Telangana RTA Staff Corruption Peaks in Smart Cards Distribution - Sakshi
Sakshi News home page

ఏం తెలివి.. 'స్మార్ట్'గా దోచేస్తున్నారు..

Published Wed, Aug 18 2021 7:48 AM

Telangana: Rta Department Staff Facing Corruption In Issuing Smart Cards Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏలో ‘స్మార్ట్‌’ దోపిడీ యధేచ్చగా కొనసాగుతోంది. వాహనదారులకు   స్మార్టు కార్డులను అందజేసేందుకు గ్రేటర్‌లోని పలు ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో  సిబ్బంది చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్పీడ్‌ పోస్టు ద్వారా వినియోగదారుల ఇంటికే నేరుగా పంపించవలసిన డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల ఆర్సీ తదితర స్మార్ట్‌కార్డులను ఏజెంట్లకు కట్టబెడుతున్నారు. కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఇందుకోసం ఒకరిద్దరిని ప్రత్యేకంగా నియమించడం గమనార్హం. ఒక్కో కార్డుపైన రూ.100 నుంచి రూ.150 చొప్పున కొన్ని కార్యాలయాల్లో ప్రతి రోజు వందకు పైగా స్మార్ట్‌ కార్డులను విక్రయిస్తున్నారు. కొంతమంది సిబ్బంది ఇలా చేతివాటాన్ని ప్రదర్శించడం ఆర్టీఏ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. రవాణాశాఖ అందజేసే వివిధ రకాల పౌరసేవల్లో పారదర్శకతను పెంపొందించేందుకు ఆన్‌లైన్‌ సేవలను  విస్తృతం చేశారు.  డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం మాత్రం వినియోగదారులు నేరుగా ఆర్టీఏ కార్యాలయాలను సంప్రదించవలసి ఉంటుంది. ఈ క్రమంలో స్మార్ట్‌కార్డులనే నేరుగా అందజేసేందుకు ఈ తరహా అక్రమాలకు పాల్పడుతున్నారు.

చిరునామా నిర్ధారణకే స్పీడ్‌ పోస్టు... 
డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీలు, తదితర డాక్యుమెంట్‌లను గతంలో వాహనదారులకే నేరుగా అందజేసే వారు. దీంతో  చాలామంది నకిలీ అడ్రస్‌లపైన ఆర్టీఏ పౌరసేవలను పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. కీలకమైన  డ్రైవింగ్‌ లైసెన్సు వంటి  డాక్యుమెంట్లు అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్లవచ్చుననే ఆందోళన వివిధ స్థాయిల్లో  వ్యక్తమైంది. పైగా ఒకే వ్యక్తి రకరకాల చిరునామాలపైన ఒక టి కంటే ఎక్కువ డ్రైవింగ్‌ లైసెన్సులు తీసుకొనేవా రు. వాహనాల అమ్మకాలు, యాజమాన్య బదిలీల్లో నూ అక్రమాలు జరిగాయి. దీంతో వాహనదారుల చిరునామా నిర్ధారణను తప్పనిసరి చేశారు. ఇందుకోసం డాక్యుమెంట్‌లను వాహనదారులకు నేరుగా ఇవ్వకుండా స్పీడ్‌ పోస్టు ద్వారా ఇంటికే పంపించేందుకు చర్యలు చేపట్టారు. సర్వీసు చార్జీల్లో భాగంగా స్పీడ్‌ పోస్టు కోసం రూ.35 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ మేరకు స్పీడ్‌పోస్టు చార్జీలు చెల్లించినప్పటికీ ఏజెంట్ల ద్వారా డాక్యుమెంట్‌లనే నేరుగా తీసుకొనేందుకు మరో రూ.100 నుంచి రూ.150 వరకు ఖర్చు చేయవలసి వస్తుంది.  

కొరవడిన నియంత్రణ.. 
గ్రేటర్‌లోని 10 ప్రాంతీయ రవాణా కార్యాలయాల నుంచి వివిధ రకాల పౌరసేవలపైన ప్రతి రోజు సుమారు 2500 నుంచి 3000 స్మార్ట్‌ కార్డులు పంపిణీ అవుతాయి. కొన్ని ఆఫీసుల్లో కచ్చితంగా పోస్టు ద్వారానే వినియోగదారులకు చేరవేస్తున్నప్పటికీ మరి కొన్ని ఆఫీసుల్లో మాత్రం 50 శాతం నుంచి 60 శాతం కార్డులను నేరుగా అందజేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ దందా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement