
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి సభకు హాజరు
గవర్నర్ ప్రసంగం అనంతరం నందినగర్ నివాసానికి..
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు నందినగర్‌లోని నివాసం నుంచి కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. ఆయన వెంట పార్టీ నేతలు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి రాగా, ఇంటి వద్ద కార్యకర్తలు కొబ్బరికాయలు కొట్టి వాహనంపై గులా బీ పూలు చల్లారు. సభ ప్రారంభానికి అరగంట ముందే అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండలిలో ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి, హరీశ్‌రావు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగ తం పలికారు.
గంగుల కమలాకర్, కేపీ వివేకానంద్, తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డి కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేశారు. శాసనసభ లాబీలో తన కు కేటాయించిన చాంబర్‌లో అరగంట పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ మాట్లాడారు. బీఆర్‌ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తన తమ్ముడి కుమారుడి వివాహానికి రావాల్సిందిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ శుభలేఖ అందజేశారు.
అశ్వారావుపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కూడా కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీ సమావేశాలు ఉదయం 11కి ప్రారంభం కాగా, 5 నిమిషాల ముందే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కేసీఆర్ సభలోకి వెళ్లారు. గవర్నర్ ప్రసంగం ముగిశాక సభ వాయిదా పడగానే అసెంబ్లీ నుంచి కేసీఆర్ తిరిగి నందినగర్ నివాసానికి వెళ్లిపోయారు.
కేసీఆర్‌ను కలిసిన మంత్రి తుమ్మల
శాసనసభకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలిశారు. ఆయన యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. కేసీఆర్ కూడా మంత్రి తుమ్మల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment