అవర్స్‌లో ప్రతి కిలోమీటర్‌కు 30 వేల వరకు వాహనాలు ప్రయాణిస్తున్నట్టు అంచనా. ఇంత రద్దీతో నగరం దిగ్బంధమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రజా రవాణాలో కీలకమైన సిటీ బస్సుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
బెంగళూరు, ముంబై వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో బస్సుల సంఖ్య ఆరేడు వేలకుపైనే ఉంది. మరిన్ని బస్సులను పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. దానికి విరుద్ధంగా హైదరాబాద్‌లో బస్సుల సంఖ్య గత నాలుగైదేళ్లలో 3,885 నుంచి 2,550 కంటే తగ్గిపోవడం ఆందోళనకరం. ఔటర్ రింగ్‌రోడ్డును దాటి మరీ నగరం విస్తరిస్తూ ఉంటే.. ప్రజా రవాణా సౌకర్యాలు మాత్రం పెరగడం లేదు.
‘బండి’తప్పనిసరి అయిపోయి..
నగరంలో ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం నిత్యం రాకపోకలు సాగించేవారు సొంత వాహనాలపై ఆధారపడాల్సి న పరిస్థితి ఉంది. నగరంలోని చాలా ప్రాంతాలను ప్రధాన మార్గాలకు అనుసంధానించే ప్రజా రవాణా సౌకర్యం సరిగా లేకపోవడమే దీనికి కారణం. అదే బస్సెక్కే విద్యార్ధులు, సాధారణ ప్రయాణికులు కిక్కిరిసి, ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది.
మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ ఆ మేరకు బస్సుల సంఖ్య పెరగలేదు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ గణాంకాల ప్రకారం.. 7,228 చదరపు కిలోమీటర్ల హైదరాబాద్ మెట్రోపాలిటన్‌న్‌ఏరియా (హెచ్‌ఎంఏ) పరిధిలో ప్రజా రవాణా సదుపాయం 31 శాతమే ఉంది.
అక్కడ పెరిగాయి...ఇక్కడ తగ్గాయి..
బెంగళూరులో ప్రస్తుతం 7,000 సిటీ బస్సులు ఉన్నాయి. వీటిని 13,000కు పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. ఢిల్లీలోనూ బస్సుల సంఖ్యను 6,000 నుంచి 7,000కు పెంచారు. కానీ గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రం బస్సుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. నాలుగేళ్ల కిందటి వరకు ఇక్కడ 3,885 బస్సులు నడవగా.. ఇప్పుడీ సంఖ్య 2,550కు తగ్గింది. సిటీ జనాభా పెరుగుతున్న క్రమంలో ప్రజారవాణాలో కీలకమైన ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గిపోతుండటం ఆందోళనకరం.
హైదరాబాద్‌లో ప్రజారవాణా లెక్కలివీ..
హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా విస్తీర్ణం:7,228 చదరపు కిలోమీటర్లు
రోడ్ నెట్‌వర్క్: 5,400 కిలోమీటర్లు
జనాభా: కోటీ 8 లక్షలు
రాష్ట్ర జనాభా శాతం: 29.6 శాతం
పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్: 31 శాతం
కార్లు: 9 శాతం
క్యాబ్‌లు, ట్యాక్సీలు: 18 శాతం
బస్‌రూట్లు: 795
ప్రైవేట్ వాహనాలు: 51 శాతం
ఏం చేస్తే.. సమస్యకు చెక్ పెట్టొచ్చు?
మెట్రో మార్గాలు పెరిగితే ఎంతో ప్రయోజనం
నాగోల్–రాయదుర్గం, ఎల్‌బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్‌ల మధ్య ప్రస్తుతం రోజుకు 1,030కుపైగా మెట్రోరైలు ట్రిప్పులు నడుస్తున్నాయి. 4.8 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. మెట్రో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూపోతోంది. రైళ్లు, మెట్రో స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బోగీల సంఖ్య పెంచాల్సి ఉందని గత ఏడాదే గుర్తించారు.
కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. మూడు కోచ్‌ల మెట్రోలోనే కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. ఢిల్లీలోని మెట్రోరైళ్లలో 6 నుంచి 8 కోచ్‌లు ఉన్నాయి. బెంగళూర్‌లో కూడా 6 కోచ్‌లతో మెట్రో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్‌లో మాత్రం 2017 నుంచీ కూడా మూడు కోచ్‌లే ఉండటం గమనార్హం. అదనంగా కోచ్‌లను ఏర్పాటు చేస్తే తప్ప రద్దీ నియంత్రణకు పరిష్కారం లభించదు.
