‘మండలి’ పోటీపై నేడోరేపో బీఆర్‌ఎస్‌ స్పష్టత | BRS Working President KTR meets KCR | Sakshi
Sakshi News home page

‘మండలి’ పోటీపై నేడోరేపో బీఆర్‌ఎస్‌ స్పష్టత

Jan 31 2025 12:56 AM | Updated on Jan 31 2025 7:48 AM

BRS Working President KTR meets KCR

కేసీఆర్‌తో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భేటీ 

పట్టభద్రుల కోటాలో పోటీ, ఆశావహుల వినతిపై చర్చ 

ఎస్సీ వర్గీకరణ పోరాట వ్యూహంపై మంతనాలు

సాక్షి, హైదరాబాద్‌: శాసనమండలిలో మూడు స్థానాల ఎన్నికలకు సంబంధించి షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో గురువారం భేటీ అయ్యారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మండలి ఎన్నికల్లో పోటీ, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా ఈ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్నా.. జ్వరం కారణంగా హాజరు కాలేదని తెలిసింది. 

మెదక్‌– కరీంనగర్‌– నిజామాబాద్‌– ఆదిలాబాద్, వరంగల్‌– ఖమ్మం– నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై పార్టీ పరంగా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎవరికైనా అధికారికంగా మద్దతు ఇవ్వాలా? లేక తటస్థంగా ఉండాలా? అనే అంశంపై ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాపై స్పష్టత వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. 

పట్టభద్రుల కోటాలో ‘మెదక్‌– కరీంనగర్‌– నిజామాబాద్‌– ఆదిలాబాద్‌’స్థానం నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్న విషయం ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఆశావహులు కూడా పార్టీ వైఖరిపై స్పష్టత ఇవ్వాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో కేటీఆర్‌ దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు. 
 
ఎస్సీ వర్గీకరణ.. స్థానిక ఎన్నికలు 
ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలుచేయాలన్న డిమాండ్‌తో ఫిబ్రవరి 7న ఎంఆర్‌పీఎస్‌ నిర్వహించనున్న బహిరంగ సభపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన తీర్మానానికి అనుగుణంగా ముందుకు సాగాలని కేసీఆర్‌ సూచించినట్లు తెలిసింది.

రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నివాసంలో జరిగిన పార్టీ మాదిగ సామాజికవర్గం నేతల భేటీలో చర్చించిన అంశాలను కేసీఆర్‌కు కేటీఆర్‌ వివరించారు. ఉద్యోగాలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వం ముందు పెట్టాలని నిర్ణయించారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ పరంగా సన్నద్ధతను వేగవంతం చేయాలని కేసీఆర్‌ సూచించారు.  



నేడు మున్సిపల్‌ మాజీ చైర్మన్ల ఆత్మీయ సమావేశం 
ఇటీవల పదవీకాలం ముగిసిన బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్లు, వైస్‌ చైర్‌పర్సన్లు శుక్రవారం తెలంగాణ భవన్‌లో సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆత్మీయ భేటీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, మాజీమంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథులుగా హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement