
ఈ నెల 27 వరకు కొనసాగనున్న అసెంబ్లీ సమావేశాలు
గురు, శనివారాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ
17, 18 తేదీల్లో ప్రభుత్వ బిజినెస్.. ఎస్సీ, బీసీ రిజర్వేషన్లపై చర్చ.. బీఏసీలో నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రభుత్వం 19వ తేదీన (బుధవారం) ఉభయ సభల్లో రాష్ట్ర బడ్జెట్ 2025–26ను ప్రవేశపెట్టనుంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన బుధవారం స్పీకర్ చాంబర్‌లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరిగింది.
ఇందులో ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, బీఆర్‌ఎస్ తరఫున మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్‌రెడ్డి, సీపీఐ తరఫున కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు.
సుమారు గంట పాటు సాగిన ఈ భేటీలో.. తాము ప్రతిపాదించిన అంశాలను సభా వ్యవహారాల్లో చేర్చాలని బీఆర్‌ఎస్, బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. సభను కనీసం 20 రోజుల పాటు నిర్వహించాలని బీఆర్‌ఎస్ కోరింది. మరోవైపు బీఏసీ సమావేశంలో ఖరారు కావాల్సిన ఎజెండాను ముందుగానే బయటికి లీక్ చేశారంటూ హరీశ్‌రావు వాట్సాప్ సందేశాలను చూపించారు. చివరికి పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అవసరమైతే సమావేశాలను పొడిగిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు.
విడివిడిగా మూడు రోజుల విరామంతో..
బీఏసీ నిర్ణయం ప్రకారం.. గురువారం (13న) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపడతారు. 14న హోలీ పండుగ సందర్భంగా విరామం ప్రకటించి, 15న చర్చను కొనసాగిస్తారు. 16న ఆదివారం విరామం. 17న ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరుగుతుంది. అదే రోజున బీసీ రిజర్వేషన్లు, 18న ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించిన తీర్మానాలపై చర్చ జరిగే అవకాశముంది.
19న రాష్ట్ర బడ్జెట్ 2025–26ను ప్రవేశపెడతారు. సభ్యులు బడ్జెట్‌ను అధ్యయనం చేసేందుకు 20న విరామం ప్రకటించారు. తిరిగి 21 నుంచి 26వ తేదీ వరకు బడ్జెట్ ప్రతిపాదనలు, పద్దులపై చర్చ జరుగుతుంది. 27న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి, ఆమోదించిన తర్వాత సమావేశాలు నిరవధికంగా వాయిదా పడనున్నాయి. శాసనసభ తరహాలోనే శాసనమండలి సమావేశాల షెడ్యూల్‌ను కూడా ఖరారు చేయగా.. అందులో ఈ నెల 22 నుంచి 26 వరకు విరామం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment