న్యూఢిల్లీ: గోధుమ వంటి వ్యవసాయ వస్తువుల ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని అలాగే కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే తక్కువ ధర ఉన్న ఉత్పత్తుల దిగుమతిని పరిమితం చేయాలని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. పామాయిల్‌కు బదులుగా సోయాబీన్, ఆవాలు, వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటి స్థానిక నూనె గింజల దేశీయ ఉత్పత్తిని పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కూడా రైతు సంఘాలు సూచించాయి. ప్రాసెస్డ్ ఫుడ్స్‌పై అధిక పన్నుల విధించాలని కోరాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రతినిధులతో వెర్చువల్‌గా ప్రీ-బడ్జెట్ 2023 సంప్రదింపులను ఇక్కడ నిర్వహించి వారి అభిప్రాయాలను స్వీకరించారు. వారు వ్యక్తం చేసిన మరిన్ని అభిప్రాయాలను పరిశీలిస్తే..
► కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) కంటే తక్కువగా ఉన్న ఉత్పత్తుల దిగుమతిని ప్రభుత్వం అనుమతించకూడదని తన కోర్కెల పత్రంలో భారత్ కృషిక్ సమాజ్ చైర్మన్ అజయ్ వీర్ జాకర్ డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో మౌలిక వనరులు, మానవ వనరుల అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. ‘వ్యవసాయం రాష్ట్ర సబ్జెక్ట్‌గా ఉంది. చాలా రాష్ట్రాలు సంబంధిత శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడం లేదు. దీని కారణంగా పలు అంశాల్లో తీవ్ర దుర్వినియోగం చోటు చేసుకుంటోంది. రసాయనాల వినియోగం, అటెండర్ సమస్యలు ఉన్నాయి. ఆయా సమస్యల పరిష్కారానికి ఆర్థిక మంత్రిత్వశాఖ మార్గాలను కనుగొనాలి’’ అని ఆయన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. పర్యావరణ అంశాలకు సంబంధించి రైతులకు అంతర్జాతీయంగా స్వచ్ఛంద కార్బన్ క్రెడిట్ ప్రయోజనాలు కల్పించే చర్యలనూ చేపట్టాలని ఆయన కోరారు.
► అగ్రి ఉత్పుత్తుల ఎగుమతుల నిషేధం వల్ల రైతాంగం ఆదాయాలు పడిపోతున్నాయని ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ కన్సార్టియం (సీఐఎఫ్‌ఏ) ప్రెసిడెంట్ రఘునాథ్ దాదా పాటిల్ పేర్కొన్నారు. నిషేధం ఎత్తివేతకు విజ్ఞప్తి చేశారు. దేశానికి విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా రావడానికి దోహదపడే చర్య ఇదని కూడా ఆయన సూచించారు. భారత్‌కు వంట నూనెల దిగుమతుల అవసరాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దిశలో సోయాబీన్, పొద్దు తిరుగుడు, వేరు సెనగ పంటల ఉత్పత్తి పెంపునకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
► ఆల్ ఇండియా స్పైసెస్ ఎక్స్‌పోర్టర్ ఫోరమ్ (కేరళ) కార్యదర్శి విరెన్ కె ఖోనా, గోవింద్ బల్లభ్ పంత్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ (ఉత్తరాఖండ్) డైరెక్టర్ ఏఎస్ నైన్, ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ గ్రోవర్స్ అసోసియేషన్ (హిమాచల్) రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ చౌహాన్, యూపీఏఎస్‌ఐ (తమిళనాడు) అధ్యక్షుడు జెఫ్రీ రెబెల్లోసహా పలువురు వ్యవసాయ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.
లైసెన్స్ ఫీజు తగ్గించండి: సీఓఏఐ
లైసెన్స్ ఫీజును ప్రస్తుత మూడు శాతం నుంచి ఒక శాతానికి తగ్గించాలని మొబైల్ ఆపరేటర్ల సంఘం–-(సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా– సీఓఏఐ) ప్రభుత్వాన్ని కోరింది. అలాగే 5జీ రోల్‌అవుట్ కోసం నెట్‌వర్క్ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీని మినహాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖకు తమ ‘బడ్జెట్ విష్‌లిస్ట్’ను సమర్పించింది. యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్‌ఓఎఫ్) రద్దు చేయాలని కూడా సీఓఏఐ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) హేతుబద్దీకరణ అవసరమని ఆర్థికమంత్రితో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో సూచించింది. లైసెన్స్ రుసుము, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు, వేలం ద్వారా పొందిన స్పెక్ట్రమ్ చెల్లింపులపై జీఎస్‌టీ తొలగించాలని విజ్ఞప్తి చేసింది. సేకరించిన జీఎస్‌టీ ఇన్‌పుట్ పన్ను క్రెడిట్ (రూ32,000 కోట్లు) వాపసు, టెలికాం టవర్‌లపై అమర్చిన క్లిష్టమైన పరికరాలపై ఇన్‌పుట్ ట్యాక్స్ లభ్యతపై స్పష్టత నివ్వడం వంటి డిమాండ్లు సీఓఏఐ చేసిన డిమాండ్లలో మరికొన్ని. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం ఆపరేటర్లకు సీఓఏఐలో సభ్యత్వం ఉంది.
చివరి పూర్తిస్థాయి బడ్జెట్
2023 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. సీతారామన్‌కు రానున్నది ఐదవ బడ్జెట్. అలాగే 2024 ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇదే మోదీ–2 ప్రభుత్వానికి తుది పూర్తిస్థాయి బడ్జెట్ కానుంది. పారిశ్రామిక రంగం ప్రతినిధులతోపాటు, మౌలిక, పర్యావరణ (క్లైమేట్ చేంజ్) రంగాల నిపుణులతో చర్చల ద్వారా సోమవారం ఆర్థికమంత్రి తన 2023-24 ప్రీ బడ్జెట్ సమావేశాన్ని ప్రారంభించారు. మంగళవారం వ్యవసాయం, ఆగ్రో పాసెసింగ్, ఫైనాన్షియల్, క్యాపిటల్ మార్కెట్, టెలికం ఆపరేటర్ల విభాగాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. 24వ తేదీన సేవలు, ఆరోగ్యం, విద్య, జల వనరులు, పారిశుధ్యంసహా సామాజిక రంగం నిపుణులతో భేటీ అవుతారు. 25వ తేదీన రాష్ట్రాల ఆర్థికమంత్రులతో న్యూఢిల్లీలో ప్రీ–బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు.
చదవండి: తగ్గేదేలే.. బ్రెజిల్‌లో రికార్డు సృష్టించిన భారత కంపెనీ, 48 గంటల్లోనే..
Comments
Please login to add a commentAdd a comment