ఎంఎంటీఎస్‌ను విస్తరించాలి
ఎంఎంటీఎస్ రెండో దశ విస్తరణ పూర్తయినా సర్వీసులు మాత్రం పెరగలేదు. పైగా గతంలో 121 ఎంఎంటీఎస్‌లు ఉంటే ఇప్పుడు 70కి తగ్గాయి. మరోవైపు లింగంపల్లి నుంచి పటాన్‌చెరు–తెల్లాపూర్ వరకు, మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు, సికింద్రాబాద్ నుంచి ఘట్‌కేసర్ వరకు ఎంఎంటీఎస్ లైన్లు అందుబాటులోకి వచ్చాయి.
కానీ అందుకు అనుగుణంగా సర్వీసులు పెరగలేదు. ప్రయాణికుల సంఖ్యను బట్టి చూస్తే.. వివిధ మార్గాల్లో కలిపి కనీసం 250 ఎంఎంటీఎస్ సర్వీసులు నడపాల్సి ఉంటుందని అంచనా. కానీ ప్రస్తుతం అందులో మూడో వంతు కూడా లేవు. కొత్తగా ఎంఎంటీఎస్ విస్తరణతోపాటు సర్వీసుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది.
లాస్ట్‌మైల్ కనెక్టివిటీ అవసరం...
మెట్రోరైల్ స్టేషన్ల నుంచి కాలనీలకు, శివారు ప్రాంతాలకు సమర్థవంతమైన కనెక్టివిటీ లేకపోవడం వల్ల నగరవాసులు సొంత వాహనాలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. మెట్రో రైలు దిగిన ప్రయాణికుడు ఇంటికి చేరేందుకు మరో ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేదు. ఆటోలు, క్యాబ్‌లలో వెళ్లాలంటే.. రోజూ వందలకు వందలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది ఆచరణ సాధ్యం కాదు. అదే లాస్ట్‌మైల్ కనెక్టివిటీని పెంచితే.. ప్రజా రవాణా వినియోగం పెరుగుతుంది.
ప్రజారవాణా పెరగాలి
వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గాలంటే ప్రజారవాణా సదుపాయాలు పెరగడం ఒక్కటే పరిష్కారం. గత పదేళ్లలో జనాభా పెరిగినట్టుగా రవాణా సదుపాయాలు పెరగలేదు. దీంతో ప్రజలు సొంత వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. – మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్, ఉపరవాణా కమిషనర్, రంగారెడ్డి జిల్లా
కనెక్టివిటీయే అతిపెద్ద సవాల్
హైదరాబాద్ నగరానికి నలువైపులా కనెక్టివిటీ లేకపోవడం ఇక్కడి ప్రజారవాణాలో అతి పెద్ద సమస్య. దీనితో వాహనాల వినియోగం బాగా పెరిగింది. కాలుష్య కారకాలు కూడా ప్రమాదకర స్థాయికి చేరాయి. ప్రభుత్వం తక్షణమే ప్రజారవాణా సదుపాయాలపై దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. – ప్రొఫెసర్ పురుషోత్తమ్‌రెడ్డి, పర్యావరణ నిపుణుడు
గ్రేటర్‌లో వాహనాల విస్ఫోటనమిదీ
కేటగిరీ వాహనాల సంఖ్య
ఆటోరిక్షాలు 1,07,862
కాంట్రాక్ట్ క్యారేజీలు 6,835
స్కూల్ బస్సులు 14,624
ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలు 41
మ్యాక్సీక్యాబ్‌లు 15,754
గూడ్స్ వాహనాలు 3,14,359
క్యాబ్‌లు 79,609
కార్లు 14,82,028
ద్విచక్ర వాహనాలు 59,25,468
ప్రైవేట్ సర్వీస్ వాహనాలు 2,274
స్టేజీ క్యారేజీలు 8,569
ట్రాక్టర్ ట్రాలర్లు 45,806
ఇతర వాహనాలు 40,421
మొత్తం వాహనాలు 80,43,650
Comments
Please login to add a commentAdd a comment