
ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చిత్రంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్
విశ్వాసం నిబద్ధతతో కలిసి నడుద్దాం.. రాష్ట్రాన్ని ఆదర్శంగా మారుద్దాం
బడ్జెట్ భేటీ సందర్భంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
తెలంగాణ కేవలం పురోగమించడమే కాకుండా రూపాంతరం చెందుతోంది
అన్ని వర్గాల సంక్షేమానికి, సుస్థిర పురోగతికి ప్రభుత్వం బాటలు వేస్తోంది.. రైతన్న సంక్షేమానికి సర్కారు కట్టుబడి ఉంది
యువత, మహిళల సాధికారత కోసం పథకాలు, కార్యక్రమాలు
‘సమగ్ర సర్వే’తో సాహసోపేత మార్పు దిశగా ప్రయాణం
రేపటి తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవబోతోంది
యువ, డైనమిక్ సీఎం సారథ్యంలో ప్రభుత్వానిది దృఢమైన సంకల్పమన్న గవర్నర్
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ కేవలం పురోగమించడమే కాకుండా రూపాంతరం చెందుతోంది. సమ్మిళితత్వం, స్వయం సమృద్ధి, సాధికార తెలంగాణ అనే విజన్.. సాహసోపేత సంస్కరణలు, ప్రజా కేంద్రీకృత సుపరిపాలన, నిర్ణయాత్మక నాయకత్వంతో సాకారమవుతోంది. అన్ని వర్గాల సంక్షేమానికి, సుస్థిర పురోగతికి ప్రభుత్వం బాటలు వేస్తోంది సమానత్వం, పురోగతిలో దేశానికి దిక్సూచి అయ్యే తెలంగాణ నిర్మాణానికి సంఘటితంగా, విశ్వాసంతో, స్థిరమైన నిబద్ధతతో అందరం కలిసి ముందుకు సాగుదాం..’ అని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బుధవారం ఉదయం ఉభయసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి అమలు, లక్ష్యాలు, ప్రభుత్వ విజయాలను వివరించారు. గవర్నర్ మాట్లాడుతున్నంతసేపు ప్రధాన ప్రతిపక్ష సభ్యులు నిరసన నినాదాలు చేస్తూనే ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చేయి చూపటం ద్వారా పలుమార్లు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. మరోవైపు గవర్నర్ కీలకాంశాలను ప్రస్తావించినప్పుడల్లా..అధికార పక్ష సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం ప్రకటించారు. గవర్నర్ 35 నిమిషాల పాటు ఆంగ్లంలో ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రానికి రైతాంగమే ప్రాణం
‘రాష్ట్రంలోని ప్రతి పౌరుడు కలలుగన్న దిశలో పురోగమించేందుకు అవసరమైన అవకాశాలను కల్పించే నిబద్ధతకు అద్దం పట్టేదిగా ఈ బడ్జెట్ సమావేశం ఉండనుంది. తెలంగాణ రాష్ట్రానికి రైతాంగమే ప్రాణం. మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేందుకు వారి కృషే కీలకం. అలాంటి రైతన్నల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. తొలుత హామీ ఇచ్చినట్టుగా రూ.2 లక్షలు చొప్పున పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. రూ.20,616.89 కోట్ల మొత్తంతో 25.35 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చింది. రైతు భరోసా పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని ఎకరాకు రూ.12 వేలకు పెంచింది.
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో భూమిలేని వ్యవసాయ కార్మీకులకు ఎన్నడూ లేని విధంగా సహాయం చేస్తూ ఏడాదికి రూ.12 వేలను సమకూరుస్తోంది. 566 రైతు వేదికలను ఏర్పాటు చేసింది. 260 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తిదారుగా తెలంగాణ ఆవిర్భవించింది. సన్న రకం వరి ధాన్యానికి కింటాల్‌కు రూ.500ల బోనస్ చొప్పున రూ.1,206.44 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్ట పరిచేందుకు తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ను ఏర్పాటు చేసింది..’ అని గవర్నర్ చెప్పారు.
గేమ్ ఛేంజర్‌గా మహాలక్ష్మి పథకం
‘బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిన మహాలక్ష్మి పథకం గేమ్ ఛేంజర్‌గా మారింది. ఇప్పటివరకు మహిళలకు రూ.5,005.95 కోట్లు ఆదా చేసింది. ఇటీవలే ఆమోదించిన ఇందిరా మహిళాశక్తి మిషన్ పాలసీ ద్వారా రూ.లక్ష కోట్ల ఆర్థిక సాయ లక్ష్యంతో లక్షమంది మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం తయారు చేస్తోంది. 50 లక్షల పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా అందిస్తోంది.
43 లక్షల కుటుంబాలకు రూ.500కే ఎల్పీజీ సిలిండర్ అందిస్తోంది. మహిళా సంఘాలకు 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టులను కేటాయించింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు సాధికారతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాదిలో 55 వేల మంది ప్రభుత్వోద్యోగాలు పొందారు. ఇది ఎన్నడూ సాధించని విజయం.
ప్రపంచ స్థాయి అథ్లెట్లను తయారు చేయడానికి యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సమీకృత గురుకులాల ప్రారంభంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు అత్యంత నాణ్యమైన విద్యను అందించేందుకు సిద్ధమవుతోంది. పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి రంగారెడ్డి జిల్లాలో యంగ్ ఇండియా పోలీసు స్కూల్‌ను ఏర్పాటు చేస్తోంది..’ అని గవర్నర్ తెలిపారు.
బీసీలకు 42% రిజర్వేషన్లకు, ఎస్సీ వర్గీకరణకు బిల్లులు
‘రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నిర్వహించడం ద్వారా ప్రభుత్వం సాహసోపేత మార్పు దిశగా ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. సామాజిక న్యాయాన్ని అందించే దిశగా వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక బిల్లును ప్రతిపాదించింది. షెడ్యూల్డు కులాల ఉప వర్గీకరణ కోసం ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టనుంది. అత్యంత అణగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎస్సీ కులాలకు రిజర్వేషన్ ప్రయోజనాలను మరింత న్యాయోచితంగా, సమతుల్యంగా అందించడమే దీని ఉద్దేశం..’ అని జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.
దావోస్‌లో ‘తెలంగాణ రైజింగ్’
‘దావోస్‌లో తెలంగాణ రైజింగ్ డెలిగేషన్ 49,500 మందికి ఉద్యోగాలను కల్పించేలా రూ.1,78,950 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. తెలంగాణకు జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగేలా పర్యాటక రంగాన్ని ప్రభుత్వం సమగ్రంగా అభివృద్ధి చేయనుంది. ఇందుకు ప్రత్యేక పర్యాటక విధానాన్ని సిద్ధం చేసింది. భూ పరిపాలనను క్రమబదీ్ధకరించడానికి, పౌరులందరికీ భూ భద్రతను కల్పించడానికి, భూ వివాదాలను తగ్గించడానికి, భూ రికార్డులలో పారదర్శకతను పెంపొందించడానికి భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టింది. సుస్థిర ప్రపంచ శ్రేణి నగర నిర్మాణం కోసం ప్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయబోతోంది..’ అని గవర్నర్ చెప్పారు.
ప్రతి కేటాయింపు వెనుక ప్రజల ఆకాంక్షలు
‘బడ్జెట్ కేవలం అంకెల కూర్పు కాదు. ప్రభుత్వ భవిష్యత్తు ప్రాధాన్యతలు, విజన్‌కు ప్రతిబింబం. మన పాలసీలను, కార్యక్రమాలను, సంక్షేమ చర్యలను తెలియజేసే ఒక ఆర్థిక నమూనా. కొన్నిసార్లు అంకెలు భయపెట్టినప్పటికీ, ప్రతి కేటాయింపు వెనుక ప్రజల ఆకాంక్షలు ఉంటాయని గుర్తించాలి. యువ, డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సంకల్పం దృఢమైంది.
ప్రవేశపెట్టిన ప్రతి పాలసీ, ప్రతి కార్యక్రమం, ప్రతి సంస్కరణ ప్రజల సాధికారతకు, సమ్మిళిత వృద్ధి కోసం ఉద్దేశించిందే. ప్రస్తుత తెలంగాణ అవకాశాలు, అభివృద్ధి, సాధికారతగల రాష్ట్రంగా ఉంది. రేపటి తెలంగాణ మరింత ఉజ్వలంగా, ఆర్థిక అభివృద్ధి, వ్యవసాయ పరిపుష్టి, సాంకేతిక విజ్ఞాన వినూత్నత, సామాజిక న్యాయంలో అగ్రగామిగా నిలవబోతోంది.
డాక్టర్ అబ్దుల్ కలామ్ అన్నట్లు ‘‘కలలు కనండి, కలలు ఆలోచనలుగా మారుతాయి, ఆ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి’’. ప్రజల కలలను ఈ ప్రభుత్వం విశ్వసిస్తుంది, విజన్, సంకల్పం, కార్యాచరణ ద్వారా వాటిని వాస్తవాలుగా మారుస్తుంది..’ అని గవర్నర్ చెప్పారు. జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఏర్పాటు చేయడాన్ని, సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు తదితర అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment