NPS-Vatsalya: వారసులపై వాత్సల్యం | NPS-Vatsalya: Nirmala Sitharaman launches NPS Vatsalya scheme for minors | Sakshi
Sakshi News home page

NPS-Vatsalya: వారసులపై వాత్సల్యం

Published Mon, Sep 30 2024 4:20 AM | Last Updated on Mon, Sep 30 2024 4:20 AM

NPS-Vatsalya: Nirmala Sitharaman launches NPS Vatsalya scheme for minors

కొత్తగా ఎన్‌పీఎస్‌ వాత్సల్య పథకం 

రూ.10వేలు.. భవిష్యత్తులో రూ.10 కోట్లు 

కాంపౌండింగ్‌తో భారీ నిధి 

బాల్యంలోనే వృద్ధాప్యానికి భరోసా  

ఉద్యోగంలో చేరిన వెంటనే ప్రతి ఒక్కరూ ముందుగా చేయాల్సిన పని, విశ్రాంత జీవనానికి  మెరుగైన ప్రణాళిక రూపొందించుకోవడం. ప్రభుత్వరంగ ఉద్యోగులకు పింఛను భరోసా ఉంటుంది. కానీ, ప్రైవేటు రంగ ఉద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారు తామే స్వయంగా ఇందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ఉద్యోగం వచి్చన కొత్తలో రిటైర్మెంట్‌ గురించి తర్వాత చూద్దాంలే.. అని వాయిదా  వేసే వారే ఎక్కువ. వివాహం, తర్వాత  సంతానంతో విశ్రాంత జీవనం ప్రాధాన్యలేమిగా  మారిపోతుంది.

 పిల్లలను గొప్పగా చదివించడమే అన్నింటికంటే ముఖ్య లక్ష్యంగా సాగిపోతుంటారు. దీనివల్ల అంతిమంగా విశ్రాంత జీవనంలో ఆరి్థక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ తరహా నిర్లక్ష్యం రేపు తమ పిల్లలు చేయకూడదని భావించే తల్లిదండ్రులు.. వారి పేరుతో ఇప్పుడే ఓ పింఛను ఖాతా తెరిచేస్తే సరి. అందుకు వీలు కలి్పంచేదే ఎన్‌పీఎస్‌ వాత్సల్య. బడ్జెట్లో ప్రకటించిన ఈ  కొత్త పథకాన్ని తాజాగా కేంద్ర ఆరి్థక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రారంభించిన నేపథ్యంలో దీనిపై అవగాహన కలి్పంచే కథనమిది...          
        
తల్లిదండ్రులు ఎవరైనా సరే తమ పిల్లల భవిష్యత్‌ మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడూ వారి గురించే ఆలోచిస్తుంటారు. కానీ, భవిష్యత్‌లో వారు ఎలా స్థిరపడతారో ముందుగా ఊహించడం కష్టం. అందుకని వారి పేరుతో ఎన్‌పీఎస్‌ వాత్సల్య ఖాతా తెరవడం ఒక మంచి ఆలోచనే అవుతుంది. ఇది పొదుపు, పెట్టుబడుల ప్రాధాన్యాన్ని తెలియజేస్తుంది. ఆరి్థక క్రమశిక్షణను నేర్పుతుంది. 18 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులు చేసిన పెట్టుబడితో ఏర్పడిన నిధిని చూసిన తర్వాత, రిటైర్మెంట్‌ లక్ష్యాన్ని పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు. వారు ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ ఖాతాను కొనసాగించుకున్నట్టు అయితే, రిటైర్మెంట్‌ నాటికి భారీ సంపదను పోగు చేసుకోవచ్చు. 50–60 ఏళ్ల కాలం పాటు పెట్టుబడులకు ఉంటుంది కనుక కాంపౌండింగ్‌ ప్రయోజనంతో ఊహించనంత పెద్ద నిధి  సమకూరుతుంది.  

వాత్సల్య ఎవరికి? 
2024–25 బడ్జెట్‌లో పిల్లల కోసం పింఛను పథకం ‘ఎన్‌పీఎస్‌ వాత్సల్య’ను ఆరి్థక మంత్రి సీతారామన్‌ ప్రకటించారు. దీన్ని సెపె్టంబర్‌ 18 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. తమ పిల్లల పేరిట పింఛను ఖాతా తెరిచి, ఇన్వెస్ట్‌ చేసుకునేందుకు ఎన్‌పీఎస్‌ వాత్సల్య వీలు కలి్పస్తుంది. తాము ఎంతగానో ప్రేమించే తమ పిల్లల భవిష్యత్‌కు బలమైన బాట వేసేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. పిల్లలకు తల్లిదండ్రులు సహజ సంరక్షకులు (గార్డియన్‌). వారు లేనప్పుడు చట్టబద్ధ సంరక్షకులు పిల్లల పేరిట ఖాతా ప్రారంభించొచ్చు. పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఎన్‌పీఎస్‌ టైర్‌–1 (అందరు పౌరులు)గా ఇది మారిపోతుంది. సాధారణ ఎన్‌పీఎస్‌ ఖాతాలోని అన్ని ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. మేజర్‌ అయిన తర్వాత మూడు నెలల్లోపు తిరిగి కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.  

పన్ను ప్రయోజనాలు 
పన్ను ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ, ఎన్‌పీఎస్‌కు ప్రస్తుతం ఉన్న పలు రకాల పన్ను ప్రయోజనాలను వాటి గరిష్ట పరిమితికి మించకుండా తమ పేరు, తమ పిల్లల పేరుపై పెట్టుబడులకు ఉపయోగించుకోవచ్చు.

సంరక్షకుల హక్కు
ఖాతాదారు (మైనర్‌) మరణించిన సందర్భంలో అప్పటి వరకు సమకూరిన నిధిని తిరిగి తల్లిదండ్రి లేదా సంరక్షకులకు ఇచ్చేస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరు మరణించిన సందర్భంలో మరొకరు కేవైసీ పూర్తి చేసి పెట్టుబడి కొనసాగించొచ్చు. తల్లిదండ్రులు ఇద్దరూ మరణించిన సందర్భంలో మైనర్‌కు 18 ఏళ్లు నిండేంత వరకు చట్టబద్ధమైన సంరక్షకులు ఎలాంటి చందా చెల్లించకుండానే ఖాతాని కొనసాగించొచ్చు.

ఉపసంహరణ 
వాత్సల్యకు మూడేళ్ల లాకిన్‌ పీరియడ్‌ అమలవుతుంది. అంటే ప్రారంభించిన మూడేళ్లలోపు పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి అనుమతించరు. ఆ తర్వాత నుంచి సమకూరిన నిధిలో 25 శాతాన్ని విద్య, అనారోగ్యం తదితర నిర్ధేశిత అవసరాలకు వెనక్కి తీసుకోవచ్చు.  

ఎక్కడ ప్రారంభించాలి? 
ఎన్‌పీఎస్‌ వాత్సల్య ఖాతాను నేరుగా ఈ–ఎన్‌పీఎస్‌ పోర్టల్‌ ద్వారా ప్రారంభించుకోవచ్చు. లేదా పోస్టాఫీస్, ప్రముఖ బ్యాంక్‌ శాఖలకు వెళ్లి తెరవొచ్చు. ప్రభుత్వరంగంలోని కెనరా బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, పీఎన్‌బీ, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతోపాటు ప్రైవేటు రంంలోని ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌లు ఎన్‌పీఎస్‌ వాత్సల్యను ఆఫర్‌ చేస్తున్నాయి. అలాగే ఆన్‌లైన్‌లో ప్రొటీన్‌ ఈ–గవ్‌ టెక్నాలజీస్, కేఫిన్‌టెక్, క్యామ్స్‌ ఎన్‌పీఎస్‌ ప్లాట్‌ఫామ్‌ల సాయంతోనూ ప్రారంభించొచ్చు.  

వైదొలగడం 
పిల్లలకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ పథకం కొనసాగించుకోవచ్చు. లేదా వైదొలిగే అవకాశం కూడా ఉంది. ఒకవేళ తప్పుకోవాలని భావించేట్టు అయితే ఇక్కడ రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. అప్పటి వరకు సమకూరిన నిధి రూ.2.5 లక్షలకు మించకపోతే, మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. రూ.2.5 లక్షలకు మించి ఉంటే అందులో 20 శాతమే వెనక్కి తీసుకోగలరు. మిగిలిన 80 శాతంతో యాన్యుటీ ప్లాన్‌ తీసుకోవాల్సి ఉంటుంది.  

డాక్యుమెంట్లు 
ఎన్‌పీఎస్‌ వాత్సల్య ప్రారంభానికి వీలుగా పిల్లలకు సంబంధించి పుట్టిన తేదీ ధ్రువపత్రం అది లేకపోతే స్కూల్‌ లీవింగ్‌ సరి్టఫికెట్‌/ఎస్‌ఎస్‌సీ/పాన్‌ వీటిల్లో ఏదో ఒకటి ఇవ్వాలి. ప్రారంభించే పేరెంట్‌ (తల్లి లేదా తండ్రి) లేదా గార్డియన్‌కు సంబంధించి ఆధార్, పాన్‌ కాపీ, బ్యాంక్‌ ఖాతా వివరాలు అవసరం అవుతాయి. ఎన్‌ఆర్‌ఐ/ఓసీఐ అయితే ఖాతా తెరిచే పిల్లల పేరిట ఎన్‌ఆర్‌ఈ లేదా ఎన్‌ఆర్‌వో ఖాతా కలిగి ఉండాలి. ఎన్‌ఆర్‌ఐ పాస్‌పోర్ట్‌ కాపీ, ఓసీఐ విదేశీ చిరునామా కాపీలను సమర్పించాలి.  

అర్హతలు 
18 ఏళ్లలోపు పిల్లల పేరిట భారత పౌరులు లేదా నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌ (ఎన్‌ఆర్‌ఐ), ఓవర్‌సీస్‌ సిటిజన్‌íÙప్‌ ఆఫ్‌ ఇండియా (ఓసీఐ) ఈ ఖాతా తెరిచేందుకు అర్హులు. ఏటా కనీసం రూ.1,000 ఇన్వెస్ట్‌ చేయాలి. గరిష్ట పరిమితి లేదు. సంరక్షకులు ఇన్వెస్ట్‌ చేసినప్పటికీ ఈ ఖాతా లబ్దిదారు మైనరే అవుతారు. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నియంత్రణలో ఈ పథకం కొనసాగుతుంది. మైనర్‌ పేరిట పెన్షన్‌ రిటైర్మెంట్‌ అకౌంట్‌ నంబర్‌ (పీఆర్‌ఏఎన్‌/ప్రాన్‌)ను పీఎఫ్‌ఆర్‌డీఏ కేటాయిస్తుంది.  

పెట్టుబడుల ఆప్షన్లు 
యాక్టివ్‌ చాయిస్‌: ఈ విధానంలో 50 ఏళ్ల వయసు వరకు ఈక్విటీలకు గరిష్టంగా 75 శాతం కేటాయింపులు చేసుకోవచ్చు. కార్పొరేట్‌ డెట్‌కు 100 శాతం, ప్రభుత్వ సెక్యూరిటీలకు 100 శాతం, ఆల్టర్నేట్‌ అసెట్‌ క్లాస్‌కు 5 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. 75 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకుంటే.. 50 ఏళ్ల వయసు దాటిన క్రమంగా 60 ఏళ్ల నాటికి ఈక్విటీ కేటాయింపులు 50 శాతానికి తగ్గి, డెట్‌ కేటాయింపులు 50 శాతంగా మారుతాయి.  

ఆటో చాయిస్‌: ఏ విభాగానికి ఎంత మేర కేటాయింపులు చేసుకోవాలన్న అవగాహన లేకపోతే ఆటో చాయిస్‌ ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధానంలో లైఫ్‌ సైకిల్‌ ఫండ్‌ (ఎల్‌సీ)–75, ఎల్‌సీ–50, ఎల్‌సీ–25 అని మూడు ఆప్షన్లు ఉన్నాయి. ఎల్‌సీ–75లో 35 ఏళ్ల వయసు వరకే 75 శాతం ఈక్విటీలకు కేటాయింపులు వెళతాయి. ఆ తర్వాత నుంచి ఏటా ఈక్విటీలకు తగ్గుతూ, డెట్‌కు పెరుగుతాయి. ఎల్‌సీ–50 కింద ఈక్విటీలకు 35 ఏళ్ల వయసు వచ్చే వరకే 50 శాతం కేటాయింపులు చేసుకోగలరు. ఆ తర్వాత క్రమంగా ఈక్విటీలకు కేటాయింపులు తగ్గుతూ వెళతాయి. ఎల్‌సీ–25లో 35 ఏళ్ల వరకే ఈక్విటీలకు 25 శాతం కేటాయింపులు వెళతాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా డెట్‌కు కేటాయింపులు పెరుగుతాయి.  

డిఫాల్ట్‌ చాయిస్‌: పైన చెప్పుకున్న ఎల్‌సీ–50 ప్రకారం ఈ విధానంలో పెట్టుబడుల కేటాయింపులు చేస్తారు.

చిన్న మొత్తమే అయినా.. 
పెట్టుబడులకు ఎంత ఎక్కువ కాల వ్యవధి ఉంటే, అంత గొప్పగా కాంపౌండింగ్‌ అవుతుంది. వడ్డీపై, వడ్డీ (చక్రవడ్డీ) తోడవుతుంది. ఒక ఉదాహరణ ప్రకారం.. శిశువు జన్మించిన వెంటనే ఖాతా తెరిచి ఏటా రూ.10,000 చొప్పున 18 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. మొత్తం పెట్టుబడి రూ.1.8 లక్షలు అవుతుంది. 10 శాతం రాబడుల రేటు ఆధారంగా 18 ఏళ్లు పూర్తయ్యే నాటికి ఈ మొత్తం రూ.5లక్షలుగా మారుతుంది. 

