
ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్
అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని పార్టీ నేతలకు కేసీఆర్ ఆదేశం... బయటికి పంపితే వివిధ రూపాల్లో నిరసన తెలపాలి
22న చెన్నైలో జరిగే భేటీలో తెలంగాణపై కేంద్ర వివక్షను ప్రశ్నించాలి
పార్టీ రజతోత్సవాల కోసంభారీగా ఏర్పాట్లు చేయాలని సూచన
ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో కేటీఆర్ సమావేశం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా ప్రధాన ప్రతిపక్షంగా బలంగా గొంతు వినిపించాలని బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలను ఆదేశించారు. ప్రభుత్వం పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు అసెంబ్లీలో బీఆర్‌ఎస్ సభ్యుల సస్పెన్షన్‌ను ప్రభుత్వం ఆయుధంగా ఎంచుకుందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులంతా అసెంబ్లీ సమావేశాలకు క్రమం తప్పకుండా వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఎండగట్టాలని స్పష్టం చేశారు.
ఒకవేళ అసెంబ్లీ నుంచి బలవంతంగా బయటికి పంపినా వివిధ రూపాల్లో నిరసన తెలపాలని స్పష్టం చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరవుతారని భావించినా హోలీ పండుగ నేపథ్యంలో కేటీఆర్ ఒక్కరే వెళ్లినట్టు పార్టీవర్గాలు తెలిపాయి.
ముందుగా ప్లాన్‌చేసుకునే సస్పెన్షన్లు
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మా నంపై చర్చ సందర్భంగా రచ్చ చేసి బీఆర్‌ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ ఎల్పీ భేటీలోనే ప్లాన్ చేసుకున్నారని కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. ‘‘అసెంబ్లీ సమావేశాల నుంచి బహిష్కరించడం ద్వారా ప్రజా సమస్యలు, ఆకాంక్షలు చర్చకు వచ్చే అవకాశం లేకుండా పోతుంది. రాష్ట్ర ప్రభు త్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లోని డొల్లతనాన్ని బయట పెట్టేందుకు సమావేశాలను ఉపయోగించుకోవాలి. దూషణలు, పరస్పర విమర్శల జోలికి వెళ్లకుండా పూర్తి అధారాలు, అంకెలతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాలి’’అని సూచించినట్టు సమాచారం.
పార్టీ రజతోత్సవాలపైనా చర్చ
బీఆర్‌ఎస్ రజతోత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా కేసీఆర్ పలు సూచనలు చేశారు. వరంగల్‌లో ఏప్రిల్ 27న నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే దృష్టి సారించారు. ఆ సభను విజయవంతం చేసేందుకు జరగాల్సిన కసరత్తు, నియోజకవర్గాల వారీ గా సన్నాహక సమావేశాలు, సన్నాహక కమిటీల ఏర్పాటు వంటి అంశాలపైనా కేటీఆర్‌కు కేసీఆర్ ప లు సూచనలు చేశారు. ఏర్పాట్లకు సంబంధించి త్వ రలో కేటీఆర్ అన్ని జిల్లాల ముఖ్య నేతలతో ఒక ప్ర త్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.
22న డీఎంకే భేటీకి కేటీఆర్
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో ఈ నెల 22న చెన్నైలో జరిగే దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష భేటీకి హాజరుకావాల్సిందిగా కేటీఆర్‌ను కేసీఆర్ ఆదేశించారు. ఆ భేటీలో బీఆర్‌ఎస్ పక్షాన ప్రస్తావించాల్సిన అంశాలు, పోరాట రూపాలు, ఐక్యకార్యాచరణ, అవలంబించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చూపుతున్న వివక్ష, దానిపై బీఆర్‌ఎస్ చేసిన పోరాటాలను కూడా ప్రస్తావించాలని సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన, నిధుల పంపిణీలో వివక్ష, దేశ ఆర్థిక వ్యవస్థకు దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్న కంట్రిబ్యూషన్ తదితరాలపైనా దిశానిర్దేశం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment