రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ ధ్వజం
రైతుబంధు అమలు చేతకాకుంటే..
రైతుల కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలి
కేసీఆర్ పాలనలో రైతే రాజు.. ఇప్పుడు యాచించే స్థితికి తెస్తారా?
రైతుబంధులో ‘రూ. 22 వేల కోట్ల దుర్వినియోగం’పై వివరాలు బయటపెట్టాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి రైతుబంధు పథకం అమలు చేయడం చేతకాకపోతే రైతుల కాళ్లు పట్టుకొని క్షమాపణ కోరాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశారు. గతంలో వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనకు తలొగ్గి ఏడాది తర్వాత వెనక్కి తగ్గి ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారని ఆయన గుర్తుచేశారు. గత బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ రైతులను రాజులుగా శాసించే స్థితికి తీసుకెళ్తే.. రేవంత్ ప్రభుత్వం మాత్రం వారిని యాచించే స్థాయికి దిగజారుస్తోందని ఆరోపించారు.
కేసీఆర్ ఆనవాళ్లు చెరి పేయడమే లక్ష్యంగా రైతుబంధు పథకాన్ని బొందపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నేతలతో కలిసి కేటీఆర్ విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. ‘రైతు భరోసా కోరు కొనే రైతులు ప్రమాణ పత్రాలు ఇవ్వాలని చెప్పడం సిగ్గు మాలిన చర్య. ప్రభుత్వానికి దమ్ముంటే రైతు రుణమాఫీ, వరికి బోనస్, ధాన్యం కొనుగోలుకు డబ్బు చెల్లింపు, రైతు బంధు పథకంపై ఊరూరా ‘ఇమాన పత్రాలు’ ఇవ్వాలి.
ఏడాది నుంచి గ్రామాలవారీగా ఎందరు కౌలు రైతులు, రైతు కూలీలకు లబ్ధి జరిగిందో జాబితాలు ప్రదర్శించాలి. రైతు బంధులో రూ. 22 వేల కోట్లు పక్కదారి పట్టినట్లు ఆరోప ణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఆ వివరాలు కూడా గ్రామాల వారీగా బయట పెట్టాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
దరఖాస్తులపై ప్రభుత్వాన్ని నిలదీయండి
‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు తదితరాల కోసం అభయ హస్తం పేరిట 1.06 కోట్ల దరఖాస్తుల స్వీకరణ చేపట్టింది. ఇటీవల కులగణన పేరిట నిర్వహించిన ఇంటింటి సర్వేలోనూ రైతుల పూర్తి వివరాలు సేకరించింది. అలాంటప్పుడు రైతుల నుంచి మళ్లీ ప్రమాణ పత్రాలు కోరాలనే అలోచన దుర్మార్గం. గతంలో ఇచ్చిన దరఖాస్తులపై అధికారులను రైతులు నిలదీయాలి. పత్తి, కంది, చెరుకు, పసుపు, మిర్చితోపాటు ఇతర ఉద్యాన పంటలకు రైతుబంధు ఎగ్గొట్టే ఉద్దేశంతోనే ప్రభుత్వం ప్రమా ణ పత్రాలను తెరపైకి తెచ్చింది.
క్రషర్లు, రియల్ ఎస్టేట్, వెంచర్లు, గుట్టలు, రాళ్లు రప్పలకు రైతుబంధు ఇచ్చారని ఆరోప ణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు ఊరూరా ఆ వివరాలు బయట పెట్టాలి. ఏడాది కాలంగా రైతుబంధు ఇవ్వకుండా ఎగవేసిన ప్రభుత్వం ఒక్కో రైతుకు ఎకరాకు రూ. 17 వేలు చొప్పున బకాయి పడింది. ఒక ఎకరా మొదలుకొని ఏడు ఎకరాల వరకు లెక్కతీసి రైతుబంధు రూపంలో రైతులకు రావాల్సిన బకాయిలపై గ్రామ గ్రామాన పోస్టర్లు వేస్తాం.
రైతుభరోసాలో కోతలు విధిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా రైతులతో కలిసి ఉద్యమిస్తాం’అని కేటీఆర్ హెచ్చరించారు. తమ హయాంలో రైతుల నుంచి ఎలాంటి దరఖాస్తులు తీసుకోకుండా, ఆఫీసుల చుట్టూ వారు తిరిగే అవసరం లేకుండా 11 సీజన్లలో రూ. 73 వేల కోట్లను రైతుల ఖాతాలో వేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment