budget meeting
-
ప్రీ-బడ్జెట్ సమావేశం: వాటిపై నిషేధం ఎత్తివేయండి!
న్యూఢిల్లీ: గోధుమ వంటి వ్యవసాయ వస్తువుల ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని అలాగే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే తక్కువ ధర ఉన్న ఉత్పత్తుల దిగుమతిని పరిమితం చేయాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. పామాయిల్‌కు బదులుగా సోయాబీన్, ఆవాలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి స్థానిక నూనె గింజల దేశీయ ఉత్పత్తిని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కూడా రైతు సంఘాలు సూచించాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్‌పై అధిక పన్నుల విధించాలని కోరాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రతినిధులతో వెర్చువల్‌గా ప్రీ-బడ్జెట్ 2023 సంప్రదింపులను ఇక్కడ నిర్వహించి వారి అభిప్రాయాలను స్వీకరించారు. వారు వ్యక్తం చేసిన మరిన్ని అభిప్రాయాలను పరిశీలిస్తే.. ► కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కంటే తక్కువగా ఉన్న ఉత్పత్తుల దిగుమతిని ప్రభుత్వం అనుమతించకూడదని తన కోర్కెల పత్రంలో భారత్ కృషిక్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జాకర్ డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో మౌలిక వనరులు, మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. ‘వ్యవసాయం రాష్ట్ర సబ్జెక్ట్‌గా ఉంది. చాలా రాష్ట్రాలు సంబంధిత శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదు. దీని కారణంగా పలు అంశాల్లో తీవ్ర దుర్వినియోగం చోటు చేసుకుంటోంది. రసాయనాల వినియోగం, అటెండర్ సమస్యలు ఉన్నాయి. ఆయా సమస్యల పరిష్కారానికి ఆర్థిక మంత్రిత్వశాఖ మార్గాలను కనుగొనాలి’’ అని ఆయన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. పర్యావరణ అంశాలకు సంబంధించి రైతులకు అంతర్జాతీయంగా స్వచ్ఛంద కార్బన్ క్రెడిట్ ప్రయోజనాలు కల్పించే చర్యలనూ చేపట్టాలని ఆయన కోరారు. ► అగ్రి ఉత్పుత్తుల ఎగుమతుల నిషేధం వల్ల రైతాంగం ఆదాయాలు పడిపోతున్నాయని ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ కన్సార్టియం (సీఐఎఫ్ఏ) ప్రెసిడెంట్ రఘునాథ్ దాదా పాటిల్ పేర్కొన్నారు. నిషేధం ఎత్తివేతకు విజ్ఞప్తి చేశారు. దేశానికి విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా రావడానికి దోహదపడే చర్య ఇదని కూడా ఆయన సూచించారు. భారత్‌కు వంట నూనెల దిగుమతుల అవసరాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దిశలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, వేరు సెనగ పంటల ఉత్పత్తి పెంపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ► ఆల్ ఇండియా స్పైసెస్ ఎక్స్‌పోర్టర్ ఫోరమ్ (కేరళ) కార్యదర్శి విరెన్ కె ఖోనా, గోవింద్ బల్లభ్ పంత్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ (ఉత్తరాఖండ్) డైరెక్టర్ ఏఎస్ నైన్, ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ గ్రోవర్స్ అసోసియేషన్ (హిమాచల్) రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ చౌహాన్, యూపీఏఎస్ఐ (తమిళనాడు) అధ్యక్షుడు జెఫ్రీ రెబెల్లోసహా పలువురు వ్యవసాయ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. లైసెన్స్ ఫీజు తగ్గించండి: సీఓఏఐ లైసెన్స్ ఫీజును ప్రస్తుత మూడు శాతం నుంచి ఒక శాతానికి తగ్గించాలని మొబైల్ ఆపరేటర్ల సంఘం–-(సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా– సీఓఏఐ) ప్రభుత్వాన్ని కోరింది. అలాగే 5జీ రోల్అవుట్ కోసం నెట్వర్క్ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీని మినహాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖకు తమ ‘బడ్జెట్ విష్‌లిస్ట్’ను సమర్పించింది. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) రద్దు చేయాలని కూడా సీఓఏఐ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) హేతుబద్దీకరణ అవసరమని ఆర్థికమంత్రితో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో సూచించింది. లైసెన్స్ రుసుము, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు, వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్ చెల్లింపులపై జీఎస్టీ తొలగించాలని విజ్ఞప్తి చేసింది. సేకరించిన జీఎస్టీ ఇన్పుట్ పన్ను క్రెడిట్ (రూ32,000 కోట్లు) వాపసు, టెలికాం టవర్లపై అమర్చిన క్లిష్టమైన పరికరాలపై ఇన్పుట్ ట్యాక్స్ లభ్యతపై స్పష్టత నివ్వడం వంటి డిమాండ్లు సీఓఏఐ చేసిన డిమాండ్లలో మరికొన్ని. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం ఆపరేటర్లకు సీఓఏఐలో సభ్యత్వం ఉంది. చివరి పూర్తిస్థాయి బడ్జెట్ 2023 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. సీతారామన్‌కు రానున్నది ఐదవ బడ్జెట్. అలాగే 2024 ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇదే మోదీ–2 ప్రభుత్వానికి తుది పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది. పారిశ్రామిక రంగం ప్రతినిధులతోపాటు, మౌలిక, పర్యావరణ (క్లైమేట్ చేంజ్) రంగాల నిపుణులతో చర్చల ద్వారా సోమవారం ఆర్థికమంత్రి తన 2023-24 ప్రీ బడ్జెట్ సమావేశాన్ని ప్రారంభించారు. మంగళవారం వ్యవసాయం, ఆగ్రో పాసెసింగ్, ఫైనాన్షియల్, క్యాపిటల్ మార్కెట్, టెలికం ఆపరేటర్ల విభాగాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. 24వ తేదీన సేవలు, ఆరోగ్యం, విద్య, జల వనరులు, పారిశుధ్యంసహా సామాజిక రంగం నిపుణులతో భేటీ అవుతారు. 25వ తేదీన రాష్ట్రాల ఆర్థికమంత్రులతో న్యూఢిల్లీలో ప్రీ–బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. చదవండి: తగ్గేదేలే.. బ్రెజిల్లో రికార్డు సృష్టించిన భారత కంపెనీ, 48 గంటల్లోనే.. -
అసెంబ్లీకి ఆస్ట్రియా పార్లమెంటరీ బృందం
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రెండురోజుల తెలంగాణ పర్యటనకు వచ్చిన ఆస్ట్రియా పార్లమెం టరీ ప్రతినిధి బృందం మంగళవారం శాసనసభను సందర్శించి బడ్జెట్ సమావేశాలను వీక్షించింది. ఈ సందర్భంగా ఆస్ట్రియా ప్రతినిధి బృందం అసెంబ్లీ సమావేశాలను వీక్షిస్తోందని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించగా సభ్యులు అభివాదం చేశారు. ఈ ప్రతినిధి బృందంలో ఆస్ట్రియా నేషనల్ కౌన్సిల్ (దిగువ సభ) ప్రెసిడెంట్ వుల్ఫ్‌గాంగ్ సోబోట్కా, ఫెడరల్ కౌన్సిల్ (ఎగువ సభ) ప్రెసిడెంట్ క్రిస్టినా స్వర్జ్–ఫచ్‌తోపాటు 17 మంది పార్లమెంట్ సభ్యు లు ఉన్నారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో సమావేశమయ్యారు. 400 ఏళ్లకు పైబడిన హైదరాబాద్ నగర ప్రత్యేకతలను స్పీకర్ వివరించారు. ఆస్ట్రియా ప్రతినిధి బృందం పర్యటన భారత్‌తో సుదృఢ సంబంధాలకు తోడ్పడుతుందని వుల్ఫ్‌గాంగ్ సొబోట్కా అన్నారు. ఆస్ట్రియాతో సంబంధాలు బలోపేతం: దీక్షిత్ ఇండియా, ఆస్ట్రియా మధ్య సంబంధాలు మరింత బలపడేలా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌లో ఆస్ట్రియా దేశ గౌరవ కాన్సులేట్ జనరల్ వాగీష్ దీక్షిత్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆస్ట్రియా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ఆయన ఆస్ట్రియా పార్లమెంటు సభ్యులతో కలసి ప్రారంభించారు. -
ప్రజాసమస్యలే ‘ఎజెండా’
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యల పరిష్కారంలో విఫలమైన అధికార టీఆర్ఎస్ను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీయాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) నిర్ణయించింది. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఎన్నికల వాగ్దానాల విస్మరణ, బడ్జెట్ అసమానతలు, అవినీతి, కరెంటు చార్జీల పెంపు, ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగభృతి, రైతు రుణమాఫీ, నకిలీ విత్తనాలతో రైతులకు నష్టం, అభయహస్తం, మహి ళలకు వడ్డీలేని రుణాలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల మళ్లింపు, దళితబంధు వంటి అంశాలపై ప్రభుతాన్ని ప్రశ్నించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిర్ణయించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్‌దక్కన్‌లో సీఎల్పీనేత భట్టి అధ్యక్షతన దాదాపు ఆరున్నర గంటలపాటు సీఎల్పీ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్న సీఎల్పీ నేత భట్టి నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో చర్చించారు. నీళ్లు, నిధులు, నియా మకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో నెరవేరని ప్రజల ఆకాంక్షల గురించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిలదీస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోతే ప్రభుత్వ ప్రోగ్రెస్ రిపోర్టు ఎలా తెలుస్తుందని, ఇది సభ్యుల హక్కులను హరించడమేనని అన్నారు. కొత్త రాజ్యాంగం రాయాలంటున్న కేసీఆర్ ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో గవర్నర్ ప్రసంగం లేకుండా రాజ్యాంగాన్ని చట్టవిరుద్ధంగా అమలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్: రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడు తూ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఇదేనని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది డిసెంబర్లో ప్రభుత్వం రద్దవుతుందని, మరో 12 నెలల్లో రాష్ట్రంలో సోనియా గాంధీ రాజ్యం వస్తుందని చెప్పారు. ప్రభు త్వ లోటుపాట్లను కాంగ్రెస్ నిలదీస్తుందనే దుర్మార్గపు ఆలోచనతోనే గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారని ఆరోపించారు. అసెంబ్లీ లో తమ పార్టీ ఎమ్మెల్యేలను మాట్లాడకుం డా అడ్డుకుంటే రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగుతాయని హెచ్చరించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల వంటివి దేశంలో ఎక్కడ అమలవుతున్నాయో చూపిస్తారా.. అని మంత్రి కేటీఆర్ చేసిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, ఆయనకు 30 రోజుల సమయం ఇస్తున్నానని రేవంత్ చెప్పారు. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసం గం లేకపోవడంపై పార్లమెంటులోనూ ప్రస్తావిస్తానని చెప్పారు. సమన్వయం ఏదీ : సంపత్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడు తూ పార్టీనేతల్లో సమన్వయం ఎక్కడుంద ని ప్రశ్నించారు. సీఎల్పీ సమావేశం పెట్టుకు ని పీసీసీ అధ్యక్షుడు వేరే జిల్లాలకు వెళ్లడమేంటని ప్రశ్నించిన సంపత్ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం ఘటనను పార్టీ పరంగా ఉపయోగించుకోలేకపోయా మని అభిప్రాయపడ్డారు. సమావేశానికి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి హాజ రు కాలేదు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన నియోజకవర్గానికి వెళ్లి కూడా తనకు సమాచారం ఇవ్వలేదన్న కారణంతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమావేశంలోంచి వెళ్లిపోయారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మె ల్యే ఈరవత్రి అనిల్ కూడా పార్టీ నేతల ఐక్యతపై మాట్లాడినట్టు సమాచారం. సమావేశానికి ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, సీతక్క, పొదెం వీరయ్యలతో పాటు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీ, వి.హనుమంతరావు, చిన్నారెడ్డి, నాగం జనార్దనరెడ్డి, అంజన్‌కుమార్‌యాదవ్, డీసీసీ అధ్యక్షులు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ అనుబంధ సంఘాల చైర్మన్లు హాజరయ్యారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు: ఉత్తమ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జోస్యం చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సీఎల్పీ సమావేశానికి హాజరైన ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంతో పాటు మనకు కూడా ఎన్నికలు వస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలందరూ హైదరాబాద్‌ను వదిలేసి నియోజకవర్గాలకు వెళ్లాలని, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. అయితే, రానున్న ఎన్నికల్లో తాను ఎక్కడ పోటీ చేసేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేనని, తాను ఎక్కడ పోటీ చేయాలన్న విషయాన్ని సోనియాగాంధీ నిర్ణయిస్తారని ఉత్తమ్ అన్నారు. -
బడ్జెట్ సమావేశాలు.. 25 లేదా 28 నుంచి
సాక్షి, హైదరాబాద్: వార్షిక బడ్జెట్ సమావేశాలను (2022–23) ఈ నెల 25 లేదా 28వ తేదీ నుంచి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సుమారు పక్షం రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని భావిస్తోంది. ఈ నెల 25 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే పక్షంలో తొలి రోజు గవర్నర్ ప్రసంగం, 26న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగే అవకాశముంది. ఈ నెల 28న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి శివరాత్రి పండుగ నేపథ్యంలో రెండ్రోజుల విరామం తర్వాత మార్చి 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. బడ్జెట్‌తో పాటు పద్దులకు సంబంధించి చర్చ వచ్చే నెల 16వ తేదీ వరకు కొనసాగే సూచనలున్నాయి. సమావేశాల ప్రారంభానికి ముందు ఈ నెల 24 లేదా 25 తేదీల్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. కాగా, శాసన మండలి చైర్మన్‌గా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవీ కాలపరిమితి గతేడాది జూన్‌లో ముగియడంతో భూపాల్‌రెడ్డి ప్రొటెమ్ చైర్మన్‌గా శాసన మండలి సమావేశాలను నిర్వహించారు. ఈ ఏడాది జనవరిలో భూపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవీకాలం కూడా పూర్తవడంతో ఆయన స్థానంలో ఎంఐఎం పార్టీకి చెందిన అమీనుల్ జాఫ్రీ ప్రస్తుతం ప్రొటెమ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల ఆరంభంలో మండలి కొత్త చైర్మన్ ఎన్నిక కోసం షెడ్యూలు విడుదలయ్యే అవకాశముంది. -
శాసన సభ నిరవధిక వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభ నిరవధిక వాయిదా పడింది. మార్చి 5న గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదాపడినట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. మొత్తం 19 రోజుల్లో 133.58 గంటల పాటు శాసన సభ జరిగిందని వివరించారు. మొత్తం 166 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పగా, తొమ్మిది బిల్లులు ఆమోదం పొందాయి. ఈ సభలో ప్రభుత్వం 5 తీర్మానాలు చేసింది. మొత్తం 103 మంది సభ్యులు మాట్లాడారు. -
ఏయ్..నీకేం తెల్దు..కూచో
రాజమహేంద్రవరం సిటీ : నగరాభివృద్ధికి బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో అభివృద్ధిపై ప్రశ్నించే మహిళలు, వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, ఈతకోట బాపన సుధారాణిలపై ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఏకవచన సంబోధన చేస్తూ ఏయ్ నువ్వు ఆగు.. నువ్వు కూర్చో అంటూ రెచ్చిపోయారు. నువ్వంటే నువ్వంటూ ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. అభివృద్ధిపై ఎప్పటిలోగా చర్చ పెట్టాలి? ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ముందే చర్చించవచ్చు కదా అని మేయర్, కమిషనర్లను ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి నేతృత్వంలో ప్రశ్నించగా ఆదిరెడ్డి ఎమ్మెల్సీ నన్న విషయం మర్చిపోయి రెచ్చిపోయారు. ప్రశ్నిస్తున్నది ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ అనే మర్యాద లేకుండా ఏయ్ కూర్చో అంటూ ఆదిరెడ్డి చేసిన ఏకవచన సంబోధనకు సభలోని మహిళలు, ప్రజా ప్రతినిధులు విస్తుపోయారు. ‘జన్మభూమి’లో పేదలకు పింఛన్లు ఇచ్చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలికి ఇవ్వకపోవడంపై క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నామంటూ, పుష్కరాలకు మంజూరైన నిధులు రూ.240 కోట్లకు రూ.130 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని మిగిలిన వాటి పరిస్థితి ఏమిటంటూ షర్మిలారెడ్డి మేయర్ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయడంతో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి కార్పొరేషన్ తరుఫున వకాల్తా పుచ్చుకుని నీకేం తెలుసు ప్రభుత్వం దఫదఫాలుగా ఇస్తుంది.. నువ్వు కూర్చో.. లేకపోతే బాగోదంటూ రెచ్చిపోయారు. అయినప్పటికీ అడిగిన ప్రశ్నలకు సమాధానం కావాలంటూ షర్మిలారెడ్డి పట్టుపట్టారు. సభలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా అభివృద్ధి పనుల విషయాన్ని సభ దృష్టికి తీసుకుని రావాల్సిన ఆదిరెడ్డి తీరుకు సభికులు విస్తుపోయారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్లకే మాట్లాడే అవకాశం 2017–18 సంవత్సరం బడ్జెట్ సవరణ, 2018–19 సంవత్సరానికి అంచనా బడ్జెట్ మేయర్ పంతం రజనీశేషసాయి అధ్యక్షతన చదివి వినిపించారు. దానిపై చర్చించి చర్యలు చేపట్టాల్సి ఉండగా కేవలం ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉండే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, మాట్లాడడం వరకే అవకాశం కల్పించారు. మిగిలిన సభ్యులు బడ్జెట్‌పై చర్చించే ప్రయత్నం చేసినా వారికి అవకాశం ఇవ్వకుండానే బడ్జెట్‌ను ఆమోదించామని మేయర్ సమావేశం ముగించారు. 2018–19 సంవత్సరానికి రూ.76 కోట్ల 41 లక్షల 50 వేలతో ప్రారంభ నిల్వతో అంచనాలు ప్రారంభించి రూ.299.05 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు కేటా యిస్తూ బడ్జెట్‌ను సిద్ధం చేశారు. రూ.222 కోట్ల 64 లక్షల 25 వేల ఆదాయంగా రూ.285 కోట్ల 70 లక్షల ఖర్చులుగా తయారు చేశారు. ముగింపు నిల్వగా రూ.133కోట్ల 5 లక్షల 75 వేలుగా చూపించారు. 2017–18 సంవత్సరానికి రూ.321 కోట్ల 2 లక్షల 32 వేల ప్రారంభ నిల్వతో బడ్జెట్ తయారు చేయగా ఆదాయం రూ.213 కోట్ల 64 లక్షల 85 వేలు, ఖర్చులు రూ.244 కోట్ల 60 లక్షల 82 వేలుగా ఖర్చులుగా నివేదిక సిద్ధం చేశారు. -
పుస్తకం విసిరేస్తే సస్పెండ్ చేస్తారా?
సాక్షి, అమరావతి బ్యూరో/ భవానీపురం(విజయవాడ పశ్చిమం): నగరపాలకసంస్థ 2018–2019 బడ్జెట్ సమావేశం రసాభాసాగా మారింది. రూ.1481 కోట్ల అంచనాలతో కార్పొరేషన్ బడ్జెట్‌ను మేయర్ కోనేరు శ్రీధర్ కౌన్సిల్లో శుక్రవారం ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చను పక్కదారి పట్టించారు. విపక్ష మహిళా సభ్యులను ఉద్దేశించి అవహేళనగా మాట్లాడి వారి మనోభావాలను దెబ్బతీశారు. బడ్జెట్లో చూపిన అంకెలగారడీని ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ సభ్యులను బలవంతంగా మర్షల్స్తో బయటకునెట్టిం చారు. సమావేశంలో తానే నియంతనంటూ ఆయన వ్యవహరించిన తీరు విస్మయపరిచింది. తోటి సభ్యులను ఏక వచనంతో మాట్లాడుతూ సమావేశంలో రగడ సృష్టించారు. విజయవాడ కార్పొరేషన్‌కు సంబంధించి 2017–18 డ్రాఫ్ట్ రివైజ్డ్ బడ్జెట్‌తోపాటు 2018–19 డ్రాఫ్ట్ బడ్జెట్ సమావేశం శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగింది. తొలుత ఇటీవల మృతి చెందిన మాజీ కార్పొరేటర్లు ఇజ్జాడ అప్పలనాయుడు, మరుపిళ్ల మోహన్ తిలక్‌కు సంతాప తీర్మానం చేసి మౌనం పాటించారు. అనంతరం మేయర్ శ్రీధర్, కమిషనర్ జె.నివాస్ కార్పొరేటర్లందరికీ ట్యాబ్‌లు అందజేశారు. అనంతరం మేయర్ కోనేరు శ్రీధర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్ల మాదిరిగానే, నాల్గో బడ్జెట్ కూడా పేద, మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం పడకుండా రూపొందించామని చెప్పారు. నగర సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిధుల లభ్యతనుబట్టి అంచనాలు తయారుచేశామన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నివాస్ మాట్లాడుతూ 2017–18, 2018–19 సంవత్సరాలకు సంబంధించి నికర ఆదాయ వ్యయాలు, రెవెన్యూ ఆదాయ వ్యయాలకు, క్యాపిటల్ ఆదాయ వ్యయాలకు సంబంధించిన డ్రాఫ్ట్ బడ్జెట్‌ను తయారు చేశామని చెబుతూ వాటి వివరాలను వెల్లడించారు. అంకెలగారడీ బడ్జెట్‌పై వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల మాట్లాడుతూ బడ్జెట్ అంకెల గారడీగా ఉందని విమర్శించారు. గత బడ్జెట్లో పొందుపరిచిన అంకెలనే ఈ బడ్జెట్లోనూ చూపి మసిపూసి మారేడుకాయ చేశారని దుయ్యబట్టారు. బడ్జెట్లోని పలు అంశాలను ఉటంకిస్తూ వాటన్నింటికీ అధికారులతో సమాధానం చెప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కార్పొరేషన్‌కు రావాల్సిన నిధులను పొందడంలో పాలకపక్షం విఫలమైందని విమర్శించారు. దీంతో మేయర్ జోక్యంచేసుకుని ‘బడ్జెట్ గురించి తెలియకపోతే తెలుసుకోవాలి. ఎలా అంటే అలా మాట్లాడకూడదు’ అంటూ అవహేళన చేశారు. దీంతో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ లేచి ఒక మహిళా కార్పొరేటర్‌ను అగౌరవంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని హితవుపలికారు. బడ్జెట్లో ప్రజలకు మేలు చేస్తున్నట్లుగా లాభాలు చూపించి మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. దీంతో మేయర్ కల్పించుకుని ‘అంతా నా ఇష్టం.. ఈ కౌన్సిల్ నాది’ అని అనేసరికి బుల్లా విజయ్ కోపంతో బడ్జెట్ ప్రతిని బల్లపై కొట్టారు. అదికాస్తా కిందపడటంతో బడ్జెట్ ప్రతిని విసికొట్టి అగౌరవంగా ప్రవర్తించిన విజయ్ను సస్పెండ్ చేయాలంటూ అధికార పార్టీ సభ్యులు గొడవకు దిగారు. ఇంతలో కార్పొరేటర్ టి.జమల పూర్ణమ్మ లేచి పుణ్యశీల, విజయ్‌కు మద్దతుగా మాట్లాడటంతో ‘ఇదేమన్నా సంతనుకున్నారా? ఎవరుపడితే వాళ్లు ఇష్టం వచ్చి నట్లు లేచి మాట్లాడటానికి, ఆవిడను బయటకు పంపించేయండి’ అంటూ సెక్రటరీని మేయర్ ఆదేశించారు. దీంతో జమల పూర్ణమ్మ, విజయ్, చందన సురేష్ వెళ్లి మేయర్ పోడియం ఎదుట బైఠాయించారు. దీంతో ఈ ముగ్గురినీ సస్పెండ్ చేస్తున్నానని మేయర్ ప్రకటించారు. మార్షల్స్ వచ్చి వారిని బలవంతాన బయటకు తీసుకెళ్లడంతో సభ రసాభాసగా మారింది. అనంతరం మేయర్ సభను 3 గంటలకు వాయిదా వేశారు. పుస్తకం విసిరేస్తే సస్పెండ్ చేస్తారా? ఏ బైలాలో ఉందో చెప్పండి : పుణ్యశీల భవానీపురం (విజయవాడ పశ్చిమం): సభ వాయిదా అనంతరం వైఎస్సార్ సీపీ ఫ్లోర్ లీడర్ పుణ్యశీల మాట్లాడుతూ పుస్తకం విసిరేస్తే సభ్యులను సస్పెండ్ చేయాలని ఏ బైలాలో ఉందని మేయర్‌ను ప్రశ్నిం చారు. ‘మేయర్‌గా నాకు ఆ అధికారం ఉంది. నా ఇష్టం’ అంటూ శ్రీధర్ అన్నారు. నాలుగేళ్లగా కౌన్సిల్లో అదే జరుగుతోంది కదా అని పుణ్యశీల విమర్శించారు. క్యాపిటల్ ఆదాయంపై మాట్లాడే అవకాశం తనకు ఇవ్వరని, పాలకపక్ష సభ్యులు ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడినా పట్టించుకోరని పేర్కొన్నారు. ప్రతి పక్ష సభ్యులను మాట్లాడనివ్వనప్పుడు కౌన్సిల్ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు. ట్యాబ్ వెనక్కు ఇచ్చిన ఆదిలక్ష్మి తనకు ఇచ్చిన ట్యాబ్‌ను సీపీఎం ఫ్లోర్‌లీడర్ గాదె ఆది లక్ష్మి వెనక్కు ఇచ్చారు. దీంతో టీడీపీ కార్పొరేటర్ కాకు మల్లికార్జున స్పందించి ఈ చర్య కౌన్సిల్‌ను అవమానించడమన్నారు. మేయర్ జోక్యం చేసుకుని వారి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఆమె తిరిగి ఇచ్చేశారని హితవుపలకడంతో కాకు మిన్నకుండిపోయారు. అనంతరం ఆదిలక్ష్మి మాట్లాడుతూ కార్పొరేషన్ తాకట్టు పెట్టిన ఆస్తులను ఎప్పుడు విడిపిస్తారని ప్రశ్నించారు. కొండ ప్రాంత అభివృద్ధికి గత బడ్జెట్లో రూ.7కోట్లు కేటా యించి, రూపాయి ఖర్చుపెట్టలేదని, మళ్లీ అదే మొత్తం కేటాయించారని విమర్శించారు. ఇప్పుడైనా ఖర్చుపెడతారా అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత యువజనోత్సవాలు నిర్వహించడం లేదని, వన్‌టౌన్‌లోని షేక్ రాజా హాస్పిటల్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు 010 అంశంపై మాట్లాడారు. సంస్కారం తెలియని మేయర్ వైఎస్సార్ సీపీ సభ్యుల విమర్శ భవానీపురం(విజయవాడ పశ్చిమం): తమను అన్యాయంగా సస్పెండ్ చేశారంటూ వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బుల్లా విజయ్, చందన సురేష్, జమల పూర్ణమ్మ కౌన్సిల్ హాల్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వారికి మద్దతుగా ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల, బొప్పన భవకుమార్, కె.దామోదర్, షేక్ బీజాన్బీ, బట్టిపాటి సంధ్యారాణి, పాల ఝాన్సీ నిలిచారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ కౌన్సిల్‌ను సంతతో పోల్చిన మేయర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ పూర్ణమ్మను సంతలో మనిషిగా మాట్లాడిన మేయర్ శ్రీధర్ సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు. మహిళా సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మేయర్ ఆ పదవికి అనర్హుడని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని దుయ్యబట్టారు. జమల పూర్ణమ్మ మాట్లాడుతూ మేయర్‌కు మహిళలపై గౌరవం లేదన్నారు. ఆయనకు సస్పెండ్ చేయడం తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. కళ్లకు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు బాధ్యతలను డెప్యూటీ మేయర్‌కు అప్పగించవచ్చుకదా అని సూచించారు. చందన సురేష్ మాట్లాడుతూ ప్రజావాణిని కౌన్సిల్లో వినిపించనీయకుండా సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. పాలకపక్షం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శించారు. ప్రజలపై పన్నుల భారం వేయలేదంటూనే త్వరలో నీటి మీటర్లు పెట్టే అంశంపై కౌన్సిల్లో మాట్లాడటంలో ఆంతర్యమేమిటో చెప్పాలని ప్రశ్నించారు. -
రసాభసగా విజయవాడ మున్సిపల్ బడ్జెట్ సమావేశం
-
అబద్ధాలతో మభ్య పెడుతున్నారు
► పేరుకే వ్యవసాయ బడ్జెట్ ► ఫారంపాండ్స్ పెయిన్‌కిల్లర్‌లా పని చేస్తాయి తప్ప శాశ్వత పరిష్కారం కాదు ► ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనంతపురం : బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలతో మభ్య పెడుతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్, ఎమ్మెల్యే రోజాను విమర్శించడానికే టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సమయం మొత్తం కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు. ఇందుకోసం అవసరమనుకుంటే సమయం పొడిగిస్తున్నారు తప్ప ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో కరువు ఉందన్నారు. కృష్ణా, గోదావరి డెల్టాల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా అడుగంటిందన్నారు. ఉపాధి లేక లక్షలాది మంది వలసలు వెళ్తున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ రంగాన్ని గట్టెక్కించడానికి ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేదన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అని ప్రకటించినా కేటాయింపుల్లో మాత్రం గతేడాది కంటే తగ్గించారని విమర్శించారు. ఎన్నికల ముందు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో 500 మండలాల్లో తీవ్ర కరువు నెలకొంటే 360 దాకా మాత్రమే ప్రకటించారన్నారు. 2014 ఇన్సూరెన్స్ ఇప్పటికీ పైసా ఇవ్వలేదన్నారు. 2015-16లో రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి కనిపించలేదన్నారు. దుర్మార్గమైన నిబంధన అమలులోకి తెచ్చారని విమర్శించారు. సగటు ఐదేళ్ల పంట దిగుబడిలో 30 శాతం నష్టపోయి ఉంటేనే పరిహారమని ప్రకటించారన్నారు. మోసపూరిత రుణమాఫీ హామీ వల్ల ఓవర్‌డ్యూస్ రూ.24 వేల కోట్లకు పెరిగిపోయాయన్నారు. మొండిబకాయిలు రూ.5 వేల కోట్లు పెరిగాయన్నారు. ఫారంపాండ్లతో కరువు పారదోలుతామని చెబుతున్నారని, జిల్లాలో ఇవి పెయిన్ కిల్లర్‌లా పని చేస్తాయి తప్ప శాశ్వత పరిష్కారం కావని స్పష్టం చేశారు. సీఎంకు కీర్తి కాంక్ష పట్టుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబుకు కీర్తి కాంక్ష పట్టుకుందని, ఇందుకోసం వేల కోట్ల రూపాయల అప్పులు చేసేందుకు కూడా వెనకాడటం లేదని వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నిర్వాకంతో రాబోయే కాలంలో రాష్ట్ర ప్రజలు అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదముందన్నారు. కొన్ని పత్రికలు, ఛానెళ్లు పని కట్టుకుని తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. భవిష్యత్తులో టీడీపీ అధికారంలోకి వస్తుందనే నమ్మకం మా ఎమ్మెల్యేలెవరికీ లేదన్నారు. రాజధాని భూముల కొనుగోలులో అక్రమాలను వెలికితీసిన విలేకరులను పోలీసులు విచారించడం బాధాకరమని విలేకరులు అడిగిన ఓప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజా సమస్యలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం బడాయికి పోతోందని విమర్శించారు. -
బడ్జెట్ సమావేశానికి ఒకేఒక్కరు
► 18మంది సభ్యుల్లో 17మంది గైర్హాజరు ► కోరం లేక సమావేశం వారుుదా ► లెక్కలు తేలకనే! మెట్పల్లి : మెట్పల్లి మున్సిపాలిటీలో బడ్జెట్ సమావేశానికి ఒకేఒక్క సభ్యుడు హాజరుకావడంతో కోరం లేక వాయిదా పడింది. మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ మర్రి ఉమారాణి ఆధ్యక్షతన అధికారులు బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారు. మొత్తం 19మంది సభ్యులున్న పాలకవర్గంలో చైర్‌పర్సన్‌తోపాటు 8వార్డు కౌన్సిలర్ ధ్యావతి అరుణ మాత్రమే హాజరయ్యారు. మిగతా 17మంది ైగె ర్హాజరయ్యారు. ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభం కాగా.. ఆరగంట పాటు చైర్పర్సన్, అధికారులు సభ్యుల కోసం వేచి చూశారు. సభ్యులెవరూ రాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ ప్రకటించారు. ‘లెక్క’ తేలకే.. అభివృద్ధి పనుల కమీషన్ల లెక్కలు తేలకపోవడం, వార్డుల్లో నీటి సమస్య పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని మెజార్టీ సభ్యులు బడ్జెట్ సమావేశానికి హాజరు కాలేదని తెలిసింది. పాలకవర్గం బాధ్యతలు చేపట్టిన నుంచి ప్రతి పనిలో హోదాలవారీగా ‘ఇంత కమీషన్’ ఇవ్వాలనే ఒప్పందం కాంట్రాక్టర్లతో చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం చైర్పర్సన్, అధికారులకు తప్ప తమకు సక్రమంగా కమీషన్లు అందడం లేదనే అసంతృప్తి కౌన్సిలర్లలో నెలకొంది. ఈ వ్యవహారమే చైర్పర్సన్, కౌన్సిలర్ల మధ్య విభేధాలకు దారి తీసింది. నాలుగు రోజుల క్రితం లెక్కలు తేల్చడానికి ఓ కాంగ్రెస్ సభ్యుడి ఇంట్లో కాంట్రాక్టర్లతో కలిసి కొందరు ముఖ్యనేతలు చర్చలు జరిపారు. ఇవి కొలిక్కి రాలేదని తెలిసింది. దీనికితోడు ఈనెల 10న నిర్వహించిన సాధారణ సమావేశంలో వార్డుల్లో బోర్ల ఏర్పాటుకు సభ్యులంతా ఆమోదం తెలిపినా అధికారులు ఇంకా పనులు ప్రారంభించలేదు. అటు లెక్కలు తేల్చక.. ఇటు బోర్ల పనులు మొదలుపెట్టక తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని భావించే మెజార్టీ కౌన్సిలర్లు బడ్జెట్ సమావేశానికి దూరంగా ఉన్నారని సమాచారం. కంగుతిన్న కమిషనర్... కీలకమైన బడ్జెట్ సమావేశానికి మెజార్టీ కౌన్సిలర్లు గైర్హాజరు కావడంతో కమిషనర్ శైలజ కంగుతిన్నారు. వారిని మెప్పించి రెండుమూడు రోజుల్లో సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వార్డుల్లో బోర్ల పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కౌన్సిలర్లకు ఆమె హామీ ఇచ్చినట్లు తెలిసింది. -
23 నుంచి రాజ్యసభ భేటీలు
ఏప్రిల్ 20 నుంచి లోక్‌సభ సమావేశాలు న్యూఢిల్లీ: రాజ్యసభ మలిదశ బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన సమావేశమైన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ మంగళవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘రాజ్యసభ 234వ సమావేశాలు(బడ్జెట్ సమావేశాల మొదటి భాగం) మార్చి 28, 2015న ప్రొరోగ్ అయ్యాయి. పెద్దల సభ 235వ సమావేశం ఏప్రిల్ 23న మొదలవుతుంది. లోక్‌సభ ఏప్రిల్ 20న ప్రారంభమై, మే 8తో ముగుస్తుంది. రాజ్యసభ మే 13 వరకు కొనసాగుతుంది’ అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభతో పాటు ఏప్రిల్ 20న రాజ్యసభను సమావేశపరచటానికి ప్రభుత్వానికి ఇబ్బంది లేనప్పటికీ, రాజ్యసభ నియమావళిలోని 39వ నిబంధన ప్రకారం వివిధ అంశాలపై నోటీసులు ఇవ్వటానికి సభ్యులకు 15 రోజుల సమయమివ్వాల్సి ఉన్నందున ఏప్రిల్ 23నుంచి పెద్దలసభ సమావేశాలను మొదలుపెట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మెజారిటీ లేకపోవటం వల్ల భూసేకరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి సాహసించలేకపోయిన ఎన్డీఏ సర్కారు, దానికి సంబంధించిన ఆర్డినెన్సును రెండోసారి జారీ చేసేందుకు పెద్దల సభను ప్రొరోగ్ చేసిన సంగతి తెలిసిందే. -
అంకెల గారడీ!
నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొదటి బడ్జెట్ సమావేశం మంగళవారం నగర పాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా 2015-16 బడ్జెట్ రూ.610 కోట్లుగా ప్రవేశపెట్టారు. ప్రారంభ నిల్వను రూ.11.89 కోట్లుగా చూపారు. భూగర్భ డ్రైనేజీకి రూ.125 కోట్లు, తాగునీటికి రూ.100 కోట్లు, మరుగుదొడ్లకు రూ.10 కోట్లు, మాస్టర్‌ప్లాన్‌కు రూ.10 కోట్లు కేటాయించారు. పన్నులు రూపంలో రూ.26 కోట్లు, ఇతర జమలు రూ.112 కోట్లు, డిపాజిట్లు రూ.14 కోట్లు, గ్రాంట్లు రూ.444 కోట్లు వస్తుందని లెక్కల్లో చూపించారు. ఈ ఏడాది బీపీఎస్ రూపంలో కార్పొరేషన్‌కు రూ.60 కోట్లు వస్తుందని అంచనా వస్తున్నారు. నెల్లూరు, సిటీ: నగర పాలక సంస్థ 2015-16 బడ్జెట్ వాస్తవ దూరంగా, అంకెల గారడీలాగా ఉందని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం తదితరులు నిలదీశారు. అయితే మేయర్ ఏకపక్షంగా వ్వవహరిస్తూ ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేశారు. నెల్లూరు కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం మంగళవారం మేయర్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ప్రారంభంకాగానే 12వ డివిజన్ కార్పొరేటర్ రంగ మయూర్‌రెడ్డి అధికారులు పన్నులు వసూలు చేస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. ఈ విధంగా పన్నులు వసూళ్లు చేయడం దారుణమన్నారు. పోడియం వద్ద ఆందోళన చేశారు. ఆనం కారణంగానే అప్పులు: మేయర్ ఈ క్రమంలో టీడీపీ వర్గీయులకు, రంగమయూర్‌రెడ్డికి మధ్య వాగ్వాదం నెలకొంది. మేయర్ జోక్యం చేసుకుని ‘నీ కారణంగా, మీ నాన్న కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. మీ నాన్న పాలనలో చేసిన అక్రమాల కారణంగా కార్పొరేషన్ రూ.40 కోట్ల అప్పుల్లో మునిగిపోయిందన్నారు. మీ ఇంట్లో పనిచేసుకునేందుకు కూడా కార్పొరేషన్ ఉద్యోగులను వాడుకున్న సందర్బాలు ఉన్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.’ ఈ సందర్భంలో మంత్రి నారాయణ, మేయర్ అజీజ్‌పై రంగమమూర్రెడ్డి విమర్శలు గుప్పించారు. వెంటనే నూనె మల్లికార్జున్‌యాదవ్ కల్పించుకుని మంత్రిని విమర్శించే హక్కు నీకు లేదన్నారు. ఈక్రమంలో మేయర్, టీడీపీ సభ్యులు రంగమయూర్‌రెడ్డిని సమావేశం నుంచి వెళ్లిపోవాలని పదేపదే అనడం గమనార్హం. దీంతో అతను బడ్జెట్ కాగితాలను చించివేసి సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం కౌన్సిల్ సమావేశం యాథావిధిగా కొనసాగింది. పన్నులు వసూళ్లు, టోల్‌ప్లాజాపై ప్రస్తావన.. వైఎస్సార్సీపీ, మరికొందరు పన్నుల భారం, నగర పరిధిలో ఏర్పాటు చేయనున్న టోల్‌ప్లాజా నిర్మాణం గురించి తమ దృష్టికి తీసుకొచ్చారని మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు కోరినట్లు టోల్‌ప్లాజా నిర్మాణం అన్యాయమని, దీనికి కౌన్సిల్ ఆమోదం తెలపబోదని స్పష్టం చేశారు. ఇటీవల టోల్‌ప్లాజా నిర్మాణాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని గుర్తుచేశారు. గత ప్రభుత్వ తప్పిదాలే పునరావృతం: ద్వారకా ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేర్కొన్న లెక్కలు తప్పులతడకగా ఉన్నాయి.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే పునరావృతమవుతున్నట్లుగా ఉందని డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ అన్నారు. కౌన్సిల్ నిర్వహణ ఖర్చులు రూ.10లక్షలు చూపించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. చెట్ల పెంపకానికి, ఫాగింగ్, నిర్వహణ ఖర్చులు, వాహనాల మరమ్మతుల ఖర్చులు అత్యధికంగా చూపారన్నారు. వీధిదీపాలకు రూ.6.61కోట్లు లెక్కలు చూపించారని, అయితే ఎక్కడా ఖర్చుపెట్టిన సందర్భాలు లేవన్నారు. కార్పొరేటర్లే సొంత నిధులను ఖర్చుచేశారన్నారు. అయితే ఇంత భారీస్థాయిలో వీధి దీపాలకు ఖర్చుచూపించడంపై అధికారులు అవినీతికి పాల్పడినట్లుగా తెలుస్తుందన్నారు. ఉచ్చి భువనేశ్వరప్రసాద్, టీడీపీ కార్పొరేటర్ పంట కాలువల పూడికలు తీయడానికి రూ. 64 లక్షలు ఖర్చుపెట్టారన్నారు. ఎక్కడా పూడికలు తీసిన పరిస్థితి లేదన్నారు. ఎందుకు ఆలస్యంగా నిర్వహిస్తున్నారు ఏడాది చివరిరోజు బడ్జెట్ కౌన్సిల్ సమావేశం ఇంత ఆలస్యంగా ఎందుకుపెట్టారని వైఎస్సార్సీపీ విప్, బొబ్బొల శ్రీనివాసులు మేయర్‌ను నిలదీశారు. బడ్జెట్‌ను ఎప్పుడు సవరణ చేస్తారు, ప్రభుత్వానికి ఎప్పుడు పంపిస్తారన్నారు. అదేవిధంగా కొంతకాలం క్రితం మంత్రి నారాయణ మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా మున్సిపల్ స్కూల్స్‌ను అభివృద్ధి చేస్తానని హమీ ఇచ్చారని, అయితే ఈ బడ్జెట్‌ను గమనిస్తే రాబోయే కాలంలో విద్యార్థులకు ఇబ్బందులు తప్పవనే పరిస్థితి కనిపిస్తుందన్నారు. వైఎస్సార్సీపీ బాయ్‌కాట్ :రాబడికి, అభివృద్ధి పనుల నిర్వహణకు సంబంధించి వేసిన లెక్కల్లో పొంతనలేదని వైఎస్సార్సీపీ కౌన్సిల్ సభ్యులు ఆరోపించారు. ఈ బడ్జెట్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని సమావేశం నుంచి బహిష్కరించి వెళ్లిపోయారు. అనంతరం ప్రతిపక్ష సభ్యుల ఆమోదం లేకనే బడ్జెకు మేయర్ పచ్చజెండా ఊపారు. -
యూఎల్‌సీకి మంగళం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: యూఎల్సీ (పట్టణ భూ గరిష్ట పరిమితి) భూములపై నెలకొన్న వివాదాలన్నిటికీ చరమగీతం పాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైనవారందరికీ రెగ్యులరైజ్ చేయడం.. తక్కినవాటిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోనే అత్యంత విలువైన, అత్యధిక భూములు రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నో ఏళ్లుగా సీలింగ్ భూములతో విసుగెత్తి వే సారిన భూ యజమానులకు కొంత ఊరట.. మరోపక్క ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం సమకూరనుంది. నగర శివార్లలోని 11 మండలాల్లో 3,453.70 ఎకరాల యూఎల్సీ భూములను కాపాడడం సర్కారుకు తలనొప్పిగా తయారైంది. ఇబ్బడిముబ్బడిగా ఆక్రమణలు జరుగుతుండడం.. వీటిని అరికట్టాల్సిన యూఎల్సీ విభాగానికి ప్రత్యేక నిఘా వ్యవస్థ లేకపోవడంతో జిల్లా యంత్రాంగానికి గుదిబండగా మారింది. క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండడం.. అక్రమార్కులు కోర్టులను ఆశ్రయిస్తుండడంతో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యూఎల్సీ స్థలాలను వీలైనంత మేర క్రమబద్ధీకరించాలని యోచిస్తోంది. ఉభయ ప్రయోజనం.. బడ్జెట్ సమావేశంలో కేసీఆర్ సర్కారు.. భూముల అమ్మకం ద్వారా రూ.6,500 కోట్లు సమకూర్చుకుంటామని ప్రస్తావించింది. ఈ క్రమంలోనే ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ, సీలింగ్ భూములను క్ర మబద్ధీకరించాలని నిర్ణయించింది. మరీ ముఖ్యంగా విలువైన యూఎల్‌సీకి చెందిన స్థలాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలు జరగడం... వీటిని తొలగించడం ఆషామాషీ కాదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఘట్కేసర్ గురుకుల్ ట్రస్ట్ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలనే నిర్ణయంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన సర్కారు.. ఈ జాగాల క్రమబద్ధీకరణకు మొగ్గు చూపుతోంది. తద్వారా ఖజానా నింపుకోవడమేకాకుండా ఏళ్ల తరబడి యాజమాన్య హక్కుల కోసం ఎదురుచూస్తున్న భూ యజమానులకు ఉపశమనం కలిగించవచ్చని భావిస్తోంది. ధరల నిర్ధారణపై మల్లగుల్లాలు క్రమబద్ధీకరణతో దాదాపు యూఎల్సీ స్థలాల కథకు పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్న సర్కారు... కోర్టు కేసులకు కూడా త్వరితగతిన ముగింపు పలకాలని నిర్ణయించింది. క్రమబద్ధీకరణకు పోగా మిగిలిన స్థలాలను స్వాధీనం చేసుకోవాలని యోచిస్తోంది. మరోవైపు యూఎల్సీ భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి ఖరారు చేయాల్సిన ధరలపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. యూఎల్సీ స్థలాలు ఉన్న ప్రాంతాల్లో భూముల విలువ ఆకాశాన్నంటిన నేపథ్యంలో.. కనీస ధర నిర్ధారణపై మల్లగుల్లాలు పడుతోంది. అయితే, ప్రస్తుత కనీస (బేసిక్ మార్కెట్ వాల్యూ) ధరలు భారీగా పలుకుతున్నందున.. 2008 ధరలను ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తోంది. యూఎల్సీ వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులకు ఏ ధరలను వర్తింపజేయాలనే అంశంపై తర్జనభర్జనలు పడుతోంది. ⇒మాదాపూర్‌లో 2003లో చదరపు గజం (బేసిక్ మార్కెట్ వాల్యూ) కనీస ధర రూ.2వేలు పలకగా, 2008లో రూ.13వేలు.. ఇప్పుడు రూ.20వేలు పలుకుతుంది. ⇒గచ్చిబౌలిలో 2003లో చదరపు గజం కనీస ధర రూ.ఒక వెయ్యి కాగా, 2008లో రూ.12వేలు.. తాజాగా రూ.15వేలుగా రిజిస్ట్రేషన్ శాఖ వసూలు చేస్తోంది. ⇒రాయదుర్గంలో 2003లో చ.గజం కనీస ధర రూ.1000 ఉండగా, 2008లో రూ.11వేలు.. ప్రస్తుతం రూ.20వేలు ఉంది. 2008 ప్రభుత్వ కనీస మార్కెట్ విలువ ఆధారంగా రూ.7,500 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం.. క్రమబద్ధీకరణ ప్రక్రియను చకచకా పూర్తి చేయాలని భావిస్తోంది. ⇒ఈ నెల 16న జరిగే అఖిలపక్ష సమావేశం అనంతరం నిర్దేశిత ధరను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. -
బడ్జెట్‌పై నేడు ఆర్థిక మంత్రి సమావేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం ఉదయం 8 గంటలకు సచివాలయంలో బడ్జెట్ రూపు రేఖలపై ఆర్థిక, ప్రణాళికా శాఖ ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. గ్రామ, జిల్లాస్థాయి నుంచి వచ్చే ప్రణాళికలు, అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన నేపథ్యంలో ఆర్థికమంత్రి ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రాధాన్యం నెలకొంది. ఇదే సమయంలో బడ్జెట్ గురించి, కేంద్ర, రాష్ట్ర ఆదాయ వనరులు, ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు, 14వ ఆర్థిక సంఘానికి చేయాల్సిన సిఫార్సులు తదితర అంశాలపై అధికారులలో లోతుగా సమీక్షించడం ద్వారా మొత్తం ఆర్థిక రంగంపై ఈటెల పూర్తిస్థాయిలో పట్టు పెంచుకోనున్నారు.