ఇదే నిధి ఏటా 10 శాతం చొప్పున కాంపౌండ్‌ అవుతూ వెళితే 60 ఏళ్లు ముగిసే నాటికి రూ.2.75 కోట్లు సమకూరుతుంది. ఒకవేళ రాబడుల రేటు 11.59 శాతం మేర ఉంటే రూ.5.97 కోట్లు, 12.86 శాతం రాబడులు వస్తే రూ.11.05 కోట్లు సమకూరుతుంది. కేవలం రూ.10వేల వార్షిక పొదుపు రూ.కోట్లుగా మారుతుంది. ఈ ఉదాహరణను ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో, చండీగఢ్‌ జారీ చేసింది. 

మరొక ఉదాహరణ చూద్దాం. ప్రతి నెలా రూ.5,000 చొప్పున శిశువు జని్మంచిన నాటి నుంచి ఇన్వెస్ట్‌ చేస్తూ.. వారు ఉద్యోగంలో చేరేంత వరకు.. ఆ తర్వాత పిల్లలు కూడా అంతే మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేస్తూ వెళితే 10 శాతం రాబడి అంచనా ప్రకారం 60ఏళ్లకు (రిటైర్మెంట్‌ నాటికి) సుమారు రూ.19 కోట్లు సమకూరుతుంది. ఇదే రూ.5,000 పెట్టుబడిని మొదటి నుంచి ఏటా 10 శాతం చొప్పున పెంచుతూ వెళితే 60 ఏళ్లకు రూ.100 కోట్ల నిధి ఏర్పడుతుంది. ఇది కాంపౌండింగ్‌ మహిమ. 

ఈ తరహా దీర్ఘకాలిక పెట్టుబడుల పథకాన్ని, పిల్లలకు ఫించను బహుమానాన్ని ఇవ్వడం మంచి నిర్ణయమే అవుతుంది. ‘‘ఎన్‌పీఎస్‌లో ఈక్విటీ విభాగం 14 శాతం, కార్పొరేట్‌ డెట్‌ విభాగం 9.1 శాతం, జీ–సెక్‌ విభాగం 8.8 శాతం చొప్పున వార్షిక రాబడులు అందించింది. ఎన్‌పీఎస్‌ వాత్సల్య దీర్ఘకాల పెట్టుబడి. కనుక క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అనుసరించాలి. మీ పిల్లల భవిష్యత్‌ ఆరి్థక భద్రతపై దృష్టి సారించాలి’’అని స్వయానా ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటించారు. దీర్ఘకాలంలో ఈక్విటీలకు గరిష్ట కేటాయింపులతో కూడిన ఆప్షన్‌లో రాబడి 10 శాతం ఉంటుందని ఆశించొచ్చు.  

ఆన్‌లైన్‌లో ఎలా ప్రారంభించుకోవచ్చు? 
→ ఈఎన్‌పీఎస్‌ పోర్టల్‌కు వెళ్లాలి. హోమ్‌పేజీ పైన మెనూలో కనిపించే ఆప్షన్లలో ‘ఎన్‌పీఎస్‌ వాత్సల్య (మైనర్స్‌) రిజిస్ట్రేషన్‌’ను ఎంపిక చేసుకోవాలి.  
→ ఇక్కడ మైనర్, గార్డియన్‌ వివరాలు అన్నింటినీ నమోదు చేయాలి. కావాల్సిన డాక్యుమెంట్‌ కాపీలను అప్‌లోడ్‌ చేసి ‘కన్‌ఫర్మ్‌’ చేయాలి.  
→ మొదట గార్డియన్‌ పుట్టిన తేదీ వివరాలు, పాన్‌ నంబర్, మొబైల్‌ నంబర్, ఈ మెయిల్‌ ఐడీ వివరాలు ఇచ్చి ‘బిగిన్‌ రిజి్రస్టేషన్‌’ను క్లిక్‌ చేయాలి.   
→ మొబైల్, ఈమెయిల్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేసి సబ్మిట్‌ చేయాలి. అక్‌నాలెడ్జ్‌మెంట్‌ నంబర్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. అప్పుడు ‘కంటిన్యూ’ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి.  
→ ఆన్‌లైన్‌లో ఖాతా తెరిచే వారు (తల్లి/తండ్రి/సంరక్షకులు) తెల్ల పేపర్‌పై సంతకం చేసి దాన్ని స్కాన్‌ చేసి పెట్టుకోవాలి. దీన్ని ఇతర డాక్యుమెంట్లతోపాటు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.  
→ ఆరంభ చందా రూ.1,000 చెల్లించాలి. దీంతో ప్రాన్‌ జారీ అవుతుంది. మైనర్‌ పేరిట  ఎన్‌పీఎస్‌ వాత్సల్య ఖాతా  ప్రారంభం అవుతుంది.  

 –సాక్షి, బిజినెస్‌డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement