రాజమహేంద్రవరం సిటీ : నగరాభివృద్ధికి బడ్జెట్ ప్రత్యేక సమావేశంలో అభివృద్ధిపై ప్రశ్నించే మహిళలు, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు మజ్జి నూకరత్నం, ఈతకోట బాపన సుధారాణిలపై ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఏకవచన సంబోధన చేస్తూ ఏయ్ నువ్వు ఆగు.. నువ్వు కూర్చో అంటూ రెచ్చిపోయారు. నువ్వంటే నువ్వంటూ ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది. అభివృద్ధిపై ఎప్పటిలోగా చర్చ పెట్టాలి? ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకునేందుకు ముందే చర్చించవచ్చు కదా అని మేయర్, కమిషనర్‌లను ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ షర్మిలారెడ్డి నేతృత్వంలో ప్రశ్నించగా ఆదిరెడ్డి ఎమ్మెల్సీ నన్న విషయం మర్చిపోయి రెచ్చిపోయారు. ప్రశ్నిస్తున్నది ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్ అనే మర్యాద లేకుండా ఏయ్ కూర్చో అంటూ ఆదిరెడ్డి చేసిన ఏకవచన సంబోధనకు సభలోని మహిళలు, ప్రజా ప్రతినిధులు విస్తుపోయారు. ‘జన్మభూమి’లో పేదలకు పింఛన్లు ఇచ్చేస్తున్నామంటూ ప్రగల్భాలు పలికి ఇవ్వకపోవడంపై క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నామంటూ,
పుష్కరాలకు మంజూరైన నిధులు రూ.240 కోట్లకు రూ.130 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని మిగిలిన వాటి పరిస్థితి ఏమిటంటూ షర్మిలారెడ్డి మేయర్ దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయడంతో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి కార్పొరేషన్ తరుఫున వకాల్తా పుచ్చుకుని నీకేం తెలుసు ప్రభుత్వం దఫదఫాలుగా ఇస్తుంది.. నువ్వు కూర్చో.. లేకపోతే బాగోదంటూ రెచ్చిపోయారు. అయినప్పటికీ అడిగిన ప్రశ్నలకు సమాధానం కావాలంటూ షర్మిలారెడ్డి పట్టుపట్టారు. సభలో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా అభివృద్ధి పనుల విషయాన్ని సభ దృష్టికి తీసుకుని రావాల్సిన ఆదిరెడ్డి తీరుకు సభికులు విస్తుపోయారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్లకే మాట్లాడే అవకాశం
2017–18 సంవత్సరం బడ్జెట్ సవరణ, 2018–19 సంవత్సరానికి అంచనా బడ్జెట్ మేయర్ పంతం రజనీశేషసాయి అధ్యక్షతన చదివి వినిపించారు. దానిపై చర్చించి చర్యలు చేపట్టాల్సి ఉండగా కేవలం ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉండే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, మాట్లాడడం వరకే అవకాశం కల్పించారు. మిగిలిన సభ్యులు బడ్జెట్‌పై చర్చించే ప్రయత్నం చేసినా వారికి అవకాశం ఇవ్వకుండానే బడ్జెట్‌ను ఆమోదించామని మేయర్ సమావేశం ముగించారు.
2018–19 సంవత్సరానికి రూ.76 కోట్ల 41 లక్షల 50 వేలతో ప్రారంభ నిల్వతో అంచనాలు ప్రారంభించి రూ.299.05 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు కేటా యిస్తూ బడ్జెట్‌ను సిద్ధం చేశారు. రూ.222 కోట్ల 64 లక్షల 25 వేల ఆదాయంగా రూ.285 కోట్ల 70 లక్షల ఖర్చులుగా తయారు చేశారు. ముగింపు నిల్వగా రూ.133కోట్ల 5 లక్షల 75 వేలుగా చూపించారు. 2017–18 సంవత్సరానికి రూ.321 కోట్ల 2 లక్షల 32 వేల ప్రారంభ నిల్వతో బడ్జెట్ తయారు చేయగా ఆదాయం రూ.213 కోట్ల 64 లక్షల 85 వేలు, ఖర్చులు రూ.244 కోట్ల 60 లక్షల 82 వేలుగా ఖర్చులుగా నివేదిక సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment